రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి సహా అనేక నగరాలు, పట్టణాలు కల్తీ మాంసంతో కలవరపడుతున్నాయి. ప్రజల జిహ్వాచాపల్యం ఆసరాగా మాంసం వ్యాపారులు వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రోజుల తరబడి నిల్వ ఉంటున్న కల్తీ మాంసం పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున దిగుమతి అవుతోంది. ఆహారభద్రతా అధికారులు తగినంత సంఖ్యలో లేకపోవడంతో తనిఖీలకు అవకాశం లేకుండా పోతోంది.
సాక్షాత్ శ్రీవేంకటేశ్వరస్వామి నెలకొన్న పవిత్ర ప్రదేశం తిరుపతి. ఐదారు లక్షలమంది స్థానికులు, రోజువారీగా శ్రీవారి దర్శనానికి వేలల్లో వచ్చే యాత్రికులు, ఇతర అవసరాలతో వచ్చే వేలమంది వ్యాపారులు.. ఇలా క్షలాది జనాభాతో తిరుపతి నిత్యం కిటకిటలాడుతుంది. రాష్ట్రంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగి భారీ రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో పరిశుభ్రమైన ఆహారం లభించడం ఒక కలగా మారిందా? అన్న ప్రశ్న చర్చనీయాంశం అయింది. తిరుపతి నగరంలో ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన తనిఖీల్లో ఘోరమైన వాస్తవాలు బయట పడ్డాయి. కుళ్లిన మాంసం, పురుగులు పట్టిన చేపలు, రసాయనాలు కలిపిన ఆహార పదార్థాలు ఈ పవిత్ర నగర ప్రజలకు పళ్లేలలో వడ్డనవు తున్నాయని తేలడం భయకంపితులను చేస్తోంది. అత్యంత ఆందోళన కరమైన విషయమేమిటంటే, ఇది కేవలం తిరుపతికే పరిమితమైన సమస్య కాదు ఆంధప్రదేశ్ నలు వ•లలకు సరఫరా అవుతున్నాయి. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, ఉత్తరాది రాష్ట్రాల నుండి టన్నుల కొద్దీ అపరిశుభ్రమైన మాంసం రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు దిగుమతి అవుతున్నది. ఇది ప్రజారోగ్యానికి పొంచి ఉన్న మహాముప్పుగా పరిణమించింది.
ఎక్కడి నుండి వస్తున్నది? ఎలా వస్తున్నది?
ఆంధప్రదేశ్‌లో దిగుమతి అవుతున్న మాంసం మొత్తం తెలంగాణ,తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణా తదితర రాష్ట్రాల నుండి వస్తున్నదే. ముందుగా హైదరాబాదు, చెన్నైకి చేరిన మాంసం, నిల్వఉండేలా రసాయనాలను పూసి రాష్ట్రం లోని అన్నిప్రాంతాలకు తరలిస్తున్నారు. హైదరాబాదు, చెన్నై నగరాల్లో మేక తలలు, కాళ్లు వంటి అవయవాలకు పెద్దగా గిరాకీ ఉండదు. అందువల్ల వాటిని చాలా చౌక•గా (ఒక్కో తల రూ. రెండు నుండి వ•డు వందలు) కొనుగోలు చేసి ఆంధప్రదేశ్‌లోని విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి… ఇలా ఒకటేమిటి అన్ని నగరాలు, పట్టణాలకు పంపు తున్నారు. ఆ మాంసాన్ని నీళ్లతో కడిగి, తాజాగా రక్తం కనపడేలా రసాయనాలు కలిపి వినియోగ దారులను మోసగిస్తున్నారు. ఇలా వారాల తరబడి నిల్వఉంచిన మాంసాన్ని వండి వడ్డిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో మాంసం అమ్మే పెద్ద దుకాణాల కన్నా చిన్నదుకాణాలే అత్యధికం. వాటిలో ఆదివారాల్లో రెండు నుంచి మూడు మాత్రమే మేకలు కోస్తారు. కాని అక్కడ పదుల చొప్పున తలకాయలు, వందకుపైగా కాళ్లు కనిపిస్తాయి. ఇవన్నీ ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నవే. ఇదలా ఉంటే, ఇందులో మరో కోణంకూడా ఉంది. కోళ్ల వ్యర్థాలను తెచ్చి చేపల చెరువుల్లో ఆహారంగా వాడుతున్నారు. పూర్తిగా నిషేధితమైన ఈ పద్ధతి రాష్ట్రంలో విస్తృతంగా అమలవుతున్నది. కోళ్ల వ్యర్థాల్లో హానికరమైన సూక్ష్మజీవులు, రసాయనాలు పుష్కలంగా ఉంటాయి. ఆ వ్యర్థాలు తిన్న చేపలు ఆహారానికి అనర్హంగా మారతాయి. అలాంటి చేపలు తింటే సాల్మొనెల్లా వంటి సూక్ష్మజీవులవల్ల వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్ వంటి తీవ్ర ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయి.
పీపీ చావడి నుండి నగరమంతా సరఫరా
తిరుపతిలోని పీపీ చావడి మటన్ మార్కెట్ కుళ్లిన మాంసానికి చిరునామాగా మారింది. అంతేకాదు.. ఇది పూర్తిగా అనధికారికంగా నడుస్తున్నది. ఈ ఒక్క మార్కెట్ నుండే నగరమంతా మాంసం సరఫరా అవుతున్నదని తనిఖీల్లో తేలింది. నగరపాలక సంస్థ లెక్కల ప్రకారం తిరుపతిలో 237 మటన్, కోళ్ల మాంసం చిల్లర దుకాణాలు ఉన్నాయి. వారాంతంలో సుమారు నూట యాభై పొట్టేళ్లు, మేకపోతులను మాత్రమే అధికారికంగా వధిస్తున్నారు. కానీ దుకాణాల్లో 500 తలకాయలు, 2 వేలకు పైగా కాళ్లు విక్రయిస్తున్నారు. ఇవన్నీ చెన్నై, హైదరాబాదు నుంచే వస్తున్నాయని మాంసం వ్యాపారులే ఒప్పుకున్నారు. ఆ మార్కెట్ పరిసరాల్లో రక్తం, జంతు వ్యర్థాలు నేలపైన, గోడలపైన పేరుకు పోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతున్నది. సరైన మురుగునీటివ్యవస్థ లేకుండా మార్కెట్ మొత్తం అపరిశుభ్రంగా మారింది. ఆ మార్కెట్ ప్రహరీగోడకు ఆనుకుని మున్సిపల్ పాఠశాల ఉంది. ఈ వాతావరణం పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులే అంగీకరిస్తున్నారు.
పెద్ద సంస్థలు కూడా అదే దారిలో
ప్రజల నమ్మకాన్ని సంపాదించుకున్న బహుళ జాతి సంస్థలు సైతం ప్రజారోగ్యంతో నిర్దాక్షిణ్యంగా వ్యాపారం చేస్తున్నాయి. తిరుపతిలోని రెండు ప్రసిద్ధ భోజనశాలలలో మున్సిపల్ అధికారులు తనిఖీలు జరిపారు. ఎయిర్ బైపాసు రోడ్డు, భవానీనగరాల్లో ఉన్న ఆ భోజనశాలల్లో కోళ్ల మాంసాన్ని సరైన అరలలో కాకుండా, నేలపైనే అపరిశుభ్ర వాతా వరణంలో నిల్వ ఉంచడంతో కంపు కొడుతున్నదని అధికారులు గుర్తించారు. దాదాపు 683 కిలోల చెడిపోయిన కోళ్ల మాంసాన్ని బెంగళూరుకు వెనక్కి పంపించారు.
ఆహార పదార్థాల ప్యాకింగ్‌పై లేబుళ్లు లేకపోవడం, గిడ్డంగి అపరిశుభ్రంగా ఉండడం వంటి లోపాలు కనిపించాయి. పీవీ మహల్ రోడ్డులోని మరో ప్రముఖ భోజనశాలలో 680 కిలోల కుళ్లిన కోళ్ల మాంసం గుర్తించారు. తక్కువ ధరకు ఆఫర్లు ఇవ్వడానికి బెంగళూరు నుండి భారీగా ఈ మాంసం తెప్పించారని తేలింది. తిమ్మనాయుడు పాలెంలో ఆవు మాంసపు కొవ్వును కరిగించి వంట నూనెగా వాడు తున్నట్లు గుర్తించారు. ఇది మత విశ్వాసాలను దెబ్బ తీయడమే కాదు.. ఆరోగ్యానికి కూడా హాని చేస్తుంది.
చేపల మార్కెట్లో దారుణాలు
లీలామహల్ సర్కిలువద్ద ఉన్న చేపల మార్కెట్‌లోనూ అదే వాతావరణం వెలుగు చూసింది. ఇరవై రెండు దుకాణాలున్న ఆ మార్కెట్లో మున్సిపల్ సిబ్బంది జరిపిన తనిఖీల్లో రెండు దుకాణాల్లో కుళ్లిపోయిన రొయ్యలు, పురుగులు పట్టిన చేపలు బయటపడ్డాయి. చల్లదనపు పెట్టెలు పగిలిపోవడంతో ముక్కుపుటాలు అదిరే దుర్వాసనతో నూట యాభై కిలోల కుళ్లిన చేపలు బయటపడ్డాయి. నిల్వ ఉంచిన సముద్ర ఆహారపు ఉత్పత్తుల్లో శిలీంధ్రాల ఆనవాళ్లు కూడా గుర్తించారు. ఆ రెండు దుకాణాలను సీజు చేసి, వ్యాపార అనుమతులను రద్దు చేశారు. చేపల నాణ్యతను పర్యవేక్షించాల్సిన సంబంధిత శాఖ, ఆహారభద్రతా ప్రమాణాలను పరిశీలించాల్సిన ఆహార భద్రతాధికారులు, పారిశుధ్య నిర్వహణకు బాధ్యత వహించే మున్సిపల్ అధికారులు ఏళ్లత•రబడి తనిఖీలు జరపకుండా ఏంచేస్తున్నారని జనం ఆగ్రహంగా ప్రశ్నిస్తున్నారు.
ఆహార భద్రతా విభాగం వైఫల్యం
ఆహార భద్రతా విభాగం పూర్తి నిర్వీర్యమే ఈ సమస్యకు వ•ల కారణమని ఆరోపణలు ఉన్నాయి. తిరుపతి, శ్రీకాళహస్తి, తిరుచానూరు వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు కలిగిన తిరుపతి జిల్లాకు కేవలం ముగ్గురు సహాయ ఆహార భద్రతాధికారులే ఉన్నారు. వారిలో ఒకరు తిరుమలకు పరిమితమయ్యారు. మరొకరు దీర్ఘకాలిక సెలవు తీసుకున్నారు. ఇంకొకరు ప్రముఖుల పర్యటనలకు నిరంతరం వెళ్తుంటారు. అదనపు బాధ్యతలు అప్పగించిన నెల్లూరు జిల్లా అధికారి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు. ఫిర్యాదు అందితే తప్ప తనిఖీలు లేకపోవడం ఈ దుస్థితికి వ•ల కారణం. పైగా ఆహార కల్తీపై కేసు నమోదు చేసే అధికారం కేవలం ఆహార భద్రతాధికారులకే ఉంటుంది. ఆ అధికారులు పనిచేయకపోవడంతో మున్సిపల్ అధికారులు జరిమానాలు విధించడం తప్ప నేర విరోధకచర్యలు చేపట్టలేకపోతున్నారు. ప్రారంభించలేకపోతున్నారు. ఇది నేరస్తులకు కలిసి వస్తున్నది.
ప్రయోగశాల ఏర్పాటులో జాప్యం
తిరుపతిలో రూ.25 కోట్లతో అత్యాధునిక ఆహార పరీక్ష ప్రయోగశాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రతి వారం ఒక్కో అధికారి కనీసం పది నవ•నాలు సేకరించి వెంటనే పరీక్షించి, కల్తీ నిర్ధారణ అయిన తర్వాత కేసులు నమోదు చేయాలన్న లక్ష్యంతో ఈ ప్రయోగశాలను ప్రణాళిక వేశారు. శ్రీదేవి కాంప్లెక్సులో అద్దె భవనంలో ప్రారంభించాలని నిర్ణయించి ఏడాది పూర్తవుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం నవ•నాలను హైదరా బాదుకు పంపాలి కనుక ఫలితాలు ఆలస్యమవుతు న్నాయి. అందువల్ల అధికారులు నవ•నాల సేకరణ పైనే శ్రద్ధ చూపట్లేదు. ప్రయోగశాల అందుబాటులో లేకపోవడం ఆహార కల్తీదారులకు కొండంత ఆసరాగా మారింది.
ఆరోగ్య ముప్పులు తీవ్రం
కుళ్లిన మాంసంలో, రసాయనాల్లో పరిమితికి మించిన క్యాన్సర్ కారకపదార్థాలు ఉంటాయి. హోటళ్లలో ఒకే నూనెను పదే పదే వాడటంతో హాని కలిగించే సమ్మేళనాల శాతం పెరిగి గుండె జబ్బులు వచ్చే ముప్పు పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. కుళ్లిన మాంసంలో సాల్మొనెల్లా వంటి సూక్ష్మజీవుల వల్ల వాంతులు, విరేచనాలు, ఆహారపు కాలుష్యం సంభవిస్తుందని హెచ్చరిస్తున్నారు. కోళ్ల వ్యర్థాలు తిన్న చేపలను భుజిస్తే జీర్ణ సంబంధ వ్యాధులు ప్రబలుతాయని స్పష్టం చేస్తున్నారు.
ఈ ఘటనలపై జిల్లా కలెక్టరు వెంకటేశ్వర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహారభద్రతా అధికారు లతో, మున్సిపల్ వైద్యాధి కారులతో సమీక్ష జరిపారు. బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని, ఆధారాలతో నేరు నమోదుచేయాలని ఆదేశించారు. పీపీచావడి మార్కెట్‌లో అక్రమ మాంసం కార్యకలాపాలను నిలిపి వేయాలని పరిశీలిస్తున్నారు. అయితే ప్రజా ప్రతినిధులు ఒత్తిడి తెచ్చి మార్కెట్ తెరిపించాలని ప్రయత్నిస్తున్నారన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఇది కేవలం ఒక జిల్లా సమస్య కాదు. వ్యవస్థీకృత మాఫియా ద్వారా ఆంధప్రదేశ్ అంతటా జరుగుతున్న ఆహార కల్తీ దందా. ఆహార భద్రతా విభాగానికి తగిన సిబ్బందిని వెంటనే నియమించడం, తక్షణం ప్రయోగ శాలను ఏర్పాటుచేయడం, నిరంతర తనిఖీలు చేపట్టడం, నేరస్తులకు కఠిన శిక్షలు విధించడమే ఇవే పరిష్కార మార్గాలు. ప్రజలుకూడా అప్రమత్తంగా ఉండాలి. చవకగా వచ్చే ఆహారంపై అనుమానం కలిగినప్పుడు వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలి. పవిత్ర తిరుపతి నగరంతో పాటు ఆంధప్రదేశ్ మొత్తంలో ప్రజలు తినే ఆహారం నిజంగా పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉండాలంటే ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు నిజాయతీగా బాధ్యత వహించాలి.

తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్