హైడ్రా.. హిట్లర్.. ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉందా? హైడ్రాకు హిట్లరే ఆదర్శమా? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓ బహిరంగ వేదికపై చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. ఓవైపు రాజకీయంగా ప్రకంపనలు పుట్టిస్తుండగా, మరోవైపు ముఖ్యమంత్రి తీరుపై జనం కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ సదస్సులో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పేరుకు సంబంధించిన వివరణ ఇస్తూ, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలోనూ తీవ్ర చర్చకు దారితీశాయి.
హైదరాబాద్‌లో చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా రూపొం దించిన వ్యవస్థ ‘హైడ్రా’. ఇది ఏర్పాటైనప్పటి నుంచి దాని పనితీరు వివాదాస్పదంగానే కొనసాగుతోంది. చెరువులు, ప్రభుత్వ భూములు, పార్కులు, రహదా రులు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను తొలగించడంలో ఈ సంస్థ సమర్థంగా వ్యవహరిస్తోందని ప్రభుత్వం చెబుతుండగా, ప్రతిపక్షాలు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అంతేకాదు.. క్షేత్రస్థాయిలో నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు గూడు లేని వాళ్లుగా రోడ్డున పడుతున్నారన్న వాదనలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మరింత ప్రాధాన్యతను సంతరించు కున్నాయి.
బెంగళూరులో ఓ వార్తాసంస్థ నిర్వహించిన ఒక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా గురించి మాట్లాడుతూ.. “హైడ్రా” అనే పదానికి హిట్లర్‌తో సంబంధం ఉందని పేర్కొన్నారు. హిట్లర్ కోర్ టీమ్ పేరు హైడ్రా అని, అదే స్ఫూర్తితో తెలంగాణలో హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేశామని వ్యాఖ్యానిం చారు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు లేవనెత్తాయి. ప్రపంచ చరిత్రలో అత్యంత వివాదాస్పద వ్యక్తుల్లో ఒకడైన అడాల్ఫ్ హిట్లర్ పేరును ఒక ప్రజాస్వామ్య దేశంలోని ముఖ్యమంత్రి ప్రస్తావించడం సహజంగానే చర్చకు దారి తీసింది. ముఖ్యంగా ప్రజా ఆస్తుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంస్థను హిట్లర్‌తో అనుసంధానం చేయడం వివాదాస్పదంగా మారింది.
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA)ను తెలంగాణ ప్రభుత్వం 2024లో ఏర్పాటు చేసింది. చెరువులు, కుంటలు, నదులు, ప్రభుత్వ భూములు, పార్కులు వంటి ప్రజా ఆస్తులను ఆక్రమణల నుంచి రక్షించడం దీని ప్రధాన లక్ష్యంగా ప్రకటించారు. అక్రమ నిర్మాణాల తొలగింపు, ఆక్రమణల నిర్మూలన వంటి అంశాల్లో ఈ సంస్థ కీలకంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం వివరణ ప్రకారం వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు, జలవనరులను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో హైడ్రాను ఓ వాహకంగా ప్రభుత్వం వినియోగించుకుంటోంది. ఈ క్రమంలోనే హైడ్రాకు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టింది. ఆ అధికారాలను అడ్డం పెట్టుకొని హైడ్రా హద్దులు దాటుతోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. పలుమార్లు న్యాయస్థానాల నుంచి మొట్టికాయలు కూడా పడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో హైకోర్టు కూడా హైడ్రా చర్యలపై ప్రశ్నలు లేవనెత్తింది. అయినప్పటికీ.. నిర్మాణాల కూల్చివేతల సమయంలో నోటీసులు, న్యాయపరమైన ప్రక్రియలు పాటించడం లేదన్న ఆరోపణలు తొలినుంచీ వస్తున్నాయి.
రాష్ట్రంలో హిట్లర్ వేడి
హిట్లర్ స్ఫూర్తితోనే ‘హైడ్రా’ ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టించాయి. రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ, బీఆరఎస్‌లు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. హిట్లర్, తుగ్లక్ కలిస్తే రేవంత్‌రెడ్డి అని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డికి హిట్లర్ స్ఫూర్తి అని బీఆరఎస్ విమర్శించింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రమాద కరమైన హిట్లర్, ఎమర్జెన్సీ మైండ్‌సెట్ మరోసారి బహిర్గతం అయ్యిందన్నారు. యుద్ధంతో అతలాకుతల మైన ఇరాన్, ఇజ్రాయెల్ వంటి దేశాలలో జరిగే విధ్వంసాలతో హైదరాబాద్‌లోని కూల్చివేతలను పోలుస్తూ..తన నాయకుడు రాహుల్ గాంధీ భాషలోనే రేవంత్‌రెడ్డి కూడా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎమర్జెన్సీ రోజుల నుండి హిట్లర్ దాకా కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల గొంతు నొక్కడానికే ప్రయత్నించిందని ఆరోపించారు. హిట్లర్ నుంచి స్ఫూర్తి పొందినట్లు బహిరంగంగా చెప్పడం ఆందోళనకరమని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి సిగ్గుతో తలదించుకోవాలని, తెలంగాణ ప్రజలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మరింత ఘాటుగా స్పందించారు. హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకున్నవారికి చరిత్రలో ఏర్పడిన పరిణామాలే ఎదురవుతాయని హెచ్చరించారు. హిట్లర్‌ను అనుసరిస్తున్న రేవంత్‌రెడ్డికి కూడా హిట్లర్‌కు పట్టిన గతే పడుతుందన్నారు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే సీఎం గ్రామాల్లో తిరగలేరని హెచ్చరించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. మరోవైపు.. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. హిట్లర్, తుగ్లక్ ఇద్దరి లక్షణాలు కలిసిన నాయకత్వంలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హైడ్రా పేరుతో పేదలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ, హైడ్రా ఒక ‘హంతక ముఠా’లా పనిచేస్తోందని బీఆరఎస్ పార్టీ కార్యనిర్వాక అధ్యక్షుడు కె.తారకరామారావు ఆరోపించారు. ప్రజల ఇళ్ల కూల్చివేతలను గొప్పగా చెప్పుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. రేవంత్ డిక్టేటర్లను పూజిస్తారƒని, కూల్చివేతల గురించి గొప్పలు చెప్పుకుంటారƒని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలకు ఈ విషయం ముందే తెలుసని, రేవంత్ రెడ్డి మనస్తత్వం ఇప్పుడు దేశం మొత్తం ముందు బయటపడిందని విమర్శించారు.
జాతీయ స్థాయిలోనూ చర్చ
ముఖ్యమంత్రి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాలేదు. ఈ అంశంపై జాతీయ స్థాయిలోనూ చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి అనూహ్యంగా హిట్లర్‌ను కీర్తించడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ విషయంపై స్పందిస్తూ, ఇవే వ్యాఖ్యలు ఒక బీజేపీ ముఖ్యమంత్రి చేసి ఉంటే దేశవ్యాప్తంగా ఫాసిజం, నాజీయిజం ఆరోపణలు వచ్చేవని అన్నారు.
జాతీయ మీడియా కూడా దీనిపై కథనాలు ప్రచురించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పనిచేస్తున్న ప్రభుత్వ సంస్థను హిట్లర్‌తో అనుసంధానం చేయడం సరైనదేనా? అనే ప్రశ్నలను లేవనెత్తింది. కొందరు విశ్లేషకులు దీనిని రాజకీయ అతిశయోక్తిగా అభి వర్ణించగా, మరికొందరు ప్రజా నాయకులు చారిత్రక అంశాలపై మరింత జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు.
చరిత్రకారులు ఏమంటున్నారు?
ఈ వివాదంలో మరో ఆసక్తికర అంశం చూస్తే.. చారిత్రక వాస్తవాలపై జరిగిన చర్చ. కొన్ని వార్తా సంస్థలు, చరిత్రకారుల అభిప్రాయాలను ఉటంకిస్తూ హిట్లర్ కోర్ టీమ్‌కు “హైడ్రా” అనే పేరు ఉన్నట్లు ఆధారాలు లేవని పేర్కొన్నాయి. వాస్తవానికి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ నిర్వహించిన “ఆపరేషన్ హైడ్రా” అనే సైనిక చర్య చరిత్రలో ఉంది. అలాగే పాపులర్ కల్చర్‌లో, ముఖ్యంగా మార్వెల్ కామిక్స్, సినిమాల్లో “హైడ్రా” అనే కల్పిత నియో-ఫాసిస్ట్ సంస్థ ప్రసిద్ధి చెందింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో ఈ రెండు అంశాలు కలగలిసిపోయి ఉండవచ్చన్న విశ్లేషణలు కూడా వెలువడ్డాయి.
హైడ్రా చుట్టూ వివాదాలు
హైడ్రా ఏర్పాటైనప్పటి నుంచి అనేక వివాదాలు ఎదుర్కొంటోంది. అక్రమ నిర్మాణాల తొలగింపు చర్యల్లో దుందుడుకు చర్యలు ఆందోళనకు కారణ మయ్యాయి. ఒకవైపు చెరువులు, నదులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం కఠిన చర్యలు అవసరమని ప్రభుత్వం వాదిస్తోంది. మరోవైపు ఆ చర్యల్లో పారదర్శకత, నోటీసులు, న్యాయపరమైన ప్రక్రియలు పాటించడం లేదని విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంపై కూడా హైడ్రా ప్రభావం పడిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు హిట్లర్ వ్యాఖ్యల నేపథ్యంలో హైడ్రా చుట్టూ ఇప్పటికే అలుముకున్న వివాదం మరింత పెరిగింది. హైడ్రా వివాదం, హిట్లర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ చరిత్రతో అనుసంధానం చేస్తూ బీజేపీ విమర్శిస్తోంది. మరోవైపు.. బీఆరఎస్ హైడ్రా చర్యల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే వాదనను ముందుకు తెస్తోంది. ఈ వివాదం భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో చర్చల్లో కూడా ప్రధానంగా ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది.
ప్రజాస్వామ్యంలో నాయకులు చేసే ప్రతి వ్యాఖ్యకు ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా చరిత్రలో వివాదాస్పద వ్యక్తుల పేర్లు ప్రస్తావించి నప్పుడు మరింత జాగ్రత్త అవసరం. అది కూడా రాజ్యాంగయుత పదవుల్లో ఉన్నవాళ్లు చేసే వ్యాఖ్యలు మరింత చర్చకు కారణమవుతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న హైడ్రా-హిట్లర్ వివాదం కూడా దీనికి నిదర్శనంగా నిలుస్తోంది.
మొత్తానికి హైడ్రా పేరుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు నాంది పలికాయి. ప్రతిపక్షాలు బీజేపీ, బీఆరఎస్ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేయగా, చరిత్రకారులు కూడా రేవంత్ వ్యాఖ్యల చారిత్రక ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తారు. మరోవైపు హైడ్రా పనితీరు, కూల్చివేతలు, ప్రజా ఆస్తుల పరిరక్షణ వంటి అంశాలు మళ్లీ చర్చకు వచ్చాయి. అయితే, ఈ వివాదం చివరికి ఒక కీలక ప్రశ్నను ముందుకు తెచ్చింది. ప్రజా ఆస్తుల పరిరక్షణ కోసం కఠిన చర్యలు అవసరమా? అవసరమైతే అవి ప్రజాస్వామ్య విలువలు, న్యాయపరమైన ప్రక్రియల పరిధిలోనే కొనసాగుతున్నాయా? ఈ ప్రశ్నలు భవిష్యత్తులో హైడ్రా పనితీరు, తెలంగాణ రాజకీయా లపై ప్రజల తీర్పును నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది.
సుజాత గోపగోని
సీనియర్ జర్నలిస్ట్, 6302164068