భారతదేశాన్ని రక్షిస్తున్నవారు ఎవరు? ఈ ప్రశ్నకు మనలో చాలామంది వెంటనే మన సైనికులు, పోలీసులు, సరిహద్దు భద్రతా దళాలు అని సమాధానం చెబుతారు. సరిహద్దుల్లో నిలబడి శత్రువులను ఎదుర్కొనే మన సైనికుల త్యాగాలు వర్ణనాతీతం. అయితే, ఈ దళాల వెనుక ఎవరికీ కనిపించని మరో బలమైన అదృశ్య రక్షణ కవచం ఉంది. అదే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా). ఈ సంస్థలో పనిచేసే అధికారులు భారతదేశానికి నిజమైన అజ్ఞాత వీరులు. వారి జీవితం, సేవలు, విజయాలు, చివరికి వారి మరణం కూడా. రహస్యంగానే ముగిసిపోతాయి.

అదృశ్య రక్షణ వ్యవస్థ – ‘రా’

ప్రపంచంలో శక్తివంతమైన ప్రతి దేశానికి విదేశీ నిఘా సమాచారాన్ని సేకరించే ప్రత్యేక సంస్థ ఉంటుంది. మన దేశానికి ఆ బాధ్యతను ‘రా’ నిర్వర్తిస్తున్నది. విదేశీ నేలపై భారతదేశ భద్రతకు ముప్పు కలిగించే ఉగ్రవాద సంస్థలను పసి గట్టడం, శత్రు దేశాల వ్యూహాలను తిప్పికొట్టడం, గూఢచర్య కార్యకలాపాలను అడ్డుకోవడం, సైబర్ దాడులను నిరోధించడం, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలపై నిఘా ఉంచడం ‘రా’ ప్రధాన బాధ్యత. సరిహద్దులకు ఆవల ఏం జరుగుతుందో ముందే తెలుసుకుని, అత్యంత కీలకమైన సమాచారాన్ని భారత ప్రభుత్వానికి అందించడం ద్వారా వీరు రాబోయే ముప్పులను ముందే అడ్డుకుంటారు.

గుర్తింపు లేని మహోన్నత త్యాగం

మన దేశంలో ఇంటెలిజెన్స్ బ్యూరో, కేంద్ర నిఘా సంస్థలు, రాష్ట్ర పోలీసులు, ఆర్మీవంటి వ్యవస్థలు చట్టబద్ధంగా, అధికారికంగా పనిచేస్తాయి. ప్రభుత్వం వీరికి అధికారిక గుర్తింపు కార్డులు ఇస్తుంది. వీరు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతే, ప్రభుత్వం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తుంది. దేశ అత్యున్నత నాయకులు వారి భౌతికకాయానికి నివాళులు అర్పిస్తారు. వారి కుటుంబాలకు పరిహారంతో పాటు సమాజంలో గొప్ప గౌరవం లభిస్తుంది.

కానీ, ‘రా’ అధికారుల జీవితం పూర్తిగా భిన్నమైనది. వీరు విదేశీ నేలపై తమ అసలు పేరును, గుర్తింపును మరచిపోయి, కల్పిత పేర్లతో జీవిస్తారు. వారి నిజమైన పేరు, చిరునామా, కుటుంబ నేపథ్యం, చేసే ఉద్యోగం ఈ ప్రపం చానికి తెలియవు. శత్రువులు మధ్యన జీవిస్తూ సంవత్సరాల తరబడి దేశం కోసం గూఢచార కార్యకలాపాలు నిర్వహిస్తారు.

తాము భారతీయులమని గర్వంగా చెప్పుకునే హక్కు కూడా వారికి ఉండదు. కన్నతల్లి ఆఖరి చూపులకు నోచుకోక, భార్యాపిల్లలకు దూరమై, పండుగలకు కూడా సొంత ఇంటికి రాలేక మానసిక వేదన అనుభవిస్తారు. వారి జీవితంలో ప్రతి క్షణం ప్రమాదాలతో నిండి ఉంటుంది. ఒక్క చిన్న పొరపాటు జరిగినా వారి అసలు గుర్తింపు బయట పడుతుంది. శత్రు దేశాల నిఘా సంస్థలు లేదా పోలీసులు వారిని అరెస్టు చేస్తే, క్రూరమైన విచారణలు, చిత్రహింసలు, జీవిత ఖైదు, ఆఖరికి మరణం కూడా ఎదురవుతాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా దేశ రహస్యాలను బయటకు చెప్పకుండా, నరకాన్ని అనుభవిస్తూ ప్రాణాలను వదిలేస్తారు.

ఒకవేళ ఒక ‘రా’ అధికారి విదేశాల్లో శత్రువులకు పట్టుబడితే, భారత ప్రభుత్వం “అతను మా అధికారి” అని అధికారికంగా ప్రకటించదు. దేశ భద్రత, ఇతర రహస్య ఆపరేషన్లు, అక్కడ పనిచేస్తున్న ఇతర గూఢచారుల ప్రాణాలను కాపాడడం కోసం ప్రభుత్వం మౌనంగా ఉండవలసి వస్తుంది.

దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆ వీరుడికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయరు. వారి భౌతికకాయంపై త్రివర్ణ పతాకం కప్పరు. ప్రభుత్వం జాతీయ సంతాపం ప్రకటించదు. టీవీలలో, పత్రికల్లో వారి వార్తలు రావు. వారి పేరు చరిత్ర పుస్తకాలలో కూడా రాయరు. తమ రక్తాన్ని ధారపోసిన మాతృభూమి ఒడిలో కాకుండా, ఏ అపరిచిత నేలపైనో వారి శవం కాలిపోతుంది. కనీసం సొంత కుటుంబ సభ్యులకు కూడా తమ మనిషి ఎలా చనిపోయారో తెలియదు. ఇంతకంటే గొప్ప త్యాగం, ఇంతకంటే కన్నీరు పెట్టించే దేశభక్తి వేరొకటి ఉండదు.

తమ జీవితకాలంలో ఎలాంటి ప్రశంసలు ఉండవు. ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఎలాంటి ప్రచారం ఉండదు. చనిపోయినా ఈ లోకానికి తెలియదు. అయినప్పటికీ, వారు దేశసేవను వదిలిపెట్టరు. ఎందుకంటే వారి దేశభక్తి పతకాల కోసమో, పత్రికల్లో ఫోటోల కోసమో కాదు. వారి గుండెల్లో రగిలే దేశభక్తి కేవలం భారతమాత భద్రత కోసం మాత్రమే.

‘రా’ సాధించిన విజయాల గురించి ప్రజలకు చాలా తక్కువ తెలుస్తుంది. నిజానికి, ఒక నిఘా సంస్థ అసలు విజయం జరిగిన సంఘటనలలో ఉండదు, జరగకుండా అడ్డుకున్న ప్రమాదాలలో ఉంటుంది. భారతదేశంలో జరగాల్సిన ఎన్నో భారీ ఉగ్రవాద దాడులను ముందే విఫలం చేయడం, శత్రువుల వ్యూహాలు ముందుగానే పసిగట్టి మన ఆర్మీని అప్రమత్తం చేయడం వంటి అనేక విజయాల వెనుక ఈ అజ్ఞాతవీరుల శ్రమ ఉంది. వారు ప్రాణాలను పణంగా పెట్టి సమాచారం అందించడం వల్లే మన దేశం సురక్షితంగా ఉంది.

నేడు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదుగుతున్నది. ఈ సమయంలో ‘రా’ పాత్ర మరింత కీలకమైంది. నేటి యుద్ధాలు కేవలం సరిహద్దుల్లో తుపాకులతో మాత్రమే జరగడం లేదు. సాంకేతిక పరిజ్ఞానం, సైబర్ యుద్ధాలు, అంతర్జాతీయ ఉగ్రవాదం, ఆర్థిక గూఢచర్యం వంటి కొత్త తరహా సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ సవాళ్లను ఎదుర్కొంటూ, మన ‘రా’ అధికారులు రాత్రింబవళ్లు కంటిమీద కునుకు లేకుండా శ్రమిస్తున్నారు. మనం మన ఇళ్లల్లో ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే, ప్రపంచంలో ఏ మూలనో ‘రా’ అధికారులు మేల్కొని ఉండడమే కారణం.

మన బాధ్యత – వారికి మనమిచ్చే గౌరవం

ఈ అజ్ఞాత వీరుల సేవలకు మనం ప్రత్యక్షంగా ఎలాంటి ప్రతిఫలాన్ని ఇవ్వలేము. వారి ముఖాలు మనకు తెలియవు, వారి పేర్లు మనకు వినపడవు. కానీ, ఒక భారతీయుడిగా మనం చేయగలిగిందల్లా వారి త్యాగాన్ని మనస్ఫూర్తిగా గుర్తించడమే.

దేశభక్తి అంటే కేవలం పండుగల రోజుల్లో జెండా ఎగరవేయడం లేదా జాతీయ గీతం పాడడం మాత్రమే కాదు. దేశం కోసం తమ పేరును, కుటుంబ సుఖాలను, వ్యక్తిగత జీవితాన్ని, ఆఖరికి ప్రాణాలను కూడా నిశ్శబ్దంగా త్యాగం చేసే వారిని గుండెల్లో నిలుపుకోవడమే నిజమైన దేశభక్తి.

వారి పేర్లు చరిత్ర పుటల్లో నమోదు కావు. కానీ వారి త్యాగాలు ఈ దేశ మట్టిలో మిగిలిపోతాయి. సరిహద్దుల్లో నిలబడిన సైనికుడికి మనం ఎలాగైతే తలవంచి ప్రణామం చేస్తామో, ప్రపంచంలో ఏ మూలనో తన గుర్తింపును సైతం కోల్పోయి, భారతమాత కోసం నిశ్శబ్దంగా పోరాడుతున్న ప్రతి ‘రా’ అధికారికీ అంతే గౌరవంతో వందనం చేయాలి. వారు మనకు కనబడని కవచాలు. వారి త్యాగం చిరస్మరణీయం, వారి సేవలు అమూల్యం.

పి. వేణుగోపాల్ రెడ్డి

సీనియర్ ప్రచారక్

ఏకలవ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.