ఒకప్పుడు భాగ్యనగరంలో వర్షం అంటే చల్లని గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం, ఉక్కపోత నుంచి ఉపశమనం ఉండేవి. ఇప్పుడు మాత్రం వర్షం  మాట వినగానే, ఆకాశంలో మేఘాలు కనిపించగానే నగరవాసుల గుండెల్లో గుబులు మొదలవుతోంది. ఇంటి నుంచి బయటకు వెళితే ఎక్కడ ట్రాఫిక్‌లో చిక్కుకుంటామో, రోడ్డుపై నీటిలో ఇరుక్కుపోతామో, ఇంటికి సురక్షితంగా చేరతామో లేదో, కరెంటు తీగలు ఎక్కడైనా తెగిపడి ప్రాణాలు తీస్తాయేమో అన్న భయం వెంటాడుతోంది. ఇళ్లలోకి వర్షం నీరు చేరుతుందేమో, విద్యుత్‌ ‌సరఫరా నిలిచిపోతుందేమో అన్న ఆందోళన కూడా ఆవహిస్తోంది.

వర్షం ప్రకృతి ధర్మం, వరం. ప్రకృతి తన పని తాను చేస్తోంది. కానీ, హైదరాబాద్‌కు మాత్రం పరీక్షగా మారుతోంది. ఆ పరీక్షలో వైఫల్యానికి కారణం ప్రకృతి కాదు…మహానగర పాలనా వ్యవస్థ పనితీరు, ప్రభుత్వ యంత్రాంగం ప్రణాళికా లోపంగా చెప్పుకోవచ్చు. వర్షం కురిసినప్పుడల్లా ట్రాఫిక్‌ ‌స్తంభన, కాలనీల ముంపు, నాలాలు పొంగిపొర్లడం, రహదారులపై నీరు నిలవడం, విద్యుత్‌ ‌సరఫరాకు అంతరాయం, విద్యుదాఘాతాలతో ప్రాణాలు కోల్పోవడం.. వంటివి సర్వ సాధారణమయ్యాయి. ప్రతి వర్షాకాలంలో ఎదురువుతున్న ఆ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వ యంత్రాంగం, పాలకులు చేస్తున్న ప్రయత్నాలు శూన్యమనే చెప్పాలి..

మౌలిక సదుపాయాలపై లేని దృష్టి

హైదరాబాద్‌ ‌దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఐటీ రంగం భారీగా విస్తరించింది. కొత్త కాలనీలు, భారీ అపార్ట్ ‌మెంట్లు, ఐటీ కారిడార్లు, వాణిజ్య సముదాయాలు, గేటెడ్‌ ‌కవ్యనిటీలు నగర రూపురేఖలను మార్చేస్తున్నాయి. నగరం నలువైపులా విస్తరిస్తోంది. జనాభా నానాటికీ పెరుగుతోంది. దానికి తగినట్లే వాహనాల సంఖ్య పెరుగుతోంది. కానీ అందుకు తగినట్లు నాలాలు, డ్రైనేజీ వ్యవస్థలు,రహదారులు, పార్కింగ్‌ ‌సదుపాయాలు లేవు. ఒక్కో కుటుంబానికి రెండు, వ•డు కార్లు ఉండటం ఇప్పుడు సాధారణ విషయమైంది. అయితే ఆ స్థాయిలో రోడ్ల విస్తరణ జరగలేదు. ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులోకి రాలేదు. అక్రమ పార్కింగ్‌లు రహదారులను మరింత ఇరుకుగా మార్చేశాయి. ఫలితంగా కొద్దిసేపు వర్షం కురిసినా నగరం మొత్తం ట్రాఫిక్‌ ‌పద్మవ్యూహంలో చిక్కుకు పోతోంది. ప్రత్యేకంగా మాదాపూర్‌, ‌గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్‌, ‌కోకాపేట వంటి ఐటీ కారిడార్‌ ‌ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో వేలాది వాహనాలు ఒకేసారి రోడ్డెక్కుతున్నాయి.

నగరంలో కొత్త వాణిజ్య సముదాయాలకు, భారీ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంలో ఏ మాత్రం వెనుకాడని ప్రభుత్వం, అందుకు అనుగుణంగా డ్రైనేజీ, రోడ్లు, పార్కింగ్‌, ‌వర్షపు నీటి పారుదల వ్యవస్థలను ముందుగానే అభివృద్ధి చేయాలనే ప్రణాళికను అమలు లేదు. ఫలితంగా ఒక మోస్తరు వర్షానికి ప్రధాన రహదారులు నిమిషాల్లోనే ట్రాఫిక్‌ ‌జామ్‌గా మారిపోతున్నాయి.

వర్షంతో నరకం

రహదారులపై నీరు నిలవడం, వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడం, గంటల తరబడి ట్రాఫిక్‌ ‌కదలకపోవడం ఇప్పుడు సాధారణ దృశ్యంగా మారిపోయింది. ఇది కేవలం వాహనాల సంఖ్య పెరగుదల వల్లే కాదని, వర్షపు నీరు వేగంగా వెళ్లిపోయేలా డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. నగరంలోని చాలా ప్రాంతాల్లో నాలాలు పూడుకుపోయాయి. మరికొన్ని చోట్ల ఆక్రమణలకు గురయ్యాయి.ఫలితంగా నీరు రోడ్లపైనే నిలిచిపోతోంది.వర్షపు నీరు గంటల తరబడి, ఒక్కోసారి రోజుల తరబడి నిలిచేపోయే సందర్భాలు ఉన్నాయి. ప్లాస్టిక్‌ ‌వ్యర్థాలు, చెత్త డ్రైనేజీల్లో పేరుకు పోవడం కూడా పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. వ్యర్థాల నిర్వహణను సమర్థ వంతంగా అమలు చేయడంలో ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటోందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రూ.వందల కోట్లు వెచ్చించి ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్‌ ‌కారిడార్లు నిర్మిస్తున్న ప్రభుత్వం, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణకు అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదనే విమర్శలు ఉన్నాయి.ఏటా వర్షాకాలానికి ముందు నాలాల పూడికతీత, డ్రైనేజీ శుభ్రపరిచే పనులు జరుగుతున్నాయని అధికారులు చేస్తున్న ప్రకటనలు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు.

యమపాశాలుగా విద్యుత్‌ ‌తీగలు

వర్షాకాలంలో ట్రాఫిక్‌ ‌సమస్యలు ఎంత తీవ్రమో, విద్యుత్‌ ‌వ్యవస్థ కూడా ప్రజలకు అంతే పెద్ద ముప్పుగా మారుతోంది. ఈదురు గాలులకు విద్యుత్‌ ‌తీగలు తెగిపోవడం, స్తంభాలు ఒరిగిపోవడం, నీటిలో విద్యుత్‌ ‌ప్రవహించడం వంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా ఏటా ప్రాణనష్టం జరుగుతోంది. బండ్లగూడలో ఈ ఏడాది తొలివర్షం పడిన రోజే జరిగిన ఘటన ఇందుకు విషాద ఉదాహరణ. ఆటో దిగిన ఇద్దరు యువకులు రోడ్డుపై పడివున్న విద్యుత్‌ ‌తీగను గుర్తించలేక అడుగు పెట్టీపెట్టగానే ప్రాణాలు కోల్పోయారు. విద్యుత్‌ ‌స్తంభంలో లోపాల గురించి స్థానికులు అంతకు ముందే ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అల్వాల్‌లో ఒక ఇంటి ముందు ఉన్న చెట్టు కొమ్మలు కారుపై పడిపోగా వాటిని తొలగించే ప్రయత్నంలో దానిపై పడి ఉన్న విద్యుత్‌ ‌తగిలి తండ్రీ కుమార్తె మరణిం చారు. భార్య తీవ్ర గాయాలతో బయటపడినా, కళ్లముందే భర్త, కుమార్తెను కోల్పోయిన విషాదం ఆమెను అచేతనంగా మార్చింది.

ఇలాంటి ప్రమాదాల సమయంలో వెంటనే విద్యుత్‌ ‌సరఫరా నిలిపివేయాల్సిన రక్షణ వ్యవస్థలు ఎందుకు పనిచేయడం లేదన్న ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం లేదు. ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు సమీక్షలు నిర్వహించడం, విచారం ప్రకటించడం తప్ప ముందస్తు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. విద్యుత్‌ ‌తీగ తెగి నేలపై పడిన వెంటనే రిలే ప్రొటెక్షన్‌ ‌వ్యవస్థ పనిచేసి సరఫరా నిలిచిపోవాల్సి ఉండగా ఎందుకు జరగలేదు? కోట్లాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన భద్రతా వ్యవస్థల నిర్వహణలో లోపాలు న్నాయా? అన్న ప్రశ్నలకు జవాబులు చెప్పేవాళ్లు లేరు.

హైడ్రా… ప్రగతి ఎక్కడ?

హైదరాబాద్‌లో వర్షాలు, ముంపు సమస్యలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా చెరువులు, నాలాల ఆక్రమణలను ప్రభుత్వం గుర్తించి వాటిని తొలగించడానికే హైడ్రా అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేసింది. ఆ వ్యవస్థ ఏర్పడిన తర్వాత అనేక అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. చెరువులు, నాలాల పక్కన ఉన్న భవనాలు నేలమట్టం చేశారు. కానీ, ప్రతి వర్షం తర్వాత నగరంలో కనిపిస్తున్న దృశ్యాలు మాత్రం మారలేదు. అసలు హైడ్రా చర్యలు వరద ముప్పును తగ్గించడానికేనా? లేక కేవలం కూల్చివేతలకే పరిమితమయ్యాయా? అనే ప్రశ్న తలెత్తుతోంది. కూల్చివేతల ప్రభావం ఎక్కువగా పేదలు, మధ్యతరగతి ప్రజలపైనే పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు.. ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఆర్థికంగా బలమైన వర్గాలకు చెందిన వారి అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు ఉండవా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అంతేకాదు… కూల్చివేతల తర్వాత ఆ ప్రాంతాల్లో నాలాలను విస్తరించారా? డ్రైనేజీ సామర్థ్యాన్ని పెంచారా? వర్షపు నీటి పారుదల వ్యవస్థను ఆధునీకరించారా? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లేవు. వాస్తవానికి నాలాల ఆక్రమణలు ఒక్కరోజులో జరిగినవి కావు. దశాబ్దాలుగా పాలించిన ప్రభుత్వాలన్నీ ఈ సమస్యను పూర్తిగా అరికట్టలేకపోయాయి. నిర్మాణ అనుమతుల విషయంలోనూ, చెరువుల పరిరక్షణ విషయంలోనూ పాలనా వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ, గత ప్రభుత్వాల తప్పులను చూపించడం మాత్రమే ప్రస్తుత ప్రభుత్వం పనిగా పెట్టుకుందన్న ఆరోపణలు వస్తున్నాయి.

ప్రభుత్వం మారినా తీరని సమస్యలు

ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ, వర్షం పడితే నగరం ఎదుర్కొనే కష్టాలు మాత్రం మారడం లేదు. ప్రతి ఏడాది పెద్ద ఎత్తున సమీక్షలు, హెచ్చరికలు, హామీలు, ప్రణాళికలు, ప్రకటనలు సర్వసాధారణంగా మారిపోయాయి. వర్షాకాలం ముగిసే వరకు అధికార యంత్రాంగం హడావిడి చేస్తూనే ఉంటుంది. ఆ తర్వాత అంతా షరా మావ•లయిపోతుంది. వర్షాలు మొదలయ్యే ప్రతిసారీ అధికార యంత్రాంగం అప్రమత్తమైందని, కంట్రోల్‌ ‌రూములు ఏర్పాటు చేశామని, ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని ప్రకటనలు చేస్తుంటారు. ఇలా తాత్కాలిక చర్యలు కాదు, శాశ్వత పరిష్కారాలు అవసరం అని గుర్తించాల్సిన అవసరం ఉంది. నగరంలోని వరద ముంపు ప్రాంతాలను శాస్త్రీయంగా గుర్తించి ఆధునిక డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి, నీరు నిలిచే ప్రాంతాలలో అత్యాధునిక పంపింగ్‌ ‌వ్యవస్థను శాశ్వత ప్రాతిపదికపై ఏర్పాటు, నాలాల పూడికతీతను వర్షాకాలానికి ముందే పూర్తి చేయడం, భారీ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే ముందు డ్రైనేజీ సామర్థ్యాన్ని తప్పనిసరిగా అంచనా వేయడం, అక్రమ పార్కింగ్‌ ‌లపై కఠిన చర్యలు తీసుకోవడం లాంటి వాటిని ప్రభుత్వం విస్మరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఐటీ కారిడార్‌ ‌ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఒత్తిడిని తగ్గించేందుకు కార్యాలయాల పని వేళల్లో మార్పులు చేయాలంటూ ఆయా కంపెనీలకు ప్రతిపాదించ డంతో పాటు.. భారీ వర్షాల సమయంలో ‘వర్క్ ‌ఫ్రమ్‌ ‌హోమ్‌’ ‌వంటి ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాగే, కార్‌ ‌పూలింగ్‌, ‌మెట్రో, ఎంఎంటీఎస్‌, ‌సిటీ బస్సుల వినియోగాన్ని పెంచే విధానాలు రూపొందించడం అత్యావశ్యకమని ప్రభుత్వం గ్రహించాలి. అన్నింటి కంటే ముఖ్యంగా విద్యుత్‌ ‌వ్యవస్థలోని భద్రతా ప్రమాణాలను పూర్తిగా సమీక్షించడం, ప్రతి వర్షాకాలానికి ముందు రిలే ప్రొటెక్షన్‌ ‌వ్యవస్థలు, ఫీడర్లు, విద్యుత్‌ ‌స్తంభాలు, తీగల పరిస్థితిని పరిశీలించడం తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉంది.

హైదరాబాద్‌కు వర్షం కొత్త కాదు. శాపం కూడా కాదు.. కానీ వర్షాన్ని ఎదుర్కొనే వ్యవస్థ లేకపోవడమే అసలు సమస్య. ప్రతి ఏడాది వర్షాలు వస్తూనే ఉంటాయి. ప్రతి ఏడాది ప్రజలు అదే భయంతో బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన అవసరం లేదు. ఒక ఆధునిక మహానగరం రెండు వ•డు సెంటీమీటర్ల వర్షానికే స్తంభించిపోతుంటే, అది ప్రకృతి వైపరీత్యం కాదు… నగర ప్రణాళికలోని బలహీనతకు నిదర్శనం. వేగంగా విస్తరిస్తున్న మహానగరానికి తగ్గట్టుగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ప్రభుత్వం ప్రాథమిక బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఉంది. భాగ్యనగరానికి వర్షం మళ్లీ హాయిని గుర్తు చేసే రోజులు రావాలంటే… మారాల్సింది కేవలం ప్రణాళికలు కాదు.. పాలనా వ్యవస్థ.

About Author

By editor