యావద్భారత దేశాన్ని పులకింప చేసే మహా పర్వదినం శివరాత్రి. దాక్షాయణి అగ్ని ప్రవేశానంతరం తీవ్ర తపోనిష్ఠలో నిమగ్నమైన పరమేశ్వరుడు పెండ్లి కొడుకైన శుభతరుణం. లోకకంటకుడు వృతాసుర సంహారం తమ దంపతుల సంతతి వల్లనే సాధ్యమన్న పరమేష్టి వచనం మేరకు గౌరీకల్యాణం జరిగిన పర్వదినం. ఇది ఆధ్యాత్మిక ఔన్నత్యం చాటే పర్వదినమే కాక… దేశదేశాంతరాలలోని హిందూజాతి అఖండత్వాన్ని చాటే మహత్తర సామాజికోత్సవం.

నిత్య, పక్ష, మాస శివరాత్రి అని పర్వదినాలు ఉన్నా మహాశివరాత్రికి మరింత విశిష్టత ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి.‘శివప్రియాతు దుపాసానార్ధా రాత్రి శివరాత్రి’ (శివునికి ప్రియమైన,శివారాధనకు ఉత్కృష్టమైన రాత్రే శివరాత్రి) అని స్కంద పురాణం పేర్కొంటోంది.
‘మాఘకృష్ణ చతుర్దాశ్యామాదిదేవో మహానిశి
శివలింగ త్వయోద్భూతః కోటి సూర్య సమప్రభః
తత్కాలవ్యాపినీ గ్రాహ్యా శివరాతివ్రతేతిథిః’…
మాఘచతుర్దశి నాటి నిశిరాత్రి సమయంలో ఆదిదేవుడు శివుడు కోటి సూర్యులతో సమానమైన కాంతితో లింగ స్వరూపంగా ఆవిర్భవించాడు. నాటి నుంచి శివరాత్రి వ్రతమాచరణ ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
‘శివరాత్రి మహోరాత్రం నిరాహారో జితేంద్రియః
అర్చయేద్వా యథాన్యాయం యథాబలమ పంచకః
యత్ఫలం మహాపూజయాం వర్షమేక నిరంతరం
తత్ఫలం లభతే సద్యః శివరాత్రౌ మదర్చనాత్‌’… ఇం‌ద్రియనిగ్రహాన్ని పాటిస్తూ, శివరాత్రి నాడు ఉపవాస దీక్షతో శివలింగాన్ని పూజిస్తే.. పరమేశ్వ రుడిని ఏడాది పాటు పూజించినంత ఫలితం కలుగుతుందని ఆర్యోక్తి. ఆ రోజు ఎంతో విశిష్టమైనది కనుకనే ‘జన్మానికో శివరాత్రి’ అనే నానుడి పుట్టిందం టారు. ఆ ఒక్కరోజు చేసుకున్న పుణ్యమే విశేష ఫలితాలను ఇస్తుందని భావన•. ఇతర రోజులలో మాటెలా ఉన్నా ఆనాడు నిరాహారులై, జాగరణతో శివయ్యను అర్చించిన వారు మోక్షార్హులవుతారనేందుకు గుణనిథి, కన్నప్ప (తిన్నడు), నత్కీరుడు, బెజ్జమమాదేవి లాంటి పాత్రలు ఎన్నో ఉదాహర ణలుగా ఉన్నాయి.
శివుడు అభిషేకప్రియుడు. అభిషేకం అంటే శివలింగంపై పాలు, నీళ్లు పోయడం అని సాధారణ భావన. ‘మన మనసును యోగంతో లగ్నం చేయడమే నిజమైన అభిషేకం’ అంటారు పెద్దలు. ‘నీ దయతో సిద్ధించిన ఈ జన్మను చరితార్థం చేసుకునేందుకు యత్నించే దాసానుదాసుడను’ అనే భావనతో తనను తాను అంకితం చేసుకోవడం, శరణగతి కోరడం. చెంబుడు శుద్ధోదాకాన్ని లింగాకృతిపై పోసి, చిడికెడు భస్మాన్ని చల్లే సామాన్యులను, మహన్యాసపూర్వక నమక చమకాదులతో ఏకాదశ రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు నిర్వహిం చే అసామాన్యులను శివయ్య ఏకరీతిన కరుణిస్తాడని విశ్వాసం. నిజానికి.. జ్ఞానం, విచక్షణతో ఆలోచించడమే ‘అభిషేకం’ అని చెబుతారు. ఆత్మను పరమాత్మతో అనుసంధానించి నపుడు ఆత్మప్రక్షాళన జరుగుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు.
‘పరమేశ్వరుడు భక్తుల హృదయ దీపమై వెలిగే పరంజ్యోతి.కూర్చొని ఆలపిస్తే నిలబడి వింటాడు. నిల్చుని గానం చేస్తే ఆనంద తాండవం చేస్తాడు. ఆకాశం జటాజూటంగా (హ్యోమకేశుడు), దిక్కులే వస్త్రాలై (దిక్‌+అం‌బరుడు) దిగంబరుడుగా, చంద్రుడు సిగపూవుగా, స్థిరమైన ఆనందమే స్వరూపంగా కలిగినవాడు. సామీప్య, సారూప్య, సాయుజ్యంతో శంకర కరుణకు పాత్రులు కావచ్చు’ అని జగద్గురువు శంకర భగవత్పాదులు శివతత్త్వాన్ని కీర్తించారు.మన హృదయ పుష్పాలను శివార్పణ చేస్తే చాలు. ముక్తి కరతలామలకమవుతుందని ‘శివానందలహరి’లో పేర్కొన్నారు.
ఆయన ‘ఆదిభిక్షువు’వే అయినా ఐశ్వర్యప్రదాత. అందుకే ‘దారిద్య్ర దుఃఖ దహనాయ నమశ్శివాయ’ అని వశిష్ఠ మహర్షి ‘దారిద్య్ర దహన స్తుతి’లో శ్లాఘించారు. లోక శ్రేయస్సు కోసం కష్టాలను ఇష్టంగా భరించడం, ప్రమాదాలను ప్రమోదంగా స్వీకరించడం శంకర తత్వం. క్షీరసాగర మథనవేళ ఆవిర్భవించిన హాలాహలాన్ని గరళంలో నిలపడమే అందుకు ప్రథమోదహరణ. ఫాలనేత్రంలో అగ్నికీలాలు దాచిన వాడు. అయినా శాంతమూర్తి. భక్తాభీష్ట ప్రదాత. ఆయన మూడవ నేత్రం జ్ఞానానికి చిహ్నం. జ్ఞాని మోహాతీతుడు కనుకనే మన్మథుని జయించి జితేంద్రు డయ్యాడు. విషయ వాంఛలను త్యజించి అతి సామాన్య జీవితాన్ని గడిపిన మహనీయుడు. ఆయన వాహనం వృషభం నాలుగు పాదాల నడిచే ధర్మస్వ రూపం.
నిత్యం శాస్త్రోక్తంగా, మంత్ర సహితంగా శివారాధన చేయ(లే)పోయినా ‘ఓం నమశ్శివాయ’అనే పంచాక్షరిని జపించినా పుణ్యమేనని పురాణాలు చెబుతున్నాయి.
‘మూడు మూర్తులకును మూడు లోకములకు
మూడు కాలములకు మూలమగుచు
భేదమగుచు తుదికభేదమై యొప్పారు
బ్రహ్మమనగ నీవె ఫాలయన’.. త్రిమూర్తులకు, ముల్లోకాలకు భూతవర్తమాన భవిష్యత్‌ ‌కాలాలకు ఆధారమవుతూ, వాటిలో లీనమవుతూ, చివరికి నీలోనే ఐక్యం చేసుకునే ఏకైక అణుస్వరూపుడవు ఫాలలోచనుడా/ శివుడు’ అని కీర్తించాడు పోతనా మాత్యుడు. ‘శివశివ శివ యనరాదా… భవభయ బాధలనణచుకోరాదా’ అని త్యాగరాజ స్వామి కీర్తించారు.

డా।। ఆరవల్లి జగన్నాథస్వామి
సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE