అమెరికా, యు.కె, ఇజ్రాయెల్‌ల నుంచి వచ్చే నౌకలపై ఆంక్షలు విధించినప్పటికీ, ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారైన భారతదేశానికి చెందిన చమురు నౌకలు హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి ఇరాన్ అనుమతించడం తాజా పరిణామం. రెండుదేశాల విదేశాంగశాఖ మంత్రులైన జైశంకర్, అబ్బాస్ అరగ్చిల మధ్య జరిగిన దౌత్య చర్చలు ఈ సానుకూల పరిణామా నికి దారితీశాయి. దీంతో మార్చి 12న పుష్పక్, పరిమళ్ వంటి నౌకలు మన దేశానికి ప్రయాణం కావడం తాజా పరిణామం. ఇదే పరిస్థితి కొనసాగితే మనదేశం చమురు ఇబ్బందుల నుంచి బయటపడినట్టే భావించాలి. ఈ ఏడాది ఫిబ్రవరి 28న మొదలైన ఇరాన్, ఇజ్రాయెల్-యుఎస్‌ల మధ్య యుద్ధం మొత్తం ప్రపంచ గమనాన్నే మార్చివేసింది. ఈ యుద్ధం కేవలం మూడు దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, భౌగోళిక, ఆర్థికపరంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఈ యుద్ధంలో యుఎస్-ఇజ్రాయెల్‌కు బ్రిటన్ మద్దతుగా నిలవగా, ఇరాన్‌కు పరోక్షంగా రష్యా, చైనాలు మద్దతిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది మరో ‘‘ప్రచ్ఛన్న యుద్ధాన్ని’’ తలపింపజేస్తోంది. విచిత్రమేమంటే ఈ యుద్ధం విషయంలో అమెరికా, యూరప్ దేశాల మధ్య విభేదాలు తలెత్తడం గమనార్హం. ముఖ్యంగా యు.ఎస్. చేస్తున్న ఈ యుద్ధాన్ని ఫ్రాన్స్, జర్మనీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇదిలా ఉండగా మొజ్తాబా ఖమేనీ మరణించిన తన తండ్రి అయొతుల్లా అలీ ఖమేనీ స్థానంలో ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎన్నిక కావడం కూడా అంతర్గతంగా వ్యతిరేకతకు దారితీసింది. 1979 తర్వాత మొట్ట మొదటిసారి అధికారం తండ్రి నుంచి కుమారుడికి బదిలీ కావడమే ఇందుకు ప్రధాన కారణం. ఇది ఇస్లామిక్ విప్లవం మౌలిక సూత్రాలకు విరుద్ధమన్నది వ్యతిరేకుల వాదన. ముఖ్యంగా ఇటువంటి వంశపారంపర్య రాజకీయాలను సమూలంగా మార్చివేయడమే ఇస్లామిక్ విప్లవం ప్రధాన లక్ష్యమైన నేపథ్యంలో తాజా పరిణామం కులీన వర్గాల్లో ఇబ్బందిని సృష్టిస్తోంది. ఇక దేశంలోని సంస్కరణవాద గ్రూపులు కూడా మొజ్తాబా నియామకాన్ని వ్యతిరేకించడం సహజమే. 2009లో దేశంలో చోటు చేసుకున్న అల్లర్లను కర్కశంగా అణచివేయడంలో ఈయన పాత్ర బలీయంగా ఉన్నదనేది సంస్కరణ వాదుల ఆరోపణ.
విస్తరిస్తున్న యుద్ధం
ప్రస్తుతం యుద్ధం లెబనాన్, సిరియా, యెమెన్, ఇరాక్‌లకు కూడా విస్తరించడంతో, ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. లెబనాన్‌లో ఇజ్రాయిల్ దాడుల వల్ల 7.6లక్షల మంది నిరాశ్రయులు కావడం తాజా పరిణామం. చమురుశుద్ధి కర్మాగారాలపై దాడుల వల్ల టెహ్రాన్ వంటి నగరాల్లో ఆమ్ల వర్షాన్ని పోలిన ‘‘నల్లటి వర్షం’’ కురిసింది. దీనివల్ల విపరీతమైన గాలి కాలుష్యం, ఆరోగ్య సమస్యలకు దారితీసింది. ఇరాన్ సరిహద్దు దేశాలైన టర్కీ, అజర్ బైజాన్‌లకు లక్షలాది మంది ఇరాన్ ప్రజలు వలస వెళ్లడంతో ఆ దేశాలపై తీవ్ర భౌగోళిక వత్తిడి పెరిగింది. ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా కలిగిన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో బ్రెంట్ క్రూడాయిల్ ధర ఒక్కసారిగా బ్యారల్‌కు 120 డాలర్లకు పెరిగింది. కువైట్, ఇరాక్, సౌదీ అరేబియాల్లో చమురు ఉత్పత్తి రోజుకు 6.7మిలియన్ బ్యారల్స్ తగ్గింది. గల్ఫ్ ప్రాంతంలోని విమానాశ్రయాలపై ఇరాన్ దాడుల వల్ల 4వేల విమాన సర్వీసులు రద్దయ్యాయి. యుద్ధం ప్రారంభమైన 96 గంటల్లోనే ప్రపంచ స్టాక్ మార్కెట్లు 3.2 ట్రిలియన్ డాలర్ల మేర నష్టపోయాయి. ఇది కేవలం ఆయుధాల పోరు మాత్రమే కాదు, ప్రపంచ దేశాల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న మహా సంక్షోభంగా మారింది.
మన నౌకలకు అనుమతి
ప్రస్తుతానికి మన చమురు నౌకలు హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి ఇరాన్ అనుమతించిన నేపథ్యంలో ఇంధన సమస్యకు తక్షణ పరిష్కారం లభించినట్టే. అన్నింటికీ మించి ఇరాన్, ఇజ్రాయెల్ రెండూ మనకు మిత్ర దేశాలే. తన మనుగడకోసం ఇజ్రాయెల్ చేస్తున్న ఈ పని మనకూ ప్రయోజనం కలిగిస్తుండటమే ఇందుకు కారణం. ఇరాన్‌లోని ఛబ్బహార్ పోర్టును మనదేశం నియంత్రిస్తోంది. ఒక నెలపాటు రష్యానుంచి చమురు కొనుగోలు చేయడానికి భారత్‌కు అనుమతి ఇస్తున్నామని అమెరికా ప్రకటించడం మరో విచిత్రం! ఎందుకంటే ప్రైవేటు సంస్థలు తప్ప మన ప్రభుత్వ సంస్థలు యదేచ్ఛగా రష్యా చమురును కొనుగోలు చేస్తున్నాయి. అయితే ఈ మినహాయింపు ద్వారా కొనుగోలు చేసిన చమురును శుద్ధి చేసి అవసరాలు తీరిన తర్వాత మిగిలినది యూరప్ దేశాలకు ఎగుమతి చేయాలన్నది అమెరికా కోరిక! మన విదేశాంగ విధానం దేశ అవసరాలకు అనుగుణంగా స్వతంత్రంగా వుంటుందని మనదేశం ఇదివరకే స్పష్టం చేసింది.
ఇరాన్ అణ్వస్త్రాలపై అనుమానాలు
అణ్వాయుధాల తయారీ వాడకం ఇస్లాంకు వ్యతిరేకమని మొజ్తబా తండ్రి, దివంగత అలీ ఖమెనీ గతంలో ఫత్వా జారీచేశారు. ఇప్పుడు కొత్త నాయకుడు మొజ్తబా తండ్రి విధానాన్ని అనుసరిస్తారా లేక మారుస్తారా అన్నది ఇంకా తేలలేదు. తండ్రి మరణం తర్వాత బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు మొజ్తబా ప్రజల ముందుకు రాకపోవడంతో, అణ్వాయుధాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అణ్వాయుధాలను తయారు చేయాల్సిందేనని ఇరాన్ సైన్యం (ఐఆర్‌జీసీ) వత్తిడి ఈయనపై తీవ్రంగా వుంది. ‘‘మా ఉనికిని దెబ్బతీసేలా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు దాడులకు పాల్పడితే అణ్వాయుధ సిద్ధాంతాన్ని మార్చుకోక తప్పదని’’ ఇరాన్ ఉన్నతాధికారులు గతంలో హెచ్చరించడం గమనార్హం. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) ప్రకారం, ఇరాన్ వద్ద 60% వరకు శుద్ధి చేసిన యురేనియం నిల్వలున్నాయి. వీటిని బాంబు తయారీకి అవసరమైన 90% స్థాయికి తీసుకెళ్లడం చాలా సులభమని సంస్థ స్పష్టం చేసింది.
మధ్యవర్తిత్వానికి పుతిన్ యత్నం
అయొతుల్లా ఖమేనీ హత్యను కుట్రపూరిత చర్యగా వర్ణించిన రష్యా, అమెరికా బలగాల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని ఇరాన్‌కు రహస్యంగా అందిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఉన్న రష్యా ప్రత్యక్షంగా ఇరాన్‌కు సహాయం చేసే స్థితిలో లేదు. ఇరుదేశాల మధ్య ఒప్పందంలో ‘‘పరస్పర రక్షణ’’ అనే క్లాజు లేకపోవడం కూడా ఇందుకు కారణం. అయితే రష్యాకు ఇరాన్ సన్నిహిత మిత్రదేశం. ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు అండగా నిలిచింది. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని నిలుపుచేయడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి.
చమురు సరఫరాలకోసం చైనా తపన
ప్రపంచంలో అతిపెద్ద చమురు దిగుమతిదారైన చైనా, ఈ యుద్ధం వల్ల తమ చమురు సరఫరాలు ఎక్కడ దెబ్బతింటాయోనని భయపడుతోంది. యుద్ధాన్ని ఆపేసి తక్షణం చర్చలు జరపాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ పదేపదే కోరుతుండటా నికి ప్రధాన కారణం ఇదే. అయితే హార్ముజ్ జలసంధి నుంచి చైనా చమురు నౌకలకు ఇరాన్ అనుమతిం చడం ఆ దేశానికి ఊరటనిస్తోంది. ఈ యుద్ధంలో ఇరాన్‌కు మద్దతుగా నిలిచిన చైనా, అక్కడ నాయకత్వ మార్పునకు యు.ఎస్. చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తోంది. విశేషమేమంటే గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను చైనా ఖండించడం. ఎందుకంటే ఈ దేశాలనుంచి కూడా చైనా చమురును దిగుమతి చేసుకుంటోంది మరి! ఈ యుద్ధంలో రష్యా ఇంటెలిజెన్స్, డిఫెన్స్ టెక్నాలజీ పరంగా ఇరాన్‌కు సహాయం చేస్తుండగా, చైనా దౌత్య, ఆర్థికపరంగా అండగా ఉంటోంది. ఈ పక్రియలో మధ్యప్రాచ్యంలో యు.ఎస్.ను బలహీనపరచడం రష్యా లక్ష్యం కాగా, చైనా మాత్రం తన ఇంధన సరఫరాకు ఆటంకం రాకుండా ఉండే లక్ష్యంతో వ్యవహరిస్తోంది.
నలిగిపోతున్న పాకిస్తాన్!
ఏ భౌగోళిక పరిస్థితులు తనకు ప్రాధాన్యత కల్పిస్తున్నాయని పాకిస్తాన్ భావిస్తున్నదో అవే ఇప్పుడు గుదిబండగా మారడంతో విలవిలలాడుతోంది. పొరుగుదేశం ఇరాన్, ఆర్థిక-సైనిక సంబంధాలున్న సౌదీఅరేబియాల మధ్య నలిగిపోతోంది. ఇరాన్‌పై దాడులు చేయడానికి, వైమానిక స్థావరాలను ఉపయోగించుకోవడానికి అనుమతించాలని అమెరికా పాకిస్తాన్‌పై వత్తిడి తెస్తోంది. ఒకవేళ ఒప్పుకుంటే ఇరాన్ తన క్షిపణులను పాక్ వైపునకు మళ్లిస్తుంది. అంగీకరించకపోతే యు.ఎస్. నుంచి ఆర్థిక సహాయం నిలిచిపోతుంది. సౌదీ అరేబియాతో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ తన సైన్యాన్ని సౌదీకి పంపిస్తే, ఇరాన్‌తో కోరి శత్రుత్వం తెచ్చుకున్నట్టే. ఇప్పటికే ఇరాన్‌తో సత్సంబంధాలు లేక పాక్ ఇబ్బందులు పడుతోంది. ఖమేనీ మరణం తర్వాత పాకిస్తాన్‌లోని షియావర్గం ప్రజలు అమెరికా కాన్సులేట్‌పై దాడులు చేశారు. మరే ఇతర దేశంలో జరగని స్థాయిలో అల్లర్లు జరిగాయి. దీనికి తోడు ఆఫ్ఘనిస్తాన్‌తో ప్రత్యక్ష యుద్ధం పాకిస్తాన్‌ను రాచపుండు మాదిరిగా సలుపుతోంది. ఆఫ్ఘన్‌ల దాడిలో నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్ మరోసారి ధ్వంసమైంది. బలూచిస్తాన్ క్వెట్టాలోని కీలక సైనిక స్థావరం ‘‘12వ కార్పస్ హెడ్ క్వార్టర్స్’’, ఖైబర్ ఫక్తూన్‌త్వాలోని సైనిక క్యాంపులపై ఆఫ్ఘన్ తాలిబన్లు దాడులు చేసి ధ్వంసం చేయడంతో తలెత్తుకోలేని స్థితి ఏర్పడింది! అబోటాబాద్, నౌషెరా, జమృద్ ప్రాంతాల్లోని సైనిక ప్రాంతాలపై డ్రోన్లతో దాడులు చేస్తున్నారు. దీనికితోడు దేశంలోని తెహ్రిక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ)కి ఆఫ్ఘన్ తాలిబన్లు పూర్తి మద్దతిస్తున్నారు. ఈ రెండు యుద్ధాలతో అసలే దుర్భరంగా ఉన్న ఆర్థిక పరిస్థితి మరింత దిగజా రింది. ఒకే రోజులో పాక్ స్టాక్ మార్కెట్ 16వేల పాయింట్లు కోల్పోవడం గమనార్హం. ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసి వేయడంతో దేశంలో పెట్రోలు దొరకడంలేదు. దీనికి తోడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి లక్షల సంఖ్యలో శరణార్థులు దేశంలోకి ప్రవేశిస్తుండటంతో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ఒకవైపు ఇరాన్, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాక్ ముప్పును ఎదుర్కొంటున్నది. అంతర్గతంగా బలూచ్ వీరులు, తెహ్రిక్ ఏ తాలిబన్‌ల దాడులు, సింధ్ ప్రాంత ప్రజల ఆందోళన, పీఓకే ప్రజల్లో నిరసన వంటివి పాక్ పాలకులకు నిద్రలేని రాత్రులను మిగులుస్తున్నాయి. మరోవైపు అమెరికా తన స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం, రెండు దేశాలతో యుద్ధాలు, అంతర్గత అనిశ్చిత పరిస్థితులు పాకిస్తాన్‌ను విచ్ఛిన్నం దిశగా తీసుకెళుతున్నాయి. ఈ దశలో చైనా సహాయం కోసం పాకిస్తాన్ అర్రులు చాస్తున్నా, ఆశించిన స్పందన ఉండటంలేదు. ప్రపంచ పరిణామాల నేపథ్యంలో చైనా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుండ టమే ఇందుకు కారణం. ఆఫ్ఘనిస్తాన్‌తో యుద్ధం వల్ల తన సీపెక్ (చైనా-పాకిస్తాన్ ఆర్థిక నడవా) ప్రమాదంలో పడటంతో, తక్షణం యుద్ధం ఆపేలా తాలిబన్లతో చర్చలు జరపాలని చైనా వత్తిడి తెస్తోంది. ఆఫ్ఘ నిస్తాన్‌తో చైనాకు భారీ మైనింగ్ ఒప్పందా లుండ టంతో ఇప్పుడు ఈ యుద్ధం ఆగిపోవడం దానికి చాలా అవసరం. పాకిస్తాన్ ఆర్థికంగా దివాళా తీయడం వల్ల తాను ఇచ్చిన రుణాలు తిరిగి రావని చైనా భయపడుతోంది. దీనికి తోడు చైనా ఇంజినీర్లపై తరచుగా జరుగుతున్న దాడుల పట్ల ఆ దేశం అసహనంగా ఉంది. చైనా ఎప్పుడూ ఉచితఏంగా ఏదీ ఇవ్వదు. ఇప్పుడు తన రుణాల కింద కొన్ని భూభాగాలను తనకు రాసివ్వాలని పాకిస్తాన్‌ను కోరుతోంది. ఈవిధంగా పాకిస్తాన్ అన్ని విధాలుగా తాను తీసుకున్న గోతిలో తానే పడుతున్నది.

జమలాపురపు విఠల్‌రావు
సీనియర్ జర్నలిస్ట్