రఘూజీ రాజే భోంస్లే (రెండో రఘూజీ) నాగ్‌పూర్ సంస్థానాధీశుడు. ఈయనకు కందకుర్తితో చిత్రంగా పరిచయం కలిగింది. అది కూడా పిండారీల కారణంగా జరగడమే వింత. ఈయన కాలంలోనే అంటే 1800 ప్రాంతంలో పిండారీల బెడద ఎక్కువయింది. పిండారీలు గ్రామాలపై పడి దోచుకుపోయేవారు. అత్యాచారాలు చేసేవారు. చంపడం సర్వసాధారణం. కందకుర్తి సహా, ఈ పరిసరాలు ఆ కిరాతక హంతక ముఠాల అకృత్యాలతో తల్లడిల్లుతున్న సమయంలో ఈ ప్రాంతంలో పిండారీలను అణచివేయవలసిందని ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వం నాగ్‌పూర్ పాలకుడు రాజా రఘూజీ భోంస్లేని ఆదేశించింది. ఆ సమయంలోనే కందకుర్తితో పాటు కందకుర్తికి చెందిన రామభక్తుడు, గొప్ప భాగవతుడు రఘూజీ దృష్టికి వచ్చారు. పేరు శ్రీధర్ మహరాజ్. నాగపూర్‌లో భాగవత సప్తాహం నిర్వహించవలసిందిగా శ్రీధర్ మహరాజ్‌ను రఘూజీ ఆహ్వానించారు. శ్రీధర్ మహరాజ్ వెంట మరొక ఇద్దరు కందకుర్తి గ్రామస్థులు కూడా నాగ్‌పూర్ వెళ్లారు. వారే సంగమ్‌కర్ లేదా సంగమ్‌వార్, నరహరిశాస్త్రి హెడ్గెవార్. ఇక్కడ వార్ అంటే ‘వారు’ అన్న పదానికి కన్నడ రూపమే. హెడ్గె అంటే గ్రామ పెద్ద అని కూడా అర్థం. హెడ్గె, హెగ్డె రెండూ దాదాపు ఒకే అర్ధాన్ని ఇస్తాయి. కర్ణాటకలో గ్రామ పెద్దలనే హెగ్డె అని పిలుస్తారు.
శ్రీధర్ మహరాజ్ భాగవత సప్తాహం పూర్తి చేసి, రాజావారి చేత గజారోహణం కూడా అందుకుని కందకుర్తికి తిరిగి వచ్చేశారు. కందకుర్తిలోని రామాలయ అర్చకత్వం వీరిదే. శ్రీధర్ మహరాజ్ దంపతుల విగ్రహాలు, వారి పాదుకలు కూడా ఇప్పుడు కందకుర్తిలో ఉన్నాయి. ఈ వంశీయులలో ఎనిమిదో తరం వారే కందకుర్తి రామాలయంలో అర్చకులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పాత ఆలయం అలా ఉంచి, దానికి ముందు విశాల ప్రాంగణంలో కొత్త ఆలయం కట్టారు. పాత మూర్తులతో పాటు కొత్తవి కూడా ప్రతిష్టించారు. వీటికీ ఒక గాథ• ఉంది.
శ్రీధర్ మహరాజ్ వెంట వెళ్లిన ఆ ఇద్దరు నాగ్‌పూర్‌లో ఉండిపోయారు. సంస్థానాధీశుడు వారికి ఇళ్లు, ఈనాములు ఇచ్చాడు. నిజానికి నాగ్‌పూర్ వెళ్లి అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని వారు నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణం ఉంది. అది- కందకుర్తిలో మత పరిస్థితులు. నిజాం రాజ్యంతో పాటు, దాని పరిధిలోనే ఉన్న కందకుర్తిలోను హిందువులకు మత స్వేచ్ఛ లేదు. గౌరవం లేదు. గోపాల్ నీల్‌కంఠ్ దాండేకర్ నవల ‘పెను తుపానులో దీపస్తంభం’లో(అనుః రామచంద్ర సదాశివ హల్దేకర్) హెడ్గెవార్ పూర్వీకులు నాగ్‌పూర్‌కు తరలిపోవడం వెనుక ఉన్న అసలు వాస్తవం కనిపిస్తుంది.
కందకుర్తిలోని స్కంధ మందిరం శిథిలమైంది. ఆ ఆలయం స్థానంలో కొత్త ఆలయం కట్టాలని అనుకున్నారు. కానీ ఏ ఆలయం మసీదు గోపురానికి మించి ఉండరాదన్న నిబంధన ఉంది. ఈ నిబంధనను మార్చాలని గ్రామస్థులు అధికారులను కోరినా ఫలితం లేకపోయింది. ఇదీ పరిస్థితి. నాగ్‌పూర్‌లోనే నరహరిశాస్త్రికి పుత్ర సంతానం కలిగింది. ఆయన పేరు మహదేవశాస్త్రి. మహదేవశాస్త్రి కుమారుడు బలీరాంపంత్. బలీరాంపంత్‌కు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమారుడు మహదేవశాస్త్రి. రెండో కుమారుడు సీతారాంపంత్. చివరివాడు కేశవరావ్. ఆయనే కేశవరావ్ బలీరామ్ హెడ్గెవార్. యాదృచ్చికంగా జరిగిన మరొక పరిణామం గురించి కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. అప్పటికే నాగ్‌పూర్ ప్రాంతంలో ఉన్న తెలుగు కుటుంబీకుల ఆడపడుచుతో బలీరాంపంత్ వివాహం జరిగింది. ఆమె పేరు రేవతీబాయి. వీరి పూర్వీకుల స్థలం మంథని, తెలంగాణ. వీరి కుమారుడు డాక్టర్ కేశవరావ్ బలీరామ్ హెడ్గేవార్.
కేశవరావ్ బలీరామ్ హెడ్గెవార్ పుట్టిన సమయంలోనే సంగమ్‌కర్ వంశీయులలో వాసుదేవ్‌శాస్త్రి సంగమ్‌కర్ పుట్టారు. ఈ ఇద్దరు గొప్ప మిత్రులు. సంగమ్‌కర్ బీఏ, ఎల్‌ఎల్‌బీ చేశారు. అప్పటికి సంస్థానాధీశునిగా ఉన్న రాజా లక్ష్మణ్‌రావ్ భోంస్లే దగ్గర దివాన్‌గా చేరారు. కేశవరావ్ బలీరామ్ హెడ్గెవార్, సంగమ్‌కర్, లక్ష్మణ్‌రావ్ ముగ్గురు దాదాపు సమవయస్కులే. స్నేహితులే. సంస్థానాధీశుని మద్దతుతో వాసుదేవశాస్త్రి 1930లో నాగ్‌పూర్ మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. వాసుదేవశాస్త్రి తమ్ముడు వినాయక్ శాస్త్రి, వాసుదేవ్ శాస్త్రి తమ్ముని కుమారుడు రామచంద్రరావు 1958లో కందకుర్తి ప్రాంతానికి తిరిగి వచ్చేశారు. రామచంద్రరావు కొద్దికాలం డాక్టర్జీ ఇంట్లోనే ఉండి చదువుకున్నారు. వీరు చెప్పిన సంగతులు ఈ వ్యాసానికి కొంతవరకు ఉపయోగపడినాయి.
1853 ప్రాంతంలో నాగ్‌పూర్ సంస్థానం కూడా ఆంగ్లేయుల పరమైంది. ఆ సమయంలోనే సంస్థానాధీశుడు లక్ష్మణ్‌రావ్ నాగ్‌పూర్‌లోని కొత్త ఇల్లు కట్టుకుని అందులోకి మారిపోయాడు. కొన్నేళ్లకు ఆ పాత ఇల్లే (మోతేవాడలో) తొలినాళ్లలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయమైంది. వాసుదేవశాస్త్రి సలహా మేరకు లక్ష్మణ్‌రావ్ పాత ఇంటిని డాక్టర్జీకి అప్పగించారు. ఆ సమయంలోనే ఒక సంఘటన జరిగింది. డాక్టర్జీ కుటుంబం కడు పేదరికంలో ఉండేది. సంస్థానాధీశుడు, దివాన్ వాసుదేవశాస్త్రి ఇద్దరూ కూడా ఆర్థికసాయం చేయడానికి ముందుకు వచ్చారు. తనకు వ్యక్తిగతంగా సాయం ఒకటి. సంస్థకు సాయం మరొకటి. తను స్థాపించిన సంస్థకు ఇచ్చిన సాయాన్ని మాత్రమే డాక్టర్జీ స్వీకరించారు. సొంతానికి ఇవ్వజూపిన సాయాన్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. థగ్గులకు తీసిపోని ఆంగ్ల పాలకులు, దారిదోపిడీ పిండారీలు ఈ విధంగా కందకుర్తికి చెందిన హెడ్గెవార్ కుటుంబాన్ని నాగ్‌పూర్ పంపించాయి.
పిఠాపురం బంధం
తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడకు సమీపంలో ఉంటుంది పిఠాపురం. అసలు పేరు పీఠికాపురం. ఇదొక శక్తిపీఠం. పురుహూతికా అమ్మవారు ఇక్కడ వెలిసింది. శ్రీపాద వల్లభేశ్ ఏడు వందల ఏళ్ల క్రితం దత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. హెడ్గెవార్ మూలపురుషుడు ఈయన శిష్యుడే.
నిజామాబాద్ అసలు పేరు ఇందూరు
నిజామాబాద్‌ను ఇప్పుడు కూడా కొందరు ఇందూరు అని పిలుచుకుంటారు. రాష్ట్రకూట వంశీయుడైన ఇంద్రవల్లభుని పేరు మీదుగా ఈ నగరం ఏర్పడింది. దీనికే 1905లో నిజాం పేరు మీదుగా నిజామాబాద్ అని నామకరణం చేశారు. ఇందుకు నిజాం ప్రభువులు చెప్పిన కారణం వింతగా ఉంటుంది. ఇందూరు అని చెబుతుంటే, దేశంలో కొందరు ఇందోర్ (మధ్యప్రదేశ్) అనుకుని తికమక పడుతున్నారట. అందుకు ఇందూరు పేరును తొలగించి ఈ పేరు పెట్టారట. ఇంద్రవల్లభుడు రాష్ట్రకూట వంశీయుడు రెండో అరికేసరి మనుమడు. అంటే కూతురు కొడుకు.