దేశ స్వాతంత్య్ర పోరాటంలో కీలకపాత్ర పోషించిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సుదీర్ఘ పోరాటం తర్వాత భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తొలిసారిగా 2026లో అధికార పగ్గాలు చేపట్టింది. తొలుత కాంగ్రెస్, తర్వాత వామపక్షాలు, అనంతరం తృణమÖల్ కాంగ్రెస్ (టీఎమ్‌సీ) పరిపాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైంది. ప్రధానంగా నాలుగు దశాబ్దాలకుపైగా వామపక్షాలు, టీఎమ్‌సీ ఒంటెత్తు పోకడలతో పశ్చిమ బెంగాల్ ఆర్థికంగా కుదేలైంది. ముఖ్యంగా తృణమూల్ పదిహేనేళ్ల పాలనలో శాంతి భద్రతలు క్షీణించడంతో పాటు, నిరుద్యోగం పెరిగిపోవడం, దౌర్జన్యాలకు బెదిరి పెట్టుబడులు, కంపెనీలు రాకపోవడంతో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర అభివృద్ధి గురుతర బాధ్యత పెరిగింది.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడంతో పాటు శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాల్సిన బాధ్యత కూడా బీజేపీ ముఖ్యమంత్రి సువేందు అధికారి భుజస్కంధాలపై ఉంది. ఈ నేపథ్యంలో తృణమÖల్ అధినేత్రి మమతా బెనర్జీ పాలనలో పట్టాలు తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు 2026`27 ఆర్థిక సంవత్సరానికి రూ.4.39 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్‌ను పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ తొలి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అన్ని రంగాలకు ప్రాధాన్యతిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి స్వపన్ దాస్‌గుప్తా సమర్పించిన వార్షిక బడ్జెట్‌తో రాష్ట్రానికి తాత్కాలిక ఉపశమనం కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరుతాయని ప్రజలు విశ్వసిస్తున్నారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలే అధికారంలో ఉండడంతో డబుల్ ఇంజిన్ సర్కార్ తోడ్పాటుతో పశ్చిమబెంగాల్ వేగవంతంగా అభివృద్ధి సాధించే అవకాశాలున్నాయి.
పశ్చిమ బెంగాల్ 2026 అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను దేశవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక, పరిపాలనా వర్గాలు ఆసక్తిగా గమనించాయి. కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టే తొలి బడ్జెట్‌ను కేవలం ఆదాయ, వ్యయాల లెక్కల పత్రంగానే కాకుండా, ఎన్నికల సమయంలో వారు ప్రజలకిచ్చిన హామీలను ఎంతవరకు నెరవేరుస్తున్నారో విశ్లేషిస్తారు. అందుకే ఈ బడ్జెట్‌ను కేవలం గణాంకాలతోనే కాకుండా, బీజేపీ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిఫెస్టో “భరోషార్ షపథ్ సంకల్ప పత్రం” హామీల అమలు కోణంలో కూడా ఉంది. పదిహేనేళ్లుగా రాజకీయ ఆధిపత్యంతో రాష్ట్ర అభివృద్ధి మందగిం చింది. సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తున్నట్టు మమతా బెనర్జీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించు కున్నా, అర్హులకు అందకపోవడంతో అసంతృప్తి నెలకొంది. మరోవైపు పారిశ్రామిక పెట్టుబడుల కొరత, తయారీ రంగం మందగమనం, యువతలో పెరుగుతున్న నిరుద్యోగం, భారీ అప్పుల భారం వంటి సమస్యలు కూడా రాష్ట్రంలో అంతే తీవ్రంగా పెరిగాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై అప్పుల భారం లక్షల కోట్ల రూపాయలకు చేరుకోవడం, ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో గణనీయమైన భాగం వడ్డీలు, అప్పుల చెల్లింపులకే వెచ్చించాల్సి రావడం వల్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు, వనరులు అందుబాటులో లేకుండా పోయాయి.
ఈ నేపథ్యంలో 2026 ఎన్నికల సమయంలో బీజేపీ విడుదల చేసిన సంకల్ప పత్రం కేవలం రాజకీయ ప్రకటన కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించేందుకు ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాగా ప్రజలకు కనిపించింది. రాష్ట్రంలో మహిళల సంక్షేమం, యువతకు ఉపాధి, వ్యవసాయాభివృద్ధి, పరిశ్రమలకు ప్రోత్సాహం, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ఆధునిక సాంకేతిక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణ, ఉత్తర బెంగాల్‌కు ప్రత్యేక అభివృద్ధి, అవినీతి నిర్మూలన, సులభ వ్యాపార వాతావరణం వంటి అంశాలకు ఆ ప్రణాళికలో ప్రాధాన్యతిచ్చారు. ఇప్పుడు ప్రవేశపెట్టిన తొలి పూర్తి బడ్జెట్‌ను పరిశీలిస్తే ఆ హామీల్లో గణనీయమైన భాగానికి ప్రభుత్వం ఆర్థిక కేటా యింపులు చేయడానికి ప్రయత్నించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ బడ్జెట్‌లో అత్యంత ఆసక్తికరమైంది లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. ఎన్నికల ప్రచారంలో బీజేపీ యువతకు ఉపాధి కల్పనను ప్రధాన హామీగా ప్రకటించింది. రాష్ట్రంలోని పాఠశాలలు, పోలీసు శాఖ, ఆరోగ్య శాఖ, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామని పేర్కొంది. ఇప్పుడు బడ్జెట్‌లో లక్ష ఉద్యోగాలను ప్రకటించడం ద్వారా ఆ హామీ అమలు దిశగా తొలి అడుగు వేసినట్లు ప్రభుత్వం స్పష్టమైన సంకేతం ఇచ్చింది. యువతకు ఉపాధి కల్పనతో పాటు, ఉద్యోగం దొరికే వరకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక సహాయ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది. బీజేపీ ఎన్నికల ప్రణాళికలోని ప్రధాన హామీల్లో ఇది ఒకటి. యువత ఉపాధి కోసం పారిశ్రామిక పెట్టుబడులు పెరిగి, ప్రైవేట్ రంగంలో భారీ స్థాయిలో ఉద్యోగాలు సృష్టి అయితేనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని భావించిన బీజేపీ ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో సంక్షేమంతో పాటు పెట్టుబడులపై కూడా సమాన దృష్టి పెట్టడం గమనార్హం.
గత రెండు దశాబ్దాలుగా పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్ వెనుకబడిందనే అభిప్రాయం ఉంది. దీనిని మార్చేందుకు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం “రూ.5,000 కోట్ల పెట్టుబడి ప్రోత్సాహక నిధిని” ఏర్పాటు చేసింది. అలాగే ఏఐ డేటా సెంటర్లు, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు, సెమీకండక్టర్ అనుబంధ పరిశ్రమలు, అధునాతన సేవారంగాలకు ప్రత్యేక ప్రోత్సాహక విధానాలను ప్రకటించింది. సింగిల్ విండో క్లియరెన్స్, 24గంటల వ్యాపార అనుమతులు, పెట్టుబడిదారులకు అనుకూలమైన పారిశ్రామిక విధానాల ద్వారా రాష్ట్రాన్ని తూర్పు భారతదేశంలో అతిపెద్ద పెట్టుబడి కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ముఖ్యమైన ఎన్నికల హామీ “సిండికేట్ రాజ” నిర్మూలన. పరిశ్రమలు, రియల్ ఎస్టేట్, చిన్న వ్యాపారాలపై స్థానిక స్థాయిలో ఏర్పడిన అక్రమ వసూళ్ల వ్యవస్థను పూర్తిగా తొలగిస్తామని బీజేపీ సంకల్ప పత్రంలో పేర్కొంది. ఈ బడ్జెట్‌లో పెట్టు బడుల ప్రోత్సాహంతో పాటు వ్యాపార నిర్వహణను సులభతరం చేసే చర్యలు, పరిశ్రమలకు వేగవంత మైన అనుమతులు, పెట్టుబడిదారులకు అనుకూల మైన పరిపాలనా విధానాలు తీసుకువస్తామని ప్రకటించిన ప్రభుత్వం, అక్రమాలకు చెక్ పెట్టేందుకు నడుం బిగించడంతో దళారుý గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మరో కీలక హామీ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం. వ్యవసాయ, అనుబంధ రంగాలకు బడ్జెట్‌లో సుమారు రూ.24,000 కోట్ల కేటాయింపుతో ప్రాధాన్యం కల్పించారు. సాగునీటి విస్తరణ, గ్రామీణ మౌలిక సదుపాయాలు, ఆహార ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజ్‌లు, మార్కెట్ అనుసంధానం వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులకు కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు అదనపు ఆర్థిక భరోసా కల్పిస్తామని సంకల్ప పత్రంలో పేర్కొంది. రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయ మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, నీటి పారుదల సదుపాయాలను విస్తరించడం, నిల్వ గిడ్డంగులు, శీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం వంటి అంశాలను కూడా ప్రధానంగా ప్రకటించింది. బడ్జెట్‌లో గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాగునీటి సదుపా యాల విస్తరణ, రైతులకు మార్కెట్ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రోత్సాహం వంటి అంశాలకు కేటాయింపులు చేయడం ద్వారా ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పరోక్షంగా బలోపేతం చేసే వ్యూహాన్ని అనుసరించింది.
మహిళా సాధికారత ఈ బడ్జెట్‌లో అత్యంత ప్రధానమైన అంశంగా నిలిచింది. మహిళలకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందిస్తామని, కుటుంబాల ఆర్థిక భద్రతను పెంచే ప్రత్యేక పథకాలను అమలు చేస్తామని ఎన్నికల సమయంలో బీజేపీ ప్రకటించింది. బడ్జెట్‌లో ‘అన్నపూర్ణ యోజన’కు రూ.36,000 కోట్ల భారీ కేటాయింపు చేయడం అంటే, ఆ హామీకి ఆర్థిక రూపం ఇచ్చినట్లే. ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం కరవుభత్యం (డీఏ) పెంపు ప్రకటించడం కూడా ఎన్నికలలో ఇచ్చిన హామీ నెరవేర్చడమే. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డీఏ సమస్యను పరిష్కరిస్తామని, వేతన వ్యవస్థలో ఉన్న అసమానతలను తొలగిస్తామని బీజేపీ తన సంకల్ప పత్రంలో హామీ ఇచ్చింది.
విద్యా రంగం విషయానికొస్తే, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ, మౌలిక వసతుల అభివృద్ధి, ఉన్నత విద్యలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. విద్య, క్రీడలు, కళలు, సాంస్కృతిక రంగాలకు కలిపి సుమారు రూ.50 వేల కోట్లకు బడ్జెట్ కేటాయింపుతో ప్రాధాన్యం కల్పించడం ద్వారా మానవవనరుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతోంది. కొత్త స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా క్రీడలను ఉపాధి అవకాశాలతో అనుసంధా నించే ప్రయత్నం చేసింది.
మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రభుత్వం దీర్ఘకాలిక పెట్టుబడిగా పరిగణించినట్లు బడ్జెట్ ద్వారా తెలుస్తోంది. చింగ్రీఘాట్`న్యూటౌన్ మధ్య రూ.900 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్, కల్యాణిలో కొత్త విమానాశ్రయం, పురూలియా, మాల్దా, బలూర్ ఘాట్‌లలో విమానాశ్రయాల అభివృద్ధి, పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్స్ నెట్‌వర్క్ బలోపేతం వంటి కార్యక్రమాలు రాష్ట్ర పారిశ్రామికీకరణకు కొత్త ఊపు తీసుకురానున్నాయి. ముఖ్యంగా ఉత్తర బెంగాల్ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. డార్జిలింగ్, కాలింపాంగ్, జల్పాయిగురి, ఆలీపుర్ దువార్, కూచ్‌బెహార్, ఉత్తర-దక్షిణ దినాజ్‌పూర్, మాల్దా జిల్లాలను సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్లేం దుకు ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికను ప్రకటించింది. పర్యాటకం, టీ పరిశ్రమ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, రహదారులు, లాజిస్టిక్స్, విమానా శ్రయాల అభివృద్ధి, సరిహద్దు ప్రాంతాల మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. బడ్జెట్‌లో ఉత్తర బెంగాల్ అభివృద్ధిని ప్రత్యేక ప్రాధాన్య రంగంగా ప్రకటించడాన్ని ప్రాంతీయ సమతుల్య అభివృద్ధి హామీ అమలుకు తొలి అడుగుగా భావించవచ్చు.
మొత్తంగా చూస్తే రూ.4.39 లక్షల కోట్ల బడ్జెట్‌లో మహిళల సంక్షేమానికి రూ.36,000 కోట్లు, పెట్టుబడుల ప్రోత్సాహానికి రూ.5,000 కోట్లు, లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మౌలిక సదుపాయాల కోసం భారీ ప్రాజెక్టులు, విద్యా రంగానికి రూ.50 వేల కోట్లకు పైగా వ్యయప్రాధాన్యం, వ్యవసాయానికి రూ.24 వేల కోట్లకుపైగా కేటాయింపులు వంటి చర్యల ద్వారా ఎన్నికల సమయంలో ప్రకటించిన “భరోషార్ షపథ్-సంకల్ప పత్ర”లోని ప్రధాన హామీల అమలు దిశగా తొలి బడ్జెట్‌లోనే బీజేపీ ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు కనిపిస్తోంది.
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తొలి పూర్తి స్థాయి బడ్జెట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఉంది. ఉపాధి, మహిళా సంక్షేమం, వ్యవసాయం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించిన ఈ బడ్జెట్ రాష్ట్ర ఆర్థిక పునరుద్ధరణకు, సమగ్ర అభివృద్ధికి పునాదివేస్తూ అన్ని రంగాల్లో పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి తోడ్పడగలదనే ఆశలు కలిగిస్తోంది.
– శ్రీపాద