సరైన చేయూతనిస్తే.. ఆ మహిళ సమాజానికి దిశానిర్దేశం చేసే పారిశ్రామిక వేత్తగా మారుతుంది. ఆ ఇల్లు ఆర్థికంగా నిలబడుతుంది. ప్రాచీన చేతివృత్తుల నుండి నేటి గృహ పరిశ్రమల వరకు.. ప్రభుత్వ పథకాల నుండి డిజిటల్ ఈ-కామర్స్ వరకు… మహిళలు స్వయంసమృద్ధి సాధించేందుకు నేడు అద్భుతమైన అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. చేతివృత్తులు, గృహ పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు భారతీయ ఆర్థికవ్యవస్థకు వెన్నుముక వంటివి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తూ, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడంలో చేతివృత్తులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి.

గృహిణులు ఇంటి పనులు పూర్తి చేసుకుని ఖాళీ సమయంలో చేసే చిన్న చేతివృత్తే ఆ కుటుంబానికి ఆర్థిక భరోసానిస్తుంది. సబ్సిడీల రూపంలో ప్రభుత్వాలు అందిస్తున్న ఆర్థికచేయూత సొంత వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సహకరిస్తుంది. ఇంట్లో తయారుచేసిన ఉత్పత్తులను ఆన్‌లైన్ మాధ్యమాలు వినియోగించుకొని మహిళ ఆర్ధికంగా ఎదిగే అవకాశం నేటి తరుణంలో మెండుగా ఉంది. కేవలం మన సంప్రదాయాన్ని కాపాడే కళలుగా మాత్రమే కాక..ఈ డిజిటల్ యుగంలో చేతివృత్తులు అత్యంతవేగంగా ఎదుగుతున్న బిజినెస్ మోడల్స్‌గా మారాయి.

మహిళల తక్కువ మూలధనంతోనే  ఎక్కువ ఉపాధి అవకాశాలు లభించే చేతివృత్తులను ఎంచుకొని ఇంట్లోనే ఉపాధిని ఏర్పరుచుకోవచ్చు. టైలరింగ్, ఎంబ్రాయిడరీ, మగ్గం పనులు, మట్టి పాత్రలు, బొమ్మలు, చేనేత, అల్లికలు, జ్యూట్ బ్యాగుల తయారీ వంటి కళలు అతి తక్కువ పెట్టుబడితోనే ప్రారంభించ వచ్చు.  ఖాళీ సమయంలోనే ఈ పనులు చేస్తూ, కుటుంబానికి అదనపు ఆదాయ వనరుగా మహిళలు మారే అవకాశం ఈ చేతి వృత్తుల్లో ఉంటుంది.

పూర్వకాలంలో చేతివృత్తుల ఉత్పత్తులు స్థానికంగా అయినకాడికి అమ్ముకోవాల్సి వచ్చేది. కానీ నేడు సోషల్ మీడియా వేదికల ద్వారా మహిళలు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్మ గల్గుతున్నారు. హ్యాండ్‌క్రాఫ్ట్స్, పండుగ అలంకరణ వస్తువులు, సాంప్రదాయ వస్త్రాలు, చేతివృత్తుల ఉత్ప త్తులను విదేశాల్లో ఉన్న భారతీయులకు అందించడం ద్వారా లాభాలు ఆర్జిస్తున్నారు.

మహిళలు స్వయంగా సంపాదించడం వల్ల కుటుంబ ఆర్థికనిర్ణయాల్లో వారి భాగస్వామ్యం పెరుగుతుంది. వారి చేతికి వచ్చే ఆదాయం ప్రధానంగా పిల్లల చదువు, పౌష్టికాహారం, కుటుంబ ఆరోగ్య రక్షణకే ఎక్కువ ఖర్చవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. డ్వాక్రా వంటి స్వయం సహాయక సంఘాలు, ఇతర మహిళా సంఘాల ద్వారా రుణాలు పొంది ఉమ్మడిగా చేతివృత్తుల యూనిట్లు స్థాపించడం ద్వారా గ్రామీణ మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు. అయితే వీరికి యంత్రాల ద్వారా తయారయ్యే చౌక ఉత్పత్తుల పోటీ తలనొప్పిగా తయారవడమే కాదు, దీనిని తట్టుకోవడం సవాలుగా మారింది. అయితే సాంప్రదాయ కళలకు ఆధునిక డిజైన్లను మేళవించడం, ప్యాకేజింగ్, బ్రాండింగ్‌లో సరైన శిక్షణ పొందడం ద్వారా ఉత్పత్తుల విలువ పెంచుకో గలుగుతున్నారు.

మహిళలు చేతివృత్తులు, కుటీర పరిశ్రమలు, స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు అనేక సహాయక పథకాలను, రుణ సదుపాయాలను అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చిన్న చేతివృత్తులు, అల్లికలు మొదలైన వాటికి రూ.50,000 వరకు, పరికరాల కొనుగోలు, తయారీకి రూ.50,000 నుండి రూ.5 లక్షలవరకు, వ్యాపార విస్తరణకు రూ. 5 లక్షల నుండి రూ.10 లక్షలవరకు, ‘ముద్ర రుణాల’ పేరున అందిస్తోంది. అలాగే మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం కోసం నూతన వ్యాపారాలు లేదా తయారీ యూనిట్లు ప్రారంభించే మహిళలకు రూ.10 లక్షల నుండి రూ.1 కోటి వరకు స్టాండప్ ఇండియా పేరున బ్యాంకుల ద్వారా రుణం లభిస్తుంది. స్వయం ఉపాధి యూనిట్లు, గృహ పరిశ్రమల స్థాపనకోసం ప్రధాన మంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమం ద్వారా తయారీ రంగానికి రూ.50 లక్షల వరకు, సేవా రంగానికి రూ.20 లక్షల వరకు రుణం అందించడమే కాక గ్రామీణ ప్రాంత మహిళలకు ప్రాజెక్ట్ వ్యయంలో 35%వరకు సబ్సిడీ లభిస్తుంది. కుమ్మరులు, చేనేత, దర్జీలు, బొమ్మల తయారీ మొదలైన  సాంప్రదాయ చేతివృత్తుల కళాకారులకు ఒక లక్ష నుండి 3లక్షల రూపాయలవరకు కేవలం ఐదు శాతం  వడ్డీకే  రుణ సదుపాయంతో పాటు, 15,000 రూపాయలు టూల్‌కిట్ గ్రాంట్, ఉచిత శిక్షణ కూడా అందిస్తుంది. మరోవైపు వెనుకబడిన వర్గాలు, మైనారిటీ మహిళల చేతివృత్తులకు చౌక వడ్డీకి రూ. 1,40,000 వరకు ఆర్థిక సహకారం ఇస్తుంది. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన మహిళలకు గృహ పరిశ్రమలు, ప్యాకింగ్ యూనిట్లు, టైలరింగ్ కోసం బ్యాంకుల సహాయంతో త్వరితగతిన రూ.50,000 నుండి రూ.2 లక్షలవరకు రుణాలు లభిస్తాయి. సమయాను కూలంగా రుణాలు చెల్లించే మహిళా సంఘాలకు ప్రభుత్వం వడ్డీ సబ్సిడీని నేరుగా ఖాతాల్లో జమ చేస్తుంది.

కొత్తగా ప్రారంభించిన వ్యాపార సంస్థలు (స్టార్టప్‌లు), గృహ పరిశ్రమలకు అవసరమైన పెట్టుబడి లేదా నిధులు అందించడం, మార్కెటింగ్, బ్రాండింగ్‌లో మార్గదర్శకత్వం ఇస్తూ  తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళా పారిశ్రామిక వేత్తల కోసం ఇంక్యుబేటర్ సెంటర్లను ఏర్పాటు చేసింది. రుణ సదుపాయాలను పొందేందుకు అవసరమైన పత్రాలను, వ్యాపారాన్నిబట్టి అంచనా వ్యయాన్ని సిద్ధం చేసుకొని మహిళలు ఆయా రుణాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మన సాంప్రదాయ కళలను, ప్రాచీన చేతివృత్తు లను సజీవంగా ఉంచుతూ భావితరాలకు అందిం చడంలో మహిళలే ముఖ్యపాత్ర వహిస్తున్నారు.  నైపుణ్యానికి ప్యాకేజింగ్, బ్రాండింగ్, సోషల్ మీడియా ప్రచారాన్ని జోడిస్తే… మహిళల చేతివృత్తులు కేవలం జీవనోపాధిగా మాత్రమే కాక, విజయవంతమైన చిన్నతరహా పరిశ్రమలుగా రూపాంతరం చెందు తాయి. నైపుణ్యం ఉన్న చేతులకు సరైన చేయూత లభిస్తే, స్వయంసమృద్ధి సాధించడమే కాకుండా స్థానిక ఆర్థికవ్యవస్థ కూడా బలోపేతమవుతుంది.

జయశ్రీ ఆచంట
సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor