వాట్సప్, మెటా సంస్థలకు వ్యతిరేకంగా నాలుగైదేళ్లుగా పిటిషన్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఒక్కసారిగా ఆ సంస్థల మీద విరుచుకుపడింది. “మా రాజ్యాంగాన్ని అనుసరించదలచుకోని పక్షంలో మీరు మా దేశం విడిచి వెళ్లిపోండి” అంటూ ఈ సంస్థలకు సర్వోన్నత న్యాయ స్థానం అల్టిమేటం జారీ చేసింది. వాట్సప్, దాని మాతృసంస్థ మెటా 2021లో రూపొందించి, అమలు చేస్తున్న ఒక విధానానికి వ్యతిరేకంగా తమకు అందిన పిటిషన్లపై సుప్రీంకోర్టు స్పందించింది. వాణిజ్య ప్రకటనలు, మార్కెటింగ్, వాణిజ్య ప్రయోజనాల కోసం వాట్సప్, మెటా సంస్థల తమ వద్ద ఉన్న వినియోగదారుల సమాచారాన్ని ఫేస్‌బుక్, తదితర తమ గ్రూప్ సంస్థలతో పంచుకోవడానికి ఈ 2021 విధానం అవకాశం కల్పిస్తుంది. ఈ విధంగా సమాచారం పంచుకుంటున్నందుకు ‘కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ సంస్థ ఈ వాట్సప్, మెటాలకు రూ. 213.14 కోట్లు జరిమానా విధించింది. దీనిని సవాలు చేస్తూ ఈ రెండు సంస్థలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.
ప్రభుత్వ సంస్థ అయిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాట్సప్, మెటా సంస్థలు అనుసరిస్తున్న విధానాన్ని ‘దోపిడీవిధానం’గా అభివర్ణించారు. వినియోగదారుల సమాచారాన్ని వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం దేశ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమని, ఇదొక దోపిడీ విధానమని ఆయన ఘాటుగా విమర్శించారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ స్పందిస్తూ, “మా రాజ్యాంగాన్ని అనుసరించని పక్షంలో మీరు ఈ దేశం విడిచి వెళ్లిపోండి. మేం మా పౌరుల గోప్యతను దుర్విని యోగం కానివ్వం” అని స్పష్టం చేశారు. వాట్సప్, మెటాలు అనుసరిస్తున్న విధానం భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందని, వినియోగ దారుల్ని బలవంతంగా తమ విధానాన్ని అనుసరించేలా చేస్తూ, ఇదెంతో విలువైన విధానంగా ఎలా చెప్పగలుగుతున్నారని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. “మా విధానాన్ని అనుసరించండి. లేని పక్షంలో వాట్సప్ అకౌంట్‌ను క్లోజ్ చేయండి” అని వాట్సప్, మెటాలు వినియోగదార్లకు చెప్పడం రాజ్యాంగం ప్రకారం పౌరుల స్వేచ్ఛకు, ప్రాథమిక హక్కులకు విరుద్ధమని న్యాయమూర్తి జయమాల్య బాగ్చీ వ్యాఖ్యానించారు. పైగా తమ విధానానికి ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందని ఈ సంస్థలు చెప్పడం విడ్డూరంగా ఉందని, ఇది పూర్తిగా కట్టుకథ అని ఆయన విమర్శించారు.
ప్రజల హక్కులకు భంగం
ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తూ, వినియోగదారుల సమాచారాన్ని ఇతర సంస్థలతో పంచుకోవడం చట్ట విరుద్ధమని, ఇటువంటి కార్యకలాపాలను తాము అనుమతించమని స్పష్టం చేశారు. “ఇష్టం లేకపోతే ఖాతా మూసేయండని, దీని నుంచి వెళ్లిపోండని చెప్పడానికి మీరెవరు? ఇది సమాచారాన్ని చోరీ చేయడం కాకపోతే మరేమిటి? మొత్తం మార్కెట్ మీద మీరే ఆధిపత్యం చెలాయిద్దామనుకుంటున్నారా? మీకు పోటీ ఉండకూడదనుకుంటున్నారా?” అని ఆయన తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. “మీకు మీ వాణిజ్య ప్రయోజనాలేమిటో తెలుసు. వినియోగ దార్లను మీ వాట్సప్, ఫేస్‌బుక్‌లకు బానిసలను చేసి, ఆ తర్వాత వారి మీద ఒత్తిడి తీసుకు వస్తున్నారు. వినియోగదార్లు గత్యంతరం లేక మీ సంస్థకే కట్టుబడి ఉండేలా చేస్తున్నారు. మీరు గుత్తాధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు” అని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
వాట్సప్, మెటా సంస్థలు దాఖలుచేసిన పిటిషన్లతో పాటు కాంపీటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్లను, కొందరు వినియోగదార్లు సమర్పించిన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నాయకత్వంలోని ధర్మాసనం పరిశీలించింది. “కొద్దిపాటి సమాచారాన్ని కూడా మేం పంచుకోనివ్వం. ఈ దేశ ప్రజల గోప్యతతో మీరు ఆడుకోవడం, వారి గోప్యతను దుర్వినియోగం చేయడం ఇక్కడ జరగనివ్వం. గోప్యతకు సంబంధించి ప్రజల హక్కులను కాపాడడంలో రాజీపడే ప్రసక్తే లేదు. ప్రజల హక్కులను ఎవరూ ఎటువంటి పరిస్థితు ల్లోనూ ఉల్లంఘించడానికి వీల్లేదు” అని ధర్మాసనం స్పష్టం చేసింది. “దేశ ప్రజల గోప్యతను హుందాగా, దర్జాగా దోపిడీ చేయడం జరుగుతోంది. ఈ చౌర్యాన్ని కొనసాగనివ్వం. దేశ ప్రజల హక్కులను దుర్వినియోగం చేయడానికి, ఉల్లంఘించడానికి అవకాశమివ్వం. మీరు ఇటువంటి పద్ధతులకు, ఆలోచనలకు ఇక స్వస్తి చెప్పడం శ్రేయస్కరం” అని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది.
వాట్సప్ సమర్థన
వాట్సప్, మెటా సంస్థల తరఫున ముకుల్ రోహత్గి తన వాదన ప్రారంభిస్తూ, దాదాపు ఇదే రకమైన కేసొకటి రాజ్యాంగ ధర్మాసనం పరిశీలనలో ఉందని చెప్పారు. తాము వినియోగదారుల దగ్గర ఒక్క పైసా కూడా వసూలు చేయడం లేదని, ఉచితంగా సేవలనందిస్తున్నామని చెప్పారు. అరుణ్ కత్పాలియా అనే మరో న్యాయవాది వాదిస్తూ, వినియోగదారుల పూర్తి సమాచారాన్ని తామెవరితోనూ పంచుకోవడం లేదని, కొద్ది సమాచారాన్ని మాత్రమే పంచుకుంటున్నారని తెలిపారు. ఫిబ్రవరి 9 తర్వాత మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి ధర్మాసనం నిర్ణయించుకుంది. అయితే, ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని ఫిబ్రవరి 23కు వాయిదా వేసింది. తాము ప్రజల సమాచారాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇతర సంస్థలతో పంచుకోమని చెబుతూ ఒక అఫిడవిట్‌ను అందజేయాలని ధర్మాసనం వాట్సప్, మెటా సంస్థలను ఆదేశించింది. ఇవి గనుక ఇటువంటి అఫిడవిట్ అందజేయని పక్షంలో ఇవి కాంపిటీషన్ కమిషన్ ఆప్ ఇండియా, నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రైబ్యునల్ (ఎన్.సి.ఎల్.ఏ.టి) వంటి సంస్థల చర్యలను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయడం జరుగుతుందని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది.
వాట్సప్ విధానం కొద్దిగా వివాదాస్పదంగా తయారైంది. “ఫేస్ బుక్ గ్రూప్ కంపెనీల్లో ఒకటైన వాట్సప్ సంస్థకు సమాచారాన్ని సేకరిం చడం, దాన్ని ఈ గ్రూపులోని ఇతర సంస్థలతో పంచుకోవడం జరుగుతుంది. మేం సేకరించిన సమాచారాన్ని మేం ఉపయోగించుకుంటాం. మేం పంచిన సమాచారాన్ని మా గ్రూప్ సంస్థలు ఉపయోగించుకుంటాయి. మా సంస్థలు వృద్ధి చెందడానికి, మెరుగుపడడానికి, పనిచేయడానికి, అవగాహన పెంచుకోవడానికి, వినియోగదార్లకు సన్నిహితం కావడానికి, మా సేవలను మార్కెట్ చేసుకోవడానికి, వాటికి ప్రచారం కల్పించుకోవ డానికి మేం విలువైన సమాచారాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది” అని 2021 నాటి వాట్సప్ విధానం తెలియజేస్తోంది. ఈ విధానం ప్రకారం, వాట్సప్, ఫేస్‌బుక్ వినియోగదార్లు ఇందుకు అంగీకరించడం లేదా కట్టుబడిఉండడం జరగాలి. లేని పక్షంలో వారి అకౌంట్లను క్లోజ్ చేయాల్సి ఉంటుంది.
ఈ విధానాన్ని విడుదల చేసిన తర్వాత వాట్సప్ సంస్థ ఒక వివరణ కూడా జారీ చేసింది. వినియోగదార్లు తమ బంధువులు, స్నేహితులకు పంపించే లేదా వారి నుంచి తీసుకునే మెసేజుల్లోని సమాచారం జోలికి తాము వెళ్లమని, కేవలం వారు తమ గురించి ఇచ్చిన వివరాలను, ఇతరత్రా అందులో ఉన్న వ్యాపార సంబంధమైన విషయాలను మాత్రమే సేకరించడం జరుగు తుందని అది ఆ వివరణలో తెలిపింది. ఇటువంటి సమాచారాన్ని సేకరించి ఫేస్‌బుక్ అడ్వర్టయిజింగ్‌కు ఉపయోగించడం జరుగుతుందని కూడా అది వివరించింది.
అయితే, అనేక పిటిషన్లను, సవాళ్లను పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రెండు సంస్థలను నిలదీసింది. ‘మా సంస్థల్లో ఖాతాలు ఉంచుకోదలచుకుంటే మా విధానాన్ని అనుసరించండి. మా విధానం నచ్చకపోతే వెంటనే నిష్క్రమించండి’ అంటూ వాట్సప్ పేర్కొన డాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. దేశం లోని కోట్లాది అమాయక ప్రజల హక్కులకు ఇది పూర్తిగా భంగకరమని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
– జి.రాజశుక, సీనియర్ జర్నలిస్ట్