కందకుర్తికి నడిబొడ్డు అనదగిన ప్రదేశంలో స్కంద మందిరం ఉంది. తూర్పు ముఖంగా దీనిని నిర్మించారు. ఏడువందల ఏళ్ల నాటి ఈ మందిరం శిథిలమైంది. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకర్తలు, కొందరు గ్రామస్తులు కలసి కొత్త ఆలయ నిర్మాణం చేపట్టారు. నిర్మాణంలో ఉన్న ఈ మందిరానికి కొన్ని అడుగుల దూరంలోనే తూర్పు ముఖంతో హెడ్గెవార్‌ ‌కుటుంబీకుల ఇల్లు ఉండేది. అది చాలా కాలం క్రితం కూలిపోయింది. ఇప్పుడు అదే చోట కేశవ స్మృతిమందిరం నిర్మించారు. ఇందులో మూడు ప్రతిమలు ఉంటాయి. ఎడమ పక్కన భారతమాత విగ్రహం, మధ్యలో చెన్న కేశవనాథ్‌ ‌రాజ్‌ ‌ప్రతిమ, కుడి పక్కన డాక్టర్జీ విగ్రహం ప్రతిష్టించారు. అన్ని కులాల వారు దీనిని శుభకార్యాలకు వినియోగించుకుంటున్నారు. అయితే పునర్నిర్మాణంలో ఉన్న కేశవ స్మృతి మందిరాన్ని 2026 ఏప్రిల్‌ 11‌న పరమపూజనీయ సర్‌సంఘచాలక్‌ ‌డాక్టర్‌ ‌మోహన్‌భాగవత్‌ ‌ప్రారంభిస్తారు.

ఇం‌దులో ప్రతిష్టించిన చెన్నకేశవనాథ్‌ ‌రాజ్‌ ‌విగ్రహానికి కూడా పెద్ద చరిత్ర ఉంది. ఈ చరిత్ర చాలు, ముస్లింల దాష్టీకం ఆ కాలంలో ఏ విధంగా చెలామణీ అయినదో చెప్పడానికి! బోధన్‌లో వంద స్తంభాల ఆలయం ఉండేది. తుగ్లక్‌ ‌దండయాత్రకు వచ్చినప్పుడు ఆ ఆలయం మీద దాడి జరుగుతుందని అనుమానించి ఆ ప్రతిమను అక్కడే ఒక భూగృహంలో ఉంచి రహస్యంగా పూజాదికాలు నిర్వహించేవారు. ఎందుకో మరి తరువాత ఆ ప్రతిమను ఒక చెరువులో పడేశారు. ఇది తెలిసిన కందకుర్తి బ్రాహ్మణులు కొందరు వెళ్లి ఆ ప్రతిమను వెలికి తీసి కందకుర్తి తరలించుకువచ్చారు. ఇక్కడ కూడా భూగృహంలో ఉంచే అర్చన చేసేవారు. నిజాం పతనం తరువాత ఆ మూర్తికి భూగృహం నుంచి విముక్తి దొరికింది. ఈ చెన్నకేశవనాథ్‌ ‌రాజ్‌ ‌హెడ్గెవార్‌ల కులదైవం. మహారాష్ట్రలో తండ్రి పేరును కుమారుడు తన పేరులో కలుపుకుని చెప్పే సంప్రదాయం ఉన్నమాట నిజమే అయినా, డాక్టర్‌ ‌కేశవరావ్‌ ‌బలిరామ్‌ ‌హెడ్గేవార్‌లోని కేశవ మాత్రం చెన్నకేశవనాథ్‌ ‌రాజ్‌ ‌లోనిదే. ఈ సంగతిని డాక్టర్‌ ‌హెడ్గెవార్‌ అన్న సీతారామశాస్త్రి (పంత్‌) ‌కందకుర్తి వాసులకు చెప్పారు. ఆయన మాత్రం వివిధ సందర్భాలలో మూడుసార్లు తమ పూర్వీకుల స్వస్థలాన్ని దర్శించుకున్నారు. డాక్టర్‌ ‌హెడ్గెవారు తన పూర్వీకుల గ్రామానికి వచ్చే అవకాశం దక్కలేదు. కానీ ఆయన మదిలో ఈ ఊరి పేరు ఎప్పుడూ పదిలంగానే ఉండేది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత నిజామాబాద్‌ ‌తదితర ప్రాంతాల నుంచి ఎందరో పొట్ట చేత పట్టుకుని బొంబాయి నగరం వెళ్లారు. డాక్టర్‌ ‌హెడ్గెవార్‌ ఎప్పుడు బొంబాయి వెళ్లినా అలవాటు ప్రకారం బాలలతో కొద్దిసేపు మాట్లాడి, మిఠాయిలిచ్చి పంపుతూ ఉండేవారు. అయితే ఇందులో నిజామాబాద్‌ ‌ప్రాంతం నుంచి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా? అని తరచూ అడిగేవారు. తరువాత కందకుర్తి పేరు విన్నారా? అని అడిగేవారు. ఒకసారి ఇద్దరు అబ్బాయిలు తాము (వీరి మనుమలు ఇప్పుడు కందకుర్తిలో ఉన్నారు. ఈ ఫొటోలు తీసిన యువకుడు ఆ కుటుంబానికి చెందినవాడే) కందకుర్తివారమని చెప్పగానే, ఆ గ్రామం గురించి ఎన్నో ప్రశ్నలు వేశారు. ఆ గ్రామం ఎక్కడ ఉంది? ఎలా ఉంది? ఎవరు, ఏమిటి? వంటి వివరాలన్నీ అడిగేవారు.

-దేవోళ్ల గోవింద్‌
‌కందకుర్తి

About Author

By editor

Twitter
YOUTUBE