రెండురోజుల సభల తరువాత జనవరి 24న ముగింపు కార్యక్రమం జరిగింది. గంభీరమైన ఉపన్యాసాలతో, స్ఫూర్తిదాయకమైన మార్గదర్శనంతో ఇవి ముగిశాయి. కేంద్రమంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్, బీజేపీ జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నాయకులంతా చివరి వరకు ఉండి సభల పట్ల, దీనదయాళ్ పట్ల తమ గౌరవ ప్రతిపత్తులను చాటుకున్నారు. ముగింపు సమావేశానికి సైతం సభాస్థలి కార్యకర్తలతో కళకళలాడింది. అదే ఉత్సాహంతో వారు నినాదాలు చేశారు.

‘ఏకాత్మ మానవత దర్శనాన్ని దీనదయాళ్ ఇస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  సంక్షేమ పథకాల ద్వారా దానిని ఆచరణలో పెడుతున్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ పేర్కొన్నారు. ఆయన మాటలలోనే ఆయన ప్రసంగం` విజయవాడ గడ్డ పవిత్రమైనది. ఇక్కడ వేదికపై అలంకరించినట్లుగా వ్యక్తి, కుటుంబం, సమాజం, దేశం, మానవత్వం అన్నీ ఒకే మాలలో ఉంటాయి. 1980లో అటల్ బిహారీ వాజపేయి ముంబైలో చెప్పినట్లు ‘చీకటి విడిపోతుంది, సూర్యుడు ఉదయిస్తాడు, కమలం వికసిస్తుంది’. ఆ మాటను నిజం చేస్తూ విజయవాడ మార్గం చూపింది. చివరగా, ఈ రోజే రాజ్యాంగ సభ జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని ఆమోదించిందని ప్రధాని మోదీ గుర్తుచేశారు.  నేను రాజస్థాన్ వాసిని. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ కూడా రాజస్థాన్‌లోని పిలానీలో విద్యాభ్యాసం చేశారు. అక్కడ ప్రచారంలో ఉన్న ఒక గాథ ద్వారా ‘ఏకాత్మ మానవ దర్శనం’ ప్రభావం గురించి వివరిస్తాను. దీనదయాళ్ విద్యార్థిగా ఉన్నప్పుడు ఒక పెళ్లికి వెళ్లారు. అక్కడ మిఠాయిలు వండే వ్యక్తిని, ఆసనాలు ఏర్పాటు చేసిన వ్యక్తిని, బూట్లు పాలిష్ చేస్తున్న వ్యక్తిని, బట్టలు ఇస్త్రీ చేసే వ్యక్తిని… ‘ఎవరి కోసం ఈ పనులు చేస్తున్నారు? అని అడిగితే, వారందరూ ‘మా ఊరి అమ్మాయి పెళ్లి, మా ఊరి అమ్మాయి అంటే ఈమె నా కూతురే’ అని సమాధానం ఇచ్చారు. వృత్తులు వేరైనా, ఊరంతా ఏకమై ఒక అమ్మాయిని సొంత కూతురిలా భావించడమే ‘ఏకాత్మ దర్శనం’. ఒకసారి పార్లమెంటులో సాంస్కృతిక జాతీయవాదంపై జరిగిన చర్చలో సుష్మా స్వరాజ్  గొప్ప సమాధానం ద్వారా మరొక అంశాన్ని జాతి ముందు ఉంచారు. అస్సాంకు చెందిన ప్రముఖ న్యాయవాది ఎన్‌సీ చటర్జీ, గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయానికి ఎప్పుడూ వెళ్లకపోయినా, తన కుమారుడికి ‘సోమనాథ’ (సోమనాథ్ చటర్జీ) అని పేరు పెట్టారు. దేశంలోని ఒక మూల ఉన్న వ్యక్తి, మరో మూల ఉన్న సంస్కృతిని గౌరవించడమే సాంస్కృతిక జాతీయవాదం అని స్వరాజ్ గుర్తు చేశారు. మనిషికి శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ ఉంటాయని  దీనదయాళ్ చెప్పారు. వీటి అవసరాలు వేరు. వాటిని సమన్వయం చేస్తూ, అందరికీ అందేలా చూడటమే ‘ఏకాత్మ మానవతా వాదం’. దీనదయాళ్ ఈ దర్శనాన్ని ఇస్తే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంక్షేమ పథకాల ద్వారా దానిని ఆచరణలో పెడుతున్నారు.

 60 ఏళ్ల క్రితం విజయవాడ వేదికగా జరిగిన సదస్సు ఇవాళ పార్టీకి దిశానిర్దేశం చేస్తున్నది. దీనదయాళ్ ఉపాధ్యాయ సాత్విక దర్శనం వల్లే నేడు వాజపేయి, మోదీ వంటి నాయకులు దేశాన్ని ఏలుతున్నారు. వ్యక్తి, కుటుంబం, సమాజం, దేశం, మానవత్వం.. ఇవన్నీ ఒకే సూత్రంతో ముడిపడి ఉన్నాయి. ఇదే ‘ఏకాత్మ మానవ దర్శనం’. చివరగా, రాజ్యాంగ సభ జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని ఆమోదించిన రోజు ఇదేనని ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌ను చేశారు. ఇంతటి చారిత్రక వాతావరణం నేపథ్యంలో ఇలాంటి కార్యశాలను నిర్వహించిన నేతలకు, కార్యకర్తలకు అభినందనలు.

 శివప్రకాష్, భాజపా

ఇది కేవలం ఒక ప్రదర్శన కాదు, మన సిద్ధాంత వికాస పరిణామక్రమాన్ని పునశ్చరణ చేసుకునే అద్భుత అవకాశం. 1952 నుండి 2025 వరకు భారతీయ జనసంఘ్, భారతీయ జనతా పార్టీ సాగించిన ప్రయాణం ఎన్నో సంఘర్షణలు, బలిదానాలు, విజయాల సమాహారం. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ కలలుగన్న ‘గతం కంటే వైభవపేతమైన భారత’ను నిర్మించడమే మన లక్ష్యం అంటూ  బీజేపీ జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ తన ప్రసంగం ప్రారంభించారు. ఆయన ఇంకా ఇలా మాట్లాడారు…. స్వామి వివేకానంద చెప్పినట్లు, ప్రపంచానికి శాంతి, ప్రేమ, సహనం, సమన్వయ సందేశాన్ని అందించడం కోసం భారత్ శక్తివంతంగా ఎదగడం అనివార్యం. ప్రపంచంలోని ఇతర దేశాలకు భిన్నంగా, భారత్ మాత్రమే సమస్త చరాచర జగత్తును తన కుటుంబంగా భావిస్తుంది. ‘వసుధైవ కుటుంబకం’, ‘సర్వేభవంతు సుఖినః’ అనేవి మన మూలసూత్రాలు. కేవలం మానవ క్షేమమే కాదు, ప్రకృతిని, జంతుజాలాన్ని గౌరవించే సంస్కృతి మనది. ఈ ఉన్నతమైన భావనలు ప్రపంచంలో నిలవాలంటే భారత్ శ్రేష్టమైన దేశంగా నిలవాలి. నేడు భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ‘వైచారిక గందరగోళం’. దేశ వికాసాన్ని అడ్డుకోవడానికి విదేశీ శక్తులు, ఎన్జీవోలు ఒక పథకం ప్రకారం అరాచకత్వాన్ని సృష్టిస్తున్నాయి. దీనినే ‘ఫిఫ్త్ జనరేషన్ వార’ అని పిలుస్తారు. రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దు వంటి అసత్య కథనాలు, ప్రచారాలు సృష్టించి ప్రజల్లో అయోమయం కలిగిస్తున్నారు. CAA వంటి చట్టాలపై అల్లర్లు రెచ్చగొట్టడం, నేరగాళ్లను సన్మా నించడం ఈ కుట్రలో భాగమే. సాయుధ నక్సలిజం అంతమవుతున్న తరుణంలో, ‘అర్బన్ నక్సలిజం’ రూపంలో కొత్త ముప్పు పొంచి ఉంది. వీరు బౌద్ధికంగా యువతను తప్పుదోవ పట్టిస్తూ ఉత్తర-దక్షిణ విభేదాలను, కుల ప్రాతి పదికన చీలికలను ప్రోత్సహిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను అస్థిరపరిచే ప్రయత్నాలు జరుగు తున్నాయి. మతపరమైన ఛాందసవాదం కూడా బాధితుల కార్డును వాడుకుంటూ దేశ సమగ్రతకు సవాలు విసురుతోంది. శతాబ్దాల బానిసత్వం మన మెదళ్లలో మన భాష, సంస్కృతి పట్ల ప్రతికూల భావాలను నింపింది. అందుకే మోదీ ‘పంచ ప్రాణ’ సంకల్పం ద్వారా బానిసత్వపు మానసికత నుండి విముక్తి పొందాలని పిలుపునిచ్చారు. మన మాతృ భాషలను గౌరవించుకుంటూ, స్వదేశీ ఆత్మనిర్భరతతో ముందుకు సాగాలి. ఆర్థికంగా భారత్ ఎదగడాన్ని అడ్డుకోవడానికి వస్తున్న ‘టారిఫ్ టెర్రరిజం’ వంటి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలి.

అవినీతిరహిత పాలన, డిబిటి వంటి పారదర్శక పద్ధతుల ద్వారా మనం అభివృద్ధిని సాధిస్తున్నాం. కుటుంబ రాజకీయాల నుండి విముక్తి పొంది, ఏకాత్మ మానవ దర్శనం ప్రాతిపదికన దేశాన్ని ఏకం చేయాలి. 2047 నాటికి ‘వికసిత్ భారత’ సాధనే మన లక్ష్యం. అటల్ జీ చెప్పినట్లు, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ప్రళయ మేఘాలు కమ్ముకున్నా, మనం కలిసికట్టుగా అడుగులో అడుగు వేస్తూ విజయపథంలో సాగాలి. 60 సంవత్సరాల నాటి చారిత్రక సందర్భాన్ని నేటి తరానికి సజీవంగా పరిచయం చేస్తూ, నాటి కళాకృతులు, భోజన పద్ధతులను యథాతథంగా పునఃసృష్టించిన నిర్వహణ బృందం కృషి అభినందనీయం.

అంతకు ముందు ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అందరికీ కృతజ్ఞతలు తెలియచేశారు.

తురగా నాగభూషణం,  సీనియర్ జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE