‘కాశ్మీర దీపకళిక’ (యాత్రా సాహితీ రచన)
‘అపరాజిత’ (మరో ఇద్దరితో కలిసి గొలుసు నవల)
అగ్నిపుత్రి పేరిట కవితా సంకలనం
ఆయుధ శీర్షికన కథాసంపుటి
తరగతి గదిలో ఆలకించిన పాఠాల నేపథ్యంలో ధారావాహికగా ‘ఆంధ్రుల కథ’, జానపద గేయాల గురించిన పరిశోధన.
ఇలా ఎన్నో విభిన్నతలను పుణికిపుచ్చుకున్న నాయని కృష్ణకుమారి తనదైన తీరున పాట రాసింది పదకొండేళ్ల వయసులో!
దశాబ్దం క్రితం జనవరి 30న ఆమె శాశ్వత నిద్రలోకి జారుకున్నపుడు వనితా సాహితీ కిరణం మటుమాయమైందని ఎందరెందరో కంటతడి పెట్టారు.
తన రచనల్లో ఒకటి ‘ఏం చెప్పను నేస్తం’ నాటి నుంచి నేటిదాకా ఏటేటా ఆ మూడు పదాలనే తలచుకుంటున్నారు అభిమానులందరూ! అంతటి ఆ ‘సారస్వత మిత్ర’ జీవనయాన విశేషాలెన్నో.
భారత స్వాతంత్య్ర సమరయోధులు నాయని సుబ్బారావు. భావ కవిత్వమైనా, ఆత్మకథాత్మక ప్రక్రియ అయినా ఆయనవే. మాతృగీతాలు, జన్మభూమి కావ్యాలకర్త. ఆయన తనయే కృష్ణకుమారి.
‘నాన్న నాకు ఎన్నో నేర్పారు. ఎలా రాయాలో, ఏం మాట్లాడాలో, నలుగురిలోనూ ఏ విధంగా మెలగాలో, ఎప్పుడు ప్రశ్నించాలో, ఏ రీతిన సమాధానం రాబట్టాలో నాన్నే నాకు నేర్పించారు, తీర్చిదిద్దారు’ అని పలుమార్లు గుర్తు చేసుకునేవారామె. ‘నా తొలి గురువు నాన్న’ అంటుండేవారు.
ఆమె ఉన్నత స్థాయి చదువులు గుంటూరు, శ్రీకాకుళం ప్రాంతాల్లో కొనసాగాయి. డిగ్రీ చదువుతుండగానే చరిత్ర పుస్తకాన్ని వెలువరించారు. అప్పటికి తనకు 18 సంవత్సరాలే! విశిష్ట అంశం మరొకటి ఏమిటంటే – అప్పట్లో ఆ పుస్తకమే బడి పిల్లల పాఠ్య గ్రంథమైంది!
అధ్యాపక జీవితం మద్రాసు, హైదరాబాద్ నగరాల్లో. తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకులపతి స్థాయికి ఎదిగినా, ఎంతగానో ఒదిగి ఉండేవారు. ఉత్తమ రచయిత్రిగా పురస్కారం స్వీకరించినా, రాష్ట్ర స్థాయిన సాహిత్య అకాడమీ బహుమతి విజేత అయినా, అన్నింటినీ మించి ఆనాడే గృహలక్ష్మి స్వర్ణకంకణ గ్రహీతగా కీర్తి కిరీటం అందుకున్నా… సదా వినమ్రత కనబరచేవారు.
గృహలక్ష్మితోపాటు ఆంధ్ర మహిళ, జయశ్రీ, కిన్నెర వంటి పత్రికల్లో నాయని కృష్ణకుమారి రచనలనేకం ప్రచురితమయ్యాయి. ‘ఆత్మకథ’ రచన ప్రచురితమైనపుడు ఆ రచయిత్రి వయసు 23. అందులో వర్ణన: ఆవిడది సన్నగా, పొడుగ్గా ఉండే రూపం. తీర్చిదిద్దిన ముఖం. సన్నటి వాయిల్ చీరకట్టి, తలవెంట్రుకలను జారుముడి వేసుకుని ఉంది.
అదే కథాపరంపరలోని సంభాషణల శైలికి ఓ మచ్చుతునక : ‘అన్నీ ఆలోచించే సమాధానం చెప్తున్నాను. నా కంఠంలో ప్రాణం ఉండగా; ఈ లోకమంతా ఏకమైనా నన్ను ఆ దౌర్భాగ్యుడికిచ్చి పెళ్లి చేయలేరు. నేను చచ్చిన తర్వాత నా శవానికి అతడిని కట్టాల్సిందే! ఇది మాత్రం నిజం, బాగా ఆలోచించి మాట్లాడుతున్నాను. నేను బాగా ఉండాలంటే ఈ సంబంధాన్ని ఒప్పుకోకండి. ఇప్పటికింకా మించి పోలేదు’` ఈ విధంగా కొనసాగుతుంది రచనాశైలి అంతా.
వాక్యరచనలో సూటిదనం, సన్నివేశ కల్పన / చిత్రీకరణలో సహజత్వం కృష్ణకుమారి నిపుణతకు తార్కాణాలు. ఎంత పెద్ద సంవిధానమైనా, ఎక్కడా వ్యర్థపదమంటూ కనిపించదు. పాత్రల ద్వారా ప్రశ్నింపచేసే తత్వమూ ఆ కథల్లో కనిపిస్తుంటుంది. ఇటువంటి శైలీ విన్యాసాలే చదువరుల అభిమానం చొరగొనేలా చేశాయి.
ఐకమత్యము పేరిట ఉన్న రచన మొత్తం సామెతలతో కొనసాగుతుంది.
లక్షాధికారైన లవణమన్నమె కాని….
మిరపగింజ చూడ మీద నల్లగ ఉండు… వంటివి.
వంట ఇంటి మూలలో ఉన్న కూరగాయల తట్టలోని మిరపకాయ బంగారు చెక్కపెట్టెలని లవణ స్వామి.
పక్కన కాగితంలో పెట్టిన చింతపండు.
ఇదే కథావిధానంలోని కొన్ని వాక్యాలు ప్రస్తుత సందర్భంలో ప్రస్తావించుకోవాల్సినవే. అంతగా ఆకట్టుకుంటాయవి.
నిద్రపోతున్న చింతపండు మహాశయుడు ఆవలిస్తూ లేచి, చేతులూ కాళ్లూ సవరించుకుని, ‘మీలో మీకెందుకు తగువులు?’ అని సర్దబోయారు గాంధీజీ లాగ.
‘అంతేలేండి…’ అని సగం ఇష్టం, సగం అయిష్టం సూచిస్తున్న ధ్వనితో పులుసు వాక్యాలను సమర్థించబోయాడు నెహ్రూ పండితుడిలా కారం మహాశయుడు.
కానీ లవణస్వామి జయప్రకాశ్‌నారాయణ్ ఉద్ధృతం పుణికిపుచ్చుకున్నాడాయె. ఊరుకుంటాడా? ‘ఏం…. ఆ కారం…. ముందు నన్నెందుకు కదిలించాలీ’ అని ప్రొటెస్ట్ చేశాడు.
అంతలో ఆ ఇంట్లోని ఆమె ఆ అన్నింటినీ (పదార్థాలు) కలిపి సాంబారు కాచడంతో, కమ్మదనం వ్యాపించిందనేది సారాంశం.
పులుసు, ఉప్పు, కారాలే సాంబారుగా రూపొంది నపుడు; సమైక్యత సాధించినపుడు… ఆ మధురత్వం స్వరాజ్యమెందుకు కాదూ – అని ముక్తాయించారు రచయిత్రి కృష్ణకుమారి.
ఈమె వేరొక కథానిక ‘అభిమానాలు’. ఇందులోని విశేషణం: ‘అతని నాభినుంచి బయలుదేరిన హసన తరంగమొకటి కెరటాలు కెరటాలుగా గొంతవరకూ కదిలివచ్చి, అక్కడ ఆగిపోగా…. ముఖం చలించి… అరుణమై… నవ్వును పుక్కిటపట్టినట్లు కలకలలా డింది!’
‘నీలి గోరింట’ పేరుతో రాసిన కథకు ముగింపు ఎంతో విభిన్నంగా గోచరిస్తుంది. అది : ‘బయట రాజుకుంటున్న పిడకల పొగ ఆవిణ్ణి చుట్టుముట్టగా, ఆ ఆకారం రేకులు కరుగుతున్న నీలి గోరింటలా ఉంది’ అని!
ఇక; ‘జానపద సాహిత్యము, సంస్కృతి’ అనే ` గ్రంథం కృష్ణకుమారి పరిశీలనాతృష్ణను, పరిశోధక పటిమను తేటతెల్లం చేస్తోంది. భారతీయ జానపద ఘనతలో ఇదొక అంతర్భాగం.
అలనాటి ఆ పెండ్లి కథల్లో భాగంగా సీతా కల్యాణాన్ని వివరిస్తూ ఇలా ప్రస్తావించారు రచయిత్రి (ఉదాహరణ పూర్వకంగా)
బంగారు పందిరీ బలుపుగా తీర్చీ
పచ్చలా పీటల్లు పందిట్ల పరిచీ
విరజాజి పువ్వులా వీవనలు తెచ్చీ
వింత వింతల మాలలెన్నో కైసేసీ
దూరాన ఎవ్వరే వచ్చేటి వారూ?
పెండ్లి కొడుకు రామయ్యా…. పేరైన వాడూ!
ఆ కోవలోనే బాలపార్వతి అవతరణ గురించిన అభివర్ణన :
కన్నులు కలువ రేకులు బోలూ
కురులు తుమ్మెదల బారును బోలూ
చూపులు విరితూపులను బోలూ
మన్మథుని ముంజేతి చిలుక ఆ బాలా!
పరమేశ్వరుని అర్థాంగి ఆ పడతి!!
‘తెలుగు జానపద గేయగాథలు’ సైతం కృష్ణకుమారి గ్రంథంలో అనేకంగా వెలుగు చూశాయి. ప్రచురణగా వెలువడి ఇప్పటికే ఐదున్నర దశాబ్దాలు! ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నది ఈ పుస్తకానికే. పరిశోధన రంగంలో తన ఘనతకు మూలకారకులు భర్త మధుసూదనరావు కావడంతో, గేయగాథల గ్రంథాన్ని ఆయనకే అంకితం చేశారు. అందులోనే తన కృతజ్ఞతాభావాన్ని చిరువాక్యాల్లో విస్తరించారు.
‘పడి ఉన్న చోటు నుండి అణువైనా
అటూ ఇటూ తనంతట తానై తరలలేని
కందుక సదృశ మందప్రవృత్తి నాది’ అన్నారు మొదట.
నన్ను పురికొల్పి రెచ్చగొట్టి
తిన్నగా పరిశోధనా సముద్రంలో ముంచేసి
తమాషా చూసిన నా భర్తకు నా ప్రాణానికి….
అంటూ దాంపత్య అనురాగ బంధాన్ని విభిన్న కోణంలో ఆవిష్కరించారు.
‘జానపద సరస్వతి’గా పలువురి ప్రశంస లందుకున్న ఆమె అనువాద రంగంలో సైతం సుప్రసిద్ధ, బహుభాషా నైపుణ్యాన్ని మెండుగా కనబరిచారు.
‘పదవా్మఙయంలో పిల్లల ప్రసక్తి’ని ప్రత్యేకించి గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందిప్పుడు.
ఆమె దృష్టిలో, అభివ్యక్తిలో….
తన బిడ్డ గురించి తెలిపేందుకే స్త్రీ నోరు విప్పి పాడుతుంది.
మాతృకర్తృక పదాలు, పాటలు, కీర్తనలే ఎక్కువ.
గానం లేనివి, వచన రూపంలోనివీ వనితలు సజించినవే!
పిల్లల కోసం పడతి తపస్సు వర్ణనకు అతీతం.
రుద్రాక్ష మీద భద్రాక్ష
భద్రాక్ష మీద పోకచెక్క
పోకచెక్క మీద సన్న సూది
సన్న సూది మీద శిరస్సు కిందికీ, సిరిపాదం మీదికీ…అనేంతగా!
మరి` బిడ్డకళ్లు కలువపూలైతే? వాటి నుంచి జారే కన్నీరు….
అమ్మణ్ణి కన్నుల్లు తమ్మి పువ్వుల్లు
తమ్మి పువ్వులు తేర్చు కమ్మ తేనెల్లు
చిన్నారి కళ్లలో కన్నీటి జల్లు
కన్నీరు చూపకే కరగు నెడదల్లు
చక్కన్ని నా తల్లి గుక్క పట్టింది
చెక్కుటద్దాలలో చెదిరెనే సంజ!
ఇంతటి ప్రేమాదరాల తల్లిని విశదీకరిస్తూ, జానపద గేయ సాహితిని, విపులీకరిస్తూ, నాయని కృష్ణకుమారి చేసిన పరిశీలన, పరిశోధనలు రచనా రంగాన్ని సుసంపన్నం చేశాయి.
తెలుగు భాషా చరిత్రను గ్రంథస్తం చేసిన ప్రసిద్ధత ఆమెది. దీపకళిక అనే ఆమె పుస్తకం పేరు వ్యక్తిపరంగానూ ఆమెకే వర్తిస్తుంది! విశేష కృషికి మారు పేరు, విశిష్టసేవకు మరో పేరూ కృష్ణకుమారి. రచనల పరంపరలే ఇందుకు అక్షర సాక్ష్యాలు.
జంధ్యాల శరత్‌బాబు
సీనియర్ జర్నలిస్ట్