వేంగి చాళుక్య అని కూడా పేరొందిన తూర్పు చాళుక్య రాజవంశం, క్రీ.శ. 624-1189 వరకు దక్కన్‌ను ఎక్కువ కాలం పాలించిన రాజవంశం. ఇదే కాలం ప్రాకృత భాష, పూర్వ కాలాల లిపి నుంచి తెలుగు లిపి, కవిత్వం సహా సాహిత్యం, సంస్కృతి అభివృద్ధికి ప్రసిద్ధి చెందింది. వేంగి రాజవంశం వాతాపికి చెందిన బాదామి చాళుక్యుల నుంచి ఉద్భవించింది. రెండవ పులకేశి బలహీనులైన విష్ణుకుండినుల నుండి ఈ భూభాగాన్ని స్వాధీనం చేసుకుని తన సోదరుడు కుబ్జ విష్ణువర్థనుడిని వేంగి సింహాసనంపై కూర్చుండబెట్టాడు. వీరి సుదీర్ఘ పాలన కాలం తెలుగు భాష అన్ని కోణాల్లోనూ అభివృద్ధి చెందడానికి దోహదపడింది. ఈ కాలంలో 40 అక్షరాల మౌర్య బ్రాహ్మి లిపి 56 అక్షరాల తెలుగు ‘లిపి’గా పరిణామం చెందింది. పాలనాధికారం విష్ణుకుండినుల నుండి వేంగికి పరివర్తన చెందినట్లు నాణేలు కూడా చూపిస్తున్నాయి. విష్ణుకుండినుల నాణేలు విలక్షణమైనవి. అవి సింహం, కలశం బొమ్మలను కలిగి ఉన్నాయి (చిత్రం 1). వేంగి చాళుక్యులు సింహ చిహ్నాన్ని నిలుపుకున్నారు కానీ కలశ చిహ్నాన్ని శ్రీవత్స చిహ్నంగా మార్చారు (చిత్రం 2). వేంగి చాళుక్య నాణేలను రాగి, వెండి, బంగారం లోహాలతో జారీ చేశారు.
సాధారణ విష్ణుకుండినుల రాగి నాణెం:

బొమ్మ: శ్రీవత్సవ విగ్రహం, అర్ధ చంద్రుని చిహ్నాలతో నోరు తెరిచి ఉన్న సింహం.
బొరుసు: కిరణాల అంచులతో పొదిగి, రెండు వైపులా త్రిశూలాలు కలిగిన కలశం.
సాధారణ వేంగి చాళుక్య రాగి నాణెం:
బొమ్మ: పైన చిహ్నంతో కుడివైపు ముఖంగా ఉన్న సింహం.
బొరుసు: కిరణాల అంచులతో పొదిగి ఇరువైపులా దీపస్తంభాలతో శ్రీవత్స చిహ్నం.
వేంగి చాళుక్యుల వెండి, బంగారు నాణేలు:
విష్ణుకుండినుల వెండి, బంగారు నాణేల వివరాలు తెలియవు. వేంగి చాళుక్యులు ఒక ప్రత్యేక రకమైన బంగారు, వెండి నాణేలను విడుదల చేశారు. బెజ్జాలు వేయడం ద్వారా చిహ్నాలను ముద్రించే పద్ధతిని తిరిగి ప్రవేశపెట్టారు. అన్నింటికీ మధ్యలో ఒక పంది లేదా వరాహ చిహ్నం ఉంది. అంచున ఎనిమిది చిహ్నాలు ఉన్నాయి. కైవారం చిహ్నాలలో శ్రీ, కమలం రెండు చోట్ల ఉన్నాయి. రాజు పేరును సూచించే ఇతిహాసాన్ని వెల్లడించడానికి నాలుగు చిహ్నాలు ఉన్నాయి. ఇటువంటి నాణేలు 1946లో ధవళేశ్వరం ఖజానాలో బైటపడ్డాయి. 
వీటిని మద్రాసు మ్యూజియంలో భద్రపరిచారు. తూర్పు చాళుక్యుల బంగారు నాణేల మరొక గుట్ట 1896లో గూడూరులో బైటపడింది. ఆశ్చర్యకరంగా, ఈ రాజవంశం బంగారు నాణేలు 1933లో బర్మాలోని అరకాన్ తీరంలో సుదూర దీవులలో వెలుగులోకి వచ్చాయి. ఇది వేంగి చాళుక్యులు, అరకాన్ రాజుల మధ్య సముద్ర వాణిజ్యాన్ని సూచిస్తుంది. వేంగి చాళుక్యులు నాలుగు శతాబ్దాలకు పైగా పరిపాలించినప్పటికీ వారి నాణేలు చాలా అరుదు అని చెప్పవచ్చు. ఈ రాజవంశానికి చెందిన వెండి, బంగారు నాణేల ప్రాథమిక రూపకల్పన చిత్రం 3లో చూడవచ్చు.
చిత్రం 3: చాళుక్యుల (బాదామి, కళ్యాణ), కాకతీయుల వెండి, బంగారు నాణేల ప్రాథమిక రూపకల్పన ఒకేలా ఉంటుంది. వాటన్నింటికీ మధ్యలో వరాహం ఉంది. చాళుక్యుల కాలంనాటి నాణేల కైవారంలో రెండు శ్రీలు, రెండు కమలాలు ఉన్నాయి. కాకతీయ కాలంనాటి నాణేల కైవారంలో నాలుగు శ్రీలు, నాలుగు కమలాలు ఉన్నాయి. నాణేలపై కాకతీయ ఇతిహాసాన్ని వెల్లడించడానికి రెండు చిహ్నాలు, వేంగి, కళ్యాణి చాళుక్యుల ఇతిహాసాన్ని వెల్లడించడానికి నాలుగు చిహ్నాలు ఉన్నాయి. ఇతిహాసం అసంపూర్ణంగా ఉన్నప్పటికీ, పాలకులను వారి బిరుదులలో పేరుతో గుర్తించవచ్చు.

డా।। దేమె రాజారెడ్డి
న్యూరో సర్జన్, అపోలో