దక్షిణ ఆసియాలో భారత్, పశ్చిమ ఆసియాలో ఇజ్రాయెల్ ఒకే సమస్యతో దగ్గరవుతున్నాయి. ఈ రెండూ తమ సరిహద్దు దేశాలతో నిత్యం మత వైషమ్యాలతో ఉగ్రవాద సమస్యలను ఎదుర్కొంటున్నాయి. భారత్, పాకిస్తాన్‌ల మధ్య తరచూ జరుగుతున్న ఘర్షణల తరహాలో ఇజ్రాయెల్ కూడా తన చుట్టూ ఉన్న ముస్లిం దేశాలతో ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుంది. ఈ రెండు దేశాల మధ్య ఉన్న ఉగ్రవాద పోరాట సారూప్యంతో ఇజ్రాయెల్ దేశంతో మైత్రీ ఆవశ్యకతను గుర్తించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు ఫలిస్తున్నాయి. చుట్టూ ఉన్న ముస్లిం దేశాలతో నిత్యం పోరాడుతుండే ఇజ్రాయెల్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తే దేశంలో తమ ఓటు బ్యాంకు రాజకీయాలకు ఎక్కడ గండి పడుతుందో అనే జంకుతో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు వెనకడుగేశాయి. అయితే 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక ఇజ్రాయెల్‌పై భారత్ వైఖరిలో వచ్చిన మార్పు ఇరు దేశాలకు ప్రయోజనకరంగా మారింది.


ఇజ్రాయెల్‌లో పర్యటించిన భారత తొలి  ప్రధాని మంత్రిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. అంతకు ముందు దేశ ప్రధాన మంత్రులు ఆచితూచి అడుగులేశారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ మొదలు కొని కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రులు అందరూ అరబ్ దేశాలతో స్నేహాన్ని దృష్టిలో ఉంచుకొని ఇజ్రాయెల్‌తో పరిమిత సంబంధాలు పెట్టుకొని భారత విదేశాంగ విధానంలో పాలస్తీనాకు మద్దతి చ్చారు. నెహ్రూ కాలంలో భారత్‌ను ఇజ్రాయెల్ అధికారికంగా గుర్తించినా సన్నిహితంగా మెలగలేదు. ఇందిరాగాంధీ పాలనలో పాలస్తీనా వైపు మొగ్గు చూపిస్తూ రక్షణ రంగంలో ఇజ్రాయెల్ నుండి సహాయ సహకారాలను రహస్యంగా తీసుకుంటూ బహి రంగంగా ఆ దేశానికి దగ్గరవలేదు. రాజీవ్ గాంధీ హయాంలో సాంకేతిక సహకారం నేపథ్యంలో ఇజ్రాయెల్‌తో సంబంధాలు కొనసాగించాలని ఆలోచన వచ్చినా దౌత్య స్థాయి సంబంధాలకు ధైర్యం చేయలేదు. అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వాలతో పోలిస్తే పీవీ నరసింహారావు పాలనలో ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు అధికారికంగా ప్రారంభ మయ్యాయి. అనంతరం అటల్ బిహారీ వాజపేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఏరియల్ షారోన్ భారత్‌లో పర్యటించి రెండు దేశాల మధ్య నూతన చరిత్రకు నాంది పలికారు. అయితే వామపక్షాల మద్దతుపై ఆధార పడిన మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఇజ్రాయెల్‌తో పరిమితంగానే మెలిగింది. బుజ్జగింపు రాజకీయాలకు ప్రాధాన్యతిచ్చే కాంగ్రెస్, వామపక్షాలు దేశ ప్రయోజనాలను విస్మరించి పాలస్తీనాకు మద్దతిస్తూ ఇజ్రాయెల్‌తో మైత్రీకి వెనకడుగులు వేశాయి.

కోటి జనాభా మాత్రమే ఉండే చిన్న దేశమయిన ఇజ్రాయెల్ సాంకేతిక రంగాన్ని సద్వినియోగం చేసుకుంటూ సాధిస్తున్న ప్రగతి ప్రపంచానికి ఆదర్శం. ఆధునికంగా ఎంత అభివృద్ధి చెందినా తన సంస్కృతికి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ ముస్లిం దేశాలతో వారి నిత్య పోరాటం స్ఫూర్తిదాయకం. అత్యంత పొడి వాతావరణం ఉండే ఆ దేశంలో ఆధునిక పరిజ్ఞానంతో వ్యవసాయ రంగంలో విప్లవాన్ని సృష్టించింది. గంటన్నరలో ఆ దేశంలో ఒకవైపు నుండి మరోవైపుకు వెళ్లవచ్చు. అక్కడ ఒకవైపు పూర్తిగా ఎడారి, ఇసుక బీచ్‌లు ఉంటే, మరోవైపు మంచుతో కూడిన పర్వతాలు ఉంటాయి. ఇంతటి భిన్నవాతావరణంలో ఇజ్రాయెల్ వ్యవ సాయంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. టెక్నాలజీ విషయంలో ఆ దేశానికి ఎదురే లేదు. చిన్న దేశమైనా అక్కడ ఏకంగా మూడు వేలకుపైగా హైటెక్ స్టార్టప్‌లు ఉండడం విశేషం. మరోవైపు చుట్టూ శత్రు దేశాలతో ఎప్పుడూ యుద్దానికి సన్నద్ధంగా ఉండే ఇజ్రాయెల్ అత్యంత శక్తివంతమైన ఇంటెలిజెన్స్‌తో బలమైన రక్షణ వ్యవస్థను కలిగి ఉంది. అత్యంత రహస్యమైన ఇజ్రాయెల్ మోసాద్ నిఘా వ్యవస్థకు ప్రపంచ వ్యాప్తంగా నెట్‌వర్క్ ఉంది. ఆధునిక టెక్నాలజీతో డ్రోన్లు, ల్పుేర్ ఆయుధాలు, ఏఐ వార్ ఫేర్ వంటివి ఇజ్రాయెల్ రక్షణ రంగాన్ని బలోపేతం చేశాయి.

ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ అన్ని రంగాల్లో అభివద్ధి చెందుతున్న ఇజ్రాయెల్‌తో మైత్రీ కొనసాగిస్తూ ప్రధానంగా రక్షణ రంగంలో సహాయ సహకారాలు అందించుకోవాలనే సంక ల్పంతో భారత ప్రధాన మంత్రిగా పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోదీ వ్యూహాత్మకంగా అడుగులేశారు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహూ ఆహ్వానం మేరకు నరేంద్ర మోదీ జూలై, 2017లో ఆ దేశంలో పర్యటించడంతో ఇటు ఇంటా అటు బయట దుమా రమే రేగింది. భారత్‌లోని ముస్లింలు నొచ్చుకుంటా రని పాలస్తీనా పాట పాడే మన దేశంలోని రాజకీయ పార్టీలు దీన్ని తప్పు పట్టాయి. మరోవైపు అరబ్ దేశాలు కూడా నన్నాయి నొక్కులు నొక్కాయి. అయితే మన దేశం ప్రయోజనాలకే పెద్ద పీట వేసిన నరేంద్ర మోదీ చాకచక్యంగా ఇజ్రాయెల్‌కు స్నేహ హస్తం అందిస్తూనే, మరోవైపు అరబ్ దేశాలతో కూడా మైత్రీని కొనసాగించారు. దీంతో రక్షణ రంగం, వ్యవసాయం, నీటి నిర్వహణ, సైన్స్ అండ్ టెక్నాల జీలో భారత్, ఇజ్రాయెల్ మధ్య సంబంధాల్లో నూతన దశ ప్రారంభమైంది. తర్వాత జనవరి, 2018 లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ భారత్‌లో పర్యటిం చడంతో రెండు దేశాల మధ్య బంధం మరింత బలోపేతమయ్యింది. దీనికి కొనసాగింపుగా 2026 ఫిబ్రవరి 18, 19 తేదీల్లో రెండోసారి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించడంతో రెండు దేశాల మధ్య కీలకాంశాలపై వ్యూహాత్మకమైన నిర్ణయాలు జరిగాయి. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి పగ్గాలు చేపట్టకముందే ఇజ్రాయెల్‌తో సంబంధాలపై దఢవైఖరి కలిగి ఉండటం విశేషం. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2006లో ఇజ్రాయెల్ దేశంలో పర్యటించారు. అప్పుడే ఆయన ఇజ్రాయెల్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్‌లో వినియోగించుకోవాలని నిర్ణయించారు.

నరేంద్ర మోదీ 2017 తొలి చారిత్రాత్మక ఇజ్రాయెల్ పర్యటనకు కొనసాగింపుగా 2026లో రెండోసారి నిర్వహించిన పర్యటన రెండు దేశాలకు బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యంగా మారింది. రెండోసారి పర్యటనకు వెళ్లిన నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రసంగించే అరుదైన గౌరవం దక్కింది. నరేంద్ర మోదీని ఇజ్రాయెల్ దేశంలో అత్యున్నత పురస్కారం అయిన ‘స్పీకర్ ఆఫ్ ది కెనెసెట్ మెడల’తో సత్కరించారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే పాలస్తీనా కూడా 2018లో ఆ దేశ అత్యున్నత పురస్కారమైన ‘గ్రాండ్ కలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తైన’ అవార్డును మోదీకి అంద జేసింది. పరస్పరం ఘర్షణ పడే ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాలు నరేంద్ర మోదీకి వారి దేశాల అత్యున్నత పురస్కారాలను ఇవ్వడం భారత్‌కు గర్వకారణం. అంతేకాక ఆయా దేశాల మధ్య ఎలాంటి వైఖరి ఉన్నా భారత్‌కు తమ ప్రయోజనాలే ముఖ్యమనే మోదీ వైఖరీ కూడా ఈ సందర్భంగా స్పష్టం అవుతుంది.

ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రసంగించే అవకా శాన్ని నరేంద్ర మోదీ సద్వినియోగం చేసుకుంటూ రెండు దేశాలు ఎదుర్కొంటున్న ఉగ్రవాదం పెనుముప్పు గురించి సభలో మాట్లాడారు. ఉగ్ర వాదంపై పోరులో రాజీలేదని చెబుతూనే, టెర్ర రిజంపై ద్వంద్వ వైఖరి కొనసాగించే దేశాల తీరును ఎండగట్టారు. రెండు దేశాలు శాంతిని పెంచడంతో పాటు రక్షణ, వ్యవసాయం, వాణిజ్యం, టెక్నాలజీ అన్ని రంగాల్లో కలిసికట్టుగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. మోదీ పర్యటనతో భారత్‌కు టెక్నాలజీ, రక్షణ రంగాల్లో ఇజ్రాయెల్ నమ్మకమైన మిత్ర దేశంగా ఆవిర్భవించింది. మోదీ, నెతన్యాహూ కీలక భేటీ సందర్భంగా ఇరు దేశాల మధ్య మొత్తం 17 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఏఐ, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, తయారీ, సంస్కృతి, నీటి వ్యవస్థ, వ్యవసాయం తదితర రంగాలపై పరస్పర సహకారాన్ని పటిష్టం చేసుకోవడమే లక్ష్యంగా ఒప్పందాలు కుదుర్చు కున్నాయి. వీరి భేటీ సందర్భంగా అమెరికా`ఇరాన్ ఘర్షణ అంశంతో పాటు మధ్య ఆసియా పరిణా మాలు, సంక్షోభాలు కూడా చర్చకు వచ్చాయి.

ఆర్థిక సహకారంలో భాగంగా పరస్పరం పెట్టుబడులను ప్రోత్సాహించుకోవాలని నిర్ణయించు కున్న రెండు దేశాలు ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చేసి త్వరలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. భారత్ యూపీఐ సేవలను ఇజ్రాయెల్‌లో ప్రారంభించాలని నిర్ణయించారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదనకు ఆధునిక సాంకేతిక సాయం కోసం ‘సెంటర్స్ ఆఫ్ ఎక్సెలెన్స’ను ఏర్పాటుచేయాలని రెండు దేశాలు నిర్ణయించాయి. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి, డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీతో వ్యవసాయ రంగంలో పురోగతి సాధించాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా అనేక రాష్ట్రాల్లో ఇండో`ఇజ్రాయెల్ అగ్రికల్చర్ సెంటర్లు ప్రారంభించనున్నారు. నీటి శుద్ధి రీసైక్లింగ్ టెక్నాలజీతో పాటు తాగు నీటి కొరత పరిష్కారానికి రెండు దేశాలు సాయం చేసుకోనున్నాయి. స్టార్టప్‌లు, ఇన్నోవేషన్ రంగంలో భాగ స్వామ్యం నెలకొల్పుకోవాలని, ఏఐ, సైబర్ సెక్యూరిటీ పెంపొందించుకోవడానికి రెండు దేశాలు సంయు క్తంగా పరిశోధన ప్రాజెక్టులు చేపట్టనున్నాయి. వాణిజ్య రంగంలో భాగంగా హైటెక్, ఫార్మా విభాగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉభయ దేశాలు అంగీకరించాయి. ఇరు దేశాల మధ్య 2017 నుండి ఏఐ, సైబర్ సెక్యూరిటీ బయోటెక్, సంయుక్తంగా ఆర్ అండ్ డీ నిధులు వెచ్చింపు, యూనివర్సిటీ – స్టార్టప్‌ల భాగస్వామ్యం, 2018 నుండి ఇన్నోవేషన్, ఫిన్‌టెక్, అగ్రిటెక్, హెల్త్‌టెక్ రంగాల్లో సహకారం వంటి కీలక ఒప్పందాలు ఇప్పుడు 2026లో మోదీ ఇజ్రాయెల్ పర్యటనతో మరింత బలోపేత మయ్యాయి.

రక్షణ రంగంలో ఇజ్రాయెల్ భారత్‌కు కీలక భాగస్వామిగా మారింది. ఉగ్రవాదంపై పోరాటంలో ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఇజ్రాయెల్‌తో అవగాహనకు ప్రధాని నరేంద్ర మోదీ అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. నిఘా వ్యవస్థలో భాగంగా ఉగ్రవాదంపై సమాచార మార్పిడి చేసుకోవడంతో పాటు భద్రత సంస్థల మధ్య సమన్వయం ఏర్పర్చు కోవడమే కాకుండా టెర్రరిజంపై అంతర్జాతీయ వేదికలపై ఒకే అభిప్రాయం కలిగి ఉండాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు. రక్షణ రంగంతో పాటు పౌర అణు ఇంధనం, అంతరిక్ష రంగాల్లో సహకారం పటిష్టతపై ఇరుదేశాల ప్రధానులు చర్చించారు. ఇజ్రాయెల్ నుండి భారత్‌కు అత్యాధునిక ఆయు ధాలు, నిఘా వ్యవస్థలు, డ్రోన్లు, మిస్సైల్ టెక్నాలజీలో సహకారంపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

నిఘా, రక్షణ విభాగాల్లో భారత్, ఇజ్రాయెల్ మధ్య సహకారం ఎంత కీలకమో ఇటీవల పాకిస్తాన్‌పై మనం విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో నిరూపితమైంది. పాక్‌పై దాడుల్లో భారత్‌కు ఇజ్రాయెల్ అందించిన సహకారం కీలక పాత్ర పోషించింది. శాటిలైట్ సాంతికతతో ఉగ్రవాద శిబిరాల గుర్తింపుతో పాటు దాడి చేసే స్పష్టమైన సమయం భారత్‌కు ఉపయోగపడింది. భారత్ వాడిన హీరాన్ డ్రోన్లు వినియోగంతో పాటు నైట్ విజన్ గాగుల్స్‌తో ఉగ్రవాదుల కదలికలను గుర్తించడంలో ఇజ్రాయెల్ టెక్నాలజీ సాయమైంది. అంతే కాక ఇజ్రాయెల్ అందించిన స్నైపర్ రైఫిల్స్, స్పెషల్ గన్స్‌తో లక్ష్య ఛేదన తేలికైంది. ఉగ్రవాదులపై దాడుల్లో రక్షణ, నిఘా రంగాల్లో ఇజ్రాయెల్‌కు ఉన్న అపార అనుభవం ఆపరేషన్ సిందూర్‌లో భారత్‌కు తోడ్పడింది.

దేశ స్వాతంత్య్రం అనంతరం బుజ్జగింపు రాజకీయాలతో ఇజ్రాయెల్‌తో మైత్రీకి గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వెనకడుగు వేశాయి. దీనికి భిన్నంగా ప్రస్తుతం నరేంద్ర మోదీ దేశ ప్రయోజనాలే లక్ష్యంగా ధృఢ సంకల్పంతో వ్యవహరిస్తున్నారు. భారత దేశ వాతావరణ, ప్రకృతి పరిస్థితుల్లో వ్యవసాయం రంగంలో, వాణిజ్యపరంగా ఆధునిక సాంకేతికతలో మన దేశం సరిహద్దుల్లో ఉన్న మత ఛాందస ఉగవ్రాదుల నేపథ్యంలో రక్షణ, నిఘా విభాగాల్లో దేశ ప్రయోజనాలే లక్ష్యంగా వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనే సంకల్పంతో నరేంద్ర మోదీ ప్రత్యేక కృషి తీసుకొని ఇజ్రాయెల్‌తో సత్సం బంధాలు కొనసాగిస్తున్నారు. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లోనే కాకుండా వ్యవసాయ, వాణిజ్య రంగాల్లో కూడా దేశ ప్రయోజనాలకు ఇజ్రాయెల్‌తో సత్సంబంధాలు కచ్చితంగా తోడ్పడుతాయని ఆశిద్దాం.

– శ్రీపాద

About Author

By editor

Twitter
YOUTUBE