‘‌నానృషిః  కురుతే  కావ్యం …’అనే ఆర్యవాక్కుకు ప్రత్యక్షర నిదర్శనం వాల్మీకి మౌని. చతుర్విధ  పురుషార్థాలనే స్తంభాలపై శ్రీమద్రామాయణ కావ్యసౌధాన్ని నిర్మించి, ఆదర్శపురుషుడి  ఆవిష్కరణతో విశ్వమానవునికి సన్మార్గం చూపిన  క్రాంతిదర్శి. మనిషి మనుగడ ఎలా సాగాలి? ప్రకృతిని, పరిస్థితులను ఎలా సద్వినియోగం చేసుకోవాలి? జీవితపథంలో ఎదురయ్యే అవరోధాలను దృఢచిత్తంతో ఎలా అధిగమించాలి? భారతీయ సమాజంలో ఆదర్శకుటుంబ సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయి?ఎలా ఉండాలి? లాంటి అనేకానేక అంశాలను ఈ కావ్యం ద్వారా లోకానికి వివరించారు.దర్శనం,వర్ణనం కలవాడే నిజమైన కవి, రుషి. వాల్మీకి అక్షరాల  ఆ కోవకు చెందినవాడు.

సమాజం ఆధ్యాత్మికంగా, భౌతికంగా సాధించిన వికాసం తరతరాల వారికి అందాలంటే కుటుంబ జీవన స్వరూప స్వభావాలు స్పష్టంగా,ఒక ప్రమాణంగా నిలవాలి. శ్రీరాముడికి పూర్వం గల ఆరు అవతారాలను పురాణ యుగానికి పరిమితం చేసి, ఆయనతో ప్రారంభమయ్యే అవతారాలను చారిత్రకమైనవిగా చిత్రీకరించి జగద్ధితం కోసం పాటుపడేలా ఒక ప్రబోధాత్మక పక్రియ చేపట్టవలసిన ఆవశ్యకతను రుషులు ముందే గ్రహించారు.

శ్రీమద్రామాయణం కర్త వాల్మీకి రుషి కారణజన్ముడని విశ్వాసం. వల్మీకం (పుట్ట)ను ఛేదించుకొని బయటికి రావడం వల్ల ‘వాల్మీకి’గా లోక ప్రసిద్ధుడయ్యాడు.ఆయన జన్మవృత్తాంతం గురించి అనేక గాథలు ఉన్నాయి. ఆయన బ్రహ్మ వంశంలో పుట్టినట్లు స్కంద పురాణం పేర్కొంటోంది. కృణుడు అనే గంధర్వునికి, నిలూచి అనే నాగకన్యకు పుట్టినవాడని, అడవిలో ఒక పొదలో దొరికితే నిషాదులు (బోయవారు) పెంచి పెద్ద చేశారని కథనం ఉంది. ఆయనకు రత్నాకరుడు, రుక్షుడు అనే పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. కృతయుగంలో దుష్టసాంగత్యంతో హింసకు పాల్పడుతున్న అగ్నిశర్మ అనే విప్రకుమారుడికి అత్రి మహర్షి హితోపదేశం చేయగా, అతను ఒక చెట్టు కింద పదమూడేళ్ల పాటు కఠోర దీక్షలో నిమగ్నమయ్యాడు.అటుగా తిరిగి వస్తున్న అత్రిమహర్షి అతని చుట్టూ పుట్ట (వల్మీకం)ను తొలగించి, ‘ఇక మీదట వాల్మీకి పేరుతో లోక ప్రసిద్ధుడవు అవుతావని ఆశీర్వరించాడని కథనం. తాను ప్రాచేతసుడి పదవ పుత్రుడనని శ్రీరాముడితో వాల్మీకి అన్నట్లు ఉత్తరకాండ (98వ సర్గ, 19వ శ్లోకం) చెబుతోంది.

ఒకనాడు వాల్మీకి తన శిష్యుడు భరద్వాజతో తమసా నదీతీరంలో సంచరిస్తుండగా..అనురాగ రసా స్వాదనలో ఉన్న క్రౌంచపక్షుల జంటలో మగపక్షిని ఓ వేటగాడు బాణంతో కొట్టడం,అది నేల కొరిగి గిలగిలకొట్టుకోవడం, ఆడపక్షి ఆక్రందనతో మౌని హృదయం కరుణార్ద్ర మైంది.అలా..ఆయనకు కలిగిన శోకం శ్లోకరూపం దాల్చింది. ‘ఓ నిషాదుడా! కామమోహితమైన పక్షి జంటలో ఒకదానిని చంపిన నీవు ఎక్కువ కాలం జీవించలేవు (మానిషాద ప్రతిష్ఠాంత్వం ఆగమః శాశ్శతీస్సమా:/యత్‌ ‌క్రౌంచ మిథునాదేకమ్‌ అవధీః కామ మోహితమ్‌’) అని శపించాడు. ఆ శ్లోకం జనావళిని తరింపచేసే మహాకావ్యానికి, బీజం వేసింది.

‘జాతే జగతి వాల్మీకౌ కవి రిత్యభిధా భవత్‌

‌కవీ ఇతి తతో వ్యాసే కవయ స్త్వయి దండినే’ …వాల్మీకి అవతరించాక ‘కవిః’అనే ఏకవచనం, వ్యాసుడిని కలిపితే ‘కవీ’అనే ద్వివచనం, దండీ మున్నగువారి వల్ల ‘కవయః’అనే బహువచనం వచ్చింది. ‘మధుమయిఫణితీనాం మార్దదర్శీ మహర్షిః’ (మధుర శబ్దాలకు మార్గదర్శిగా నిలిచిన మహర్షి) అని భోజరాజు శ్లాఘించారు.

బ్రహ్మదేవుడి ఆదేశం, నారద మహర్షి ప్రోత్సాహంతో కావ్యరచనకుసిద్ధమైన వాల్మీకి, తన కావ్యనాయకుడి పాత్రకు తగిన ఉన్నత వ్యక్తిత్వం, అసాధారణ లక్షణాలు గల వారు ఉన్నారా? (‘కోన్వస్మిన్‌ ‌సాంప్రతంలోకే గుణవాన్‌ ‌కశ్చ వీర్యవాన్‌, ‌ధర్మజ్ఞశ్చ, కృతజ్ఞశ్చ, సత్యవాక్యో దృఢవ్రతంః?’) మనసులో సందేహాన్ని వెల్లడించాడు. అలాంటి సద్గుణాలన్నీ ఒక వ్యక్తిలో మూర్తీభవించడం కష్టతరమే నని, అయినా ఇక్ష్వాకు వంశీయుడు రాముడు ఆ శుభలక్షణాలు కలిగి ఉన్నాడంటూ రామకథను క్లుప్తంగా చెప్పాడు నారదుడు. ‘శ్రీరాముడి వృత్తాం తానికి సంబంధించిన విశేషాలన్నీ సహజంగానే కరతలామలకములు అవుతాయి’ అన్న బ్రహ్మ వర ప్రభావంతో కథాంశాలన్నీ ఆ మౌని మనస్సుకు స్పష్టంగా గోచరించాయి. అలా శ్రీమద్రామాయణ కావ్యం రూపుదిద్దుకుంది.గాయత్రీ మంత్రంలోని ఒక్కొక్క అక్షరానికి వెయ్యి శ్లోకాల వంతున 24 వేల శ్లోకాలను రచించాడు.

‘వృత్తం రామస్య వాల్మీకీః సుకృతిః కిన్నర స్వరౌ!

కింతత్‌? ‌యేన మనోహర్తుమ్‌! అలంస్వాతాం న శ్వణ్వతామ్‌!! (‌చరిత్రా! శ్రీరామునిది. రచనా! వాల్మీకిది. గానము చేసేవారా! కిన్నర కంఠస్వరులైన లవకుశులు. ఇక ఇందులో శ్రోతల మనసులను అలంరించని అంశం ఏముంది?) అని మహాకవి కాళిదాసు రామాయణాన్ని శ్లాఘించాడు.   ‘భారతదేశం వాల్మీకి దేశం- రామాయణ దేశం’అని మాక్స్‌ముల్లర్‌ ‌మహాశయుడు కీర్తించాడు.

భారతీయ భాషలలో భిన్న పక్రియలతో పాటు ప్రపంచంలోని వివిధ భాషల్లోని వందల కొద్దీ రామాయణ గాథలకు వాల్మీకి రామాయణమే మాతృక.రామాయణంపై ఇన్నీ గ్రంథాలు అవసరమా? అన్న ప్రశ్నకు అనేక మంది కవులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.  ‘రాముని వంటి ధీరోదాత్త నాయకుడు మాకు మరొకరు కనిపించ లేదు. కనుక, ఈ కథనే తిరిగి వెలయించుటలకు రాముని కల్యాణగ••ణములు దోషం కారణములు కాని మా దోషం కాదు’(యది క్షుణ్ణం పూర్వైః ఇతి జహతి రామస్య చరితమ్‌/ ‌గుణై రేతావద్భిః జగతి పున రన్యో జయతి కః)అని సంస్కృత కవి మురారి వ్యాఖ్యానించడు. వ్యక్తి, కుటుంబం, సంఘ ధర్మాలతో త్రివేణి సంగమంలా ఈ మహా కావ్యం తరతరాలుగా మానవజాతిని పునీతం చేస్తోంది. ఈ రసమయ కావ్యంలో ఆధ్యాత్మిక విద్యా రహస్యాలను కూడా అంతర్వాహినిగా ప్రవహింప చేశాడు. ఉత్తమ మానవతా విలువలు కలిగిన దీని మాధుర్యాన్ని ఆస్వాదించిన పాశ్చాత్య పండితులు అనేకులు తలలూపారు. ‘ఎన్నిజన్మలకు వాల్మీకి రుణం తీర్చుకోగలం?’ అని విశ్వనాథ సత్య నారాయణ శ్లాఘించారు. వాల్మీకి ఈ ఏకైక రచన ఆచంద్రతారార్కం నిలవగలిగే మహా కావ్యం.

– ‌డాక్టర్‌ ఆరవల్లి

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.