భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
– గోవిందరాజు చక్రధర్
రాకేశ్‌ను అమెరికా విమానం ఎక్కించి వచ్చిన ఆ తల్లిదండ్రులకు మనసు మనసులో లేదు. తమ కుటుంబంలోను దగ్గరి బంధువుల్లోనూ ఇప్పటివరకూ ఎవరూ దేశం బయట కాలు పెట్టలేదు. అలాంటిది తమ కొడుకు ఏకంగా అమెరికాలో అడుగుపెడుతున్నాడు. రంగమ్మ, రాజయ్య దంపతులకు ఒకింత గర్వంగా ఉంది.
మా అబ్బాయి పైచదువులకు అమెరికా వెళ్లాడు. ఇంకేముంది, ఇట్లా చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించేస్తాడు. అక్కడే స్థిరపడతాడు అని రాజయ్య మనసులోనే పొంగిపోతున్నాడు.
ఎయిర్‌పోర్ట్‌లో సెండాఫ్ చెప్పటానికి తమతో పాటు కూతురు అల్లుడు కూడా వచ్చారు. ఎయిర్‌పోర్ట్ పేరు వినటమే గానీ అక్కడ అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. చెకిన్ అయ్యాక రాకేష్ దూరం నుంచే చెయ్యి ఊపుతూ కళ్లముందు నుంచి కదిలి వెళ్తుంటే దిగాలుగా చూస్తుండిపోయారా దంపతులు.
భారంగా అడుగులు వేస్తూ వెనక్కి తిరిగారు. ‘మీ అమ్మ చెయ్యి కాస్త పట్టుకుని నడిపించవే. ఈ మధ్య కళ్లు సరిగా కనిపించడంలేదు’ అన్నాడు రాజయ్య కూతురు కావ్యతో.
‘అది సరేగానీ, అమ్మకి కంటి ఆపరేషన్ ఎప్పుడు చేయిస్తున్నావు? శుక్లం ముదర లేదంటూ ఇంకెన్నాళ్లు కూచుంటావు? అయినా ఇప్పుడు చిటికెలో లేజర్‌తో కంటి ఆపరేషన్లు చేస్తున్నారు.’ తండ్రిని మందలిం చింది కావ్య.
‘చేయిద్దాం తల్లీ! ఇప్పటిదాకా రాకేష్ హడావిడి తోనే సరిపోయింది. ఇక అంతా ఖాళీయే’ రాజయ్య కూతురుకు సర్ది చెప్తున్నా, డబ్బు లేక ఆపరేషన్ వాయిదా పడుతోందన్న చేదు వాస్తవం ఆ తండ్రీ కూతుళ్లకు తెలియంది కాదు.
రాజయ్య దంపతులను ఇంటి దగ్గర దింపి వెళ్లారు కూతురు, అల్లుడు. అప్పటి నుంచి క్షణమొక యుగంలా గడుపుతూ వచ్చారు. ముప్పై గంటలు గడుస్తున్నా రాకేష్ నుంచి ఫోను రాకపోవడంతో రాజయ్యలో ఆందోళన మొదలైంది. మనసు పరిపరి విధాల పోతోంది. గాల్లోకి లేచిన విమానం క్షేమంగా అమెరికాలో దిగిందా? అనే ఆలోచన బుర్రను తొలుస్తోంది.
‘చేరతాడు లేవయ్యా! నీకంతా కంగారు’ అంటూ రంగమ్మ ధైర్యం చెప్తోంది.
‘నాన్నా! తమ్ముడు ఫోను చేశాడా? చేయగానే నాకు చెప్పు’ అంటూ కూతురు పది నిమిషాలకోసారి ఫోను చేస్తూ కంగారును మరింత పెంచుతోంది.
చివరికి వారి నిరీక్షణ ఫలించి రాకేష్ నుంచి ఫోనొచ్చింది క్షేమంగా చేరానని. రంగమ్మ, రాజయ్యల మనసు కుదుటపడింది.
రాకేష్ దాదాపు ప్రతిరోజూ ఫోను చేస్తూనే ఉన్నాడు. ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే మన తెలుగు స్టూడెంట్స్ వచ్చి తీసుకెళ్లారని, ఒకటి రెండు రోజులు వాళ్లతోనే కలిసి ఉండి వేరే ఫ్రెండ్స్‌తో రూము తీసుకున్నానని చెప్పాడు. యూనివర్సిటీలో అడ్మిషన్ పూర్తయిందని, చాలామంది తెలుగు విద్యార్థులు పరిచయం అయ్యారని మరుసటిరోజు కబురు. అమెరికా వాతావరణం, వారి మనస్తత్వం. బహిరంగ ప్రదేశాల్లో వాళ్లు పాటించే క్రమశిక్షణ గురించి కళ్లకు కట్టించాడు. అమెరికన్ల ఇంగ్లీషు అర్థం చేసుకోవడం మొదట్లో కాస్తంత కష్టమైందని, ఇప్పుడిప్పుడే బాగా అర్థమవుతోందని, తను కూడా ఇంగ్లీషును ధారాళంగా మాట్లాడగలుగుతున్నానని చెప్తుంటే, ఆపన్న హృదయాలు ఆనందించాయి.
రోజూ రాకేష్ ఫోను కోసం ఎదురు చూడటం అలవాటయిపోయింది. దుకాణంలో ఖాళీగానే ఉంటున్నాడు. ఈ మధ్య వచ్చే జనం బాగా తగ్గారు. ఇది కూడా ఒక రకంగా మంచిదే, ఏ ఆటంకాలు లేకుండా కొడుకుతో ఫోనులో మాట్లాడగలుగుతు న్నానని కూడా ఆనందపడ్డాడు.
ఆ రోజు యథాప్రకారం రాకేష్ నుంచి ఫోను వచ్చింది. ‘రెండేళ్లంటే ఏముంది! చిటికెలో అయిపోవూ! కోర్సు పూర్తవగానే జాబ్ చూసుకుంటా. నువ్వూ అమ్మ కూడా అమెరికాకు వచ్చి విజిటింగ్ వీసాపై ఆర్నెల్లు ఉండి వెళ్లచ్చు. కాలం కలిసొస్తే గ్రీన్‌కార్డ్‌పై మీరు కూడా నాతోపాటే అక్కడే సెటిలవ్వచ్చు. మీరు కూడా ఇప్పటిదాకా ఎక్కడికీ కదలలేదు. రాకేష్ మాటలు రాజయ్యకు సంతోషానిచ్చాయి.
నిజానికి అమెరికా చూడాలన్న ఉత్సాహమేదీ రాజయ్యకు లేదు. కొడుకు ప్రయోజకుడవుతు న్నందుకు మహదానందపడ్డాడు. రాకేష్, వాళ్లమ్మతో మాట్లాడాతానంటే ఆవిడకు ఫోను ఇచ్చి దుకాణం మూసెయ్యటానికి నెమ్మదిగా లేచాడు రాజయ్య.
దుకాణం ముందు బైకు ఆగిన శబ్దం. ఈ వేళలో ఎవరా! అని తేరిపార చూశాడు. బైకు స్టాండువేసి వస్తున్న వీరాస్వామి కన్పించాడు.‘ఏమండీ రాజయ్య గారూ! ఎలా ఉన్నారు? మీ వాడు ఎలా ఉన్నాడు? ఫోను చేస్తున్నాడా?’ అంటూ మాటల్లోకి దింపాడు వీరాస్వామి.
‘చేస్తున్నాడు స్వామీ! ఇప్పుడే వాడితో మాట్లాడాను. అంతా బాగానే ఉంది. మమ్మల్ని కూడా అమెరికా తీసుకెళ్తాట్ట. మాకు అదొక్కటే తక్కువ’ అన్నాడు సంబరంగా రాజయ్య.
‘మీరూ అమెరికా చూసిరండి. అందరికీ ఈ ఛాన్స్ దొరుకుతుందా? ఇప్పుడు నేను పోవాలంటే పోగలనా చెప్పు? అక్కడ ఒక డాలరు సంపాదిస్తే మనూళ్లో వంద రూపాయలు సంపాదించినట్టేట గదా! అక్కడ వడ్డీలెట్టా ఉంటాయో?’ వీరాస్వామి అటూ ఇటూ తిప్పి తన వడ్డీ వ్యాపారంవైపు దారి మళ్లించాడు.
‘ఏమో స్వామీ! ఆ వడ్డీ లెక్కలూ అవీ నాకు ఎట్టా తెలుస్తాయి? నీ వడ్డి లెక్క ఒక్కటే ఎరిక. ఏమైనా నువ్వు సమయానికి ఆదుకోబట్టే మావాడు అమెరికా వెళ్లగలిగాడు’ రాజయ్య కృతజ్ఞతగా అన్నాడు.
ఇదే మంచి అదనుగా తోచింది వీరాస్వామికి. చల్లకొచ్చి ముంత దాచట మెందుకనుకున్నాడు. వీరస్వామికి అసలు కంటే కొసరు ముద్దు. అసలు, గడుపులోగా ఇవ్వకున్నా భరిస్తాడు. ఏ నెలకానెల వడ్డీ చేతిలో పడకపోతే ఒంటిమీద తేళ్లూ, జెర్రులూ పాకినట్లుంటాయి వీరాస్వామికి. ఏ నెలకానెల పోగయిన వడ్డీ డబ్బుల్ని మళ్లీ మరొకరికి అప్పుగా ఇస్తాడు. ఇలా వీరస్వామి రొటేషన్ సొమ్ము నెనెలా పెరుగుతూ వడ్డీ వ్యాపారం మూడు అప్పులు ఆరు వడ్డీలుగా వర్ధిల్లు తోంది.
అప్పు ఇచ్చేటప్పుడే రెండు నెలల వడ్డీ మొత్తాన్ని వీరాస్వామి మినహాయించుకున్నాడు.రెండు నెలలవరకు వెసులుబాటు ఉందిలే అని రాజయ్య ప్రశాంతంగా ఉన్నాడు. అయితే వీరాస్వామి మాత్రం అలా ఎవరినీ ప్రశాంతంగా ఉండనివ్వడు. అదే అతడి వ్యాపార విజయసూత్రం.
‘వడ్డీ సంగతి గుర్తు చేసి వెళ్దామని వచ్చా రాజయ్యా! డబ్బు తీసుకుని రెండు నెలలవుతోంది’ అన్నాడు సున్నితంగా హెచ్చరిస్తూ.
‘రెండు నెలల వడ్డీ ముందే మినహాయించు కున్నావుగదా! మరొక నెల గడిచాక కదా, మేం వడ్డీ కట్టాల్సింది’ అన్నాడు రాజయ్య నిలదీస్తున్న ధోరణిలో.
పట్టు విడుపులు వీరాస్వామికి అప్పుతో పుట్టిన విద్య. ఎప్పుడు తగ్గాలో మరెప్పుడు నెగ్గాలో అతగాడికి కొట్టిన పిండి.
‘కాదని ఎవరన్నారు? అటు పోతూ ఒకసారి గుర్తుచేద్దామని ఆగా. అంత మాత్రానికే కోపం తెచ్చుకుంటే ఎట్టా?’ అంటూ బైకు దగ్గరకు రెండు అడుగులు వేసినవాడు వెనక్కి వచ్చి- ‘మర్చేపోయా! మాయావిడ బియ్యం తెమ్మంది. పది కిలోల సోనా మసూరి ఇవ్వు’ అన్నాడు వీరాస్వామి ధాటిగా. రాజయ్య బియ్యం తూచి పాత సంచిలో పోసి మూట గట్టి ఇచ్చాడు. డబ్బులిస్తాడని ఎదురు చూస్తున్న సమయంలో ‘వద్దు పద్దు రాసుకో రాజయ్యా!’ అంటూ సమాధానం కోసం కూడా చూడకుండా బైకు స్టార్ట్ చేసుకుని క్షణాల్లో మాయమయ్యాడు.
* * *
రాజయ్యకు తండ్రి నుంచి నాలుగు ఎకరాల పొలం, విశాలమైన పెరడుతో పెంకుటిల్లు సంక్రమించింది. అంతంత మాత్రం వానాకాలం చదువు, వ్యవసాయం తప్ప మరో పని చేతకాని రాజయ్య విధిలేని పరిస్థితుల్లో వ్యాపారంలోకి దిగాల్సి వచ్చింది. రెండెకరాలు అమ్మి కూతురు కావ్య పెళ్లి చేశాడు. మిగిలిన రెండెకరాల్లో రాబడి అంతంత మాత్రమే. రేటు బాగా ఉందని ఒక ఏడాది మిర్చివేస్తే, తామర తెగులొచ్చి నష్టాల్లో కూరుకుపోయాడు. ఆ తర్వాత టమాటా వేసినా, రేటు పడిపోయి రోడ్డుమీద పారబోయాల్సి వచ్చింది. తెచ్చిన అప్పులు ఎట్లా తీర్చాలో, కుటుంబాన్ని ఎట్లా పోషించాలో, కొడుకు కాలేజి ఫీజులు ఎట్లా కట్టాలో అంతు చిక్కక ఆ రెండెకరాలను రెండు విడతలుగా అమ్మేశాడు.
వ్యవసాయం చేస్తూ స్వతంత్రంగా బతుకీడుస్తున్న రాజయ్యకు ఏం చేయాలో పాలుపోలేదు. అప్పుడెవరో సలహా ఇచ్చారు. మన చుట్టుపక్కల కిరాణా దుకాణం లేదు. మీ ఇంటి వసారాలో కిరాణా సరుకులు అమ్మచ్చు గదా అని. ఆ సలహా రాజయ్యకు నచ్చింది. ఇప్పటి మాదిరే సర్వస్వతంత్రంగా బతకవచ్చునను కున్నాడు. ఇంటి వసారాకు చుట్టూ గోడ కట్టించి, విశాలమైన తలుపులు చేయించాడు. రాజయ్య కిరాణా దుకాణం అని బోర్డు పెట్టించాడు. దగ్గర్లోనే ఉన్న పట్నానికి మోపెడ్‌పై వెళ్లి హోల్‌సెల్ కొట్లో సరుకులు కొనుక్కొచ్చాడు. ఏదీ లేదన్న మాట రాకూడదని పిన్నీసుల నుంచి పేస్టుల దాకా సమస్తం అందుబాటులో ఉంచాడు.
కొడుకు రాకేష్ పట్నం కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతో తీరుబడి లేకుండా ఉండేవాడు. దీంతో చేతికింద శాయిలుకు పెట్టుకున్నాడు. టెన్త్ తప్పిన శాయిలు పిలిచినప్పుడు పొలం పన్లకు వచ్చేవాడు. ఆ పరిచయంతో రాజయ్య అడగ్గానే నెల జీతం మీద కుదిరాడు. పట్నం వెళ్లి సరుకులు తేవడం, వాటిని పొట్లాలు కట్టివ్వడంలో చేదోడుగా ఉండేవాడు శాయిలు.
దగ్గర్లో మరో దుకాణమేదీ లేకపోవడంతో కొద్దిరోజుల్లోనే వ్యాపారం పుంజుకుంది. ఉదయం ఆరింటికి దుకాణం తెరిచిన దగ్గర్నుంచీ రాత్రి పదింటికి కట్టేసేవరకూ క్షణం తీరుబడి ఉండేది కాదు. మధ్యాహ్నం వేళలో రెండు గంటలపాటు రద్దీ తగ్గేది. ఆ టైములో దుకాణం కట్టేసి, భోంచేసి కాసేపు నడుం వాల్చేవాడు. శాయిలు కూడా ఇంటికివెళ్లి తినొచ్చేవాడు. ఇల్లూ, దుకాణం ఒకటే కావడంతో అర్ధరాత్రి, అపరాత్రి అయినా తలుపు తడుతుండేవారు.
తూకం వేసి న్యూస్‌పేపర్‌లో పొట్లాలు కట్టడం మొదట్లో కష్టంగా ఉండేది. సరుకులకు డబ్బు లెక్కేసి తీసుకుని మిగిలిన చిల్లర ఇవ్వటానికి తడబడేవాడు. నెమ్మదిగా అలవాటయి ఒడుపు సాధించాడు. పొట్లాలు కట్టే బదులు, ప్లాస్టిక్ సంచులు సులువని ఎవరో చెప్తే రెండు మూడురకాల సైజుల్లో సంచులు తెచ్చి వాటిల్లో నింపి ఇచ్చేవాడు. పోటీ లేకపోవడం, వ్యక్తిగత పరిచయాలుండటంతో ఉప్పూ పప్పు కోసం ప్రతివారూ రాజయ్య దుకాణానికే వచ్చేవారు. వ్యాపారంలో కుదురుకున్నాడు. కుటుంబానికి ఏ లోటూ లేకుండా సాగుతోంది.
కాలంతోపాటు చాపకింద నీరులా మార్పు లొచ్చాయి. పట్టణం విస్తరిస్తూ గ్రామంలోకీ చొరబడింది. కొత్త కాలనీలు వచ్చాయి. గ్రామం పట్టణంలో భాగమైంది. రియల్ ఎస్టేట్ యజమాని భార్య పేరుతో అక్కడ సౌభాగ్యపురం వె•లిసింది. రాజయ్యకు పోటీగా పక్కనే మరో కిరాణా దుకాణం వచ్చింది. ఉత్తరాది నుంచి వచ్చిన కుటుంబం ఆ దుకాణం తెరిచింది. మొదట్లో వారికి హిందీ తప్ప తెలుగు వచ్చేది కాదు. తొందర్లోనే తెలుగు అర్థం చేసుకోగల స్థితికి వచ్చాడు సేఠ్. పొడిపొడిగా మాట్లాడటమూ నేర్చాడు. వస్తూనే సొంత ఊరి నుంచి దూరపు బంధువును పిలిపించుకున్నాడు. రేయింబవళ్లూ ఇద్దరూ దుకాణం మీదే ధ్యాస నిలిపి పనిచేసేవారు. మధ్యాహ్నం పూట కూడా దుకాణం తెరిచే ఉండేది. సేఠ్, అతని సహాయకుడు భోజనానికి వెళ్లిన ఆ కాసేపు సేఠ్ భార్య దుకాణంలో కూచునేది. దుకాణం మొదలైన రోజే ‘అప్పురేపు’ అని తెలుగు తెలిసినవారి చేత పలకపై రాయించి కౌంటర్‌లో వేలాడదీశాడు.
రాజయ్య కూడా మొదట్లో ఎవరికీ అప్పులు ఇచ్చే వాడు కాదు. కానీ కాలం గడిచే కొద్దీ తెలీకుండానే బాకీలు ఇవ్వాల్సి వచ్చేది. ఐదొందల రూపాయల సరుకు తీసుకుని మూడొందలు ఇచ్చి మిగతాది ఖాతాలో రాసుకోమనేవారు. ఎక్కడికి పోతారులే, ఉన్నప్పుడిస్తారు అనే భరోసాతో కాదనలేక పోయేవాడు. వ్యాపారంలోకి దిగినా, పుట్టుకతో వచ్చిన రైతు ఉదార మనస్తత్వం రాజయ్యను నిర్మొహమాటంగా ఉండనివ్వలేదు. ఒకరిని చూసి మరొకరు బాకీ పెట్టటం నేర్చారు. వ్యాపారం జోరుగా సాగినా గల్లాపెట్టెలో మాత్రం డబ్బుండేది కాదు. పట్నంలో సరుకులు తేవడానికి కూడా చేతిలో పైసలు ఆడేవి కావు. ఇక ఇలాగైతే లాభం లేదనుకుని పాత బాకీ తీరిస్తేనే సరుకులు ఇచ్చేదని రాజయ్య తెగేసి చెప్పేసరికి ఒక్కొక్కరూ ముఖం చాటేశారు. ఉత్తరాది సేఠ్ దుకాణం పుంజుకుంది. రాజయ్య బాకీ ఎగ్గొట్టిన వారి ఆటలు మాత్రం సేఠ్ ముందు సాగలేదు. డబ్బిచ్చి సరుకు పట్టుకెళ్లేవారు.
కొత్త కాలనీలతోపాటే పట్నం కళ వచ్చేసిందా గ్రామానికి. జనాభా పెరిగింది. దాంతోపాటే పలు రకాల దుకాణాలు పుట్టుకొచ్చాయి. నగలు, బట్టల దుకాణాలు, టూవీలర్, ఫోర్‌వీలర్ షోరూమ్‌లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, కొరియర్ సర్వీసులు – ఇలా దేనికీ కొదవ లేకుండా వ్యాపారాలు విస్తరించాయి. మిగతా వాటి మాటెలా ఉన్నా కొత్తగా వచ్చిన సూపర్ మార్కెట్, రాజయ్య వ్యాపారాన్ని పూర్తిగా దెబ్బ తీసింది. జనాల అభిరుచిలో మార్పు రావడం, మార్కెట్‌ను ముంచెత్తిన పలు రకాల బ్రాండ్లు అక్కడ దొరకడంతో సూపర్ మార్కెట్ అయస్కాంతంలా ప్రజలను ఆకర్షించింది. శాయిలు కూడా రాజయ్యకు గుడ్‌బై చెప్పి, సూపర్‌బజార్‌లో సూపర్‌వైజర్‌గా చేరాడు.
రాజయ్య ఒంటరివాడయ్యాడు. ఓపికున్న రోజున పట్నం వెళ్లి సరుకులు తెచ్చేవాడు. ఉత్తరాది సేఠ్‌కి సూపర్ బజార్ తాకిడి కొంత తగలకపోలేదు. కానీ డిస్కౌంట్ ఆఫర్లతో తన ఖాతాదారుల్ని చాలావరకు నిలుపుకోగలిగాడు. మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ వచ్చిన సేఠ్, ఊరి నుంచి మరో బంధువుని పిలిపించి, హార్డ్‌వేర్, పెయింట్స్‌షాపు మొదలు పెట్టాడు. ఇళ్ల నిర్మాణాలు బాగా సాగుతుండటంతో హార్డ్‌వేర్ దుకాణానికీ గిరాకీ పెరిగింది.
ఇంజినీరింగ్ ఫైనలియర్ కొచ్చినప్పటి నుంచి రాకేష్‌కి అమెరికాపై ధ్యాస మళ్లింది. తన ఫ్రెండ్సందరూ అమెరికాలో ఎం.ఎస్. చేయాలను కుంటుంటే తానూ వెళ్లాలని సంకల్పం పూనాడు. చివరి సెమిస్టర్ నుంచే టోఫెల్, జీఆర్‌ఇ కోచింగ్‌లకు వెళ్లటం మొదలుపెట్టాడు. వాటిని తేలిగ్గానే క్లియర్ చేయటం కొత్త ఉత్సాహాన్నిచ్చింది. కోచింగుల కోసం డబ్బులు కావాలనేవాడు. వేరే దారి లేక రంగమ్మ ఒంటిమీద బంగారం అమ్మి కొడుకు చేతిలో పోశాడు. అమెరికా యూనివర్సిటీలకు అప్లికేషన్‌లు, ఫీజులకు, కొరియర్లకు లక్ష రూపాయలపైనే ఖర్చయింది.
రాకేష్ అదృష్టం బావుండి, ఒక యూనివర్సిటీలో సీటొచ్చింది. ఇక ఆ దిశలో వెనక్కి లాగి లాభం లేదనుకున్నాడు రాజయ్య. బ్యాంకులో ఎడ్యుకేషన్ లోన్ కూడా తేలిగ్గానే వచ్చింది. కాకుంటే విమాన టికెట్లకు, అమెరికాలో ఏడాదిపాటు నెలవారీ తిండి, వసతి ఖర్చులకు డబ్బు సమకూర్చుకోవలసి వచ్చింది. అందుకోసం వీరాస్వామిని ఆశ్రయించాల్సి వచ్చింది. రెండు రూపాయల వడ్డీకి పదిలక్షల దాకా అప్పు తీసుకున్నారు. తిన్నా తినకున్నా వడ్డీ కింద నెలనెలా ఇరవై వేల రూపాయలు కట్టాల్సి వచ్చింది.
* * *
కొడుకు అమెరికా వెళ్లాడన్న సంతోషం లేకుండా చేస్తున్నాడు వీరాస్వామి. వడ్డీకోసం ప్రతి నెలా వచ్చి పీకల మీద కూచుంటున్నాడు. తప్పని పరిస్థితుల్లో అల్లుడు దగ్గర తీసుకుని ఒక నెల వడ్డీ కట్టాడు. ఇంకో నెల వరకూ ఊపిరి పీల్చుకోవచ్చు ననుకున్నాడు.
మొదట్లో రాకేష్‌కు విషయం చెప్పకుండా దాటవేయాలని చూశాడు రాజయ్య. ఇక్కడి సమస్యలన్నీ ఏకరువు పెడుతుంటే కొడుకు చదువు ప్రశాంతంగా సాగదనుకునేవాడు. ఇక ఒత్తిడి తట్టుకో లేక, మార్గాంతరం లేక రాకేష్‌కు ఉన్న విషయం చెప్పక తప్పలేదు.
‘వీరాస్వామి వడ్డీకోసం రోజూ తిరిగి పోతు న్నాడురా. రెండు నెల్లు బాకీ పడ్డాం. నాకు వెసులు బాటు కావటంలేదు. రాజయ్య పళ్ల బిగువున చెప్పాడు.
రాకేష్‌కి పరిస్థితి అర్థమైంది. ‘అసిస్టెన్స్‌షిప్ వచ్చేట్లుంది నాన్నా! అదొస్తే ఇక ఏ సమస్యా ఉండదు. కొంత నా ఖర్చులకుపోయినా, మిగిలింది పంపగలను. వడ్డీ పోను మిగిలిన పైకం మీరు వాడుకోవచ్చు’. రాకేష్ మాటలతో రాజయ్యకు కొండంత భరోసా కలిగింది.
ఆ తర్వాత ఇరవై రోజులకే రాకేష్ అమెరికా నుంచి రాజయ్య బ్యాంకు అకౌంట్‌కి డబ్బు పంపాడు. రాజయ్య మనసు కుదుటపడింది. ఆ రోజే డబ్బు డ్రా చేసి, వీరాస్వామికి ఫోను చేసి మరీ పిలిచి వడ్డీ బకాయి తీర్చేశాడు.
పెరట్లో కాచిన కూరగాయలతో రంగమ్మ వంట అయిందనిపిస్తోంది. రాజయ్య కిరాణా దుకాణం మూతపడే స్థితికి వచ్చింది. ఒకరిద్దరు తప్పించి ఎవరూ దుకాణంవైపే రావట్లేదు. కొత్త సరుకు తేవటానికి డబ్బు సమకూర్చుకోలేకపోతున్నాడు. తిప్పలు పడి ఎలాగో అలా తెచ్చినా అమ్ముడు పోతుందన్న నమ్మకం కన్పించడంలేదు. ఖాళీగా కూచోవడం విసుగనిపించి, రంగమ్మకు దుకాణం అప్పగించాడు.
శుక్లాలు ముదిరి రంగమ్మకు కంటిచూపు ఆనడంలేదు. కొంతమంది ఆకతాయిలు ఇదే అదనుగా తీసుకుని దుకాణంలో అడుగుబొడుగు మిగిలిన సామానును దొంగ నోట్లిచ్చి పట్టుకెళ్లారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు, ఆ నోట్లు తీసుకుని మార్కెట్ కెళ్లిన రాజయ్యకు అసలు సంగతి బోధపడింది. ఉసూరుమంటూ ఖాళీ చేతులతో వెనక్కి రావల్సీ వచ్చింది.
పళ్ల బిగువన దుకాణంలో తనే కూచుంటున్నాడు. ఎప్పుడో తెచ్చిన పప్పులకు, రవ్వలకు పురుగు పట్టింది. వాటిని తీసికెళ్లిన ఒకరిద్దరు ఎగ్గొట్టారు. రాజయ్య, దుకాణం తియ్యటం మానేశాడు. సాటి రైతు వెంకటయ్య ఆ రోజు ఇంటి తలుపు తట్టాడు.
‘రాజయ్యా! ఎన్నాళ్లిలా ఖాళీగా కూచుంటావు. పొరుగూళ్లో మిర్చి కోతలకు పోతున్నా. నువ్వూ వస్తావంటే నా బండిమీదే తీసుకెళ్తా! వెంకటయ్య చెప్పింది వినగానే తటపటాయించాడు. నిన్నటిదాకా తన పొలంలో పనిచేసుకోవటంలేదు. ఇప్పుడు వేరే వాళ్ల పొలంలో కూలీకి పోవటం వేరు. గౌరవాభి మానాలు అడ్డు రాగా ఎటూ తేల్చుకోలేక సతమత మవుతున్న రాజయ్యకు వెంకటయ్య నచ్చ చెప్పాడు.
‘ఎవరి పొలమైతేనేం? సొంత పొలం మనకు కూడుపెట్టిందా? కాలంతో పాటు మనమూ మారాలి. పద వెళ్దాం’ అంటూ సర్ది చెప్పి, రాజయ్యను మిర్చి కోతలకు వెంటబెట్టుకెళ్లాడు వెంకటయ్య.
మొదటిరోజు కాస్తంత ఇబ్బందిగా అన్పించింది, అభిమానం అడ్డొచ్చి, సాయంత్రం అయ్యేటప్పటికి చేతిలో మూడొందలు పెట్టారు. మరో పదిరోజులు పనుందన్నారు. కళ్లు మూసుకుంటే మూడువేలు చేతిలో పడతాయి. ఇంటి ఖర్చులు వెళతాయి. కొడుకు పంపే డబ్బుని పూర్తిగా వీరాస్వామికి చెల్లు వేస్తే, వడ్డీతోపాటు కొంత అసలు కింద జమ చేసుకుంటాడు. అనుకున్నదానికంటే ముందే అప్పు తీర్చేయచ్చు.
రంగమ్మ మొదటిరోజున గుడ్ల నీరు కక్కుకుంది. ‘ఈ వయసులో కూలి పనులకు పోవటమేంటయ్యా, ఖర్మ కాకపోతే’ అని కుమిలిపోయింది. రాజయ్య విడమరిచి చెప్పడంతో సరేననక తప్పలేదు రంగమ్మకు.
రాజయ్య ఉదయాన్నే కూలి పనికెళ్లాడు వెంకటయ్యతో కలిసి. ముక్కుతూ మూలుగుతూ వంట మొదలెట్టింది రంగమ్మ. తలుపుకొట్టిన చప్పుడైతే వెళ్లితీసింది. ఎదురుగా రాకేష్, మరెవరినో చూసి రాకేష్ అని పొరపడ్డాననుకుంది ఒక్క క్షణం. రాకేష్ గొంతు విప్పేసరికి కన్న కొడుకేనని నిర్ధారించుకుంది.
‘ఏంటిరా! మీ నాయన మీద దిగులుపడ్డావా, ఏంటి! ఇట్టా చెప్పాపెట్టకుండా వచ్చావేం?’ కొడుకు వచ్చాడన్న ఆనందం ఒకవైపు, ఎందుకొచ్చాడన్న అనుమానం మరోవైపు రంగమ్మను చుట్టు ముట్టేశాయి.
అసలు విషయం చెప్పకుండా-‘నాన్నేడి! సరుకులు తేవటానికి పట్నం వెళ్లాడా?’ సూట్‌కేసులు లోపలి గదిలోకి చేరవేస్తూ అడిగాడు రాకేష్.
‘వస్తాడులే. తెలిసిన వాళ్ల పొలంలో పనికి పిలిస్తేపోయాడు’ అంది ముక్తసరిగా, కొడుకు ఎలా స్పందిస్తాడో తెలీక.
‘పనికి పోవటమేమిటే! దుకాణం ఎవరు చూస్తారు?’ అంటూ దుకాణంలోకి తొంగి చూశాడు. సరుకులేమీ లేక బోసిపోయి ఉండటంతో రాకేష్‌కు పరిస్థితి బోధపడింది. రాజయ్య ఫోను కూడా తీసుకెళ్లకపోవడంతో తండ్రి రాకకోసం ఎదురు చూస్తూ గడిపాడు రాకేష్. తల్లికి కూడా అసలు విషయం చెప్పకుండా దాటవేస్తూ వచ్చాడు.
పొద్దుగూకేవేళ ఇంటికి తిరిగొచ్చిన రాజయ్య, హఠాత్తుగా కళ్లముందు కొడుకు కన్పించేసరికి ఆశ్చర్యపోయాడు. అమెరికా వెళ్లి గట్టిగా ఆరునెలలు కూడా కాలేదు. రెండేళ్ల చదువు. ఆ తర్వాత అక్కడే కొలువు చూసుకుని సెటిల్ అవుతానని చెప్పినవాడు హఠాత్తుగా తిరిగొచ్చేసరికి ఏమీ అంతు చిక్కలేదు రాజయ్యకు.
తల్లిదండ్రుల దగ్గర నిజం దాచి పెట్టినందువల్ల ఏమీ ప్రయోజనం ఉండదనుకున్నాడు రాకేష్. సూటిగా విషయం చెప్పుకొచ్చాడు.
అనుకున్నట్లు రాకేష్‌కి యూనివర్సిటీలో అసిస్టెన్స్‌షిప్ రాలేదు. అది వచ్చి ఉంటే క్యాంపస్‌లో ఏ ప్రొఫెసర్ దగ్గరో, లైబ్రరీలోనో పార్ట్‌టైమ్ చేసేవాడు. ఇది లీగల్ కనుక ఏ సమస్యా ఉండేది కాదు.
కానీ దురదృష్టవశాత్తు ఆ ప్రయత్నాలేవీ కలిసి రాలేదు. వడ్డీ భారం తండ్రిని ఎలా కుంగదీస్తుందో ఆయన మాటల్నిబట్టి గ్రహించాడు రాకేష్. అమెరికాలో పరిస్థితులు మునుపటిలా లేవు. రిస్కుందని తెలిసీ మొండి ధైర్యం చేశాడు. గత్యంతరం లేక షాపింగ్ మాల్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగంలో చేరాడు. రెండు నెలలు గడిచాయో లేదో అమెరికన్ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డాడు. ఇది ఇల్లీగల్ కావడంతో సంజాయిషీకి అవకాశం ఇవ్వకుండా రాకేష్‌ను నిర్దాక్షిణ్యంగా వెనక్కి తిప్పి పంపేశారు. సాటి విద్యార్థులు, ప్రొఫెసర్లు నిస్సహాయులయ్యారు.
రాకేష్ చదువు మానుకుని అమెరికా నుండి వెనక్కి వచ్చేశాడన్న ఉప్పు వీరాస్వామికి అందింది. క్షణం ఆలస్యం చేయకుండా ఇంటికొచ్చి కూచున్నాడు. అప్పటికప్పుడు వడ్డీతో సహా పూర్తిగా కక్కమన్నాడు. కాస్త గడువిమ్మని రాకేష్ నచ్చచెప్పబోతే, కుదరదని భీష్మించాడు.
టైమిస్తే మాత్రం ఎలా తీరుస్తారో చెప్పుమంటూ నిలదీశాడు. దిక్కుతోచని స్థితిలో పడ్డారు తండ్రీ కొడుకులు.
రాజయ్య పెంకుటింటి ముందు ‘హౌస్ ఫర్ సేల్’ బోర్డు వెలిసింది. ఇల్లు అయిన కాడికి అమ్మగా వచ్చిన డబ్బుతో బ్యాంకు లోన్‌ను, వీరాస్వామి బాకీని వడ్డీతో కట్టేసి అద్దె ఇంటికి మారారు.
పూలచెట్లు, కూరగాయల పాదులతో ఒకప్పుడు పచ్చగా అల్లుకున్న రాజయ్య పొదరిల్లు కళ్లముందే కుప్పకూలిపోయింది. ఐదంతస్తు అపార్ట్‌మెంట్ నిర్మాణానికి అక్కడ పునాదులు తప్పుతున్నారు.
అమెరికా ఆశలు పూర్తిగా అడుగంటిపోగా హైదరాబాద్‌లో ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాడు రాకేష్.