ఒకప్పుడు మిగులు బడ్జెట్‌, ‌వేగవంతమైన ఆర్థిక వృద్ధి, భారీ పెట్టుబడులకు చిరునామాగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అప్పుల చర్చలో దేశవ్యాప్తంగా ముందువరుసలో నిలుస్తోంది. రాష్ట్రం ఏర్పడిన తొలి దశలో ఆదాయ వృద్ధి, పారిశ్రామిక విస్తరణ, ఐటీ రంగం ప్రగతి, భూముల విక్రయాలు ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని సమకూర్చినా, అప్పటి బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ నిర్ణయాలు రాష్ట్రాన్ని అప్పుల్లో కూరుకుపోయేలా చేశాయి. ప్రస్తుత కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అదే ఒరవడిని  కొనసాగిస్తోంది.

రాష్ట్ర ఆదాయం అప్పులు, వడ్డీలకే కరిగి పోతోంది. సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల నిర్మాణం వివిధ కార్యక్రమాల అమలు కోసం ఎంత భారీ రుణభారం పేరుకుపోతోందో చూపిస్తూ.. కంప్రోల్టర్‌ అం‌డ్‌ ఆడిటర్‌ ‌జనరల్‌ (‌కాగ్‌) ఇస్తున్న నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రం తీసుకుంటున్న అప్పులు అభివృద్ధి కోసం మాత్రమే కాకుండా, పాత అప్పులు తీర్చడానికి కూడా సరిపోని స్థితికి చేరాయని గణాంకాలు సూచిస్తున్నాయి. అభివృద్ధి కోసం అప్పులు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. తెచ్చిన ఆ అప్పులు ఎక్కడికి వెళ్తున్నాయి? భవిష్యత్తులో వాటి భారం ఎవరిపై పడబోతోంది? అనే ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు కొత్త పథకాల ప్రకటనలు, మరోవైపు పెరుగుతున్న అప్పులు, వడ్డీ చెల్లింపులు, రెవెన్యూ లోటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

రూ.6.89 లక్షల కోట్ల రుణభారం

కాగ్‌ ‌విశ్లేషణ ప్రకారం 2015-16 నుంచి 2024-25 మధ్య దేశంలోని అన్ని రాష్ట్రాల అప్పులు సగటున 190 శాతం పెరిగాయి. కానీ తెలంగాణ విషయంలో అది 357 శాతంగా నమోదై, దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2024-25 నాటికి రాష్ట్ర మొత్తం రుణభారం రూ.6,89,021 కోట్లకు చేరింది. రాష్ట్ర జీఎస్‌డీపీలో అప్పుల వాటా 27.27 శాతంగా ఉంది. ఇది ప్రమాదకర స్థాయికి చేరువలో ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ఆదాయం పెరిగినా, అప్పుల పెరుగుదల అంతరంటే వేగంగా ఉండడం ఆర్థిక సమతుల్యతను దెబ్బ తీస్తోంది. ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్‌లో ఎక్కువ భాగం వడ్డీలు, అప్పుల చెల్లింపులకే సరిపోతుండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో అత్యంత ఆందోళన కలిగించే అంశం ‘‘డెట్‌ ‌ట్రాప్‌’’ ‌లక్షణాలు కనిపించడం. 2024-25లో రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్‌ ‌రుణాలు, వేస్‌ అం‌డ్‌ ‌మీన్స్ అడ్వాన్సులు, ఓవర్‌‌డ్రాఫ్ట్‌ల రూపంలో రూ.1,89,071 కోట్లు అప్పు తెచ్చింది. అయితే అందులో రూ.1,42,701 కోట్లు పాత అప్పులు, వడ్డీల చెల్లింపులకే సరిపోయాయి. అంటే ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి నాలుగు రూపాయల్లో వ•డు రూపాయలు పాత బకాయిలను తీర్చడానికే వినియోగించాల్సిన పరిస్థితి నెలకొంది. కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలకు లేదా సంక్షేమానికి నిర్దేశించిన మొత్తం కేవలం రూ.46,370 కోట్లు మాత్రమే.

రెవెన్యూ లోటు సర్దుబాటు చేసిన తర్వాత మిగిలింది రూ.36,950 కోట్లు. ఇది అప్పు మీద అప్పు తీసుకుంటూ ముందుకు సాగుతున్న ఆర్థిక వ్యవస్థకు సంకేతంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

రోజూ ఓవర్‌‌డ్రాఫ్ట్?

‌కాగ్‌ ‌నివేదికలోని నగదు కొరత తీవ్రతను తెలియజేసే మరో లెక్క ఆందోళనకర అంశం. రాష్ట్రం దాదాపు ఏడాది పొడవునా తాత్కాలిక అప్పులపైనే ఆధారపడుతోంది. 2024-25లో ఆర్థిక సంవత్సరంలో వేస్‌ అం‌డ్‌ ‌మీన్స్ ‌లేదా ఓవర్‌‌డ్రాఫ్ట్ ‌సౌకర్యాలను వినియోగించుకుంది. దేశంలో పంజాబ్‌ ‌తర్వాత రెండో స్థానంలో నిలిచింది. సాధారణంగా ఈ విధమైన అప్పులు తాత్కాలిక నగదు కొరతను అధిగమించేందుకు ఉపయోగిస్తారు. కానీ, దాదాపు ప్రతిరోజూ వాటిపైనే ఆధారపడటం ఖజానా నిర్వహణలో ఒత్తిడిని ఎత్తిచూపుతోంది. దాదాపు ఏడాది పొడవునా తాత్కాలిక అప్పులపై ఆధారపడటం రాష్ట్ర ఖజానా పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తోందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రభుత్వం నేరుగా తీసుకున్న అప్పులు మాత్రమే కాదు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, ప్రత్యేక ప్రయోజన వాహనాల కోసం తీసుకున్న రుణాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. కాగ్‌ ‌నివేదిక ప్రకారం 2025 మార్చి నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు రూ.2,41,528 కోట్లకు చేరాయి. ఇవి రాష్ట్ర జీఎస్‌డీపీలో 14.72 శాతం. దేశంలోనే అత్యధికం. జీఎస్‌డీపీలో 10 శాతానికి మించి గ్యారంటీలు ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ సంస్థలు అప్పులు చెల్లించ లేని పరిస్థితి వస్తే, ఆ భారం చివరికి ప్రభుత్వంపైనే పడుతుంది. ఇవి ప్రస్తుతం కనిపించని అప్పులైనా భవిష్యత్తులో ప్రజలపైనే భారం పడే అవకాశముంది.

అంచనాలు, వాస్తవాల మధ్య భారీ వ్యత్యాసం

రాష్ట్ర బడ్జెట్‌ అం‌చనాలు, వాస్తవ ఆదాయాల మధ్య భారీ అంతరం కనిపిస్తోంది. 2026-27 బడ్జెట్‌లో రూ.2.41 లక్షల కోట్ల రెవెన్యూ వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ, మే నాటికి వచ్చిన ఆదాయం కేవలం రూ.28,442 కోట్లు. అంచనాలో 11.7 శాతం. ప్రత్యేకంగా పన్నేతర ఆదాయం విషయంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. భూముల అమ్మకాలు, ఇతర వనరుల ద్వారా రావాల్సిన ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఖర్చులను నిర్వహించేందుకు ప్రభుత్వం అప్పులపైనే ఆధారపడాల్సి వస్తోంది. బడ్జెట్‌లో రూ.6,858 కోట్ల రెవెన్యూ మిగులు ఉంటుందని ప్రభుత్వం ప్రకటిస్తే, మే నాటికి వాస్తవంగా రూ.5,038 కోట్ల రెవెన్యూ లోటు నమోదైంది. ఇది అంచనాలు, వాస్తవాల మధ్య పెరుగుతున్న అంతరానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

అప్పులతో పాటే వడ్డీ భారం కూడా పెరుగు తోంది. ప్రస్తుతం వడ్డీ చెల్లింపుల కోసం పెన్షన్‌ ‌వ్యయం కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉంది. 2024-25లో మొత్తం బడ్జెట్‌ ‌వ్యయంలో 10 శాతానికి మించిన మొత్తం.. వడ్డీల చెల్లింపులకే ఖర్చవుతోంది. ఇది అప్పుల భారాన్ని ప్రతిబింబించే సూచికగా కాగ్‌ ‌పేర్కొంది. ప్రభుత్వం కొత్త అభివృద్ధి పనుల కోసం కేటాయించా ల్సిన నిధుల్లో ఎక్కువ భాగం అప్పుల వడ్డీలకే వెళ్తుండటం భవిష్యత్‌ ‌తరాలపై ఆర్థిక ఒత్తిడిని పెంచుతోంది.

సంక్షేమం కోసం అప్పులు

కాగ్‌ ‌నివేదికలో మరో అంశం గమనిస్తే… రాష్ట్ర బడ్జెట్‌లో మెజార్టీ భాగం సంక్షేమ కార్యక్రమాలకే కేటాయిస్తున్నారు. మే 2026 నాటికే జీతాలకు రూ.8,324 కోట్లు, పెన్షన్లకు రూ.4,758 కోట్లు, సబ్సిడీలకు రూ.5,809 కోట్లు, సంక్షేమ పథకాలకు రూ.9,930 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇది రాజకీయంగా అధికార పార్టీకి ప్రజాదరణ పొందేం దుకు కారణమవుతున్నప్పటికీ.. అదే సమయంలో భవిష్యత్తులో ఆదాయం పెంచే పెట్టుబడులు తగ్గిపోతే ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరగడం తథ్యమంటున్నారు విశ్లేషకులు. కాగ్‌ ‌నివేదిక ప్రకారం 2024-25లో ఆస్తుల సృష్టికి తెలంగాణ ప్రభుత్వం పెద్దగా ఖర్చు చేయలేదు. మిషనరీ, పరికరాల కొనుగోలుపై దేశవ్యాప్తంగా రాష్ట్రాలన్నీ.. రూ.16,849 కోట్లు ఖర్చు చేస్తే, తెలంగాణ వాటా కేవలం రూ.300 కోట్ల లోపే ఉంది. అంటే అప్పులు పెరుగుతున్నా, ఆ అప్పులతో కొత్త ఆదాయ వనరులు సృష్టించే పెట్టుబడులు తగిన స్థాయిలో కనిపించడం లేదు. మరోవైపు జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు, సంక్షేమ పథకాలపై భారీగా ఖర్చు పెరిగిపోతోంది. సంక్షేమం అవసరమే అయినప్పటికీ, అదే సమయంలో ఆదాయాన్ని పెంచే పెట్టుబడులు, పరిశ్రమలు, ఉత్పాదక రంగాలపై ఖర్చు తగ్గిపోతే భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక స్థితి మరింత బలహీనపడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మద్యం ఆదాయమే కీలకం

రాష్ట్ర ఆదాయంలో ఎక్సైజ్‌ ‌వసూళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎక్సైజ్‌ ఆదాయం విషయంలో రాష్ట్రం,దేశంలో మొదటి స్థానాల్లో ఉంది. గత పదేళ్లలో ఈ ఆదాయం 388 శాతం పెరిగింది. 2024-25లో మద్యం విక్రయాల ద్వారా రూ.18,604 కోట్ల ఆదాయం వచ్చింది. దేశంలోనే అత్యధిక వృద్ధి ఇది. ఆర్థిక పరంగా ఇది ఆదాయ వనరే అయినా, సామాజికంగా దీర్ఘకాలిక ప్రభావాలు తప్పవని, ప్రజారోగ్యంపై ప్రభావం చూపే రంగాలపై అధికంగా ఆధారపడటం దీర్ఘకాలంలో సుస్థిర ఆర్థిక వ్యూహం కాదని నిపుణులు చెబుతున్నారు.

ప్రభుత్వం తీసుకునే అప్పులను ప్రభుత్వం మాత్రమే చెల్లించదు. ఆ భారాన్ని చివరికి పన్నుల రూపంలో, ఫీజుల రూపంలో, వినియోగదారులపై ఛార్జీల రూపంలో ప్రజలే భరిస్తారు. అంటే.. ఈరోజు తీసుకున్న అప్పులు రేపటి తరాలకు బాధ్యతలుగా మారతాయి. వడ్డీ చెల్లింపులు పెరిగితే విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేయాల్సిన నిధులు తగ్గిపోతాయి. కొత్త పన్నులు విధించే అవకాశం పెరుగుతుంది. ప్రభుత్వ రంగ సంస్థల సేవల ధరలు కూడా పెరగవచ్చు. అంటే అప్పు తీసుకుని అమలు చేస్తున్న ప్రతి పథకం వెనుక భవిష్యత్తు తరాలు చెల్లించాల్సిన బిల్లు కూడా ఉందన్నది వాస్తవం అంటున్నారు ఆర్థిక నిపుణులు.

రాష్ట్రానికి బలమైన ఆదాయ వనరులు ఉన్నాయి. సొంత ఆదాయంలో దేశంలోనే ముందంజలో ఉంది. ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య రంగాలతో పాటు.. పన్ను వసూళ్లు, జీఎస్‌టీ, వాణిజ్య పన్నులు, భూముల విక్రయాలు ఆర్థిక ఆధారంగా ఉన్నాయి. ఇదే కాగ్‌ ‌నివేదికలోని సానుకూల అంశంగా చెప్పుకోవచ్చు. అయితే ఆదాయం పెరుగుతున్నా అప్పులు కూడా మరింత వేగంగా పెరుగుతుండటం, కొత్త అప్పుల్లో ఎక్కువ భాగం పాత అప్పుల చెల్లింపులకే వెళ్తుండటం, వడ్డీ భారం పెరగడం, అభివృద్ధి పెట్టుబడులు తగ్గిపోవడం వంటి అంశాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే సంక్షేమం-అభివృద్ధి మధ్య సమతుల్యత, అప్పుల నిర్వహణలో క్రమశిక్షణ, ఆదాయ వనరుల విస్తరణ తప్పనిసరిగా మారాయి. లేకపోతే ఈరోజు కనిపిస్తున్న సంక్షేమ వెలుగుల వెనుక రేపటి ఆర్థిక చీకట్లు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని కాగ్‌ ‌గణాంకాలు స్పష్టంగా చూపిస్తున్నాయని ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

సుజాత గోపగోని
సీనియర్‌ ‌జర్నలిస్ట్, 6302164068

About Author

By editor