భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది


‌బమ్మిడి దేవీప్రసాద్‌

సుమారు 1960 ప్రాంతం నుండి, నాకు మా ఇంట్లో జరిగే దేవీ నవరాత్రులు గుర్తున్నాయి. అప్పటికి నాకు ఎనిమిది సంవత్సరాలు. మా నాన్న హరిపురంలో దసరా ఉత్సవాలు చేయటం ప్రారంభించారని చెప్తారు. మొదట తొమ్మిది రోజులు చేసేవారు. హరికథలూ, బుర్రకథలూ, బండ్ల వేషాలు, వీధి భాగోతాలు-ఆ తొమ్మిది రోజుల్లో జరిగేవి. నాన్నే ఖర్చంతా పెట్టేవారు. ఎవరి దగ్గరా తీసుకునే వారు కాదు. ఆ తరువాత మా నాన్న ఆదాయం తగ్గి ఆ ఉత్సవాలు మూడు రోజులకి దిగాయి.

దసరా నవరాత్రులప్పుడు మా ఇంట్లో బలే సందడిగా ఉండేది. దేవీ పటాన్ని ఇంటి వ•డో అంతస్తు గది నుండి నాన్నగారి కాంపౌండర్‌ ‌జన్ని రావ్మర్తి దించేవాడు.

ఆ పటాన్ని ప్రతిష్ఠించడానికి ఓ కర్ర కుర్చీ ఉండేది. దాన్ని అలంకరించడానికి ఉలిపిరి కాగితా లతో రంగురంగుల పువ్వులు తయారు చేయడం మూడురోజుల ముందు నుంచే ప్రారంభమయ్యేది. పూలు చేయడం, ఐడియాలు ఇవ్వటంలో మా పిల్లల మధ్య చాలా పోటీ ఉండేది.

దసరా సంబరాల్లో జరిగే అన్ని కార్యక్రమాల్లో మా పిల్లలకి నచ్చిన కార్యక్రమం హరికథ. హరికథ అంటే మా హరిదాసు మామయ్య హరికథే. పిల్లలు అంటే మా తమ్ముడు భవానీ, చెల్లెలు రాజేశ్వరి, అప్పటికింకా మరో తమ్ముడు దుర్గా పుట్టలేదు. మా చిన్నాన్న పిల్లలూ, పక్క వీధి పంతులుగారి పిల్లలు. ఇంకా చాలామంది పిల్లలు చేరేవారు. అన్ని సంవత్స రాల్లోనూ మా ఇంట్లో సంబరాలకు ఆయనే హరికథకి మొనాపొలి. పేరున్న వారున్నా నాన్న మరెవరితోనూ చెప్పించలేదనుకుంటా.

హరిదాసు మామయ్య మా జ్ఞాపకాల్లో, మా ఇంట్లో అలా పాతుకు పోవడానికి కారణాలు ఎన్నో వున్నాయి.

ఆయన అసలు పేరు నరసింహ మూర్తి ఆచారి. వాళ్లు షరాబులు. శ్రీకాకుళం దగ్గిర అరసవిల్లి వాళ్ల ఊరనుకుంటా. దసరా సంబరా లకి ముందు, సంబరాల్లో కళారూపాలు ప్రదర్శించే వారికి పోస్ట్ ‌కార్డులు వెళ్లేవి. సాధారణంగా చుట్టాలను పిలవడమంటూ ఉండేది కాదు. పిలవకుండానే వచ్చి పూజ ఏర్పాట్లలో సాయం చేసేవారు. అలాంటి వాళ్లు మా చిన్నమ్మ, మేనత్త, చిన్నాన్న, ఊర్లో స్నేహితులు.

హరిదాసు మామయ్య మాత్రం కార్డు అందగానే ఒక వారం ముందే రెక్కలు కట్టుకుని హరిపురం వచ్చేసేవాడు. నిజంగా రెక్కలు కట్టుకునే!

ఆయన దిగిన వెంటనే-ఆ హడావిడీ, అందర్ని పలకరించడం, జోక్స్ ‌వేసి నవ్వించేవారు.

ఆయన ఏమీ పెద్ద సరంజామాతో దిగే వాడు కాదు. ఓ నల్ల ట్రావెల్‌ ‌జిప్‌ ‌బ్యాగులో హరిదాసు వేషానికి సంబంధించిన ఎర్ర పట్టుపంచె, జరీ అంచు పసుపు రంగు ఉత్తరీయం, చిడతలు, గజ్జెలు, నాంపండు, మెడలోకి పూసల దండా ఉండేవి. అవికాక ఓ రెండు జతల దుస్తులు.

పూజకి కేటాయించిన హాల్లో ఓ మూల పొడవు బెంచి కింద ఆయన ట్రావెల్‌ ‌బ్యాగు ఒదిగిపోయేది. రాత్రి ఆ హాల్లోనే నిద్ర. స్నానాదికాలకు ఊరి చెరువు. చెరువు గట్టున శివాలయంలో పూజ తరువాత, నుదుట విభూతిలో, నోట్లో కిళ్లీతో ఆయన రోజు మొదలయ్యేది.

ఆయన వేషధారణ-శుభ్రంగా ఉతుక్కున్న ముతక తెల్ల లాల్చి, పంచె, భుజం మీద ఎర్ర తువ్వాలు. మనిషి చాలా హాస్యంగా ఉండేవాడు. ఏదో ఒక మాట అనేవాడు. దాంతో అందరికీ నవ్వొచ్చేది. ఆయన ఉన్న చోటు నుంచి ఏవో నవ్వులు వినపడుతుండేవి. నాకు తెలిసినంతవరకు ఆయన జోక్స్ ‌వేయనిది ఇద్దరితోనే. వారు మా నాన్న, అమ్మా. మా అమ్మయితే, అన్నయ్యా అని పిలిచి మరీ భోజనం పెట్టేది.

ఆయన అలా వారం ముందు వచ్చినా ఎవరికీ ఇంట్లో ఇబ్బంది ఉండేది కాదు. పిల్లలకి మాత్రం ఆయన వస్తే సందడే. చెరువుకి వెళ్లి కలువపూలు తేవడం, బంతి పూలతో దండలు కట్టి దేవి పటానికి అలంకరించటం, ప్రసాదం పెట్టటం.. వంటి వాటన్నిటికి అనధికారిక పూజారిగా వ్యవహరించే వాడు.

దసరా నవరాత్రులలో రెండో రోజో, మూడో రోజో, లేక చివరి రోజో ఆయన హరికథా కాలక్షేపం ఉండేది. మా ఇంటి ముందు కర్ర బల్లలతో ఓ స్టేజీ వేసేవారు. దానిమీదే చాలా వరకు అన్ని కార్యక్రమాలు జరిగేవి. మొదట పెట్రోమాక్స్ ‌లైట్లూ, ఆ తరువాతి రోజుల్లో ఎలక్ట్రికల్‌ ‌లైట్స్‌తో స్టేజి వెలిగిపోయేది.

హరిదాసు మామయ్య గాత్రం వినటానికి బాగుండేది. పద్యాలు, కీర్తనలు, సంగీతయుక్తంగా ఉండేవి. ఆయన పాడుతుంటే గొంతులో ఓ జీర ఉండేది. అతను బాగా కిళ్లీలు తినటంవల్ల ఆ గొంతు అలా ఐపోయిందేమోనని మా అనుమానం.

అతను స్టేజి మీదికి వచ్చి మైకు ముందు నుంచోవడం, జన్ని రామ్మూర్తి హార్మోనియం, వల్లభరావు మద్దెలతో చెరో పక్కన కూర్చోగా, హరికథ దృశ్య కావ్యం మొదలయ్యేది. కొన్ని సంవత్సరాలుగా మా హరిదాసు మామయ్య చెప్పిన చాలా కథలు మాకిష్టమైనవి ఉన్నాయి. రుక్మిణీ కల్యాణం, భక్తప్రహ్లాద, భక్త రామదాసు, సుందరకాండ, శ్రీకృష్ణ జన్మవృత్తాంతం, పాండవ వనవాసం- ఇలా కొన్ని మా మనసుల్లో ఉండిపోయాయి. అందులో రుక్మిణీ కల్యాణం చాలా ప్రత్యేకం. ఆ కథ చాలాసార్లు అతను చెప్పినట్టు గుర్తు. అందులో పోతన పద్యాలే ఎక్కువ పాడేవాడు.

హరిదాసు మామయ్య హావభావాలు, పాట, గజ్జెలు కదలింపు, నాట్యం లయబద్ధంగా వుండేవి. ముఖ్యంగా భావం, ఆంగికం రుక్మిణీ దేవి శ్రీకృష్ణుడికి వద్దకు పంపిన బ్రాహ్మణుడి కోసం వేచి చూస్తూ పడిన వేదన, ఆయన గాత్రం లో వ్యక్తమయ్యేది.

‘‘ఘనుడా భూసురుడేగెనో, నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో, విని కృష్ణుండది తప్పుగా తలచెనో’’ అంటూ ఎడమ ముణుకు మీద కూర్చుని కుడికాలిపై మోచేతి మీద ముఖమానించి దీనంగా ‘‘నా భాగ్యమెట్లున్నది’’ – అని పద్యం ముగించి ఓ రెండు క్షణాలు అలాగే ఉండిపోయేవాడు. ప్రేక్షకుల ముఖాల్లో ఆమె పడుతున్న బాధ కనపడేది. ఆ క్షణాన, వేదిక మీద పందిరిలో కొబ్బరాకులు గాలికి కదిలే చప్పుడు తప్పించి మరేమీ ఉండేది కాదు.

‘‘లగ్నంబెల్లి వివాహముంగదిసె నే రాడు గోవిందుడని’’ ఉద్విగ్నమైన రుక్మిణి మనస్సులోని భావాల్ని తన గొంతులో పలికించే వాడు. అలాగే, పార్వతీదేవీ మందిరం నుండి బయటికి చెలికత్తె వేలుపట్టుకుని రుక్మిణి ఎలా మెల్లగా నడుస్తూ వస్తోందో వయ్యారంగా స్టేజి మీద నడిచి చూపిస్తే ప్రేక్షకులు నవ్వులు, చప్పట్లతో ఊగిపోయేవారు. ఆ వెంటనే అతని కంఠం, ఆంగికం మారిపోయేవి. రుక్మిణి ఆ దారిలో శ్రీకృష్ణుడ్ని ఎలా చూసిందో చెప్పే పద్యంలో-

‘‘కనియెన్‌ ‌రుక్మిణి, చంద్రమండల ముఖున్‌ ‌కంఠీరవేంద్రావలజ్జున్‌… ‌కంబు కంఠున్‌, ‌జగన్మోహ నున్‌,’’ ‌గొప్పగా, గంభీరంగా, కంచుమోగినట్టు అతని గానం, గజ్జెల లయబద్ధ శబ్దాలు మా చెవుల్లో మారుమోగేవి. ఆ కృష్ణుడు రుక్మిణీ దేవికి ఎలా కనిపించాడో గాని, మా మనసుల్లో కృష్ణుడి సుందరరూపం ముద్ర పడిపోయింది. ఆ రూపానికి దైవత్వం నేను అంటగట్టక పోయినా, ఒక గొప్ప వ్యక్తిగా, రాజనీతిజ్ఞునిగా, గీతోపదేశికుడిగా నా మనసులో ఆ రూపం ఉండి పోయింది.

ఇక చివరిగా, అలా కృష్ణుణ్ణి చూసిన తరువాత ఆమె రథం వైపు ఎలా నడిచి వచ్చి, కృష్ణుడి చేయి అందుకుని రథం ఎక్కడాన్ని, హోయలుగా నడుస్తూ ఒక చిన్న గెంతు గెంతి రథం అధిరోహించడాన్ని చూపేవాడు. ఆ వయ్యారానికి, నడకకి మరలా ప్రేక్షకుల్లో నవ్వులూ, కేరింతలూ.

కథలో మధ్య మధ్య హాస్యస్పోరకమైన పిట్టకథలు, ఒకటో రెండో సినిమా పాటలూ ఉండేవి.

రుక్మిణీ కల్యాణం తరువాత మా అందరికి నచ్చిన కథ భక్త రామదాసు.

‘‘ఏ తీరుగ నను దయ తలచెదవో ఇన వంశోత్తమ రామా…నా తరమా భవ సాగర మీదను నళిన దళేక్షణ రామా’’…అంటూ హరిదాసు మామయ్య పాడిన ఆ కీర్తన- ఆ వీధిలో, పందిరి కింద, లైట్ల వెలుతుర్లో వెలవెలబోయిన బయటి వెన్నెల్లో, ఆ గాలిలో- నాకు ఇంకా వినపడుతోనే వుంటుంది.

‘‘ఇక్ష్వాకు కుల తిలకా… భరతునికి చేయిస్తి పచ్చల పతకము..ఆ పతకమునకు పట్టే పదివేలా వరహాలు రామచంద్రా’’

మాకు ఇష్టమైన కీర్తన. రామదాసు ఎలా తిట్టేడో రామభద్రుడినని అనుకునే వాళ్లం.

‘‘ఆ దెబ్బలకోర్వక అబ్బా తిట్టితినయ్యా’’ అనే చరణం ఆ తిట్లకు ఉపసంహారంగా మాకు అనిపించేది.

అలా కొద్ది సంవత్సరాలు గడిచిపోయేయి. ఈలోగా కాలం పెనుమార్పులు తెచ్చింది. అది 1970-1975 ప్రాంత కాలం. నేను విజయనగరం లో పి.యు.సి తరువాత, శ్రీకాకుళం గవర్నమెంట్‌ ‌డిగ్రీ కాలేజ్‌లో బీయెస్సీ చదువుతున్న రోజులు. అప్పటికి హరిదాసు మామయ్య హరికథా కాలక్షేపం మా దసరా సంబరాల్లో నిరాటంకంగా జరుగుతోనే ఉంది. ప్రేక్షకులు బాగానే వస్తున్నారు. వేదిక దగ్గర నుండి వీధి చివర బాదం చెట్టు వరకు జనాలు నిండేవారు. హరిపురంలో హరికథ చెప్పిన తరువాత చుట్టుపక్కల ఉద్దానం గ్రామాల్లో కూడా ఆయన హరికథలు జరిగేవి. కాస్త డబ్బులు చేర్చుకుని, నవరాత్రులై పోయేక శ్రీకాకుళం వెళ్లేవారు.

ఐతే, కాలంతో పాటుగా కొన్ని మార్పులొచ్చాయి. ఆనవాయితీగా ప్రతి సంవత్సరం దసరా సంబరాల్లో ఆయన హరికథా కాలక్షేపం ఉన్నా, రాను రాను జనం రావడం తగ్గిపోయింది. రికార్డింగ్‌ ‌డాన్సుల ప్రభావం గ్రామాలకి ప్రాకింది. హరికథకే కాదు, పౌరాణిక నాటకాలు, వీధి బాగోతం వంటి కళా రూపాల మీద ప్రజలకి ఆసక్తి తగ్గిపొయింది.

జనం అంతగా రాకపోయినా, మా నాన్న అతనినే కథ చెప్పమనేవారు. అందుకు వేరే కారణాలు కూడా ఉండేవి. అలా కథ చెప్పడం వల్ల ఆయనకు డబ్బులివ్వడానికి వీలయ్యేది. లేకపోతే తను తీసుకోడని నాన్నకి తెలుసు. అలాగే ఆయన పోగ్రామ్‌ ఉం‌డటం వల్ల ఆ సంబరాలలో ఆయన రాకకు ఓ స్థానం, ప్రయోజనం ఉండేది.

అలా దసరా సంబరాలకి హరిదాసు మామయ్య వచ్చేవాడు. ఏదో ఒక రాత్రి ఎంతమంది ఆడియన్స్ ఉన్నా సిన్సియర్‌గా హరికథ చెప్పేవాడు. మా నాన్న ఇంటిముందు సిమెంటు గడప మీద కూచుని తప్పనిసరిగా కథ వినే వారు. మేం ఎలానూ ఆడియెన్స్‌లో ఉండే వాళ్లం. ఓ రెండు సంవత్సరాల తర్వాత ఒక దసరా ఉత్సవాలలో ఇది జరిగింది.

అది 1974వ సంవత్సరమేమో. ఎప్పటిలాగే సంబరాలకి హరిదాసు మామయ్య ఊళ్లోకి దిగేడు. పూజ, భజనాది కార్యక్రమాలలో బిజీగా తిరుగుతున్నాడు. రెండు రోజులు గడచి పోయేయి. మా నాన్న హరికథా కాలక్షేప ప్రస్తావన ఎంతకీ తేకపోతుంటే, ఆయనే కల్పించుకుని –

‘మాస్టారూ! హరికథ ఎప్పుడు పెట్టిద్దాం’ అన్నాడు.

మా నాన్న ఆలోచనల్లో పడినట్టు కన్పించారు.

‘జనాలు మరీ పల్చనై పోతున్నారు ఆచారీ! ఏం చేద్దాం’ అన్నారు.

‘ఈసారి బాగా చెప్పి రక్తి కట్టిద్దాం. నా శాయశక్తులా ప్రయత్నిస్తాను’ అన్నాడతను.

మా నాన్నేమన్లే. మూడో రోజు రాత్రికి హరికథ కాలక్షేపం నిర్ణయించారు. ఆ సాయంకాలం నుండే మైక్‌లో రాత్రి జరుగబోయే హరికథ గురించి అనౌన్స్‌మెంట్స్ ‌వచ్చేయి.

రాత్రి తొమ్మిదయింది. హరిదాసు మామయ్య తయారై చిడతలు పట్టుకుని హాల్లో అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఇంకా జనం ఎవరూ స్టేజీ ముందుకు చేరలా. పిల్లలు మాత్రం దీపాల కింద పరిగెడుతూ ఆడుకొంటున్నారు.

అరగంటైంది. గంటైంది. ఒకరిద్దరు వచ్చి కూచున్నారు. స్టేజి పక్కన ఉసిరిక చెట్టు కింద ఓ కుక్క చలికి ముడుచుకుని నిద్రపోతోంది.

ఇక ఆలస్యం చేయకూడదని హరిదాసు, ఆయన టీమ్‌ ‌స్టేజి మీదకి చేరేరు. విఘ్నేశ్వర ప్రార్థన, సరస్వతీ ప్రార్థన చేసి కథ మొదలుపెట్టేడో లేదో, ఆ ఇద్దరు ప్రేక్షకులు మెల్లగా నిష్క్రమించారు.

ఇక అప్పటికి, సిమెంటు గడప మీద మా నాన్న, మేడ మీద నుంచి చూస్తున్న మా అమ్మ, నేను, చెల్లి రాజేశ్వరి, స్టేజి మీద రావ్మర్తి, వల్లభరావూ మిగిలాం. ఐనా నిరుత్సాహ పడకుండా గజ్జె కదలించి పద్యం ఎత్తుకున్నాడు ఆ నిర్మానుష్యమైన ప్రదేశాన్నుద్దేశించి.

ఎన్నాళ్లో, ఎన్ని కథలో చెప్పి ఎందరినో మెప్పించిన ఆ స్టేజి మీద, మడమ తిప్పకుండా కథా కాలక్షేపం చేయాలన్న పట్టుదల అతనిది. కానీ అదెలాంటి పరిస్థితి? అదెంత విషాదం?

కథ ప్రారంభించిన కాసేపటికి, ఉసిరిక చెట్టు కింద ఉన్న కుక్కకి నిద్రా భంగమైనట్లుంది నెమ్మదిగా లేచి ఒళ్లు దులుపుకొని ప్రేక్షక స్థానానికి, అదే స్టేజీ ముందుకి వచ్చి కూర్చుంది.

హరిదాసు పద్యంలోని చరణం పూర్తి చేసి రాగం ఎత్తుకున్నాడు. స్టేజి ముందున్న బైరవుడు మోరెత్తి ‘ఓ’ – అంటూ అరవటం ప్రారంభించేడు. అనూహ్యమైన ఆ సంఘటనకి కాస్త తికమకపడ్డా, అతను ఛా!ఛా! అని కుక్కని అదిలించి మళ్లా రాగం అందుకున్నాడు.

కుక్క మళ్లీ రాగం మొదలెట్టింది. ఇలా హరిదాసు రాగం ఎత్తుకోవడం, కుక్క అదేవిధంగా రాగంమల్లే అరవడం మరో రెండుసార్లు జరిగినప్పటికీ హార్మోనియం వాయిస్తున్న రామ్మూర్తి తువ్వాలు నోటికి అడ్డం పెట్టుకుని నవ్వటం మొదలెట్టేడు. వల్లభరావు మాత్రం నవ్వు తొక్కి పెట్టుకున్నట్టు కనిపించాడు. మా నాన్న మొదట నవ్వినా వెంటనే నవ్వు ఆపి సీరియస్‌గా ఐపోయేరు.

ఇక లాభం లేదనుకున్నాడేమో హరిదాసు మామయ్య మంగళ హారతి చెప్పేసి స్టేజీ దిగిపోయేడు.

రావ్మర్తి స్టేజి దిగి ఓ కర్రుచ్చుకుని, ‘దీనెమ్మా…’ అని బూతులు తిడుతూ ఆ కుక్కని వీధి చివరకు తరుముకుంటూ వెళ్లేడు. నేను హాల్లోకి వచ్చేసరికి వేషం దుస్తులు బ్యాగులో సర్దుకొంటున్న హరిదాసు మామయ్య అన్యమనస్కంగా కనపడ్డాడు.

ఆ సంవత్సరం తరువాత, అతను మరో సంవత్సరం దసరా ఉత్సవాలకి వచ్చేడు గానీ హరికథ చెప్పలేదు. ఆ తరువాతి సంవత్సరం రాలేదు. హరిదాసు మామయ్య ఎందుకు రాలేదా? అని మావాళ్లు చర్చించుకోవడం విన్నా. ఆ తరువాతి ఏడాది శ్రీకాకుళంలో నేను బీయెస్సీ రెండో సంవత్సరం. అపుడపుడూ అరసవిల్లి దేవాలయంకి వెళ్లడం అలవాటుగా ఉండేది. నాదేం దైవభక్తి కాదు. కొబ్బరికాయలు, అరటిపండ్లు తీసుకెళ్లటం లాంటి పనులేం చేసేవాడ్ని కాదు. కోవెలకి వెళ్లి, ఓ సారి ప్రదక్షిణ చేసి కూర్చొని వస్తే బాగుండేది. ఆరోజు అరసవిల్లికి నా హెర్క్యూలిస్‌ ‌గుర్రం మీద పెంటవారి వీధిలోంచి వెళుతున్నాను. తెల్లవారి ఆరుగంటలు కూడా ఇంకా అవలా!

అక్కడ ఓ షాపు అరుగుమీద ఎవరో పడుకునున్నారు, రోడ్డు వేపు వీపు పెట్టుకుని. నా సైకిలు షాపుని సమీపించే చప్పుడికి అతను ఇటు తిరిగేడు.

ఎవరా అని పరికించా!

‘హరిదాసు మామయ్య!’

నన్ను చూశాడు. ఒక్క ఉదుటున సైకిలు దిగాను.

‘ఏమిటిక్కడున్నావు మామయ్యా? మీ ఇల్లు లేదా?’ అనడిగేను.

‘ప్రసాదూ! నువ్వా?ఈ సందులోనే మా అబ్బాయి ఇల్లు. ఇక్కడ బాగుంటుందని పడుకున్నా,’ అన్నాడతను.

రెండు నిమిషాలు ఏవో మాటలయ్యాయి. నా మనసులో ఎన్నో ప్రశ్నలు ‘ఏమిటి ఈయన పరిస్థితి’ అని.

‘నాకు షుగరొచ్చిందిరా ఈ మధ్యే’

మాటలు పూర్తయిన తరువాత, సరే వెళ్తాను అని బయల్దేరాను. సైకిలెక్కబోతున్న నన్ను ఆపి –

‘ప్రసాదూ! ఓ రెండ్రూపాయలుంటే ఇస్తావా?’ అన్నాడు.

అతని కళ్లలోకి చూసేను. ఎంత మథనపడుతూ ఆ మాటన్నాడో నాకు కనపడింది.

నా కళ్లల్లో నీళ్లు. జేబులో చెయ్యిపెట్టి, దాన్లో ఉన్న మొత్తమంతా తీసి ఆయన చేతిలో పెట్టి ఆ చెయ్యి వ•సేసి -సైకిలెక్కి అరసవిల్లి వెళ్లిపోయేను. అంతకన్నా ముందుకు వెళ్లి ఆ దినాన అతనికి ఏమి చెయ్యలేకపోయిన నా అనుభవశూన్యతకి ఇప్పటికీ గిల్టీగా ఫీల్‌ అవుతున్నా.

About Author

By editor