ఆపరేషన్ కమల్.. ఇప్పుడు కొన్ని పార్టీలను వణికిస్తున్న పదం.. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల ఫలితాలు, రాజ్యసభ ఎన్నికల ద్వారా ఎన్డీఏ కూటమికి పెరిగిన బలంతో దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. టీఎంసీలో చీలిక, శివసేన(యూబీటీ)లో తిరుగుబాటు, ఎన్సీపీ (ఎస్పీ)లో ఆయోమం, సమాజ్‌వాదీలో లుకలుకలు, కాంగ్రెస్ పార్టీ నమ్మకద్రోహంపై డీఎంకే, ఆప్ ఆగ్రహం ఇండీ కూటమిని మరింత దెబ్బ తీస్తున్నాయి. ఇందులో కొన్ని పార్టీల మనుగడకే ప్రమాదం ఏర్పడింది. ఈ పరిణామాల్లో కొన్నింటి వెనుక బీజేపీ ఉందని ఆయా పార్టీల ఆరోపణ. ఆపరేషన్ కమల్ మళ్లీ మొదలైందని మీడియా విశ్లేషిస్తోంది. ఇందుకు కారణం ఈ పార్టీల్లోని తిరుగుబాటుదారులు ఎన్డీఏ కూటమికి మద్ధతు ప్రకటించడమే.
విపక్షం ఆందోళనలు ఎలా ఉన్నా, ఈ పరిణామాలు ఎన్డీఏ కూటమికి, కేంద్ర ప్రభుత్వానికి ఎంతో అనుకూలిస్తున్నాయి. ముఖ్యంగా పార్లమెంట్ ఉభయసభల్లో మహిళా రిజర్వేషన్, లోక్‌సభ సీట్ల సంఖ్య పెంపు బిల్లు గట్టెక్కేందుకు తగిన సంఖ్యాబలం లభించే అవకాశం ఉంది. మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇంకో ఏడాదిలోగా పడిపోతుందని ఇటీవల విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఆయన ప్రకటన ఈ ఏడాది అత్యుత్తమ జోక్ అని బీజీపీ నాయకులు నవ్వుకున్నారు. నిజంగానే దేశంలో అలాంటి వాతావరణం ఉందా?.. నిరాశా నిస్పృహల్లో ఉన్న తమ పార్టీ యంత్రాంగంలో జోష్ నింపేందుకు రాహుల్ అలా అని ఉం డవచ్చు.. కానీ వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి.. ఈ ఏడాది లోపే విపక్షం మరింత క్షీణించే అవకాశాలు కనిపిస్తు న్నాయి.
తాజా పరిణామాలు గమనిస్తే, చివరకు టీఎంసీ వ్యవస్థాపకురాలైన మమతా బెనర్జీ నాయకత్వానికి సవాల్ విసురుతూ పార్టీలో ఛైర్ పర్సన్ పదవిని సృష్టించింది తిరుగుబాటువర్గం. రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్యే అరూప్ రాయ్‌ను పార్టీ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించింది. ఫిర్హాద్ హకీమ్, రథిన్ ఘోష్, సబీనా యాస్మిన్‌లను ఉపాధ్యక్షులుగా.. రితబ్రత బెనర్జీ, జావెద్ ఖాన్, సందీపన్ సాహాలను ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. అఖ్రుజ్జమాన్ అన్సారీకి కోశాధికారి బాధ్యతలు అప్పగించారు. టీఎంసీ రాజ్యాంగం ప్రకారం అన్ని నిబంధనలను పాటిస్తూ ఈ ఎన్నిక నిర్వహించినట్లు తెలిపారు రితబ్రత. పార్టీ అసలైనదా కాదా? అన్నది తాము నిర్ణయించేది కాదని, ఎన్నికల సంఘమే దానిపై తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మమత కోరుకుంటే ప్రధాన సలహాదారుగా బాధ్యతలు స్వీకరించవచ్చని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? మమతా బెనర్జీ తదుపరి వ్యూహం ఏమిటి? అనేది ఆసక్తి కలిగిస్తోంది..
ఇండీ కూటమికి బీటలు
ప్రాంతీయ పార్టీల్లోని అంతర్గత తిరుగుబాట్లకు, ఇండీ కూటమి క్షీణతకు గల 5 ముఖ్య కారణాలుగా కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష వైఖరి, నమ్మక ద్రోహం, ఎన్నికల ఓటములు, అంతర్గత శత్రుత్వం, రాజకీయ అవకాశవాదం కనిపిస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ మిత్రపక్షమైన డీఎంకేను వదిలేసి, ఎన్నికల్లో విజయం సాధించిన నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చింది. వారి ప్రభుత్వంలో కాంగ్రెస్ చేరడం తీవ్ర నమ్మకద్రోహంగా భావించారు స్టాలిన్. దీనివల్ల డీఎంకే ఇండీ కూటమి నుండి పూర్తిగా బయటకు వచ్చింది. ఢిల్లీ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఓడించడానికి కాంగ్రెస్ ప్రయత్నించిందని ఆప్ నేతలు కూటమికి దూరమయ్యారు.
ప్రాంతీయ పార్టీలలోని చాలామంది సీనియర్ నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం అధికార ఎన్డీయే లేదా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. సిద్ధాంతాల కంటే అధికారమే పరమావధిగా భావించే కొందరు నేతలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడుతూ సొంత పార్టీలను బలహీనపరుస్తున్నారు.
టీఎంసీపై పిడుగు
టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీల నియంతృత్వం మీద స్వయంగా సొంత పార్టీ వారే తిరగబడ్డారు. ఆ పార్టీకి చెందిన 58 మంది ఎమ్మెల్యేలు, 20 మంది లోక్‌సభ ఎంపీలు వేరు కుంపటి పెట్టుకున్నారు. ముగ్గురు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేశారు. మరోవైపు లోక్‌సభలో కకోలి ఘోష్ దస్తీదార్ నాయకత్వంలోని తిరుగుబాటు ఎంపీలు తగిన సంఖ్యాబలంతో అసలైన టీఎంసీ తమదేనని ప్రకటించారు. వీరంతా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడంతో పాటు ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా’లో విలీనమైనట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖను అందించారు.
ఉద్ధవ్ సేనలో చీలిక
తాజాగా శివసేన (యూబీటీ) కి చెందిన తొమ్మిది మంది లోక్‌సభ ఎంపీల్లో ఆరుగురు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేనలో చేరిపోయారు. నాలుగేళ్ల క్రితం 2022 జూన్ 22న 40 మంది ఎమ్మెల్యేలు తమతో వచ్చారన్న షిండే, ఇప్పుడు ఏకంగా ‘సిక్స్’ కొట్టామని పేర్కొన్నారు. శివసేన రెండో విడత విస్తరణ ప్రణాళికగా ఈ చేరికను అభివర్ణించారు. ‘ఆరు పులులు ఇప్పుడు అసలైన శివసేన ఫ్యామిలీలోకి వచ్చాయి. వారికి స్వాగతం. ఆపరేషన్ టైగర్ విజయవంతమైంది’ అని ప్రకటించారు. తిరుగుబాటు ఎంపీలు పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించకుండా స్పీకర్ ఓం బిర్లాకు లేఖ కూడా ఇచ్చేశారు.
అయోమయంలో శరద్ పవార్
శివసేన (యూబీటీ)లో సంక్షోభం నడుస్తున్న తరుణంలోనే ఎన్‌సీపీ (శరద్ పవార్)లో కూడా మరో తిరుగుబాటు రాబోతోందనే వార్తలు ఊపందు కున్నాయి. కనీసం ఐదుగురు లోక్‌సభ ఎంపీలు అధికార పక్షంలో భాగమైన ఎన్పీపీ (సునేత్రా పవార్)లోకి మారేందుకు చర్చలు జరుపుతున్నారని ప్రచారం జరుగుతుండగా శరద్ పవార్ వర్గం ఈ వాదనలను తీవ్రంగా కొట్టిపారేసింది. మరోవైపు ఎన్‌సీపీ (శరద్ పవార్)ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారనే విస్తృత ప్రచారం జరిగింది. దీంతో తమ పార్టీ స్వతంత్రంగానే ఉంటుందని వివరణ ఇచ్చుకోక తప్పలేదు. మహారాష్ట్ర రాజకీయాల్లో రానున్న రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సమాజ్‌వాదీ చీలుతోందా?
మరోవైపు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లోనూ అలజడి మొదలైంది. ఎస్పీకి చెందిన 37మంది ఎంపీల్లో సుమారు 25 మంది బీజేపీతో టచ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వీరంతా అఖిలేష్ యాదవ్ నాయ కత్వంపై అసంతృప్తితో ఉన్నారని, వారు పార్టీని వీడటానికి సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, మంత్రి ఓం ప్రకాష్ రాజ్‌భర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఆ పార్టీ నేత రామ్‌గోపాల్ యాదవ్ బీజేపీలో చేరడానికి సంసిద్దంగా ఉన్నామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశారని అంటు న్నారు. ఈ పరిణమాలు పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను కలవరపెడుతున్నాయి. ఇవన్నీ ఉద్దేశ పూర్వకంగా సృష్టిస్తున్న పుకార్లని కొట్టిపారేశారు. విపక్షాలను బలహీనపరచడానికి బీజేపీ ‘ఆపరేషన్ కమల్’ ద్వారా కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
తృణమూల్, శివసేన యూబీటీ, సమాజ్‌వాది పార్టీలలో అలజడి మిగతా ప్రాంతీయ పార్టీలను హడలెత్తిస్తోంది. తదుపరి వంతు ఎవరు? అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలు రాఘవ్ చద్దాతో కలిసి బీజేపీలో చేరారు. జార్ఖండ్‌లోని అధికార జేఎంఎం సైతం ఎన్టీఏ కూటమిలోకి వస్తుందన్న ప్రచారం సాగుతోంది. తాజాగా అక్కడ జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఒకటి జేఎంఎం గెలుచుకోగా, మరో సీటును బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్ధి గెలుపొందారు. ఇండీ కూటమిలోని ఆర్‌జేడీ, లెఫ్ట్ పార్టీల ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడంతో తాము ఓడిపోవాల్సి వచ్చిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఒకప్పుడు దేశంలో మూడో జాతీయ పార్టీగా వెలుగొందిన బీఎస్పీ ఇప్పటికే కనుమరుగు దశలో ఉంది.మరోవైపు ప్రాంతీయ పార్టీల్లో మాత్రం ఏ నేత ఎప్పుడు తమపై తిరుగుబాటు జెండా ఎగరవేస్తారోననే బెంగ పట్టుకుంది.
ఎన్టీఏకు తిరుగులేని బలం
విపక్ష ఇండీ కూటమి బలహీనపడటం, ప్రాంతీయ పార్టీలలో వస్తున్న చీలికలు నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీకి, ఎన్డీఏ కూటమికి రాజకీయంగా, వ్యూహాత్మకంగా భారీగా లబ్ధి చేకూరుస్తున్నాయి. విపక్ష కూటమి నుండి అసంతృప్తితో బయటకు వచ్చే చిన్న లేదా ప్రాంతీయ పార్టీలు తమ మనుగడ కోసం ఎన్డీఏ వైపు చూసే అవకాశం పెరుగుతోంది. విపక్షాల బలం తగ్గడంతో లోక్‌సభ, రాజ్యసభల్లో కీలక బిల్లులను ఆమోదించు కోవడం సులువవుతుంది. లోక్‌సభలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు 293 సీట్ల బలం ఉంది. రెండొంతుల సంఖ్యాబలం లేకపోవడంతో ఇటీవల 131వ రాజ్యాంగ సవరణ వీగిపోయింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, లోక్‌సభ స్థానాల సంఖ్య పెంపు బిల్లులు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. రాజ్యసభలో ప్రస్తుతం ఎన్డీఏ కూటమి బలం తగినంత కాదు. తాజాగా జరిగిన ఎన్నికలు, టీఎంసీలో చీలక ప్రభావంతో 163 స్థానాలకు చేరింది. అయితే కనీస మెజారిటీ అయిన 172 సీట్లకు దూరంలోనే ఉంది. పార్లమెంటులో కీలక బిల్లులు నెగ్గాలన్నా, ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలు సాధించాలన్నా తగిన సంఖ్యాబలం అవసరం. టీఎంసీ, శివసేన పార్టీల తిరుగుబాటు ఎంపీలు ఎన్డీయే కూటమికి మద్ధతు ఇవ్వడంతో అధికార పక్షం పని మరింత సులువు కానుంది. సమాజ్‌వాదీలో లుకలుకలు, ఆప్ చీలిక, కాంగ్రెస్ పార్టీకి దూరమైన డీఎంకే కూడా అధికార పక్షం ప్రవేశ పెట్టే బిల్లులకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ కారణంగా మరిన్ని పార్టీలు ఇండీ కూటమి నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉన్నాయని డీఎంకే నేత ఇళంగోవన్ పేర్కొన్నారు
బీజేపీ ఏమంటోంది?
ప్రతిపక్షాలను బలహీనపరిచేందుకు బీజేపీ ‘ఆపరేషన్ కమల్’ వ్యూహాన్ని అమలు చేస్తోందనే మీడియా వర్గాల్లో ప్రచారమవుతోంది. ప్రాంతీయ పార్టీల్లో ఉన్న అసంతృప్తిని, ఆశలను బీజేపీ సమర్థ వంతంగా వాడుకుంటోందని విశ్లేషకులు భావిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్-ప్రాంతీయ పార్టీల మధ్య ఉన్న ఆధిపత్య పోరును బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంటోందని అంటున్నారు
ఇండీ కూటమిలో చీలికలు, భాగస్వామ్య పక్షాల అంతర్గత విభేదాల వెనుక బీజేపీ ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా, ఆ కూటమి సహజంగానే కాలక్రమేణా విచ్ఛిన్నమవుతుందని బీజేపీ పేర్కొం టోంది. తాము ఎవరినీ విడగొట్టాల్సిన అవసరం లేదని, విపక్షాలు తమ స్వంత అంతర్గత కుమ్ము లాటలు, అవినీతి ఆరోపణలతో కూలిపోతున్నాయని స్పష్టం చేస్తోంది.కాంగ్రెస్‌కు, ప్రాంతీయ పార్టీలైన తృణవ•ల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ , డీఎంకేల మధ్య క్షేత్రస్థాయిలో ఎలాంటి ఐక్యత లేదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఎద్దేవా చేస్తున్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఎన్డీఏ కూటమి మాత్రమే స్థిరమైన ప్రభుత్వాన్ని ఇవ్వగలదనే నమ్మకాన్ని బీజేపీ మరింత పటిష్టం చేసుకుంటోంది. మోదీకి ప్రత్యామ్నాయం ఎవరు?’’ అనే ప్రచారాన్ని బీజేపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలుగుతోంది. విపక్షాల్లో ఐక్యత లేదని, వారు దేశాన్ని పాలించలేరనే భావనను ఓటర్లలో నాటడానికి ఇది ఉపయోగ పడుతుంది.ఈ పరిణామాలు కాంగ్రెస్‌కు ఆందోళన కలిగిస్తున్నాయి. దాదాపుగా ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ ఆధిపత్యంలో ఉంటాయి. దీంతో ఆ పార్టీల్లో వారసులు తప్ప, ఎంత కష్టపడ్డా ఇతరులు అగ్రస్థానాలకు చేరుకోలేరు. ఇదే ఆ పార్టీల్లో అంతర్గత చీలికలకు దారి తీస్తోంది.

క్రాంతిదేవ్ మిత్ర
సీనియర్ జర్నలిస్ట్