‌ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌-‌లెస్‌-‌బైన్స్‌లో జూన్‌ 17‌న ముగిసిన 2026, జీ7 శిఖరాగ్ర సమావేశంలో అంతర్జాతీయ భద్రత, ఆర్థిక భాగస్వామ్యాలు, ప్రపంచ ఆరోగ్యంపై ప్రధాన ఒప్పందాలు కుదిరాయి. ఉక్రెయిన్‌కు మద్దతును బలోపేతం చేయడం, కీలకమైన సరఫరా గొలుసులను బలోపేతం చేసే కార్యక్రమాలు, కృత్రిమ మేధ (ఏఐ)ను పరిష్కరించే వ్యూహాలు, వివిధ దేశాలలో ఆరోగ్య సంక్షోభాలను అధిగమించేందుకు నిధుల కేటాయింపు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైమానిక రక్షణ వ్యవస్థలు, ఇంటర్‌ ‌సెప్టర్‌ల వంటి సైనిక మద్దతును పెంచడానికి, రష్యా చమురు, గ్యాస్‌పై కఠినమైన ఆంక్షలు విధించడానికి అంగీకరించడం ద్వారా ఉక్రెయిన్‌ ‌సార్వభౌమాధికారం పట్ల జీ7 నాయకులు నిబద్ధతను పునరుద్ఘాటించారు. ప్రపంచ ఇంధన మార్కెట్లపై ఒత్తిడిని తగ్గించడానికి హార్ముజ్‌ ‌జలసంధిని తక్షణమే తిరిగి తెరవడానికి నాయకులు మద్దతు తెలిపారు. హిజ్బుల్లా నిరాయుధీకరణను నిర్ధారించడానికి, ప్రాదేశిక సమగ్రతను కాపాడడానికి లెబనాన్‌లో తక్షణ కాల్పుల విరమణకు కూడా పిలుపునిచ్చారు. అసమ తుల్యతలను తగ్గించడానికి, విదేశీ కీలక ఖనిజాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, సంరక్షణావాద వాణిజ్య యుద్ధాలను నివారించడానికి, ఆర్థిక విధానాలను సమన్వయం చేసుకోవడానికి సభ్యులు అంగీకరించారు. సమాచారాన్ని పంచుకోవడానికి,  పిల్లల క్యాన్సర్ల నిరోధక శక్తిని మెరుగుపరచడానికి, సమన్వయ వ్యూహాలకు కట్టుబడి ఉంటామంటూ, ఇందుకోసం ఒక బిలియన్‌ ‌డాలర్లకు పైగా కేటాయించడానికి అంగీకరించారు.

జీ7 (గ్రూప్‌ ఆఫ్‌ ‌సెవెన్‌) ‌ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన అగశ్రేణి ఆర్థిక వ్యవస్థల కూటమి.ఏటా ఒక సభ్య దేశం ఈ సదస్సుకు అధ్యక్షత వహిస్తుంది. ఈ ఏడాది 52వ జీ7 సదస్సుకు ఫ్రాన్స్ (ఎవియాన్‌-‌లెస్‌-‌బైన్స్) ఆతిథ్యం ఇచ్చింది. అభివృద్ధి చెందుతున్న దేశాల (గ్లోబల్‌ ‌సౌత్‌) ‌తరపున తన వాణిని వినిపించేందుకు ప్రత్యేక భారతదేశం ఆహ్వానం పొందింది.

‘‘కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు,అంతర్జాతీయ సంఘీభావ పునర్నిర్మాణం’’ అనేది ఈ సదస్సు ఇతివృత్తం. గ్లోబల్‌ ఎనర్జీ మార్కెట్లను సురక్షితం చేయడానికి ‘స్ట్రెయిట్‌ ఆఫ్‌ ‌హార్ముజ్‌’‌ను వెంటనే తిరిగి తెరవడానికి, ఇరాన్‌ ‌చమురు ఎగుమతులపై ఆంక్షలను సడలించడానికి ఒక ముసాయిదా అంగీకారానికి వచ్చాయి. ఉక్రెయిన్‌ ‌సార్వభౌమాధి కారానికి జీ7 దేశాలు పూర్తి మద్దతు ప్రకటించాయి. రష్యాపై కఠినమైన ఆంక్షలతో పాటు, ఉక్రెయిన్‌కు తక్షణమే వైమానిక రక్షణ వ్యవస్థలు(ఎయిర్‌ ‌డిఫెన్స్ ‌సిస్టమ్స్) అం‌దించడానికి అంగీకరించాయి. లెబనాన్‌లో తక్షణ కాల్పుల విరమణ జరగాలని,  హిజ్బుల్లా ఆయుధాలను వీడాలని, లెబనాన్‌ ‌ప్రాంతీయ సమగ్రతను రక్షించాలని నాయకులు పిలుపునిచ్చారు. పిల్లలు, యువకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఏఐ, చాట్‌బాట్‌ల వాడకంపై కఠినమైన నిబంధనలు, మార్గదర్శకాలను రూపొందించారు. చిన్నపిల్లల్లో వచ్చే కాన్సర్‌ ‌చికిత్స సమాచారాన్ని పరస్పరం పంచుకోవడానికి అంగీకరించారు. కీలకమైన ఖనిజాల సరఫరా కోసం కేవలం ఒకే దేశంపై ఆధారపడకుండా, సరఫరా గొలుసును బలోపేతం చేయాలని నిర్ణయించారు.

జీ7 సదస్సులో భారత్‌ ‌పాత్ర

భారతదేశం జీ7లో శాశ్వత సభ్యురాలు కాకపోయినప్పటికీ, వరుసగా ఈ సదస్సులకు ప్రత్యేక ఆహ్వానిత దేశంగా హాజరైంది. ప్రధాని నరేంద్ర మోదీ, భారతదేశపు యూపీఐ, డిజిటల్‌ ‌గుర్తింపు వ్యవస్థల విజయాలను ప్రపంచ దేశాలకు వివరించారు. అంతరాలను తగ్గించడానికి డిజిటల్‌ ‌పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొనే తీరును సూచిం చింది. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, కీలకమైన ఖనిజాలు సెమీకండక్టర్ల తయారీలో భారతదేశాన్ని ఒక నమ్మకమైన భాగస్వామిగా జీ7 దేశాలు గుర్తించాయి. అంతర్జాతీయ సహాయాలు కేవలం ‘దాత-గ్రహీత’ ధోరణిలో కాకుండా, సమానత్వ భాగస్వామ్యం ప్రాతిపదికన జరగాలని భారత్‌ ‌ప్రతిపాదించడాన్ని జీ7 దేశాలు అంగీకరిం చాయి. భారతదేశానికి చెందిన యూపీఐ, ఆధార్‌ ‌వంటి డిజిటల్‌ ‌టెక్నాలజీ నమూనాలను ప్రపంచ దేశాలకు ప్రత్యామ్నాయ మార్గాలుగా భారత్‌ ఈ ‌వేదికపై ప్రదర్శించింది. ఏఐ నియంత్రణ, సాంకేతిక ప్రమాణాల రూపకల్పనలో భారత్‌ ‌ప్రమేయం లేకుండా ప్రపంచ దేశాలు ముందుకెళ్ల లేవనే విషయాన్ని ఈ సదస్సు స్పష్టం చేసింది.

దేశానికి వ్యూహాత్మక ప్రయోజనాలు

 జీ7 సదస్సు ద్వారా భారతదేశానికి వ్యూహాత్మక, ఆర్థిక, సాంకేతిక ప్రయోజనాలు పెద్ద ఎత్తున చేకూరాయి. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇండియా-యుకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జులై 15, 2026 నుండి అమలులోకి రానున్నట్లు బ్రిటన్‌ ‌ప్రధాని కీర్‌స్టార్మర్‌తో జరిపిన చర్చల్లో అధికారికంగా ప్రకటించారు. దీనివల్ల భారతీయ ఎగుమతులకు బ్రిటన్‌ ‌మార్కెట్లో భారీగా అవకాశాలు లభిస్తాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ జరిపిన చర్చలలో ‘ఇండియా- యుఎస్‌ ‌కాంపాక్ట్’ ‌పురోగతిని సమీక్షించారు. రక్షణ రంగం, వ్యూహాత్మక సాంకేతిక తలు, ఇంధన రంగాలలో సహకారాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ఇరు దేశాలు అంగీకరిం చాయి. జర్మనీ ఛాన్సలర్‌ ‌ఫెడ్రిచ్‌ ‌మెర్జ్‌తో రక్షణ పారిశ్రామిక సహకార రోడ్‌మ్యాప్‌తోపాటు వీసా మినహాయింపులపై పురోగతి సాధించగా, కెనడా ప్రధాని మార్క్ ‌కార్నీతో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై కీలక చర్చలు జరిగాయి. ప్రపంచ దేశాలు చైనాపై అతిగా ఆధారపడటాన్ని తగ్గించ డానికి, సప్లై చైన్‌ ‌నెట్‌వర్క్‌లను వికేంద్రీకరించడానికి సదస్సు తీసుకొన్న నిర్ణయం భారత్‌కు వరంగా మారింది. సెమీకండక్టర్లు, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్ ‌రంగాలలో గ్లోబల్‌ ‌మాన్యుఫ్యాక్చరింగ్‌ ‌హబ్‌గా మారడానికి భారతదేశ ప్రొడక్షన్‌ ‌లింక్డ్ ఇన్సెంటివ్‌ ‌పథకాలకు విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశం పెరిగింది. చైనాతో సంబంధం లేకుండా లిథియం, గ్రాఫైట్‌, ‌కోబాల్ట్ ‌వంటి కీలక ఖనిజాల సరఫరాను పెంచేందుకు జీ7 చేసిన తీర్మానానికి భారత్‌ ‌మద్దతు తెలిపింది. దీనివల్ల జవ్మ-కశ్మీర్‌, ‌రాజస్థాన్‌ ‌వంటి రాష్ట్రాల్లో బయటపడిన లిథియం నిక్షేపాలకు వాణిజ్యపరంగా అంతర్జాతీయ డిమాండ్‌తో పాటు సాంకేతిక సహకారం లభిస్తుంది. ఇది భారతదేశ ఎలక్ట్రిక్‌ ‌వాహనాల రంగానికి ఎంతో కీలకం.

16 నెలల తర్వాత భేటీ – ఒప్పందాలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ 16 ‌నెలల తర్వాత ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఈ ప్రత్యేక సెషన్‌లో ‘కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీ భావం’ అనే అంశంపై చర్చ జరిగిన జరిగిన చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అధునాతన రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడం, ఉమ్మడి సైనిక విన్యాసాలు, హిందూ-పసిఫిక్‌ ‌ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవడంపై చ•ర్చించారు. వాణిజ్య వివాదాలను పరిష్కరించుకోవడం, పరస్పర పెట్టుబడులను పెంచడం, వీసా పక్రియలను మరింత సులభతరం చేయడంపై దృష్టి పెట్టారు. భారత్‌లో సెమీకండక్టర్‌ ‌తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు అమెరికా సాంకేతిక మద్దతును అందించడంపై ఒప్పందం కుదిరింది. భారత్‌పై ఎవరైనా దాడి చేస్తే అమెరికా అండగా ఉంటుందని అధ్యక్షుడు ట్రంప్‌ ‌స్పష్టం చేయడం గమనార్హం. ఈ వ్యాఖ్యను సాధారణ హామీగా కాకుండా, అంతర్జాతీయ దౌత్యం, భౌగోళిక రాజకీయాల కోణంలో విశ్లేషించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ దౌత్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ట్రంప్‌ ‌వ్యాఖ్యలు నేరుగా చైనాను ఉద్దేశించినవే. లద్దాఖ్‌ ‌సరిహద్దుల్లో (ఎల్‌ఏసీ) భారత్‌-‌చైనాల మధ్య ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, భారత్‌కు అమెరికా పూర్తి సైనిక, వ్యూహాత్మక మద్దతు ఇస్తుందని చెప్పడం ద్వారా చైనా దూకుడుకు బ్రేక్‌ ‌వేయడం ట్రంప్‌ ‌వ్యూహం. అంతేకాని ఈ ప్రకటన కేవలం భారత్‌పై ప్రేమతో చేసినది కాదు. చైనా అగ్రరాజ్యంగా ఎదగకుండా అడ్డుకోవడమే అమెరికా ప్రధాన లక్ష్యం. అందుకు దానికి భారత్‌ ‌కంటే బలమైన భాగస్వామి మరొకరు లేరు. అందువల్ల భారత్‌ ‌రక్షణ బాధ్యతను తమదిగా ప్రకటించుకోవడం ద్వారా ఈ ప్రాంతంలో అమెరికా తన పట్టును నిలుపుకోవాలని చూస్తోంది. ‘మేము మీకు అండగా ఉంటాం’ అనడం ద్వారా, భారత్‌తో తమ బంధం అత్యంత పటిష్టంగా ఉందని ట్రంప్‌ ‌ప్రపంచానికి చాటిచెప్పారు.

ప్రస్తుతం లిథియం, కోబాల్ట్, ‌రేర్‌ ఎర్త్ ఎలిమెంట్స్ ‌వంటి కీలక ఖనిజాల సరఫరాలో చైనాదే ఏకఛత్రాధి పత్యం. దీనిని తగ్గించడానికి జీ7 దేశాలతో కలిసి భారత్‌ ఈ ఒప్పందంలో భాగస్వామి అయింది. ఎలక్ట్రిక్‌ ‌వాహనాల (ఈవీ) బ్యాటరీలు, క్లీన్‌ ఎనర్జీ పరికరాల తయారీకి అవసరమైన ముడి పదార్థాలు నిరంతరాయంగా లభించేలా ఇరు దేశాలు ఉమ్మడి వ్యూహాన్ని ఖరారు చేశాయి.ఆఫ్రికా, ఆస్ట్రేలి యా, లాటిన్‌ అమెరికా దేశాలలో ఉన్న ఖనిజ వనరులను వెలికితీయడంలో మరియు వాటిని శుద్ధి చేయడంలో అమెరికా, భారత్‌ ‌కలిసి పెట్టుబడులు పెట్టనున్నాయి.

 పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో హార్ముజ్‌ ‌జలసంధిలో గల్ఫ్ ‌ప్రాంతంలో భారత నావికుల భద్రత అత్యంత ప్రాధాన్యమని మోదీ ట్రంప్‌ ‌దృష్టికి తీసుకెళ్లడం ఇక్కడ కీలకం. ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకుందని, వాణిజ్యపరంగా భారత్‌ అత్యంత గట్టిగా, సమర్థవంతంగా చర్చలు జరుపుతోందని ట్రంప్‌ ‌ప్రశంసించారు. జీ7 సదస్సులో డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌వైఖరిని గమనిస్తే, ఇటీవల ఇరుదేశాల మధ్య కొన్ని తీవ్రమైన అపార్థాలు, ఉద్రిక్తతలు చోటుచేసుకున్నప్పటికీ, భారతదేశం పట్ల అమెరికా తన సానుకూల వైఖరిని స్పష్టం చేస్తోందని అర్థం చేసుకోవచ్చు. ఆసియా-పసిఫిక్‌ ‌ప్రాంతంలో చైనా ఎదుగుదలను నిరోధించడానికి అమెరికాకు భారతదేశం అత్యంత కీలకమైన భాగస్వామి. ఇరుదేశాల మధ్య కుదిరిన ‘మాస్టర్‌ ‌డిఫెన్స్ ‌పార్టనర్‌షిప్‌ (ఎం‌డీపీ)’,క్వాడ్‌ ‌కూటమి ద్వారా సైనిక, రక్షణ సంబంధాలు మరింత బలపడుతున్నాయి. గతంలో రష్యా నుండి భారత్‌ ‌ముడిచమురు కొనుగోలు చేయడంపై అమెరికా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసి, భారతీయ ఉత్పత్తులపై దాదాపు 50% వరకు పన్నులు విధించింది.అయితే ఇటీవల కుదిరిన తాత్కాలిక ఒప్పందంలో భాగంగా ఆ పన్నులను 18 శాతానికి తగ్గించడం, రాబోయే రోజుల్లో 500 బిలియన్‌ ‌డాలర్ల విలువైన వాణిజ్యానికి ఇరుదేశాలు సిద్ధమవడం అమెరికా మారిన ఆర్థిక వ్యూహానికి నిదర్శనం. ఇటీవల హార్ముజ్‌ ‌జలసంధిలో అమెరికా జరిపిన సైనిక దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించడం ఇరుదేశాల మధ్య తీవ్ర దౌత్యపరమైన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ పరిణామంపై భారత్‌ ‌తీవ్ర నిరసన వ్యక్తం చేయగా, ఈ భేటీలో ట్రంప్‌ ఈ ఉ‌ద్రిక్తతలను పక్కనపెట్టి ‘‘మన మధ్య అత్యంత బలమైన సంబంధాలు ఉన్నాయి’’ అని ప్రకటించడం ఇరుదేశాల బలీయమైన బంధాన్ని చూపిస్తుంది. అమెరి• విదేశాంగ విధానం ఎప్పుడూ ‘‘లావాదేవీల రూపంలో’’ ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత దేశాన్ని పూర్తిగా దూరం చేసుకోవడం అమెరికాకు నష్టదాయకం కాబట్టి, తాత్కాలిక విభేదాలు ఉన్నప్పటికీ భారత్‌తో దీర్ఘకాలిక వ్యూహాత్మక, ఆర్థిక బంధాన్ని కొనసాగించడానికే యుఎస్‌ ‌మొగ్గు చూపుతోందని స్పష్టమవుతోంది.

 అమెరికా, భారత్‌, ‌జపాన్‌, ఆ‌స్ట్రేలియాలతో కూడిన క్వాడ్‌ ‌కూటమి సైనిక పరంగా మరింత బలోపేతం కాబోతోందని ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. భవిష్యత్తులో ఆసియా ప్రాంతంలో ఎలాంటి రక్షణ సంక్షోభం ఎదురైనా అమెరికా చురుకైన పాత్ర పోషిస్తుందనడానికి సూచన. అమెరికా విదేశాంగ విధానంలో ఏ దేశానికీ ‘ఉచితంగా లేదా శాశ్వతంగా’ రక్షణ కల్పించరు. ట్రంప్‌ ‌చేసిన ఈ ప్రకటన భారత్‌కు దౌత్యపరంగా పెద్ద విజయమే అయినప్పటికీ, దీని వెనుక అమెరికా తన గ్లోబల్‌ ‌వ్యూహాలను, ప్రయోజనాలను కూడా ముడిపెట్టిందని మనం అర్థం చేసుకోవాలి.


జమలాపురపు విఠల్‌రావు,

సీనియర్‌ ‌జర్నలిజం

About Author

By editor