‌బ్రిటన్‌ ‌ప్రధాని కీర్‌ ‌స్టార్మర్‌ ‌తన పదవికి రాజీనామా చేయడానికి  సొంత పార్టీ (లేబర్‌ ‌పార్టీ) నుంచే ఎదురైన తీవ్ర వ్యతిరేకత, అంతర్గత రాజకీయ సంక్షోభమే ప్రధాన కారణం. పార్టీ ఎంపీల నుంచి, మంత్రుల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా 100 మందికి పైగా లేబర్‌ ‌పార్టీ ఎంపీల మద్దతును ఆయన కోల్పోయారు. అధికార లేబర్‌ ‌పార్టీకి ప్రజల్లో ఆదరణ పడిపోవడం, అంతర్గత అసంతృప్తి పెరగడంతో స్టార్మర్‌ ఈ ‌నిర్ణయం తీసుకున్నారు.

‌ప్రజాభిప్రాయ సేకరణలో దారుణమైన రేటింగ్‌లు, గత సంవత్సరం పీటర్‌ ‌మాండెల్సన్‌ను యూఎస్‌ ‌రాయబారిగా నియమించాలన్న ఆయన నిర్ణయం తర్వాత వచ్చిన వరుస ఇబ్బందుల నేపథ్యంలో, లేబర్‌ ‌నాయకుడిపై కొంతకాలంగా ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. మే నెలలో వేల్స్, ‌స్కాట్లాండ్‌ ‌పార్లమెంట్‌లకు, అలాగే ఇంగ్లాండ్‌లోని కొన్ని ప్రాంతాల స్థానిక కౌన్సిళ్లకు జరిగిన ఎన్నికలను, పరిస్థితులను చక్కదిద్దగలనని నిరూపించుకోవడానికి ఆయనకు లభించిన చివరి అవకాశంగా తీవ్ర నిరాశలోవున్న లేబర్‌ ఎం‌పీలు చాలాకాలంగా భావించారు. కానీ ఈ ఎన్నికల్లో నిరాశాజనక ఫలితాలు రావడం, నైజెల్‌ ‌ఫరాజ్‌ ‌నాయకత్వంలోని వలస వ్యతిరేక, తీవ్ర మితవాద లేదా జాతీయవాద రిఫార్మ్ యూకే పార్టీ బాగా పుంజుకోవడం లేబర్‌ ‌పార్టీ నాయకులకు ఆశనిపాతమైంది. లేబర్‌ ‌పార్టీ 1,496 కౌన్సిల్‌ ‌సీట్లను కోల్పోగా, రిఫార్మ్ ‌పార్టీ 1,453 కౌన్సిలర్‌ ‌స్థానాలను (వీటిలో అధికభాగం లేబర్‌ ‌పార్టీ నుండే) కైవసం చేసుకుంది, 14 కౌన్సిళ్లపై నియంత్రణ సాధించింది. ఈ ఎన్నికలను స్టార్మర్‌పై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణగా పరిగణించారు. ‘రిఫార్మ్ యూకే’  వేగంగా ఎదుగుతున్న నేపథ్యంలో, పార్టీ ఎన్నికల అవకాశాలపై లేబర్‌ ఎం‌పీలు, క్యాబినెట్‌ ‌మంత్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇదే సమయంలో వలసలపై కఠినమైన వైఖరిని అవలంబించడానికి స్టార్మర్‌ ‌చేసిన ప్రయ త్నాలు, మాజీ కన్జర్వేటివ్‌ ఓటర్లలో, అలాగే లేబర్‌ ‌పార్టీ సాంప్రదాయ కార్మికవర్గ మద్దతుదారులలో, ముఖ్యంగా ఉత్తర ఇంగ్లాండ్‌లో రిఫార్మ్ ‌పార్టీకి పెరుగుతున్న ఆదరణను ఆపడంలో విఫలమయ్యాయి. చివరికి, ఫలితాలు తీవ్ర నిరాశాజనకంగా రావడంతో, వెస్‌ ‌స్ట్రీటింగ్‌ ఆరోగ్య కార్యదర్శి పదవికి, అలాగే పలువురు జూనియర్‌ ‌మంత్రులు రాజీనామా చేశారు. రక్షణ వ్యయంపై తెరవెనుక దీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదం కారణంగా, లేబర్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నాయకుడు జాన్‌ ‌హీలీ ఇటీవల రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేయడంతో, ప్రధాని ప్రతిష్ట మరింత క్షీణించింది. దీనికి తోడు ఇటీవల మేకర్‌ఫీల్డ్‌లో బర్న్‌హామ్‌ ‌సాధించిన నిర్ణయాత్మక విజయం, రిఫార్మ్ యూకేపై లేబర్‌ ‌పార్టీ మెజారిటీని పెంచడంతో, చాలా మంది ఎంపీలకు ఆయనపై ఆదరణ మరింత బలపడింది. తన క్యాబినెట్‌ ‌మంత్రులలో చాలామంది రహస్యంగా రాజీనామా చేయమని కోరినప్పటికీ, సర్‌ ‌కీర్‌ ‌తన నాయకత్వానికి ఎదురయ్యే సవాలును ఎదుర్కొంటానని మొదట పట్టుబట్టారు. కానీ లేబర్‌ ఎం‌పీలలో తనకు తగినంత మద్దతు లేదని ఆయనకు అంతిమంగా నిర్ధారణ కావడంతో రాజీనామా తప్ప మరో మార్గంలేకపోయింది.ఆయన రాజీనామాతో గ్రేటర్‌ ‌మాంచెస్టర్‌ ‌మేయర్‌ ఆం‌డీ బర్న్‌హామ్‌ను డౌనింగ్‌ ‌స్ట్రీట్‌లోకి తీసుకువెళ్లే అవకాశాలు మెరుగు పడ్డాయి. ఫలితంగా గత పదేళ్లలో యూకేకు ఏడవ ప్రధాని రానున్నారు.

ఆండీ బర్న్‌హామ్‌ ‌మిత్రుడొకరు మేకర్‌ఫీల్డ్ ఎం‌పీ పదవికి రాజీనామా చేయడంతో, అప్పటి గ్రేటర్‌ ‌మాంచెస్టర్‌ ‌మేయర్‌కు, లేబర్‌ ‌పార్టీ కిరీటం కోసం పోటీపడటానికి వెస్ట్‌మిన్‌స్టర్‌కు తిరిగి రావాలన్న తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి మార్గం సుగమ మైంది. ఫిబ్రవరిలో జరిగిన ఉప ఎన్నికలో బర్న్‌హామ్‌ ‌పోటీ చేయకుండా సర్‌ ‌కీర్‌ ‌గతంలో అడ్డుకోగలిగారు. కానీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఎంపీలు ఆయన రాజీనామాను డిమాండ్‌ ‌చేయడంతో, బర్న్‌హామ్‌ను అడ్డుకునే అధికారం ఆయనకు లేకుండా పోయింది. దీంతో ఇటీవల ఉత్తర ఇంగ్లాండ్‌లోని మేకర్‌ఫీల్డ్‌లో జరిగిన ఉప ఎన్నికలో గెలిచి పార్లమెంటుకు తిరిగి వచ్చిన బర్న్‌హామ్‌, ఈ అర్హతను సాధించడానికి అవసరమైన మద్దతును కూడగట్టగలిగినట్టు తెలుస్తోంది.

తదుపరి ప్రధాని బర్న్‌హామ్‌?

‌స్టార్మర్‌ ‌స్థానాన్ని భర్తీ చేసే ప్రధాన అభ్యర్థిగా అధికశాతం మంది పరిగణిస్తున్నారు. ఇటీవల జరిగిన మేకర్‌ఫీల్డ్ ఉప ఎన్నికలో ఆయన సాధించిన విజయం ఇందుకు ప్రధాన కారణం. ఒకరకంగా చెప్పాలంటే ఈ విజయం ఆయన స్థానాన్ని మరింత బలోపేతం చేసింది. బర్న్‌హామ్‌ 55 ‌శాతం ఓట్లను గెలుచుకుని, రిఫార్మ్ యూకేకు చెందిన రాబర్ట్ ‌కెన్యాన్‌ ‌కంటే 9,200 ఓట్లకు పైగా ఆధిక్యం సాధించారు. నిజానికి ఈ పోటీ చాలా తీవ్రస్థాయిలో వుంటుందని వేసిన అంచనాలను బర్న్‌హామ్‌ ‌తల్లక్రిందులు చేశారు. గ్రేటర్‌ ‌మాంచెస్టర్‌ ‌మేయర్‌గా, బర్న్‌హామ్‌ ‌లేబర్‌ ‌పార్టీలో అత్యంత సుపరిచితమైన, ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకులలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. వ్యాపార అనుకూల విధానాలను, నిత్యావసర సేవలపై అధిక ప్రజా నియంత్రణను మిళితం చేసే, తాను పనిచేసిన ఒక నవ•నా అయిన ‘‘మాంచెస్టర్‌వాదం’’ నుండి వెస్ట్‌మిన్‌స్టర్‌ ‌నేర్చుకోవచ్చని ఆయన అన్నారు. లేబర్‌ ‌పార్టీలోని సాంప్రదాయ కార్మికవర్గ ఓటర్లలో బర్న్‌హామ్‌కు ఉన్న ఆదరణ, రిఫార్మ్ యూకే వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్న ‘‘రెడ్‌ ‌వాల్‌’’ ‌నియోజకవర్గాలను తిరిగి గెలుచుకోవడానికి లేబర్‌ ‌పార్టీకి ఉన్న బలమైన ఎంపికలలో ఒకరిగా పార్టీలోని చాలామంది ఆయన్ను పరిగణించేలా చేసింది. స్థానిక ఎన్నికలలో రిఫార్మ్ ‌పార్టీ సాధించిన గణనీయమైన విజయాల తర్వాత బర్న్‌హామ్‌ ఒక్కసారి వెలుగులోకి వచ్చారు. ఇటీవలి సంవత్సరాలలో దూరమైన ఓటర్లతో తిరిగి సంబంధాలు ఏర్పరచుకోగల నాయకుడు పార్టీకి అవసరమని భావిస్తున్న లేబర్‌ ‌పార్టీ ఎంపీలకు ఆయన ఒక ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. స్టార్మర్‌ను సవాలు చేయాలనే స్పష్టమైన ఉద్దేశ్యంతోనే బర్న్‌హామ్‌ ‌పార్లమెంటులో ప్రవేశించా రన్నది సుస్పష్టం. ప్రధాని పదవికి పోటీలో బర్న్‌హామ్‌ ‌గట్టి పోటీదారుగా ఉన్నారు, వాస్తవానికి స్టార్మర్‌ను ఒక రకమైన నిర్ణయం తీసుకునేలా ఆయన ఒత్తిడి చేశారనే చెప్పాలి.

ఇతర అభ్యర్థుల పరిస్థితేంటి?

ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి వెస్‌ ‌స్ట్రీటింగ్‌ ‌చాలా కాలంగా బర్న్‌హామ్‌కు ప్రధాన ప్రత్యర్థిగా నిలవడమే కాదు, నాయకత్వ పోటీలో పాల్గొంటానని గతంలో సూచించారు. విచిత్రంగా తర్వాత తన మనసు మార్చుకొని ఆయన బర్న్‌హామ్‌కు మద్దతు ప్రకటించారు. మరొక సాధ్యమైన అభ్యర్థిగా లేబర్‌ ‌పార్టీ మాజీ డిప్యూటీ ప్రధాని ఏంజెలా రేనర్‌ ‌పేరు తరచుగా వినిపించేది. అయితే, ఆమె కూడా బర్న్‌హామ్‌కే మద్దతు ఇస్తానని సూచించారు. రేనర్‌ ‌లేబర్‌ ‌పార్టీలోనూ, కొంతమంది ఎంపీల మధ్యనూ మంచి ఆదరణ కలిగి ఉండటమే కాదు 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించారు కూడా. భవిష్యత్తులో పోటీ పడే అవకాశం ఉన్న వ్యక్తిగా రక్షణ శాఖ మాజీ మంత్రి అల్‌ ‌కార్నస్ ‌పేరుకూడా ప్రచారంలో వుంది. అయితే, పోటీకి దిగే ముందు ఆయనకు జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు అవసరం కావచ్చు. అందువల్ల ప్రస్తుతం వెనక్కి తగ్గి, భవిష్యత్తులో నాయకత్వ పదవి కోసం పోటీ పడే అవకాశం ఉంది.

ఇంకా ప్రకటించని కాలపట్టిక

ఇక అధికారిక పార్టీ కాలపట్టిక ఇంకా ప్రకటించలేదు, కానీ తన రాజీనామా ప్రసంగంలో సర్‌ ‌కీర్‌, ‌తన స్థానాన్ని భర్తీ చేయాలనుకునే అభ్యర్థులు పోటీ చేయడానికి అవసరమైన మద్దతును కూడగట్టుకోవడానికి జూలై 9 నుండి 16 వరకు సమయం ఉంటుందని చెప్పారు. పార్టీ నియమావళి ప్రకారం, అభ్యర్థులను 81మంది లేబర్‌ ఎం‌పీలు, అలాగే లేబర్‌ ‌పార్టీకి చెందిన 634 స్థానిక శాఖలలో 32, లేదా పార్టీకి అనుబంధంగా ఉన్న పండు సంస్థలు నామినేట్‌ ‌చేయాలి.

ఒకవేళ బర్న్‌హామ్‌ ‌మాత్రమే పోటీ చేసినా లేక తగినంత మద్దతు పొందిన నేతగా నిలిచినా అప్పుడు ఆ పోటీ అక్కడితో ముగిసిపోతుంది. ఇతర పోటీదారులు ముందుకు వస్తే, ప్రాధాన్యతా బ్యాలెట్‌ ‌ద్వారా ఎన్నిక జరుగుతుంది. ఎన్నికలు జరగడానికి కనీసం ఆరు నెలల ముందు నుండి లేబర్‌ ‌పార్టీలో సభ్యుడిగా ఉన్న ఏ వ్యక్తి అయినా ఓటు వేయవచ్చు. ఏ అభ్యర్థికీ 50 శాతానికి మించి మొదటి ప్రాధాన్యతా ఓట్లు రాకపోతే, తక్కువ ర్యాంకులో ఉన్న అభ్యర్థులను తొలగించి, విజేత తేలేవరకు వారి ఓట్లను పునఃపంపిణీ చేస్తారు. పోటీ ప్రణాళిక ప్రకారం జరిగితే, సెప్టెంబరులో పార్లమెంట్‌ ‌తిరిగి సమావేశమయ్యేలోపు కొత్త నాయకుడు పదవిలోకి వస్తారని లేబర్‌ ‌పార్టీ ఆశిస్తోంది. వారసుని ఎంపిక చేసిన తర్వాత, స్టార్మర్‌ ‌ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు కింగ్‌ ‌చార్లెస్‌కు లాంఛనంగా తెలియజేస్తారు, ఆ తర్వాత రాజు కొత్త లేబర్‌ ‌నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానిస్తారు.

దశాబ్దకాలంగా రాజకీయ అనిశ్చితి

గత దశాబ్ద కాలంగా బ్రిటన్‌  ‌రాజకీయాల్లో అనిశ్చితి నెలకొనడంతో పాటు వరుస ఆర్థిక సంక్షోభాలు, బ్రెగ్జిట్‌  ‌ప్రభావం, సొంత పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలు వంటి సమస్యల కారణంగా ప్రధానులు పదే పదే రాజీనామా చేయాల్సి వస్తోంది. గత దశాబ్ద కాలంగా (2016 నుండి) యూకే  ప్రధాన మంత్రులు వరుసగా రాజీనామా చేయడానికి గల ప్రధాన కారణం రాజకీయ అస్థిరత అనే చెప్పాలి. 2016లో యూరోపియన్‌ యూనియన్‌ ‌నుంచి వైదొలగాలన్న ప్రజాభిప్రాయ సేకరణ  నిర్ణయం బ్రిటన్‌ ‌రాజకీయాలను, ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. ఈ నిర్ణయాన్ని సరిగ్గా అమలు చేయలేక డేవిడ్‌ ‌కామెరాన్‌, ‌థెరిసా మే వంటివారు పదవులను వదులుకోవాల్సి వచ్చింది. బ్రెక్సిట్‌ ‌ప్రజాభిప్రాయ సేకరణ (రిఫరెండం)లో యూకే ప్రజలు యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) ‌నుండి విడిపోవడానికి ఓటు వేయడంతో, దానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన కామెరాన్‌ ‌రాజీనామా చేశారు. బ్రెక్సిట్‌ ఒప్పందాన్ని బ్రిటన్‌ ‌పార్లమెంట్‌లో ఆమోదింపజేయడంలో వరుసగా విఫలం కావడంతో, స్వంత పార్టీ ఒత్తిడి తట్టుకోలేక థెరిసా మే రాజీనామా చేయాల్సి వచ్చింది. అధికార కన్జర్వేటివ్‌ (‌టోరీ) పార్టీలో వివిధ సిద్ధాంతాల మధ్య తీవ్రమైన అంతర్గత విభేదాలు ఉన్నాయి. ప్రధానుల విధానాలు నచ్చనప్పుడు సొంత పార్టీ ఎంపీలే తిరుగుబాటు చేసి, నాయకత్వ మార్పు కోసం ఒత్తిడి తెచ్చారు. ఎందుకంటే బ్రిటన్‌లో ఓటర్లు నేరుగా ప్రధానమంత్రిని ఎన్నుకోరు. అధికార పార్టీలోని ఎంపీలు తమ నాయకుడిని ఎన్నుకుంటారు. సొంత పార్టీ సభ్యుల మద్దతు కోల్పోయినా లేదా బలమైన ప్రత్యర్థులు పార్టీలో తిరుగుబాటు చేసినా ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకు, బోరిస్‌ ‌జాన్సన్‌, ‌కీర్‌ ‌స్టార్మర్‌ ‌వంటి వారు సొంత పార్టీ సభ్యుల ఒత్తిడి వల్లే రాజీనామా చేశారు. కోవిడ్‌-19 ‌లాక్‌డౌన్‌ ‌నిబంధనలను ఉల్లంఘించి డౌనింగ్‌ ‌స్ట్రీట్‌లో పార్టీలు చేసుకోవడం (‘పార్టీగేట్‌’ ‌సంక్షోభం), ఇతర లైంగిక ఆరోపణల వివాదాల వల్ల సొంత మంత్రులు వరుసగా రాజీనామా చేయడంతో బోరిస్‌ ‌జాన్సన్‌ ‌పదవి నుండి తప్పుకున్నారు. కోవిడ్‌ ‌మహమ్మారి,  రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధాల ప్రభావంతో బ్రిటన్‌లో జీవన వ్యయం విపరీతంగా పెరిగింది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంలో, ఆర్థిక వృద్ధిని సాధించడంలో గత ప్రభుత్వాలు విఫలం కావడం పెద్ద మైనస్‌గా మారింది.

లిజ్‌ ‌ట్రస్‌ ‌ప్రవేశపెట్టిన ‘మినీ-బడ్జెట్‌’ ‌తీవ్ర ఆర్థిక సంక్షోభానికి దారితీసింది. పౌండ్‌ ‌విలువ దారుణంగా పడిపోవడంతో కేవలం 45 రోజుల్లోనే ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది (బ్రిటన్‌ ‌చరిత్రలోనే అత్యంత తక్కువ కాలం పనిచేసిన ప్రధానిగా ఆమె మిగిలిపోయారు). తర్వాత ఆర్థిక ఇబ్బందులు, దేశంలో జీవన వ్యయం పెరగడం వల్ల కన్జర్వేటివ్‌ ‌పార్టీ ప్రజాదరణ కోల్పోయింది. చివరకు 2024 సార్వత్రిక ఎన్నికలలో లేబర్‌పార్టీ చేతిలో ఘోర పరాజయం పాలవడంతో రిషి సునక్‌ ‌రాజీనామా చేశారు.

About Author

By editor