లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాలను పునర్విభజించడం, పునర్వ్యవస్థీకరించడం అన్నది అన్ని ప్రజాస్వామ్య దేశాల్లోనూ సాధారణ విషయమే. ప్రజలకు సరైన ప్రాతినిధ్యం లభించేందుకు కనీసం పదేళ్ల కొకసారి నియోజకవర్గాలను పునర్విభజించడం అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాల్లో చట్టబద్ధంగా జరిగిపోతుంటుంది. భారతదేశం వంటి అతి పెద్ద ప్రజాస్వామిక దేశంలో మాత్రం ఈ అత్యవసర కార్యక్రమం చోటు చేసుకుని నాలుగు దశాబ్దాలు కావొస్తోంది. భారత దేశానికి, ఇక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థకి మూలస్తంభాల్లాంటివి నియోజకవర్గాలు. వాటిని రూపొందించడం, మధ్య మధ్య వాటిని పునర్వ్యవస్థీకరించడం అనేది అనివార్యమైన కార్యక్రమం.


ప్రజలు తమకు లోక్‌సభ, శాసనసభల్లో ప్రాతినిధ్యం వహించడానికి పార్టీ అభ్యర్థులనో, స్వతంత్ర అభ్యర్థులనో ఎన్నుకోవడానికి ఆ నియోజక వర్గాలు తోడ్పడతాయి. ప్రజల సంఖ్య పెరుగుదల, తరుగుదలను బట్టి నియోజక వర్గాలను పునర్విభ జించడం, పునర్వ్యవస్థీకరించడం జరుగుతుంటుంది. తదుపరి జనాభా లెక్కల సేకరణ, నియోజకవర్గాల పునర్విభజన 2024 ఎన్నికల తర్వాత తప్పకుండా చోటు చేసుకుంటాయని కేంద్ర ప్రభుత్వం గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రకటించింది. నిజానికి, సుమారు నాలుగు దశాబ్దాల విరామం తర్వాత లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతోంది. 2027 లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కృత నిశ్చయంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. జనాభా గణనీయంగా పెరిగినప్పటికీ, అనేక పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రజలకు సరైన ప్రాతినిధ్యం లేకపోవడాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ పునర్విభజన కార్యక్రమాన్ని చేపట్టింది.

భారీగా వ్యత్యాసాలు

నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి భారత రాజ్యాంగం స్పష్టమైన కొన్ని నియమ నిబంధనలను రూపొందించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం ప్రతి రాష్ట్రం నుంచి దాని జనాభా ప్రకారం లోక్‌సభకు సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రాలలోని నియోజకవర్గాలన్నిటిలో దాదాపు ఒకే సంఖ్యలో జనాభా ఉండాల్సిన అవసరం ఉంది. సహజంగా నియోజకవర్గానికి, నియోజక వర్గానికి మధ్య జనాభా విషయంలో కొద్దో గొప్పో తేడా ఉండడం జరుగుతుంది. ఈ తేడా బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజలందరికీ తర తమ భేదం లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవడం సాధ్యం కాదు. సామాజికంగా కొన్ని వర్గాలకు మాత్రమే ప్రాధాన్యం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. పదేళ్లకొకసారి జనాభా లెక్కలను సేకరించడం, నియోజకవర్గాలను అందుకు తగ్గట్టుగా పునర్విభజించడం, లోక్‌సభ, శాసనసభ నియోజక వర్గాలకు దామాషా ప్రాతిపదికన ప్రాతినిధ్యం కల్పించడం అనివార్యంగా జరగవలసిందేనని రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది. కాగా, ఈ నియోజక వర్గాల పునర్విభజనను 2001 జనాభా లెక్కల వరకు స్తంభింపచేస్తూ 1971లో 42వ రాజ్యాంగ సవరణను తీసుకురావడం జరిగింది. జనాభా నియంత్రణను తు.చ. తప్పక అమలు చేసిన రాష్ట్రాలకు దీనివల్ల ఊరట లభించింది. జనాభా తగ్గిన కారణంగా శాసనసభలోనూ, లోక్‌సభలోనూ తమకు ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందని భయపడిన రాష్ట్రాలు ఈ సవరణతో ఊపిరి పీల్చుకున్నాయి. జనాభా మార్పులను నమోదు చేయడానికి మాత్రమేనన్న ట్టుగా 2001లో కొద్దిగా నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అయితే, లోక్‌సభ, శాసనసభ స్థానాల సంఖ్యలో మాత్రం మార్పు తీసుకురాలేదు. సమతుల్యమైన జనాభా అభివృద్ధి జరుగుతుందన్న ఉద్దేశంతో జనాభా లెక్కలను, నియోజకవర్గాల పునర్విభజనను 2026 వరకు వాయిదా వేస్తూ పోయారు. వీటన్నిటి ఫలితంగా దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఓటుకు విలువ ఎక్కువగా ఉండగా, కొన్ని ప్రాంతాల్లో ఓటుకు విలువ బాగా తగ్గిపోయింది. ఉత్తరప్రదేశ్‌లో ఒక లోక్‌సభ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 18 లక్షలు పైబడి ఉండగా, కేరళలో ఒక నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 13 లక్షలు మాత్రమే. అంటే, కేరళకు లోక్‌సభలో ప్రాతినిధ్యం పెరగ్గా, ఉత్తరప్రదేశ్‌కు బాగా తగ్గింది. ఇదే రకమైన తేడా ఉత్తర భారతానికి, దక్షిణ భారతానికి మధ్య కూడా కనిపిస్తోంది.

ప్రాతినిధ్యానికి గండి

త్వరలో చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఉత్తరాది రాష్ట్రాల కంటే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం పార్లమెంట్‌లో బాగా తగ్గిపోయే అవకాశం ఉందన్న ఆందోళన ఇప్పటికే ప్రారంభం అయింది. ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా గణనీయంగా పెరగగా, దక్షిణాది రాష్ట్రాల్లో బాగా తగ్గిపోయిందని, దీనివల్ల లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం బాగా తగ్గిపోయే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు జరగబోయే నియోజకవర్గ పునర్విభజన కార్యక్రమం ఈ అసమతూకాన్ని సరిదిద్దడమే కాకుండా, రాష్ట్రాల సమాఖ్య స్ఫూర్తిని కూడా కాపాడాల్సి ఉంటుంది.

ఈ పునర్విభజన కార్యక్రమంతో లోక్‌సభలో రాష్ట్రాల ప్రాతినిధ్యం మధ్య కూడా సమతూకం తీసుకు రావాల్సి ఉంటుంది. అంతేకాదు, పట్టణాలు, గ్రామాల మధ్య కూడా సమతూకం తీసుకురావాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో గ్రామీణ జనాభా కంటే పట్టణ జనాభా విపరీతంగా పెరిగిపోయింది. 1971 తర్వాత జనాభా లెక్కలు, పునర్విభజన కార్యక్రమం స్తంభించి పోయిన కారణంగా రాష్ట్రాల మధ్య జనాభాపరమైన తేడాలను గుర్తించడం సాధ్యం కాలేదు. వాస్తవానికి, 1971 నుంచి మాత్రమే కాదు, 1991 తర్వాత నుంచి జనాభా విపరీతంగా పెరిగిపోయి, ఈ అసమ తుల్యతలు మరీ పేట్రేగి పోయాయి. ఉదాహరణకు, ఢిల్లీలో ఒక నియోజక వర్గంలో ఓటర్ల సంఖ్య 31 లక్షలు కాగా, చాందినీచౌక్ నియోజక వర్గం ఓటర్ల సంఖ్య 3.76 లక్షలు మాత్రమే. ఈ అసమతూకాలు లోక్‌సభలోనే కాదు, శాసనసభల్లోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. శాసనసభల్లో చోటు చేసుకుంటున్న తేడాల ప్రభావం రాజ్యసభ సీట్ల మీద కూడా పడుతోంది. అనేక రాష్ట్రాల్లో, అనేక నియోజక వర్గాల్లో ప్రజలకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం లభించడం లేదు. ఒక ప్రాంతంలో ఉన్న ఓటు విలువ మరొక ప్రాంతంలో కనిపించడం లేదు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ప్రజలకు, ఓటర్లకు సరైన ప్రాతినిధ్యం లేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. దేశంలో జనాభా లెక్కల సేకరణ, నియోజకవర్గాల విభజన చివరి సారిగా 2021లో జరగాల్సి ఉండగా, కోవిడ్ కారణంగా వాయిదా పడడం జరిగింది. ప్రస్తుత జనాభా లెక్కలను, నియోజకవర్గాల విభజనను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే, ఎన్నికల్లో పట్టణ ఓటర్ల కంటే గ్రామీణ ఓటర్లకే ఓటు విలువ ఎక్కువగా ఉంది.

దెబ్బతింటున్న దామాషా

ప్రతి నియోజకవర్గంలోనూ దాదాపు సరిసమాన సంఖ్యలో ఓటర్లు ఉండాలని రాజ్యాంగం నిర్దేశించింది. పారిశ్రామికీకరణ వల్ల, పట్టణాభివృద్ధి కార్యక్రమాల వల్ల పట్టణాలు, నగరాల్లో జనాభా పెరగడం, పట్టణాలకు వలస కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో జనాభా తగ్గడం వంటి కారణాల వల్ల అసమతౌల్యతలు మరీ పెరిగిపోతున్నాయి. వీటి ప్రభావం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల మీదా, వాటి కార్యకలాపాల మీదా పడుతోంది. అవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మీదా, రాష్ట్రప్రభుత్వాల మీదా ఆధారపడుతున్నాయి. అవి కొద్దిగా కూడా స్వయం సమృద్ధిని సాధించలేకపోతున్నాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని పట్టణ ప్రాంత నియోజకవర్గాలను పునర్విభజన చేయాల్సిన అవసరం ఎక్కువగా కనిపిస్తోంది. పట్టణ ప్రాంత ఓటర్ల ఓటుకు విలువనివ్వడం అత్యవసరం అనే విషయాన్ని ప్రభుత్వాలు క్రమంగా గ్రహిస్తున్నాయి. పట్టణాలే కాదు, రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నా పట్టణ ప్రాంతాల నియోజకవర్గాల్లో మార్పులు రావాలి.

ప్రాతినిధ్యంలో మార్పు

కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జనాభా లెక్కల సేకరణ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చే ఎన్నికల నుంచి మహిళలకు రాజకీయ రంగంలోనూ, ప్రజాప్రాతినిధ్యం లోనూ 33 శాతం రిజర్వేషన్ కల్పించినందువల్ల, వారికి లోక్‌సభ, శాసనసభల్లో సరైన ప్రాతినిధ్యం లభించా లన్న పక్షంలో తప్పనిసరిగా జనాభా లెక్కల సేకరణ, నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గాల పునర్విభజనతో లోక్‌సభ స్థానాల సంఖ్య 816కు పెరిగే అవకాశం ఉంది. అందులో 273 స్థానాలు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. కాగా, వాస్తవానికి లోక్‌సభ, రాజ్యసభల్లో కంటే, శాసనసభల్లో ఓటర్లం దరికీ ఎటువంటి తేడా లేకుండా సరైన ప్రాతినిధ్యం లభించాల్సిన అవసరం ఉంది. 1971లో చేపట్టిన 42వ రాజ్యాంగ సవరణ వల్ల లోక్ సభ నియోజక వర్గాల్లోనే కాక, శాసనసభ నియోజకవర్గాల్లోనూ జనాభా గణన స్తంభించి పోయిన విషయాన్ని మరచిపోకూడదు. నియోజక వర్గాల పునర్విభజన అనేది రాజకీయ నాయకుల వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాక, ప్రజాస్వామ్యాన్ని, రాష్ట్రాల సమాఖ్య స్ఫూర్తిని పటిష్ఠం చేయడానికి ఉపయోగపడాలి.

– జి.రాజశుక

సీనియర్ జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE