విజయవాడలో విజయవంతంగా ఏకాత్మ మానవ దర్శన ‘పునర్దర్శన’ సభలు
‘విజయవాడలో 1965 నాటి భారతీయ జనసంఘ్ సమావేశాలను కళ్లారా చూడలేని వారమంతా ఈ రోజు ఆ చారిత్రక సన్నివేశాన్ని అదే నేల మీద పునర్దర్శనం చేసుకుంటున్నాం. ఆనాడు ఏకాత్మ మానవతావాదం పేరుతో ఇక్కడే ఆవిష్కృతమై ఈనాడు మనమంతా సమున్నతంగా భావిస్తూ, పిలుచుకుంటున్న ఏకాత్మ మానవ దర్శనం నుంచి ఎలా స్ఫూర్తి పొందాలో నేర్చుకోవడానికి ఇక్కడ సమావేశమయ్యాం’ అన్నారు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. నిజమైన రాజకీయ తాత్త్వికత కాలపరీక్షకు నిలుస్తుంది. రుషితుల్యుడు పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ 1965లో విజయవాడలో జరిగిన భారతీయ జనసంఘ్ 12వ వార్షిక మహాసభలలో ఏకాత్మ మానవ దర్శన సిద్ధాంతాన్ని పరిచయం చేశారు. ఆ గొప్ప చారిత్రక సందర్భాన్ని స్మరించుకుంటూ, జనసంఘ్ ఆధునిక రూపం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ విజయవాడలో పునర్దర్శన సభలు ఏర్పాటు చేసింది. జనవరి 23, 24-2026 తేదీలలో ఇవి జరిగాయి. ఆనాడు ఆ చారిత్రక సన్నివేశానికి వేదిక అయిన మునిసిపల్ స్టేడియం గ్రౌండ్స్ (నేడు ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ క్రీడా ప్రాంగణం, బందర్ రోడ్డు)లోనే పునర్దర్శన సభలు ఏర్పాటయ్యాయి.
ఆనాటి స్ఫూర్తిని కొనసాగించడానికి ఇవాళ కూడా శ్రీకృష్ణదేవరాయ నగర్ అన్న పేరే పెట్టారు. సభా ప్రాంగణం రెండు రోజుల పాటు భారతమాతాకీ జై, వందేమాతరం నినాదాలతో మార్మోగింది. 1965 నాటి సభలకు ప్రత్యక్ష సాక్షులు ఆచార్య ముదిగొండ శివప్రసాద్, జూపూడి హైమవతమ్మ కూడా పాల్గొని సభకు వన్నె తెచ్చారు. నాటి తమ అనుభవాలను, ఆనాటి నేతల విరాడ్రూపాలను, ఆ సిద్ధాంతం స్వతంత్ర భారత చరిత్ర మీద పరిచిన నీడను వారు ఈ తరం జాతీయవాదులకు ఎరుక పరిచారు. ఎన్నో ఆశలతో తెచ్చుకున్న స్వతంత్ర భారతదేశం ఎదుర్కొంటున్న దుస్థితికి ఒకసారి దుఃఖించారు. కానీ ఏకాత్మ మానవ దర్శన ప్రాసంగికతకు మురిసి పోయారు. అంతరాలు లేని, వైషమ్యాలు లేని ప్రపంచ నిర్మాణానికి మిగిలి ఉన్న సిద్ధాంతంగా ఇవాళ్టి జాతీయవాదులు నమ్మకాన్ని ప్రకటిస్తున్నందుకు మాత్రం వారు సంతుష్టులయ్యారు.
నిజంగానే.. 1965 నాటి చారిత్రక దృశ్యాన్ని పునఃసృష్టించేందుకు ఏపీ బీజేపీ నేత మాధవ్, రాష్ట్ర బీజేపీ, విజయవాడ శాఖ కార్యకర్తలు పడిన శ్రమ శతథా శ్లాఘనీయం. జాగృతి వారపత్రిక, సారస్వత నికేతన్ (వేటపాలెం గ్రంథాలయం), ఇతర వనరుల ద్వారా సేకరించిన చిత్రాలతో అప్పటి సభా కార్యక్రమాల సన్నివేశాలను రూపుకట్టించారు. ఆరు దశాబ్దాల నాటి పాత పుస్తకాలలోని ఫొటోలను కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇటీవల తీసిన ఛాయాచిత్రాలతో సమంగా తయారు చేయించారు.
శ్రీకృష్ణదేవరాయ నగర్ పేరుతో నిర్మించిన నాటి సభావేదిక స్వాగత ద్వారాన్ని మరపిస్తూ అదే నమూనాను రమ్యంగా తిరిగి ఏర్పాటు చేశారు. 1965 నాటి ప్రపంచంలోకి ఈ స్వాగత ద్వారమే తీసుకుపోయింది. రాయలు, దీనదయాళ్, వివేకానంద, నేతాజీబోస్ విగ్రహాలు కూడా పెట్టారు. వీటన్నిటి మధ్య అంతర్లీనమైన ఒక ఏకాత్మత ఉంది. శ్రీకృష్ణరాయలవారికీ, విజయవాడకీ అనుబంధం ఉంది. గజపతులమీద విజయం తరువాత తిరిగి వెళుతూ రాయలవారు విజయవాడలో ఆగారు. తెలుగు సాహిత్యంలో అనర్ఘరత్నంగా కీర్తిగడించిన వారి ప్రబంధం ‘ఆముక్తమాల్యద’ రచన ఇక్కడే జరిగింది. పైగా తిథుల ప్రకారం జనవరి23 ప్రాంతంలో రాయలవారి పట్టాభిషేక చారిత్రక ఘట్టం కూడా జరిగింది. జనవరి 23 నేతాజీ జయంతి. 24వ తేదీ లాలా లాజపతిరాయ్ జయంతి.
ప్రారంభ సమావేశంలో బీజేపీ సంఘటనామంత్రి బీఎల్ సంతోష్, కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఏపీ ఆరోగ్యమంత్రి సత్యకుమార్‌యాదవ్, విష్ణుకుమార్‌రాజు (ఏపీ శాసనసభలో బీజేపీ పక్షనేత) ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు (ఎమ్మెల్సీ), దగ్గుబాటి పురందేశ్వరి (ఎంపీ), పాకా సత్యనారాయణ (ఎంపీ, రాజ్యసభ), వై.ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు ఎమ్మెల్యే) పాల్గొన్నారు.
ఆరు దశాబ్దాల తరువాత ఇలాంటి ‘పునర్దర్శనం’ ఏర్పాటు చేయడం వెనుక భూమికను మాధవ్ వివరించారు. ప్రవచనానికి ఎప్పుడు విలువ వస్తుందో ఒక సందర్భంలో కవి, రాజనీతి కోవిదుడు అటల్ బిహారీ వాజపేయి కవితా రూపంలో చెప్పిన మాటలను మాధవ్ గుర్తు చేశారు. సిద్ధాంతాలు, ప్రవచనాలు వినడానికి పరిమితం చేసుకునేవికావు. వాటిని ఆచరించాలి అప్పుడే అవి అమతá ప్రాయ మవుతాయి అన్నదే దాని సారాంశం. ఈ సందర్భంలోనే దీనదయాళ్ జీవిత విశేషాలను గుర్తు చేశారు. ఎంతో పేదరికం నుంచి ఆయన వచ్చారు. స్వయంసేవక్‌గా, జనసంఘ్ నేతగా, సంఘటనా స్రష్టగా, మహోన్నత చింతనాపరునిగా ఆయన ప్రస్థానం గురించి మాధవ్ చెప్పారు. అలాంటి మహానుభావుడికి ప్రాప్తించిన దుర్మరణాన్ని గుర్తు చేసుకుని విచారం ప్రకటించారు. రైలులో బయలు దేరిన దీనదయాళ్ మొగల్‌సరాయ్‌లోని రైల్వేస్టేషన్ దగ్గర విగతజీవిగా కనిపించారు. ఆయన అప్పుడు జనసంఘ్ జాతీయ అధ్యక్షులు.

ఆరు దశాబ్దాల క్రితం ప్రపంచం దారుణమైన సిద్ధాంత రాద్ధాంతంలో కూరుకుపోయింది. కమ్యూనిజమే అంతిమ సత్యమన్నమన్నది ఒక శిబిరం. పెట్టుబడిదారీ విధానానిదే అంతిమ సత్యమని మరొక శిబిరం విజృభించి, స్వైరవిహారం చేసిన సమయమది. ఈ రాద్ధాంతంలో మనిషితనం తప్పిపోయింది. బుద్ధి అనే భావన బుట్టదాఖలయి పోయింది. నైతిక సామాజిక విలువల మధ్య శతాబ్దాల పాటు మానవాళి బుద్ధిని భద్రంగా ఉంచిన ఆధ్యాత్మిక చింతన అపహాస్యానికి గురైంది. ఈ గందరగోళానికి కారణం ఆ సిద్ధాంతాలు ఘర్షణను నమ్మడమే. ఆచరణలో ఆరు లేదా ఏడు దశాబ్దాలు మాత్రమే రాజ్యమేలి నిష్క్రమించాయి అవన్నీ. ఈ పరిస్థితిని ముందే ఊహించింది ఏకాత్మ మానవ దర్శనం. అందుకే ఏకాత్మ మానవ దర్శనం విశ్వానికి ఒక శాశ్వత పరిష్కారమని గుర్తించాలి అన్నారు మాధవ్. ఆనాడు ఇక్కడ చేసిన తీర్మానాలలోని విషయాలు ఇవాళ వాస్తవాలుగా మన కళ్లముందు ఉన్నాయి. ప్రాంతీయ భాషలు బతకాలని నాటి సమావేశం ప్రభుత్వాన్ని కోరింది. అలాగే సంస్కృత భాష శాస్త్రీయతను గుర్తించాలని కూడా జనసంఘ్ ఆశించింది.
ఒక రాజకీయ తాత్త్వికత జీవితకాలం ఆరు దశాబ్దాలేనా? లేదా ఏడెనిమిది దశాబ్దాలకు అంత మయ్యే సూచనలు స్పష్టంగా ఉన్న విదేశీ రాజకీయ సిద్ధాంతం కోసం కాలపరీక్షకు నిలిచిన జీవన విధానాన్ని, జీవన శైలిని కకావికలు చేసుకోవడాన్ని ప్రగతి పథంగా భావించే దౌర్భాగ్యం ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానం ఒక్కటే – బానిసబుద్ధి. వలసవాద మనస్త్తత్త్వం నుంచి బయటపడలేని తనం. మనిషిని యంత్రంలో ఒక భాగంగానే పరిగణిస్తూ, కట్టుబానిసలా బతకమంటుంది కమ్యూనిజం. విచ్చలవిడి స్వేచ్ఛను ఇచ్చి మనిషిని సర్వ విలువల నుంచి సుదూరంగా నెట్టివేసే వాతావరణం పెట్టుబడిదారీ విధానం సొంతం. బలవంతుడిదే రాజ్యమన్న ఆదిమ కాల సూత్రాన్ని కొత్త కొత్త పేర్లతో అమలు చేసేదే పెట్టుబడిదారీ విధానం. ఈ రెండూ కూడా ప్రకృతితో మనిషికి గొప్ప అవినాభావ సంబంధం ఉందన్న మహా వాస్తవాన్ని నిరాకరిస్తాయి. అలాంటి కాలంలోనే పండిత్ దీనదయాళ్ తన ఏకాత్మ మానవదర్శనం అందించారు. కానీ రాజకీయ సిద్ధాంతం అంటే ఆర్థిక, రాజకీయ సూత్రాలే కాదు, మానవీయ ముఖం అనివార్యం అని చెప్పింది ఏకాత్మ మానవవాదం. కానీ నాటికి విపరీతంగా ఉన్న వలసవాద మనస్త్తత్త్వం, బానిసబుద్ధి అలాంటి పరిపూర్ణ మానవ వికాస సిద్ధాంతాన్ని గుర్తించడానికి అడ్డుపడ్డాయి. కమ్యూనిజం కూలింది. చరిత్ర మీద నెత్తుటి చారికలను మిగిల్చి వెళ్లింది. బుద్ధి వైకల్యాన్ని దట్టించి మేధావుల పేరుతో విధ్వంసకారులను ప్రపంచం మీదకు వదిలి వెళ్లింది. ధనిక`శ్రమ జీవి మధ్య సంఘర్షణ కాస్తా కులాల మధ్య రగడగా దిగజారింది. స్త్రీ,పురుష ద్వేషానికి సిద్ధాంతాలు సృష్టించింది. కుటుంబ వ్యవస్థకు చేటు తెచ్చింది. ఇక పెట్టుబడిదారీ వ్యవస్థ ఇచ్చిన విపరీత స్వేచ్ఛ తుపాకీ సంస్కృతిగా మారిపోయి చాలాకాలం అయింది. ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని సమూలంగా నిర్మూలించే ఉద్యమాలను రాజేస్తోంది. డీప్‌స్టేట్‌లకీ, క్రైస్తవ వ్యాప్తికీ శక్తిమేరకు సహకరిస్తున్నది. ఇది నేటి వాస్తవిక చిత్రం. ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ వ్యథొ నేపథ్యంలో భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. తమ మాతృక జనసంఘ్ మహానేత దీనదయాళ్ ఆవిష్కరించిన ఏకాత్మ మానవ దర్శనాన్ని చేతులారా, గుండె నిండుగా ఆహ్వానించింది.
ఏకాత్మ మానవ దర్శనం అంటే సనాతన ధర్మ సారం. నీలోను, అవతలి వారిలోను; నీ సమాజం లోను, అవతలి సమాజంలోను ఒకే ఆత్మ ఉందని చెప్పే మహోన్నత సిద్ధాంతం. చరిత్రలో మరుగున పెట్టిన మహా విజయాలకు చోదకశక్తి. అవతలి సమాజాల హృదయాలను గెలిపించిన విజయాలవి. విజయం అంటే ఏమిటో తెలుసుకోవడానికి వంద లాది యుద్ధాలు, రెండు ప్రపంచ యుద్ధాలు చాల వన్నట్టు మరొక యుద్ధంకోసం అర్రులు చాస్తున్న దేశాలు,కూటములకు కళ్లు తెరిపించగలిగే సిద్ధాంతం. ఒక్కమాటలో దేశ సమస్యలకు దేశీయమైన పరిష్కారాలే ఎప్పటికీ శరణ్యమని చెప్పిన మార్గం.
దిగుమతి చేసుకున్న సిద్ధాంతాలు, అరువు తెచ్చుకున్న పాలనారీతులు మొదటి ఐదు దశాబ్దాల స్వతంత్ర భారతావనిని ఎంత హింసించాయో, ఏకాత్మ మానవ దర్శనమే ఆలంబనగా సాగిన ఒకటిన్నర దశాబ్దాల పాలన ఏ విధంగా ఉన్నదో 77 ఏళ్ల తరువాత అంచనా వేసుకోవలసిందే. రెండు రోజులలో జరిగిన ఏడు చర్చా కార్యక్రమాలు ఆ రెండు పాలనారీతుల మధ్య తేడాను గొప్పగా ఆవిష్కరించాయి. అంత్యోదయ నినాదంలోని వాస్తవికతను వివరించాయి. ఆత్మనిర్భర భారత్ విధానం దేశాన్ని ప్రపంచ దేశాల సరసన నిలిపిన సంగతిని గుర్తు చేశాయి. బీజేపీ ఇద్దరు ప్రధానులను దేశానికి ఇచ్చింది. వారే అటల్ బిహారీ వాజపేయి, నరేంద్ర మోదీ. ఆ ఇద్దరు ఏకాత్మ మానవ దర్శనాన్ని ఆదర్శంగా తీసుకున్నారని, దేశ పురోగతికి నిజమైన దిశా నిర్దేశం దానితోనే జరిగిందని మాధవ్ చెప్పారు.
అంత్యోదయకు పునాది దీనదయాళ్ చింతనే
కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి
‘ఎక్కడ ఏకాత్మ మానవ దర్శన సిద్ధాంతాన్ని ఆవిష్కరించారో, ఆ స్థలంలోనే 60 ఏళ్ల తరువాత మనందరం కలుసుకున్నాం. ఇది మన అదృష్టం. ఇవాళ (జనవరి 23) వసంత పంచమి.నేతాజీ జయంతి. అంటే దేశభక్తుల దినోత్సవం. మనందరికీ పవిత్రదినం’ అన్నారు బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి. స్వతంత్ర భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి పంథాను ఎంచుకోవడంలో తొలితరం పాలకులు చేసిన తప్పిదాలను, విదేశీ సిద్ధాంతాలను రుద్ది, అరవిందుడు, బిపిన్‌చంద్రపాల్ వంటి జాతీయవాద రాజనీతిజ్ఞుల ఆలోచనలను త్రోసిరాజని విదేశీ సిద్ధాంతాలను రుద్ది, దేశాన్ని పునర్నిర్మించడానికి బదులు, వలసవాద మనస్తత్త్వం కాపాడడం, ఆ నేపథ్యంలో భారతీయత పునాదిగా పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవ దర్శన చింతనను భారతీయులకు అందించడం వంటి విషయాలను కేంద్రమంత్రి చక్కగా వివరించారు.
పెట్టుబడిదారీవిధానమే ప్రపంచానికి శరణ్యమని కొందరు. సోషలిజమే ప్రగతికి ఏకైక సూత్రమని ఇంకొందరు. కమ్యూనిజం మాత్రమే విశ్వమానవాళి శ్రేయస్సును ఆశిస్తుందని మరికొందరు వాదులాడుకుంటూ ‘మనిషి’ని మరచిపోయారు. ఆ సమయంలో దేశ సమస్యలకు దేశీయమైన పరిష్కారాలు మాత్రమే ఉండాలన్న వాస్తవిక దృక్పథంతో నాటి భారతీయ జనసంఘ్ అధ్యక్షులు పండిత్ దీనదయాళ్ ఏకాత్మ మానవ దర్శనం ప్రతిపాదించారు. అంత గొప్ప సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి విజయవాడను ఎంచుకోవడం అపురూపం. ఆ చరిత్రాత్మక సందర్భాన్ని స్మరించుకుంటూ ఈ జనవరి 23న మనందరం సమావేశం కావడం నిజంగానే అదృష్టం.
కానీ ఈ రోజు పరిస్థితి ఏమిటో మనందరికీ తెలుసు. పెట్టుబడిదారీ విధానాన్ని నమ్మిన దేశాలూ, కమ్యూనిజాన్ని ఎంచుకున్న దేశాలూ కూడా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రపంచం ఎంత సంక్షోభంలోకి వెళుతున్నా గడచిన 12 ఏళ్ల కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం స్థిరంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నదంటే కారణం దీనదయాళ్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఆధారంగా పాలనావిధానాన్ని సాగించడమే.
అంత్యోదయ అన్న సమున్నత సంక్షేమ దృష్టితో ప్రస్తుత ప్రభుత్వం సాగుతున్నదంటే కారణం దీనదయాళ్ సిద్ధాంతమే. పెట్టుబడిదారీ విధానం, కమ్యూనిజం, సోషలిజం వంటి సిద్ధాంతాలకు ప్రత్యామ్నాయంగానే దీనదయాళ్ ఆ సిద్ధాంతాన్ని నాడు ప్రతిపాదించారు. అది ధర్మరాజ్యం గురించి చెబుతుంది. అంటే నిజమైన చట్టబద్ధ పాలన. పెట్టుబడిదారీవిధానం మనిషికి విపరీత స్వేచ్ఛను ఇస్తుంది.
కమ్యూనిజం ఇందుకు విరుద్ధం. ఆ రెండు సిద్ధాంతాలలోను వికేంద్రీకరణ మాత్రం లేదు. వాటిలో ప్రస్తుతం కనిపిస్తున్న వికృతులకు కారణం కేంద్రీకరణ. అవి ఎక్కడ విఫలమైనాయో, సరిగ్గా అక్కడే ఏకాత్మ మానవ దర్శనం వికేంద్రీకరణను ముందుకు తీసుకువచ్చింది.
దీనదయాళ్ చెప్పినది ఒక్కటే. పాలన అంటే సమాజంలోని అత్యంత పేదల సంక్షేమాన్ని మొదట పట్టించుకోవాలి. మనవైన భారతీయ విలువలకు, స్వదేశీ సిద్ధాంతానికి మనమంతా పునరంకితం కావాలని వారు అన్నారు. మనిషి కేంద్రంగా రూపొందిన తొలి సిద్ధాంతం అదే. అంత్యోదయ అందులో పరాకాష్ట. ఆర్థికవ్యవస్థ ద్వారా వచ్చే ఫలితాలు చిట్టచివర ఉన్నవారికీ చేరాలన్నదే దాని ఆశయం. ఇంకొక ఉదంతం కూడా ఉంది. 1980లో బీజేపీ ఆవిర్భవించిన తరువాత జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరిగిన స్థలం కూడా విజయవాడే.
మోదీ 12 సంవత్సరాల పాలనకు ఇదే పునాది. ఆయన ఎవరూ ఆకలితో ఉండరాదని స్పష్టం చేస్తూ ఉంటారు. ఐదేళ్ల పాటు ప్రతి పేద కుటుంబానికి ఐదు కిలోల బియ్యం పంపిణీకి ప్రేరణ అంత్యోదయ.
స్వచ్ఛ భారత్‌లో భాగంగా 19 కోట్ల ఇళ్లకు మరుగుదొడ్ల నిర్మాణం పేద ఇంటి మహిళ ఆత్మ గౌరవం కోసం చేపట్టినది. ఇంకా కేంద్ర మంత్రిమండలిలో ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీలు 60 మందికి స్థానం కల్పించడం కూడా అంత్యో దయలో భాగమే. 56 కోట్ల మందికి జన్‌ధన్ ఖాతాలు, ఓబీసీలకు 10 శాతం రిజర్వేషన్, ఆయుష్మాన్ భారత్ పేరుతో 35 కోట్ల మందికి కార్డుల జారీ, విశ్వకర్మ యోజన, నాలుగు కోట్ల నివాసాలకు నీరు, చిన్న వ్యాపారులకు రుణాలు, ముద్ర యోజన ఇవన్నీ అంత్యోదయలో భాగం. దాని వెనుక ఉన్నది దీనదయాళ్ దృష్టి.
కిషన్‌రెడ్డి ఉపన్యాసంతో ప్రారంభ కార్యక్రమం ముగిసింది. తరువాత నుంచి దాదాపు రోజున్నర ఏకాత్మ మానవ దర్శనం బీజేపీ ప్రభుత్వాల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగి ఉన్నదో వివరించాయి.
ఏకాత్మ మానవ దర్శనం.. ఇజం కాదు నిజం!
– ఆచార్య ముదిగొండ శివప్రసాద్
ఏకాత్మ మానవ దర్శనం ఒక ఇజం కాదు, నిజం అని విజయవాడ వేదిక నుంచి ఆచార్య ముదిగొండ శివప్రసాద్ నిర్ద్వంద్వంగా ప్రకటించారు. 1965 నాటి సభలను చూసిన వారిగా ఆయనను ఏపీ బీజేపీ సభలకు ఆహ్వానించింది. ఆయన అనుభవాలను వినగోరింది. సభాసదులు మొట్టమొదట విన్నది కూడా వారి జ్ఞాపకాలనే. రెండు కారణాలతో తాను ఈ సభలలో పాల్గొనడానికి అర్హత సాధించానని అన్నారాయన. ఘట్‌కేసర్ (తెలంగాణ)లో ఆనాడు గురుకులం ఉండేది. అక్కడ ఒక శిబిరం నిర్వహించి, దీనదయాళ్‌ను ఆహ్వానించారు. ఆనాడు ఆయన తన ఉపన్యాసంలో ఏకాత్మ మానవవాదం ప్రాథమిక అంశాల గురించి కొన్ని మాటలు చెప్పారు. అప్పుడు వారి పాదాల దగ్గర కూర్చుని వాటిని రాసుకుని తెలుగులోకి అనువదించానని చెప్పారు. రెండో కారణం` ఆనాడు తాను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షునిగా ఎంపికయ్యానని, అందుకే సభలలో పాల్గొన్నానని, ఆనాడు ఎవరు ఎక్కడ ఎలా ఆసీనులయ్యారో, ఎవరు హాజరయ్యారో ఇప్పటికీ తనకు గుర్తు ఉందని చెప్పారాయన. అందుకే ఆ మహనీయునికి నివాళి ఘటించేందుకు తాను హైదరాబాద్ నుంచి వచ్చానని తెలియచేశారు.
ఏకాత్మ మానవ దర్శనం ఒక ఇజం కాదు, నిజం అని ఘంటాపథంగా ప్రకటించిన ఆచార్య శివప్రసాద్` వికసిత భారత్‌కు అవసరమైనది ఈ దర్శనమేనని చెప్పారు. మన పురాణాలు, ఇతర వా్మఙయం ఎప్పుడు చెప్పినా ఎలా చెప్పినా ఒక్కటే` కలసి నడుద్దాం. మనుషులంతా ఒక్కటే అంటుంది. శరీరంలో ప్రాణం ఉంటుంది. దానినే విరాట్ అన్నారు దీనదయాళ్. మనిషికి కేవలం అన్నం ఒక్కటే అందిస్తే చాలదని, బుద్ధి కోసం సంస్కతి కూడా అవసరమని చెప్పారాయన. ఈజిప్ట్, మెసపు టోమియా, చైనాలలోను భారత్‌తో పాటు నాగరికత విలసిల్లింది. ఆ నాగరికతలన్నీ కాలగర్భంలో కలసిపోయినా, భారత నాగరికత మాత్రం జీవించే ఉందని, ఆ నాగరికతాసారాన్నే దీనదయాళ్ తన ఏకాత్మ మానవ దర్శనంలో నిక్షిప్తం చేశారని గుర్తు చేశారు.ధర్మార్థకామమోక్షాలనే అంశం ఆధారంగా దీనదయాళ్ తన సిద్ధాంతాన్ని నిర్మించారని, అందులో ఆధ్యాత్మిక భావనకు స్థానం ఇచ్చారని తెలియచేశారు. ప్రాణశక్తి తగ్గిన భాగాలు చచ్చుపడిపోతాయంటూ, భారతదేశ దక్షిణ ప్రాంతంలో ప్రాణశక్తి కొన్ని చోట్ల తగ్గింది. అలాంటి చోట్లలోనే జాతివ్యతిరేక భావాలు తలెత్తాయని గుర్తించాలని, ఆ భాగాలు ఏవో తెలిసిందేనని అన్నారు. తమిళనాడు, కేరళలలో అరాచకం విరాట్ శక్తి కోల్పోతున్న కారణంగానేనని ఆచార్య ముదిగొండ విశ్లేషించారు.
విజయవాడ సమావేశాలకు ఒకటి రెండు రోజుల ముందే ఖమ్మంలో జరిగిన కమ్యూనిస్టు సభల గురించి డాక్టర్ ముదిగొండ ప్రస్తావించారు. 1925లో డాక్టర్ కేశవరావ్ బలీరామ్ హెడ్గెవార్ ఆరఎసఎస్‌ను స్థాపించారు. అదే సంవత్సరం ఎంఎన్ రాయ్ భారత కమ్యూనిస్టు పార్టీని నెలకొల్పారు. ఆరఎసఎస్ సజీవశక్తిగా పురోగమిస్తున్నదని, సంఘం దాని అనుబంధం సంస్థలు ఏ స్థితిలో ఉన్నాయో అందరికీ తెలుసునని అంటూ, భారత కమ్యూనిస్టు పార్టీ మాత్రం ఖమ్మంలో శవాల దిబ్బల మధ్య తన వందేళ్ల సందర్భాన్ని జరుపుకున్నదని చెప్పారు శివప్రసాద్. కాబట్టి వికసిత భారత్‌కు ఏది అవసరమో ఇప్పుడు రుజువైందని అన్నారు.
ఏకాత్మ
పండిత దీనదయాళుడు
పాడిన మానవ గీతం
సురగంగా జలపాతం
విశ్వాత్మకు సంకేతం
సంగచ్ఛధ్వం మంత్రం
సంఘటనం తంత్రం
వసుధైవ కుటుంబకం
కుసుమ కమల సౌగంధ్య
సమ సూత్ర కదంబకం
నరజాతికి వరనీయం
రమణీయాచరణీయం
చిరుగుల పంచె తనకు
కొత్తబట్టలు భిక్షకునికి!
ఎరువు తెచ్చుకున్న ఏ సిద్ధాంతమైనా, తాత్త్వికత అయినా పెదాలను దాటుకుని హృదయానికి చేరదు. ఇందుకు

అక్షరాలా లక్ష ఉదాహరణలు చూపవచ్చు. మట్టి వాసన ఉన్న మనవైన జీవిత సత్యాల మాదిరిగా ఎరువు సిద్ధాంతాలు రక్తంలో ఇంకవు. పేదరిక నిర్మూలన, విశ్వశాంతి, సమసమాజం వంటి మాటలు, నినాదాలు ఒట్టి శుష్కవాదాలుగా మిగిలి, అపహాస్యానికి గురైనది అందుకే. అవేవీ ఇక్కడ నినదించినవారు ఆచరించలేదు. హృదయపూర్వకంగా స్వీకరించలేదు. సర్వేజనాఃస్సుఖినోభవంతు అన్న మనదైన భావనతో అవి తూగలేకపోయాయి. సోషలిజం, కమ్యూనిజం శ్రేణులలోనే హెచ్చుతగ్గులు సుస్పష్టం. ఆర్థికవ్యత్యాసాలు ఒక నిజం. ప్రపంచ కార్మికులారా అన్న బరువైన నినాదం పలుకుతున్న, రెండు ప్రధాన చీలిక ఎర్ర శిబిరాలు ఏకమయ్యే ఆలోచన మాత్రం ఆరు దశాబ్దాలుగా చేయడమే లేదు. కానీ నెత్తుటిలోనే సర్వేజనాః స్సుఖినోభవంతు, లోకాః సమస్తాః సుఖినోభవంతు వంటి భారతీయమైన మూలసూత్రాలు నింపుకున్న యోగుల పృరంపరలోని వారు దీనదయాళ్ ఉపాధ్యాయ. ఆయన చెప్పింది చేసి చూపించారు. సమాజంలోని అట్టడుగు మనిషిని కూడా మనం గమనంలోకి తీసుకోవడమే నిజమైన మానవధర్మం, అదే భారతీయత అని చాటిన మహనీయుడాయన. దీనిని సార్థక నామధేయుడైన ఆ జనసంఘ్ నేత నిజజీవితంలో ఎలా ఆచరించారో నిరూపించే ఒక ఉదంతాన్ని డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ గుర్తు చేసినప్పుడు సభాసదుల కళ్లు చెమర్చాయి. 1965 నాటి సభలలో ప్రతినిధిగా పాల్గొన్న జూపూడి హైమవతి ఈ సభలకు కూడా హాజరై దీనదయాళ్, తన భర్త, జనసంఘ్ నాయకుడు జూపూడి యజ్ఞనారాయణల చింతనలతో తాను ఎంతగా మమేకమైనారో నిరూపించుకున్నారు. ఇది కూడా ఒకరకమైన ఏకాత్మతే కదా! ఆ దంపతుల జీవితంలో జరిగిన ఈ మహత్తర ఉదంతాన్నే శివప్రసాద్ సభలో ప్రస్తావించారు.

దీనదయాళ్ ఒకసారి గుంటూరు పర్యటనకు వచ్చారు. తెలుగు ప్రాంతానికి వచ్చినప్పుడు గుంటూరు కార్యక్రమం ఉంటే తప్పనిసరిగా జూపూడి యజ్ఞనారాయణ ఇంటిలోనే ఆయన బస చేసేవారు. ఒక పర్యటన సందర్భంగా యజ్ఞనారాయణ ఇంటికి వచ్చారాయన. మేడ మీద ఉన్న దీనదయాళ్‌ను భోజనానికి ఆహ్వానించడానికి ఇల్లాలు హైమవతి పైకి వెళ్లారు. అక్కడ దీనదయాళ్ ఒక పనిలో నిమగ్నమైపోయి ఉన్నారు. ఆమె కళ్లు చెమర్చాయి. చిరిగిన తన పంచెకు స్వయంగా సూది పట్టి కుట్లు వేసుకుంటున్నారు. హైమవతమ్మ గబగబా దిగివచ్చి, ఏమండీ! మీ నాయకుల పరిస్థితిని మీరు చూసుకోవాలి కదా! ఆయన చూడండి! చిరిగిన ధోవతికి కుట్లు వేసుకుంటున్నారు. మీరు తక్షణం వెళ్లి వారికి బట్టలు కొని తీసుకురండి’ అని పురమాయించారు. మరుక్షణం యజ్ఞనారాయణ వెళ్లి కొత్తబట్టలతో వచ్చారు. అవి దీనదయాళ్ ముందు ఉంచి, ‘వీటిని కట్టుకుంటే తప్ప మేం అంగీకరించం. ఇవి కట్టుకున్నాకే భోజనం చేయాలని మా మనవి’ అని గట్టిగా విజ్ఞప్తి చేశారు. ‘అందుకు అభ్యంతరం ఏమిటి?’ అంటూ ఆ కొత్త బట్టలు ధరించి భోజనం చేశారు. మళ్లీ మేడ మీదకు వెళ్లి తను కుట్లు వేసుకున్న పంచెనే ధరించారు. బయటకు వెళ్లినప్పుడు బ్రాడీపేటలో ఒక బిచ్చగాడి చేతికి ఆ కొత్త బట్టలు ఇచ్చేశారు. యజ్ఞనారాయణ నొచ్చుకోకుండా ఎలా ఉండగలరు? మేం మీకు ఇస్తే ఇలా చేశారేమిటి?’ అని అన్నారు. అందుకు ఆయన చెప్పిన సమాధానం ‘నేను కుట్లు వేసుకున్న పంచె మరొక ఆరు నెలలు పనికి వస్తుంది. కానీ అతడు గోచీతో ఉన్నాడు. కాబట్టి అతడికి ఇవ్వడం న్యాయం కదా!’ అన్నారట. ఇది కదా ‘సర్వేజనాఃసుఖినోభవంతు’ అన్న సమున్నత భావనతో, తాత్త్వి కతతో ఏకాత్మత అంటే! స్వతంత్ర భారతంలో అరవయ్యేళ్లు కాలగర్భంలో కలిసిపోయాయి. ఇప్పుడొక చైతన్యం వచ్చింది. జాతి మేలుకొంటున్నది. చిరకాలం మరుగున ఉండిన ఆయన సిద్ధాంతానికి ఇప్పుడు వెలుగు వచ్చింది. అందుకే దీనదయాళ్ చిరంజీవి. భారతీయ ఆత్మతో కూడిన ఆయన సిద్ధాంతం అజరామరం.
ఐదు వేళ్లు బిగిస్తే.. పిడికిలి
చేతికి ఐదువేళ్లు ఉన్నా, అవి ఒక్కలా ఉండవు. సమానం కాదు కూడా. కానీ పిడికిలిగా బిగిస్తే అవన్నీ శక్తికేంద్రాలే అవుతాయి. ఇది గమనించాలి. నాకు ఒకటే బాధ అనిపిస్తుంది. స్వతంత్ర భారతదేశంలో అవినీతి పెరిగిపోయింది. అవినీతి వల్ల మొదట నష్టపోయేది పేదవారు. ప్రతీదానికి లంచాలు, ఇతర మార్గాలు అంటే పేదవారికి అసాధ్యం. అది అవాంఛనీయం కూడా. కాబట్టి అవినీతి లేని సమాజం ఆవిర్భవించాలి. ఎవరు ఏ పని చేసినా, ఏ మాట చెప్పినా అందుకు సంబంధించినదే అయి ఉండాలి. లేకపోతే సమాజం మనుగడ సాగించలేదు.
(1965 నాటి సమావేశాలలో ప్రతినిధిగా హాజరైన జూపూడి హైమవతి చెప్పిన ఈ నాలుగు మాటలు సభను కదిలించాయి. 92 ఏళ్ల ఆమె ఆవేదనతో ఆ మాటలు చెప్పారు. వీటిని ఎవరూ కాదనలేరు.)

ప్రత్యేక సంచికల ఆవిష్కరణ
ఏకాత్మ మానవ దర్శనం పునర్దర్శనం సందర్భంగా జాతీయ వారపత్రిక ‘జాగృతి’ వెలువరించిన ప్రత్యేక సంచికను బీఎల్ సంతోష్ ఆవిష్కరిం చారు. 1965 నాటి అద్భుత జ్ఞాపకాలతో ఉన్న స్మరణికను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆవిష్కరించారు. జాగృతి నుంచి సేకరించిన 1965 నాటి పలు క్లిప్పింగ్‌లను ప్రత్యేక సంచికగా వెలువరించారు.

అలరించిన ఎగ్జిబిషన్
పత్రికలు, గ్రంథాలయాల నుంచి సేకరించిన 1965 నాటి సభల సన్నివేశాలతో రూపొందించిన ఆడియో విడియో ప్రదర్శన ఉత్తేజకరంగా ఉంది. లక్నోలో ఒక బీజేపీ కార్యకర్త ఎంతో భక్తిగా దాచుకున్న దీనదయాళ్ ఆడియో సేకరించి, ఏఐ సాయంతో విజయవాడలో గతంలో ఆయన అన్న మాటలకు అన్వయించి సాక్షాత్తు దీనదయాళ్ నేటి తరాన్ని ఉద్దేశించి ప్రసంగించిన అనుభూతికి కలిగించే ప్రయత్నం స్వాగతించదగినది. జనవరి 23 ఉదయం 9.30 గంటలకు కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి దీనదయాళ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తరువాత బీఎల్ సంతోష్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు.

ఆతిథ్యం అద్భుతం
సభాస్థలికి పక్కనే అల్పాహార, భోజనశాల ఏర్పాటు చేశారు. బఫేతో పాటు టేబుళ్ల మీద కూర్చుని తినడానికి కూడా ఏర్పాటు చేశారు. వీరికి అరిటాకులో భోజనం వడ్డించారు. రెండు రోజులు ఉదయం అల్పాహారం, తరువాత తేనీరు, మధ్యాహ్న భోజనం, సాయంత్రం మళ్లీ తేనీరు, అల్పాహారం, రాత్రి భోజనం ఏర్పాటు చేశారు. అనుకున్నదాని కంటే ప్రతినిధుల సంఖ్య కాస్త పెరిగినప్పటికి నిర్వాహకులు ఏ లోటూ రాకుండా జాగ్రత్త పడ్డారు.
- కథనాలు : జాగృతి డెస్క్