భారతదేశంలో రాష్ట్రపతి హోదా అత్యంత గౌరవనీయమైన రాజ్యాంగ పదవిగా ఉంది. రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షణకు కట్టుబడిన భారత రాష్ట్రపతి దేశ, విదేశాల్లో ఎక్కడ పర్యటించినా ప్రొటొకాల్ పాటించడం ఆనవాయితీ. కేంద్ర హోం శాఖ రాష్ట్రపతి వెళ్లే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు ముందస్తుగానే పర్యటన సమయంలో పాటించాల్సిన నియామాలకు సంబంధించి అధికారిక మార్గదర్శకాలు జారీ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ నిబంధనలన్నింటినీ తు.చ. తప్పకుండా అనుసరించాల్సిన ఆవశ్యకత ఉంది. భారత రాష్ట్ర పతికి భద్రతతో పాటు ఆ పదవి ప్రతిష్టకు భంగం కలగకుండా ఉండానే ప్రధాన ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించి రాష్ట్రాలకు పంపుతుంది. అధికారంలో ఎవరు ఉన్నా రాజకీయా లకు అతీతంగా రాష్ట్రపతి పదవికి గౌరవ మర్యాదలు ఇచ్చే సంప్రదాయం దేశంలో ఉంది. అయితే దురదృష్టవశాత్తు ఇందుకు భిన్నంగా మమతా బెనర్జీ హయాంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అవమానం జరగడం దేశంలో సంచలనం రేపింది.
స్వయంగా సంతాల్ ఆదివాసి సామాజిక వర్గానికి చెందిన ద్రౌపది ముర్ము పశ్చిమ బెంగాల్, డార్జిలింగ్‌లో తొమ్మిదో అంతర్జాతీయ సంతాల్ సదస్సులో పాల్గొనేందుకు ఆసక్తిని చూపించారు. అత్యున్నత పదవిలో ఉన్న తమ సామాజిక వర్గానికే చెందిన ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరవు తుండడంతో ఈ సదస్సు భావోద్వేగాన్ని సంతరించు కుంది. సదస్సు నిర్వాహకులు రాష్ట్రపతిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో కేంద్ర ప్రభుత్వంతో నిత్యం ఘర్షణ వైఖరి కోరుకునే మమతా బెనర్జీ సంతాల్ సదస్సును కూడా తమ రాజకీయాలకు ఒక పావుగా వాడుకున్నారు. కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రానికి ఆహ్వానించే ప్రొటొకాల్ మొదలుకొని సదస్సు నిర్వహణ వరకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడుగడుగునా అగౌరపర్చేలా వ్యవహరించింది.
పశ్చిమ బెంగాల్‌లో అడుగుపెట్టినప్పటి నుండి సంతాల్ సదస్సు ముగిసే వరకు గౌరవ రాష్ట్రపతి రాష్ట్రంలో అవమానాలు ఎదుర్కొన్నారు. మార్చి 7న డార్జిలింగ్ జిల్లాలో జరిగిన అంతర్జాతీయ సంతాల్ సదుస్సుకు హజరయ్యేందుకు ఢిల్లీ నుండి బాగ్‌డోగ్రా విమానాశ్రయానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకోగా నిబంధనలు పాటించకుండా మొక్కుబడిగా కేవలం సిలిగురి మేయర్ మాత్రమే ఆమెకు స్వాగతం చెప్పడంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దురుద్దేశాలు బట్టబయలయ్యాయి. మమతా సర్కారు స్వాగతం పక్రియ మొదలుకొని రాష్ట్రపతి పర్యటనను ఉద్దేశ పూర్వకంగా వివాదాస్పదం చేసి అభాసుపాలైంది.
సంతాల్ సామాజిక వర్గానికి చెందిన ప్రము ఖులు, ఆదివాసీ నాయకులు పాల్గొన్న ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత లభించినా రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూసింది. మొదట ఈ సదస్సును డార్జిలింగ్‌లోని బిధానగర్-ఫాన్సిదేవా ప్రాంతంలో జరపటానికి నిర్వహకులు అనుమతి కోరారు. అయితే అక్కడ సదస్సుకు తగినంత స్థలం లేదని, సౌకర్యాలు లేవని చెప్పడం ద్వారా అధికారులు అనుమతికి నిరాకరించారు. సదస్సు వేదికను సుదూర ప్రాంతానికి మార్చారు. వాస్తవానికి అక్కడ ఏర్పాట్లు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. మొదట సదస్సు జరపాలనుకున్న ప్రాంతంలో సౌకర్యాలు లేవని స్థలం మార్చిన అధికారులు రెండో చోట వసతులు కల్పించడంలో విఫలమయ్యారు. కొత్త ప్రదేశంలో సరైన ఏర్పాట్లు లేవనే విషయం కార్యక్రమానికి రెండు రోజుల ముందే బయటకు పొక్కింది. వేదిక వద్ద సౌకర్యాలు పూర్తిగా లేవని, రహదారులు కూడా బాగోలేవని వార్తలొస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోగా రాష్ట్రపతి పర్యటనను రద్దు చేసుకోవాలని సూచిం చారు. ఇక్కడే రాష్ట్ర ప్రభుత్వం దిగజారుడుతనం బట్టబయలైంది. వేదిక మార్చమని సూచించిన ప్రభుత్వం కొత్త చోట ఏర్పాట్లు చేయలేదు. చివరికి పర్యటననే రద్దు చేయాలని సూచించారంటే వారు ఎలాంటి ఘర్షణ వైఖరీ కోరుకుంటున్నారో స్పష్టమవు తోంది. అయితే ముందస్తుగానే కార్యక్రమం తేదీ నిర్ణయించడంతో పాటు అది ఆదివాసీల సదస్సు కావడంతో రాష్ట్రపతి హాజరయ్యేందుకే ఆసక్తి చూపారు. ఆమె వసతుల కంటే ఆదివాసీలను కలుసుకోవడానికి ప్రాధాన్యమిచ్చి తమ నిబద్ధతను చాటుకున్నారు.
తొలుత సమావేశం నిర్వహించాలనుకున్న డార్జిలింగ్ బిధానగర్‌లో జన సామర్థ్యానికి తగిన స్థలం లేదని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెప్పినా, వాస్తవంగా అక్కడ సదస్సు కోసం భారీ స్థలం అందు బాటులో ఉందని తిరుగు ప్రయాణంలో స్వయంగా చూసిన రాష్ట్రపతే చెప్పారంటే ప్రభుత్వ కుట్రను అర్థం చేసుకోవచ్చు. సదస్సును విఫలం చేయాలనే దురుద్దేశంతో మారుమూల ప్రాంతంలో సదస్సు పెట్టి ప్రజలను రాకుండా చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది ఇక్కడ మరో దురదృష్టకరమైన అంశం ఏమిటంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్కడ ప్రయాణి స్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారా హిత్యంగా వ్యవహరించడంతో ఆ మార్గంలో రోడ్లు అపరిశుభ్రంగా చెత్త తొలగించకుండా కనిపించాయి.
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా రాష్ట్రాల్లో పాటించే ప్రొటొకాల్‌కు సంబంధించి ‘బ్లూ బుక్’ నియామకాలను పాటించాలి. కేంద్ర హోం శాఖ రాష్ట్రాలు పాటించాల్సిన అధికారిక మార్గదర్శకాలతో బ్లూ బుక్ రూపొందిస్తారు. ఇందులో భాగంగా రాష్ట్రపతి సదరు రాష్ట్రానికి వచ్చినప్పుడు గవర్నర్, ముఖ్యమంత్రి లేదా కనీసం ఒక మంత్రి స్వాగతం పలకాలి. దీనిని ‘మినిస్టర్ ఇన్వయిటింగ్’ అంటారు. ఈ నిబంధనను పాటించలేదు. రాష్ట్రపతి వచ్చిన సమయంలో గవర్నర్ మార్పు జరగడంతో ఆయన గైర్హాజరయ్యారు. అయితే ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు మంత్రులెవ్వరూ కూడా విమానాశ్ర యానికి రాకుండా కేవలం మేయర్‌ను పంపి చేతులు దులుపుకున్నారు. నిబంధనల ప్రకారం రాష్ట్రపతి పర్యటనకు ముందు ప్రభుత్వం జిల్లా అధికారులు, పోలీస్ శాఖ, కేంద్ర భద్రతా సంస్థల మధ్య సమా వేశాలు జరిపి సమన్వయం చేసుకోవాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సయోధ్య లేకుండా వ్యవహ రించింది. భద్రతకు సంబంధించి ప్రత్యేక భద్రతా బృందాలు మార్గంతో పాటు సమావేశం వేదిక వద్ద భద్రత నిర్వహణకు ముందస్తు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఇక్కడ సదస్సు ప్రాంగణాన్ని, ప్రయాణ మార్గాన్ని మార్చిన ప్రభుత్వం గందరగోళానికి కారణ మైంది. రాష్ట్రపతి ప్రయాణించే మార్గం పరిశీలించి రోడ్లు, ట్రాఫిక్ పరిస్థితులను అంచనా వేయాలి. చెత్తా చెదారం తొలగించి రోడ్లు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించు కోలేదు. రాష్ట్రపతి భద్రతతో పాటు వారి గౌరవం కాపాడడానికి రూపొందించిన ‘బ్లూ బుక్’ నిబంధన లకు మమత బెనర్జీ తిలోదకాలిచ్చి నూతన రాజకీయ సంప్రదాయాలకు తెరలేపారు.
పశ్చిమబెంగాల్ ప్రభుత్వం రాష్ట్రపతి ప్రొటొకాల్ ఉల్లంఘనను తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోం శాఖ పలు ప్రశ్నలకు సమాధానాలతో కూడిన వివరణను కోరింది. నిబంధనల ప్రకారం రాష్ట్ర సీఎం, ప్రధాన కార్యదర్శి, డీజీపీ రాష్ట్రపతికి ఎందుకు స్వాగతం పలకలేదు? రాష్ట్రపతి కోసం ఏర్పాటు చేసిన వాష్ రూములో నీళ్లు ఎందుకు లేవు? రాష్ట్రపతి కాన్వాయ్ వెళ్లే మార్గంలో చెత్త నిండిపోయినా ఎందుకు పట్టించుకోలేదు? సంబంధిత అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే ప్రశ్నలకు సమాధానాలతో కూడిన వివరణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో రెండు ప్రభుత్వాల మధ్య ప్రొటొకాల్ వివాదం రాజుకుంది.
మమతా బెనర్జీ ప్రభుత్వ తీరుతో కలత చెందిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రొటొకాల్ ఉల్లంఘనను ప్రస్తావిస్తూ… ‘అంతర్జాతీయ సంతాల్ సదస్సుతో పాల్గొనడానికి సిలిగురికి వచ్చిన నన్ను రాష్ట్ర సీఎం, మంత్రులు ఆహ్వానించలేదు. నన్ను పట్టించుకోలేదు. సదస్సుకు తగిన ఏర్పాట్లు చేయలేదు. భారీగా ప్రజలు హాజరుకాని విధంగా ఇరుకైన ప్రదేశంలో సదుస్సును నిర్వహించుకునేలా చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరు కాకపోవడం నన్ను బాధించింది..’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై సీఎం స్పందిస్తూ ‘‘రాష్ట్రపతి హాజరైన సంతాల్ సదస్సును ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహించింది. ఈ సదస్సు ఏర్పాటు చేయడానికి తగినంత సిబ్బంది లేరని ముందే చెప్పాం. ప్రొటొకాల్ ఉల్లంఘన జరగలేదు. ఎన్నికల ముందు బీజేపీ సలహా మేరకు ఈ అంశాన్ని రాష్ట్రపతి ముర్ము రాజకీయం చేస్తున్నారు, ఎన్నికల సమయంలో పదేపదే పర్యటనకు వస్తే ఎలా?’’ అని ప్రశ్నించారు.
మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలతో అధికారం చేపట్టడంలో ఆరితేరిన మమతా బెనర్జీ రాష్ట్రపతి పర్యటనను కూడా ఎన్నికల్లో లబ్ధికి ఉపయోగించు కున్నారు. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో రాష్ట్రపతి ప్రొటొకాల్ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శిస్తున్న మమతనే స్వయంగా ఈ విషయాన్ని ఎన్నికలతో ముడి పెట్టారు. ఆదివాసీల సదస్సుకు, రాష్ట్రపతి పర్యటనకు ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేకపోయినా ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర అధికారులపై ఒత్తిడి తెచ్చి వివాదాస్పదం చేశారు. ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహణ లోని సదస్సుకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మమత వ్యాఖ్యానించడం విడ్డూరం. రాష్ట్రపతి పదవికి గౌరవమిస్తూ పర్యటనకు వచ్చినప్పుడు భద్రత కల్పించడం, సంబంధిత ప్రదేశాల్లో వసతులు కల్పించడం వంటి ప్రొటొకాల్ పాటించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. ఒకవేళ ఎన్నికలున్నాయని భావించినా షెడ్యూల్ ప్రకటించలేదు కాబట్టి కోడ్ కూడా అమలులో లేదు. ఎన్నికల సందర్భంగా ప్రొటోకాల్ వివాదాన్ని రేపుతున్నారని బెంగాల్ సీఎం అనడం కూడా హాస్యాస్పదం. రాష్ట్రపతి కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడా ఎన్నికల విషయాన్ని ప్రస్తావించలేదు. స్వయంగా మమత బెనర్జీనే ఎన్నికలతో ముడి పెడుతూ వ్యాఖ్యానించారు.
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ప్రతి అంశాన్నీ ఎన్నికలతో ముడి పెట్టలేము. దేశంలో అత్యున్నత పదవైన రాష్ట్రపతి హోదాను కూడా తమ స్వార్థ రాజకీయాల కోసం వివాదాస్పదం చేయడం దురదృష్టకరం. రాష్ట్రపతి పర్యటనను వివాదాస్పదం చేస్తూ అవమానించడం క్షమించరాని నేరం. రాష్ట్ర పతిని అవమానించడం అంటే దేశ ప్రజలను అవమానించినట్టే. ఆదివాసీల సంప్రదాయాలకు గౌరవమిస్తూ, రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేస్తే ఇతర రాష్ట్రాలకు పశ్చిమ బెంగాల్ ఆదర్శంగా నిలిచేది. అదీ చేతకాకపోతే చేసిన పొరపాట్లకు కనీసం పశ్చాతాపం వ్యక్తం చేసినా ఇతరులకు స్ఫూర్తిగా నిలిచేవారు. సంచలనం సృష్టించాలనే కుట్రలతో ప్రతీది రాజకీయం చేయాలని చూసే మమతా బెనర్జీ ఇప్పుడు అభాసుపాలయ్యారు. ఈ ఘటన ఆమెకు గుణపాఠం నేర్పిస్తే దేశంలో మరోమారు ఇతరులు ఇలాంటి సాహసం చేయరు.
శ్రీపాద