సాంకేతిక పురోగతి మానవ మనుగడను సులభతరం చేయాల్సింది పోయి, కొత్త కష్టాలను తెచ్చిపెడుతోంది. అనుమతి లేని అశ్లీల చిత్రాలతో బెదిరింపులకు పాల్పడి బాధితుల పరువును బజారుకీడుస్తోంది. సైబర్ స్టాకింగ్ మొదలుకొని, డిజిటల్ బెదిరింపుల వరకు ఏఐ దుర్వినియోగం పెరిగిపోతోంది. కృత్రిమ మేధస్సు వినియోగంలోకి వచ్చిన తర్వాత మహిళలపై ఆన్‌లైన్ హింస సరికొత్త రంగులు అద్దుకుంది. ఏఐ నేరస్థుల చేతిలో ప్రమాదకర ఆయుధంగా మారింది. మహిళల వ్యక్తిత్వాన్ని దుండగుల సాంకేతికతతో క్షణాల్లో ధ్వంసం చేస్తున్నారు.
ప్రత్యక్షంగా భౌతికదాడి జరగకపోయినా, డిజిటల్ రూపంలో నిశ్శబ్ద హింస… తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోంది. దీంతో సోషల్ మీడియా నుంచే కాక, తమ సామాజిక జీవితం నుంచి కూడా తప్పుకునేందుకు బాధితులు ప్రయత్నిస్తున్నారు. నగ్నంగా వీడియోలు సృష్టించడం, గొంతులు మార్చి బెదిరించడం ఇప్పుడు సులభతరంగా మారింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో స్వేచ్ఛగా ఫోటోలు పెట్టుకోవడమే మహిళలు చేస్తున్న నేరంగా తయారైంది.
నష్టాలు: కృత్రిమ మేధస్సువల్ల వేగంగా పురోగతి జరుగుతున్నప్పటికీ, నష్టాలూ అధికంగానే ఉన్నాయి. చిన్న విషయాలకు కూడా ఏఐపై అతిగా ఆధార పడటం వల్ల మనుషుల్లో సొంతంగా ఆలోచించే శక్తి, సృజనాత్మకత తగ్గే అవకాశం ఉంది. శిక్షణకు ఉపయోగించే డేటాలో పక్షపాతం ఉంటే, అది ఇచ్చే నిర్ణయాలు లేదా ఫలితాలు కూడా వివక్షతో కూడి ఉండే ప్రమాదం ఉంది. ఏది నిజం, ఏది అబద్ధం అని గుర్తించడం కష్టంగా మారడంవల్ల సామాజికంగా అపోహలు, నకిలీ వార్తలు వేగంగా వ్యాపిస్తాయి. ఏఐ సహాయంతో మహిళల చిత్రాలను, వీడియోలను మార్ఫింగ్‌చేసి నకిలీ కంటెంట్‌ను తయారుచేయడం, వారి వ్యక్తిగత భద్రతకు, గౌరవానికి తీవ్ర విఘాతం కలిగిస్తోంది. మెకిన్సీ వంటి అంతర్జాతీయ సంస్థల సర్వేల ప్రకారం, ఆటోమేషన్‌వల్ల పురుషుల కంటే మహిళల ఉద్యో గాలే ఎక్కువగా ప్రమాదంలో పడుతున్నాయి. ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్, కస్టమర్‌కేర్, డేటాఎంట్రీ వంటి విభాగాల్లో ఏఐ భర్తీ వేగంగా జరుగుతోంది. ఈ అధునాతన ఎఐ సాధనాల వాడకంవల్ల మహిళలకు సరైన అవకాశాలు లభించడంలేదు. దీంతో వారు కొత్త సాంకేతిక విప్లవంలో వెనుకబడే ప్రమాదం ఉంది. ఒకవైపు డిజిటల్ వేధింపుల భయం మరోవైపు ఉద్యోగ భద్రతలేకపోవడం వల్ల మహిళల్లో మానసిక ఒత్తిడి పెరుగుతోంది.
అభివృద్ధిపథంలో నడిచేందుకు ఉపయోగ పడాల్సిన ఏఐ… బాధితుల పట్ల శాపంగా మారుతున్న తరుణంలో మనను మనం ఎలా కాపాడుకోవాలో ఆలోచించాలి. అంతర్జాలంలో 90 శాతానికి పైగా అనుమతి లేని అశ్లీలచిత్రాలే ఉంటు న్నాయని, అందులో అత్యధికంగా మహిళలే బాధితులుగా మారుతున్నారని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ తరహా ఏఐ ఆధారిత హింస కేవలం ఉద్యోగి నులు లేదా సెలబ్రిటీలకే పరిమితం కాకుండా సాధారణ బాలికల వరకు విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. సోషల్ మీడియాలో మహిళల గొంతు లేదా రూపాన్ని సాంకేతికత ద్వారా మార్చి, వారు అనని మాటలు అన్నట్లు చూపిస్తూ వారి పరువుకు నష్టం కలిగిస్తున్నారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఇన్ఫోసిస్ సుధావ•ర్తి వంటి ప్రసిద్ధ మహిళల వీడియోలే ఇందుకు ఉదాహరణ.
రూపొందించే దశలోనే భద్రత: కృత్రిమ మేధస్సు తెస్తున్న వేగవంతమైన మార్పుల వల్ల కొన్ని నష్టాలు ఉన్నప్పటికీ, సరైన నివారణోపాయాల ద్వారా వాటిని అదుపు చేయవచ్చు. పరికరాలను అభివృద్ధి చేసే కంపెనీలు దుర్వినియోగాన్ని అరికట్టే భద్రతా ప్రామాణికాలను నిబంధనల్లో చేర్చాలి. ఏఐ ద్వారా సృష్టించిన లేదా మార్చిన కంటెంట్‌ను సులభంగా గుర్తించేలా వాటర్‌మార్క్‌లను తప్పనిసరి చేయాలి. ఫిర్యాదు వచ్చిన వెంటనే ఆటోమేటెడ్ వ్యవస్థల ద్వారా అభ్యంతరకర విషయాలను తొలగించే చర్యలు సోషల్ మీడియా వేదికలు వేగవంతం చేయాలి. అలాగే, వైద్యనిర్ధారణ పరికరాలు ఎక్కువగా పురుషుల డేటాతో శిక్షణ పొందుతాయి. దీనితో మహిళల్లో వచ్చే జబ్బులు, ఇతర లక్షణాలను గుర్తించడంలో లోపాలు చూపించే అవకాశం ఉంది. వైద్యం, న్యాయం, ఉద్యోగ ఎంపికలు వంటి కీలక రంగాల్లో తుది నిర్ణయం ఏఐకి ఇవ్వకుండా మానవ పర్యవేక్షణ తప్పనిసరి చేయాలి.
చట్టపరమైన సంస్కరణలు: ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు బహుముఖ వ్యూహం అవసరం. డీప్‌ఫేక్స్, ఏఐ-ఆధారిత సైబర్ నేరాలను ప్రత్యేక నేరాలుగా పరిగణిస్తూ కఠినమైన చట్టాలు రూపొందించాలి. అనుమతి లేకుండా వ్యక్తిగత చిత్రాలను మార్చడం, ప్రచారం చేయడాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించాలి.
అవగాహన-సహాయ వ్యవస్థలు: కృత్రిమ మేధస్సు వల్ల విఘాతం కలుగుతున్న నేపధ్యంలో మహిళలు, బాలికలకు అవగాహన కల్పించాలి. బాధితులకు తక్షణ న్యాయపరమైన, మానసిక, సాంకేతిక సహాయం అందించే హెల్ప్‌లైన్లు, సైబర్ సెల్స్ బలోపేతంచేయాలి. సమాచార సాంకేతిక చట్టం, బిఎన్‌ఎస్ కింద డీప్‌ఫేక్, ఆన్‌లైన్ వేధింపులపై కేసులు నమోదు చేయవచ్చు. ఆన్‌లైన్ వేధింపులు ఎదురైతే తక్షణమే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్…లేదాసైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి.ఫోన్ లేదా కంప్యూటర్లను సైబర్ మోసాలు, హ్యాకర్ల బారినుండి కాపాడుకోవాలి. బలమైన పాస్వార్డ్‌లు వాడటం, అపరిచితులు పంపిన లింక్ లు జోలికి వెళ్లకుండా ఉండటం, పబ్లిక్ వైఫైకి దూరంగా ఉండటం ద్వారా సురక్షితంగాఉండవచ్చు. సోషల్ మీడియాలో ప్రైవసీ సెట్టింగ్స్ బలంగా ఉంచుకోవడం, తెలియని యాప్‌లకు ఫోటో యాక్సెస్ ఇవ్వకపోవడం శ్రేయస్కరం.
కృత్రిమ మేధస్సు, సాంకేతికత మానవ పురోగతికి దోహదపడాలి తప్ప, మహిళలపై డిజిటల్ రూపంలో జరుగుతున్న హింసకు ఆయుధంగా మారకూడదు. ఈ సమస్యలను అధిగమించడానికి కఠినమైన సైబర్ చట్టాలు, వ్యవస్థల్లో లింగ సమానత్వం ఉండేలా నియమాలు రూపొందించడం చాలా అవసరం.

జయశ్రీ ఆచంట
సీనియర్ జర్నలిస్ట్