డా. హెడ్గెవార్‌ ‌గురించి నాకు పెద్దగా తెలియదు. ఆయన జీవితం గురించి ఈ మధ్యనే చదవడం మొదలుపెట్టాను. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన కొందరు వ్యక్తుల గురించి నాకు తెలుసు. నాకు శ్రీ బాలాసాహెబ్‌ ‌దేవరస్‌, శ్రీ ‌హెచ్‌వీ శేషాద్రి, శ్రీ రామగోపాలన్‌, శ్రీ ‌వీ రంగస్వామి, తదితరులు తెలుసు. మన దేశంలో ప్రతీ రాజకీయ పార్టీ ఓట్ల కోసమని సోషలిజమ్‌ను రకరకాల బ్రాండ్లతో జనం మధ్యకు అదే పనిగా వదులుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక పద్ధతి ప్రకారం దేశభక్తిని పాదుగొల్పుతున్న ఏకైక సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌మాత్రమే అని నేను చెప్పగలను. ఆర్‌ఎస్‌ఎస్‌లో ఉన్నవారు దేశభక్తిని మాటల్లో కాకుండా చేతల్లో కూడా చూపిస్తారు. వారిలోని నిస్వార్థాన్ని చూసి నేను సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాను. వ్యక్తిగత ప్రయోజనాలు లేదా గుర్తింపు కోసం ఆరాటపడే రాజకీయ పార్టీల కార్యకర్తలను నేను కలిశాను. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకర్తలు నాకు అలా కనిపించలేదు. అంతేకాకుండా ఉన్నత విద్యావంతులైన యువకులు సర్వం త్యజించి, అన్నింటికి తెగించి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకర్తలుగా రూపాంతరం చెందుతున్నారు. వారిలో ఎమ్మేలు, ఇంజినీరింగ్‌ ‌గ్రాడ్యుయేట్లు, డాక్టరేట్‌ ‌ల్డర్లు ఉన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు అంకితం కావడం కోసం ఎంతో సంపాదించిపెట్టే పెద్ద పెద్ద ఉద్యోగాలను తోసిరాజన్నారు. నేను ఆసక్తి కొద్దీ కొంత మంది ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకర్తలను ‘‘మీకు మాత్రమే సాధ్యమైన పనిని ఇతర సంస్థలకు చెందినవారు ఎందుకని చేయలేకపోతున్నారు?’’ అని అడిగాను. అందుకు బదులిస్తూ వారు ఆ ఘనతను ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నుంచి పొందిన శిక్షణకు ఆపాదించారు. ప్రతీ ఇతర సంస్థ తన కార్యకర్తలకు శిక్షణ ఇస్తుంది. కానీ తేడా అల్లా దేశ సేవ కోసం సర్వస్వం త్యాగం చేసేందుకు స్ఫూర్తిని ఇచ్చే శిక్షణలోనే ఉంటుంది.
నేడు దేశం కోసం నిప్పుల మీద కూడా నడవడానికి సిద్ధంగా లక్షలాది మంది ఉన్నారు. అలాంటివారు మనకు ఆర్‌ఎస్‌ఎస్‌లో కనిపిస్తారు. అలాంటి సర్వోన్నతమైన, ఉత్తమమైన మానవులకు ఆలవాలమైనది మన భరత భూమి. అదే సమయంలో అలాంటివారిని ఒక పద్ధతి ప్రకారం తక్కువ చేసే రాజకీయ నాయకులు కూడా ఇదే గడ్డపై ఉన్నారు. ఈ దేశంలో ప్రతీ ఒక్కరు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌తరహాలో రాజీపడని దేశభక్తిని అణువణువునా కలిగి ఉన్న పక్షంలో మన దేశానికి సరితూగే దేశం ప్రపంచంలో ఉండదు కాక ఉండదు.
తమిళనాడులో రాజకీయ పార్టీలు ‘‘ఆత్మగౌరవం’’ అనే నినాదంతో అలమటించిపోతుంటాయి. కానీ వాటి నేతల్లో ఆత్మగౌరవం మచ్చుకైనా కనిపించదు. అసెంబ్లీలో మహిళలను వివస్త్రను చేయడం సహా అగౌరవకరమైన చర్యలకు పాల్పడుతుంటారు. ఎవరైనా ఇలాంటి చర్యలను ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకర్తల్లో రాతి వంటి నిశ్చలమైన ఆత్మగౌరవంతోనూ, ఆత్మవిశ్వాసంతోనూ పోల్చి చూడాలి. ‘‘మీ లక్ష్యాన్ని ఎప్పటికి సాధించగలరని అనుకుంటున్నారు? మీ దృక్కోణం ప్రకారం సామాజిక పరివర్తన సాధించడానికి ఎంత కాలం పడుతుంది?’’ అని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకర్తలను అడిగాను. ‘‘మా లక్ష్య సాధనకు ఇప్పటి నుంచి మరో 50 సంవత్సరాలు పట్టినా సరే ఆ దిశగా పనిచేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం’’ అని వారు బదులిచ్చారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ మునిసిపాలిటీలు, అసెంబ్లీలు, పార్లమెంట్‌ను ఆక్రమించుకోవడం కోసం రాజకీయ పార్టీలు పీకల్లోతు పనుల్లో నిమగ్నమై ఉన్న తరుణంలో తన లక్ష్య సాధన కోసం 50 ఏళ్ల కాల వ్యవధిని ఏర్పరుచుకొని, నిశ్చలమైన విశ్వాసంతో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ముందుకు సాగుతున్నది. ‘‘యావత్‌ ‌జాతి పూర్తిగా పరివర్తన చెందడాన్ని చూడాలని అనుకుంటున్నాం’’ అని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకర్తలు అన్నారు. ఈ హిమోన్నత శిఖరాలను నేను ఆరాధిస్తున్నాను. కానీ వ్యక్తిగతంగా నేను నిస్సహాయుడ్ని. తగినంత క్రమశిక్షణ లేని నేను ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరలేను. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకర్తల్లో కనిపించే క్రమశిక్షణ అనూహ్యమైనది. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకర్తలు చేరుకున్న శిఖరాలను ప్రస్తుత పరిస్థితితో పోల్చి చూసినప్పుడు నాకు సంతృప్తి కలుగుతుంది.
కొన్నేళ్ల క్రితం సేలంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌శిక్షణశిబిరానికి వెళ్లాను. అక్కడ కులాల మధ్య తేడాలు మచ్చుకైనా కనిపించలేదు. కులతత్త్వం లేని ఏకైక సంస్థగా ఆర్‌ఎస్‌ఎస్‌ ఉం‌ది. అదే తమిళనాడులో చూస్తే కుల సంఘాలకు చెందిన పోస్టర్లు , కార్యాలయాలు అడుగడుగునా కనిపిస్తాయి. రాజకీయ పార్టీల కారణంగా ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైంది. ప్రజలు కూడా కులం వెనుక పడిపోతుంటారు. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ అలాంటి పనులకు పాల్పడిందనే సంగతిని ఎవరైనా విన్నారా? ఆర్‌ఎస్‌ఎస్‌లో మీ కులం ఏమిటని ఏ ఒక్కరూ మిమ్మల్ని అడగరు. ఈ విషయంలో ఎంతో విశాల హృదయాన్ని కలిగి ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ అం‌టే నాకెంతో గౌరవం. ఆర్‌ఎస్‌ఎస్‌ను సమర్థించడం అంటే సెక్యులరిజానికి వ్యతిరేకమని కొందరు భావిస్తారు. కానీ దానర్థం ఎవరైనా ఒకరు తాను హిందువు అని గర్వించడమంటే అది సెక్యులరిజానికి వ్యతిరేకమని అనుకోవాలా? ఇది అసంబద్ధమైనది. నన్ను నేను ఒక హిందువు అని చెప్పుకోవడానికి నేనెంతో గర్విస్తాను.
ఒక హిందువు హృదయం ఒక్క మానవాళినే కాకుండా యావత్‌ ‌సృష్టిని తనదిగా చేసుకుంటుంది. అతడు లేదా ఆమె మానవాళి కోసమే కాకుండా ద్విపాద జీవులు, చతుష్పాద జీవులు, పక్షులు, భూమండలం ఇలా యావత్‌ ‌సృష్టి యోగక్షేమాల కోసం ప్రార్థిస్తారు. మన మంత్రాల్లో కూడా అదే ఉంది. హిందువు ఎప్పుడూ కూడా తన స్వార్థం కోసం ప్రార్థించడు. యావత్‌ ‌మానవాళి సంక్షేమం కోసం, సకల జీవరాశుల బాగోగుల కోసం ప్రార్థిస్తాడు. అలాంటి ఒక గొప్ప ధర్మాన్ని ఆజన్మాంతం ఆచరించే వ్యక్తి సెక్యూలరిస్టును అని పిలిపించుకోవడం కోసం తనను తాను హిందువు అని చెప్పుకోవడానికి సిగ్గుపడటం అనేది సెక్యులరిజం అనిపించుకోదు. అది కేవలం ఆత్మవంచన తప్ప మరొకటి కాదు. అలాగని చెప్పి ఇతర మత విశ్వాసాలను తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు. పైన పేర్కొన్న భావాలన్నింటినీ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పుణికిపుచ్చుకున్నదని నాకు తెలుసు. అయినప్పటికీ జాతి వ్యతిరేకి అంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌గురించి కొందరు వ్యక్తులు చెడుగా మాట్లాడుతుంటారు. ప్రజల్లో దేశభక్తిని పాదుగొల్పుతూ, అంతర్జాతీయ సమాజంలో భారత్‌ను అగ్రనేతగా నిలిపే లక్ష్యంతో పనిచేస్తున్న ఈ సంస్థ ప్రతిష్టను మసకబార్చడానికి ప్రయత్నిస్తుంటారు. ఇది అత్యంత అభ్యంతరకరమైనది. మరికొందరైతే ఎలాంటి కారణం లేకుండా ఆర్‌ఎస్‌ఎస్‌ను బహిరంగంగా విమర్శిస్తుంటారు. కానీ వ్యక్తిగతంగా ఆర్‌ఎస్‌ఎస్‌కు కరడుగట్టిన మద్దతుదారులుగా ఉంటారు. అలాంటి ఒక గొప్ప సంస్థను స్థాపించిన మహోన్నత వ్యక్తికి అత్యంత వినమ్రతతో శిరసు వంచి నమస్కరిస్తున్నాను. ఆయన ఒక యోగి, తత్త్వవేత్త, సమర్థమంతమైన నిర్వాహకులు, సర్వలక్షణ శోభితులు.

– చో ఎస్‌.‌రామస్వామి (దివంగత పాత్రికేయులు)

About Author

By editor

Twitter
YOUTUBE