అన్నాప్రగడ శివరామప్రసాద్ (ASR ప్రసాద్) గుంటూరు జిల్లా కారుమంచిలో, 1955లో జన్మించారు. 2025, డిసెంబర్ 7న స్వర్గస్తు లయ్యారు.

ఆంధ్రప్రభలో జర్నలిస్ట్‌గా వీరి రచనలు, వీరి విషయ వివరణ, విశ్లేషణలను గమనించిన పి.వేణుగోపాల్‌రెడ్డి సమాజకార్యంలో మీ అవసరముంది అనగానే సిద్ధం అంటూ భాగ్యనగరానికి వారి వెంట వచ్చేసారు. కుటుంబమంతా నందిగామలోనే ఉండేది. ఆ తరువాత జనసందేశ్‌లో, జాగృతిలో వారి ప్రస్థానం సాగింది.

బాల్యం నుంచి స్వయంసేవక్‌గా ఉంటూ.. అత్యున్నత గుణసంపదని ఎలా పొందవచ్చో తన జీవనం ద్వారా నిరూపించారు. బాల్యంలోనే పితృవియోగంతో కుటుంబ బాధ్యతనంతా తలకెత్తుకోవలసి వచ్చింది. అయినా అధైర్యపడలేదు. చూసిన ప్రతి పనీ నేర్చుకోవాలనే తృష్ణ వీరిని అనేక విషయాలు నేర్చుకునేలా చేసిందని చెప్పవచ్చు. మేదరి బుట్టలు అల్లడం దగ్గరి నుంచి హోమియో వైద్యం చేయడం వరకు ఎన్నో విషయాల పట్ల అద్భుత ప్రతిభ కలిగి ఉండేవారు.

ఇంట్లో నాయనమ్మ, తల్లి, అక్క, ఇద్దరు చెల్లెళ్లు.. వీరితో పాటు ఇతర బంధువులు.. ఇలా వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నా సమాజ కార్యంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. పరనింద అసలే లేదు.

కారుమంచి నుంచి నందిగామ వచ్చి అక్కడ సేల్స్ టాక్స్ ఆఫీసర్ దగ్గర అకౌంటెంట్‌గా పని నేర్చుకుని ఆడిటర్‌గా వృత్తి నిర్వహణ చేసేవారు. ఆ తరువాత ఆంధ్రప్రభలో రిపోర్టర్‌గా పనిచేస్తున్నప్పటికీ ప్రవృత్తి మాత్రం ఎల్లప్పుడూ సమాజకార్యమే. హోమియోవైద్యం నేర్చుకుని అనేక మందికి ఉచిత వైద్యం చేసేవారు. ప్రతి ఆదివారం ఏకలవ్య ఫౌండేషన్‌తో కలిసి ఆదిలాబాద్‌లోని వనవాసి క్షేత్రంలో ఉచిత వైద్యసేవలందించడానికి వెళ్లేవారు.

పుస్తక పఠనం వీరి దైనందిన జీవితంలో భాగం. అద్భుత మేధో సంపత్తి వీరి సొత్తు. విషయ విశ్లేషణ చేయడంలో వీరి ప్రతిభ అమోఘం.

1981లో వివాహమయిన తరువాత 1992లో కుటుంబాన్ని కూడా భాగ్యనగరానికి తీసుకొని వచ్చారు. మానవతా విలువలు నేర్పిస్తూ మమ్మల్ని పెంచారు అంటారు వారి అమ్మాయి. ఎట్టి పరిస్థితిలోను ఎవరి దగ్గరా చేయి చాచక పోవడం, ఆత్మాభిమానాన్ని చెదరనీయకపోవడం, మనకు ఉన్న దాంట్లో నలుగురికి పెట్టడం, దాంట్లో ఆనందాన్ని పొందడం.. నాన్నగారు మాకు ఇచ్చిన సంపద అని పిల్లలు చెప్తూ వచ్చారు.

ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు వారి సంతానం.

వారి ధర్మపత్ని కాన్సర్ బారిన పడి 2015లో మరణించారు.

ప్రస్తుతం భాగ్యనగర్‌లోని నాగోల్‌లోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో చిన్న కుమారుడితో కలిసి ఉండేవారు. కొంతకాలం జాగృతి సంపాదక వర్గంలో పనిచేశారు. వారికి ఉన్న తాత్విక చింతనయే వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా తన విధి నిర్వహణలోను, కర్తవ్య నిర్వహణలోను సమర్థవంతంగా సాగి పోవడానికి సహాయపడింది.

About Author

By editor