తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ‘కూల్చివేతల సర్కారు’గా పరిణామం చెందుతోంది. దశాబ్దాలుగా నివసిస్తున్న ఇళ్లను బుల్డోజర్లు, జేసీబీలతో కూల్చి వేస్తోంది. ప్రభుత్వ పాలన, ప్రజాసంక్షేమాల కంటే కూల్చివేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. పదులు, వందలు కాదు.. వేలు, లక్షల నివాస గృహాలను కూల్చివేసే బలవంతపు చర్యలు కొనసాగుతున్నాయి. లక్షల కుటుంబాలు పిల్లా పాపలతో అరిగోస పడే పరిస్థితిని ప్రభుత్వం తీసుకువస్తోంది.
నిరసనలు, ఆందోళనలు, ప్రతిఘటనలు, విజ్ఞప్తులు, విన్నపాలు ఏవీ ప్రభుత్వాన్ని కదిలించ లేకపోతున్నాయి. ఈ కూల్చివేతలను అమలు చేసి తీరతామంటూ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి సందర్భంలోనూ చెబుతున్నారు. ఫలితంగా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత గూడుకట్టు కుంటోంది. బీజేపీ సహా ఇతర ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ‘‘కూల్చివేతల సర్కార్’’గా అభివర్ణిస్తు న్నాయి. కానీ, ప్రభుత్వం మాత్రం అభివృద్ధి, పర్యా వరణ పరిరక్షణ కోసం, ఆక్రమణలను తొలగించడం తప్పనిసరి అని సమర్థించుకుంటోంది.
అప్పుడు సక్రమం – ఇప్పుడు అక్రమం?
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భూముల బదలా యింపులు జరిగాయి. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చాయి. విద్యుత్ విభాగం కరెంటు కనెక్షన్లు ఇచ్చింది. వాటర్ బోర్డు నీటి నల్లాలు బిగించింది. ఇవన్నీ ప్రభుత్వ అధికారులే చేశారు. అధికారికంగానే అనుమతులు ఇచ్చారు. సదుపాయాలు కల్పించారు. వీటన్నింటికీ పన్నులు, బిల్లులు కచ్చితంగా వసూలవుతున్నాయి. కానీ, ఇప్పుడు ఉన్న ఫళంగా వచ్చి.. ఆక్రమణలు అదే ప్రభుత్వం కూల్చివేస్తుంటే ‘కంచే చేను మేసిన చందం’గా ఉందన్న ఆరోపణలు, ఆక్రోశాలు పెల్లుబుకుతున్నాయి. రాజకీయంగా చూస్తే విపక్షాల నిరసనలు, ఉద్యమాలను కూడా సర్కారు లెక్కచేసే పరిస్థితులు కనిపించడం లేదు.
హైడ్రా పేరుతో అతలాకుతలం
హైడ్రా, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, భూదాన్ భూముల్లో ఆక్రమణలు.. ఇలా పేరు ఏదైనా సర్కారు మాత్రం కూల్చివేతల పాట పాడుతోంది. హైడ్రా పేరుతో హైదరాబాద్‌లోని చెరువులన్నింటినీ సుందరీకరిస్తామని, పునర్వైభవం తీసుకొస్తామని చెప్పినప్పుడు అంతా సంతోషించినప్పటికీ.. ఇప్పటివరకు జరిగిన కూల్చివేతల్లో సామాన్యులు, నిరుపేదలు, కూలీలు తామ దశాబ్దాలుగా ఉంటున్న ఇళ్లు కోల్పోతూ నిలువ నీడలేని పరిస్థితి ఏర్పడింది. అయితే బడాబాబులు, పెద్ద తలకాయల ఆక్రమణలు మాత్రం కూల్చిన దాఖలాలు ఇప్పటివరకూ కనిపించలేదు. పైగా.. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా హైడ్రా బలగాలు తెల్లవారకముందే సూర్యోదయానికి ముందే ఆయా కాలనీల్లో వాలిపోతున్నాయి.
బాధితులకు సమాధానం చెప్పే యంత్రాంగం గానీ, బాధ్యతాయుత బృందాలు గానీ కానరావడం లేదు. ఈ కూల్చివేతల వ్యవహారంపై ఎంతగా విమర్శలు వచ్చినా, ప్రతిపక్షాలు ఉద్యమాలు చేపట్టినా, బాధితులు ఎంత మొత్తుకున్నా.. ప్రభుత్వం మాత్రం కనికరించడం లేదు.
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నా మని ప్రభుత్వం చెబుతుండగా, ప్రభుత్వం పన్నులు, బిల్లులు పక్కాగా వసూలు చేస్తూ ఇంతకాలం ఇన్నాళ్లు సక్రమమైనవిగా పరిగణించగా ఇప్పటికిప్పుడు అక్రమం ఎలా అయ్యాయంటూ ప్రశ్నలను ఎక్కుపెడుతున్నారు బాధితులు. ప్రధానంగా మొదట్లో రియల్ ఎస్టేట్ రంగంలో దడ పుట్టించిన ఈ చర్యలు, ముఖ్యంగా జల వనరుల సమీపంలోని భవనాలపై దృష్టి సారించాయి. చట్టవిరుద్ధమైన నిర్మాణాలపైనే కఠినంగా వ్యవహరిస్తున్నామని, పర్యావరణ పరిరక్షణ, నగర అభివృద్ధి ఈ ప్రాజెక్టు లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. అమ్మినవాళ్లు, అక్రమార్కులు, అధికారులు అందరూ బాగానే ఉన్నారు. జీవితమంతా కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో, కుటుంబసభ్యుల ఆభరణాలు కుదువపెట్టి తెచ్చిన సొమ్ముతో, బ్యాంకు రుళ్లలో ఇళ్లను కొన్నవారి పరిస్థితే ఆగమ్యగోచరంగా తయారవుతోంది. ఈ వ్యవహారాల్లో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పలుమార్లు హైడ్రాకు మొట్టికాయలు వేసింది. దుందుడుకు చర్యలపై మందలించింది. తమ ఎదుట హాజరు కావాలని హైడ్రా కమిషనర్‌ను ఆదేశించింది. దాంతో కొంతకాలం పాటు నిలిచిన కూల్చివేతలు మళ్లీ ఏదో ఒక ప్రాంతంలో ఒక్కసారిగా ప్రత్యక్షమవుతున్నాయి.
మూసీ ప్రాజెక్టు పేరుతో నిండా ముంచుతున్నారు
మూసీ నదీప్రక్షాళన, సుందరీకరణ పేరుతో ప్రభుత్వం చేపడుతోన్న కూల్చివేతలు అందరి గుండెలనూ పిండేస్తున్నాయి. మూసీ నది బఫర్ జోన్ లో ఉన్నాయంటూ నగరం పరిధిలోని నది పొడవునా కూల్చివేతలకు పూనుకుంది. 2012లో సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా మూసీ, ఈసా నదుల బఫర్ జోన్లలో, నదీగర్భంలోని ఆక్రమణలను తొలగించడమే తమ లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంటోంది. దీని ప్రకారం చిన్న నివాస గృహాల నుంచి భారీ నిర్మాణాలు దాదాపు లక్షన్నర నేలమట్టం అవుతాయని అంచనా. అవసరమైన అన్ని రకాల పత్రాలు, అనుమతులు కలిగిఉన్నప్పటికీ, సరైన సమాచారం లేకుండా కూల్చివేతలు చేపట్టడంతో పెద్ద సం•్యలో కుటుం బాలు నిరాశ్రయమవుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇళ్లు కోల్పోయిన వారికి పునరావాసం కల్పిస్తామని, మరోచోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా,అర్హులను నిర్ధారించే వ్యవస్థలో అక్రమాలు చోటు చేసుకుంటా యని, నిజమైన బాధితులు నష్టపోతారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
భూదాన్ భూముల పేరుతో కూల్చివేతలు
ఇక, ఖమ్మం జిల్లాలో భూదాన్ భూముల ఆక్రమణల పేరుతో ప్రభుత్వం కూల్చివేతలకు పాల్పడుతోంది. వందల సంఖ్యలో నివాస గృహాలను కూల్చివేసింది. అవి అక్రమ నిర్మాణాలని చెబుతోంది. మరి.. అక్రమంగా నిర్మించుకున్నవైతే వీటికి అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారు? ఇన్నేళ్లుగా ప్రభుత్వం ఇంటి పన్నులు ఎందుకు వసూలు చేస్తోందన్న ప్రశ్నలకు సమాధానం కరవవుతోంది.
ఖమ్మం శివారు వెలుగుమట్లలోని వినోభా నవోదయ కాలనీలో పదిహేను సంవత్సరాలకుపైగా నివాసం ఉంటున్న పేదల ఇళ్లు, గుడిసెలను ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించి రాత్రికి రాత్రే ఖాళీ చేయించడం సంచలనంగా మారింది. అడ్డుకునేందుకు బాధితులు చేసిన నిరసన సైతం ఎలాంటి ప్రయోజనం ఇవ్వలేదు. ఈ చర్యపై అన్ని వర్గాల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దశాబ్దాల క్రితం ఆచార్య వినోబాభావే దేశవ్యాప్తంగా చేపట్టిన భూదాన్ ఉద్యమంతో స్ఫూర్తితో పొందిన కొందరు దాతలు వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని సుమారు 31 నుంచి 60 ఎకరాల ప్రభుత్వానికి ఇచ్చారు. భూమి లేని నిరుపేదలకు ఒక గూడు దొరుకు తుందన్నది వారి ఆశయం. కాలక్రమేణా ఖమ్మం నగరం విస్తరించడం, నగరంలో కొత్త కలెక్టరేట్ కూడా ఈ ప్రాంతానికి అత్యంత సమీపంలోనే నిర్మితమవడంతో అక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఎకరాకు రూ.10 కోట్లకుపైగా పెరిగింది. మొత్తం భూమి విలువ సుమారు 250 నుంచి 300 కోట్ల రూపాయలు కావడంతో అధికార యంత్రాంగం దీనిపై కన్నేసిందన్న విమర్శలు వస్తున్నాయ్.
భూదాన్ బోర్డు నుంచి ఈ భూమి ఎవరికీ అధికారికంగా కేటాయించలేదని, కొందరు దళారులు నకిలీ పత్రాలతో ఇక్కడ పేదలను చేర్పించి పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేశారని ప్రభుత్వం వాదిస్తోంది. ఇక్కడి భూమి విలువ ఎకరాకు 10 కోట్లకుపైగా పెరిగింది. గత నెల అంటే ఫిబ్రవరి 24న పెద్ద ఎత్తున ఇళ్లు కూల్చివేసారు. మూడు జిల్లాల నుంచి సుమారు 1,000 మందికి పైగా పోలీసుల పహారాలో, ఎస్.డి.ఆర్.ఎఫ్ (•ణ=ఖీ) బృందాల సమక్షంలో డజన్ల కొద్దీ జెసిబిలతో ఇళ్లను నేలమట్టం చేశారు. మహిళలు అడ్డుకోవడానికి ప్రయత్నించినా, కొందరు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడినా యంత్రాంగం వెనకడుగు వేయలేదు.
శారదా పీఠం భూములకూ ఎసరు?
ఈ కూల్చివేతల అంశం కేవలం నిరుపేద, సాధారణ, మధ్యతరగతి ప్రజలకే పరిమితం కాలేదు. హైదరాబాద్‌లోని శారదా పీఠం భూముల స్వాధీనానికి దృష్టి సారించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలోని సర్వేనంబరు 240లో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండెకరాల భూమిని కేటాయించగా, శారదా పీఠం ఆ భూమి చుట్టూ ప్రహరీ నిర్మించుకొని , రాజశ్యామల ఆలయ నిర్మాణాన్ని కూడా శరవేగంగా కొనసాగిస్తోంది.
జలమండలి రిజర్వాయర్ కోసం ఆ భూమి అవసరమవుతుందంటూ అక్కడి నిర్మాణాల కూల్చి వేతకు అధికారులు సర్వ సన్నద్ధమయ్యారు. విషయం తెలిసిన ప్రతిపక్షాలు ఆ పీఠానికి, స్వామీజీలకు సంఘీభావం ప్రకటించడంతో పాటు.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెనక్కి తగ్గారు. ఫిబ్రవరి 28వ తేదీన ఈ హైడ్రామా అంతా మీడియాలో ప్రసారంకావడంతో, ఆ సాయంత్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేరుకొని ‘అధికారుల అత్యుత్సాహం, సమాచార లోపం వల్లనే ఇది జరిగింది. శారదా పీఠం భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోబ•దు..’ అని స్పష్టమైన ప్రకటన చేశారు. ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి శ్రీధర్ బాబును మరుసటిరోజే శారదా పీఠానికి పంపించారు. ఆయన శారదా పీఠంలో పర్యటన అనంతరం ఈ అంశంపై విస్పష్టమైన ప్రకటన చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుపై ప్రభావం?
కూల్చివేతల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందంటున్న ప్రభుత్వం మానవీయ కోణాన్ని విస్మరిస్తోందని, బాధితుల మధ్య కూడా వ్యత్యాసం చూపిస్తోందన్న ప్రచారంతో సామాన్యుల్లో అభద్రతా భావం పెరుగుతోంది. ముఖ్యంగా మధ్య తరగతి, పేద వర్గాల ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటున్నా రనే భావన కలుగుతోంది. అదే ప్రజల్లోకి వెళితే దీర్ఘకాలంలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదంటున్నారు. ఖమ్మం, హైదరాబాద్ మూసీ తీరంలో బాధితుల నిరసనలు ఉధృతం కావడం, వారికి బీజేపీ ఇతర పక్షాలు మద్దతు ఇవ్వడం ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బందికరంగా పరిణమించింది. బాధితుల విషయంలో బీజేపీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని మరీ ఆ ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చే ప్రయత్నాలు చేసింది. బాధితులకు అండగా నిలుస్తామని ప్రకటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు. శారదా పీఠాన్ని కూడా సందర్శించి రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తమ నిరసనను తెలియజేశారు.
తుషార్ గాంధీ ట్వీట్
మరోవైపు.. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్‌లో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టు కోసం ఇళ్లను కూల్చివేయడం•పై,• మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజలను నిర్వాసితులను చేసి గాంధీ విగ్రహాన్ని పెట్టడం గాంధీ సిద్ధాంతాలకు విరుద్ధమని, ప్రాజెక్టుపై పునరాలోచించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. విగ్రహాల కంటే ప్రజల కనీస అవసరాలే ముఖ్యమని గాంధీజీ నమ్మేవారని, అటువంటిది ఆయన విగ్రహం కోసమే పేదల ఇళ్లను తొలగించడం ఆయన సిద్ధాంతాలకు విరుద్ధం’ అని తుషార్ గాంధీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
సుజాత గోపగోని
సీనియర్ జర్నలిస్ట్, 6302164068