రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వం భారీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,32,205 కోట్లతో బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆయన వరుసగా బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది మూడోసారి.
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో, హోం మంత్రి వంగలపూడి అనిత శానసమండలిలో 2026-27 వార్షిక బడ్జెను ప్రవేశపెట్టారు. అంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. అనంతరం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌కు ఆర్థికమంత్రి కేశవ్ బడ్జెట్ పత్రాలు అందజేశారు.
వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు రూ.53,752.12 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను శాసనభలో ప్రవేశపెట్టగా, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ శాసనమండలిలో ప్రవేశ పెట్టారు. గత ఏడాది కంటే ఈసారి బడ్జెట్ రూ.10 వేల కోట్లు పెరిగింది. 2026`27 బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ.2,56, 143 కోట్లు, మూలధనం వ్యయం రూ.53,915 కోట్లు, రెవెన్యూలోటు రూ.22,002 కోట్లు, ద్రవ్యలోటు అంచనా రూ.75,868 కోట్లుగా చూపారు. ఇది రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో వరుసగా 1.88 శాతం, 3.84 శాతంగా ఉండనున్నాయి.
2025-26 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ వ్యయం 2,38,021 కోట్లుగా, మూల ధన వ్యయం 39,498 కోట్లు, రెవెన్యూ లోటు సుమారు రూ.41,118 కోట్లుగా, ద్రవ్యలోటు రూ.80,56 కోట్లుగా ఉంది. ఇవి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో వరుసగా 2.33 శాతం నుంచి 4.57 శాతంగా ఉన్నాయి.
సంక్షేమానికి ప్రాధాన్యం
సూపర్ సిక్స్ పేరిట అమలవుతున్న పథకాలకు భారీగా నిధులు కేటాయించారు.రూ.లక్షా 15 వేల కోట్లతో సంక్షేమానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఇదే మొదటిసారి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వెనుకబడిన వర్గాల సంక్షేమంతో పాటు సూపర్ సిక్స్ అమలుకు కేటాయింపులు పేదల జీవితాల్లో భరోసా నింపనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బడ్జెట్‌లో మొత్తం 17 శాతం సంక్షేమానికి కేటాయించారు. నేతన్నలకు పవర్ లూమ్స్‌కు 500 యూనిట్లు, హ్యాండ్ లూమ్స్‌కు 200 యూనిట్లు విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. సాంఘిక సంక్షేమానికి రూ. 11,118.84 కోట్లు, ఈడబ్ల్యూఎస్ సంక్షేమానికి రూ. 10,699.33 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ. 23,650.88 కోట్లు, ఎన్టీఆర్ భరోసా పథకానికి రూ.27,719 కోట్లు, దీపం 2.0కు రూ.2,601 కోట్లు, వివిధ వర్గాలకు ఆర్థిక మద్దతుగా రూ. 2,320 కోట్లు, స్త్రీశక్తి పథకానికి రూ. 1,420 కోట్లు, వీకర్ సెక్షన్లకు సబ్సిడీ, ఉచిత విద్యుత్ పథకానికి రూ. 600 కోట్లు, ఆటో డ్రైవర్లకు ఆర్ధిక సహాయంగా రూ. 450 కోట్లు, తల్లికి వందనం పథకానికి రూ. 9,668 కోట్లు, శిశు సంక్షేమానికి రూ. 4,581 కోట్లు, ఉపకారవేతనాలకు రూ. 3,836 కోట్లు, సమగ్ర శిక్ష అభియాన్‌కు రూ. 2,946 కోట్లు, ఉన్నత విద్యకు రూ. 2,566 కోట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి రూ. 2,161 కోట్లు, మన బడి, మన… భవిష్యత్ పథకానికి రూ. 1,500 కోట్లు, నైపుణ్యాభివృద్ధికి రూ. 1,232 కోట్లు, పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా: రూ. 707 కోట్లు, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థిమిత్రకు రూ. 654 కోట్లు, యువత, క్రీడలు రూ. 438 కోట్లు, మత్స్యకార సేవలో: రూ.260 కోట్లు, పంటల బీమాకు రూ. 250 కోట్లు, అన్నదాత సుఖీభవకు రూ.6,600 కోట్లు కేటాయించారు. దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణం.. పోలీసులకు 3 వేల కొత్త పోలీస్ వాహనాలు మంజూరు చేసేందుకు బడ్జెట్‌లో పొందుపరిచారు.
అభివృద్ధికి పెద్దపీట
ప్రభుత్వం రాబడి పెంపుదలకు ప్రణాళికలు రచిస్తూనే సంపద సృష్టికి అడుగులు వేస్తోంది. ప్రధానంగా సంపద సృష్టికి సంక్షేమానికి రూ. 100 కోట్ల కార్పస్ నిధితో రాష్ట్ర సంక్షేమ నిధిని ఏర్పాటు అందులో భాగమే. రాష్ట్రంలో ని ప్రాంతాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తూ, ఆ దిశగా కేటాయింపులు జరిపింది. విద్య, వైద్యారోగ్యం, పట్టణ, గ్రామీణాభి వృద్ధి, జలవనరులు, వ్యవసాయం, విద్యుత్ రంగాలకు పెద్దఎత్తున నిధులు కేటాయించారు. జల వనరులశాఖకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఈ ఏడాదిలో మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసేలా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా ప్రకటిస్తూ రూ.30 వేల కోట్లు కేటాయించటం ఆ ప్రాంతానికి మహర్దశ పట్టనుంది.రాజధాని అమరావతికి రూ. 6వేల కోట్లు, పోలవరానికి రూ. 6వేల కోట్లు (కేంద్ర సహకారం ఉన్నప్పటికీ), దేశంలోనే తొలిసారిగా అమరావతిలో ఏర్పాటైన క్వాంటం వ్యాలీకి రూ. 638 కోట్లు కేటాయించారు. దీనిని ప్రపంచంతో పోటీ పడేలా అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకునే ప్రయత్నంగా చెబుతున్నారు. పాఠశాల విద్యకు రూ. 32,308.32 కోట్లు ,పంచాయతీ రాజ్, గ్రామీణాభి వృద్ధికి రూ. 22,941.54 కోట్లు, వైద్యారోగ్యం రూ. 19,306.04 కోట్లు, నీటి వనరులు రూ. 18,223. 67 కోట్లు, పట్టణాభివృద్ధి, పురపాలక శాఖకు రూ. 14,538.68 కోట్లు, విద్యుతు రంగానికి రూ. 13,934.25 కోట్లు, వ్యవసాయ రంగం రూ. 11,745.21 కోట్లు, వ్యవసాయం – నీటి భద్రత భారీగా నిధులు కేటాయించారు. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ. 9,906 కోట్లు, పోలవరం రూ. 6,105 కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన రూ. 1,927 కోట్లు, ధరల స్థిరీకరణ నిధి రూ. 500 కోట్లు, పీఎం కృషి సించాయి యోజన రూ. 190 కోట్లు కేటాయించారు. పాఠశాలలు, హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పన: రూ. 1,800 కోట్లు.. ఎంఎసఎంఈలకు ప్రయోజనం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో (బిల్ డిస్కౌంటింగ్ విధానానికి డిజిటల్ ప్లాట్ ఫామ్) అమలు చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇది మెరుగైన బడ్జెట్ : చంద్రబాబు
ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ‘వచ్చే రెండు, మూడేళ్లలో మరింత మెరుగైన బడ్జెట్ ప్రవేశపెడతాం. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు చేసిన విధ్వంసం నుంచి కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుంది. ఆదాయం తక్కువ-ఖర్చులు ఎక్కువ అనేది వారసత్వంగా వచ్చింది. కేంద్ర సహకారంతో నిభాయించుకుంటూ వస్తున్నాం. వ్యవసాయం, సేవారంగాల నుంచి ఎక్కువ ఆదాయం రావాలి. రెండు, మూడేళ్లలో అమరావతికి ఒక రూపు వస్తుంది. అక్కడి రోడ్లను జాతీయ రహదారికి అను సంధానిస్తున్నాం. దీనివల్ల అమరావతికి రాక పోకలు పెరిగి ఆదాయమూ వస్తుంది. అమరావతికి పశ్చిమ బైపాస్‌తో యాక్సెస్ పెరిగింది. బడ్జెట్‌లో రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు రూ.30 వేల కోట్లు కేటాయిం చడం మంచి పరిణామం. దేశంలోనే నాణ్యమైన పండ్లు ‘సీమ’నుంచి వస్తున్నాయి. ఇక్కడ పండే దానిమ్మకు మంచి డిమాండ్ ఉంది. విశాఖ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలన్న గ్లోబల్ ఐటీ దిగ్గజం గూగుల్ నిర్ణయం వల్ల ఒక్కసారిగా ప్రపంచ దేశాలన్నీ రాష్ట్రం చూసేలా చేసింది.
గ్రామం నుంచి గ్లోబల్ స్థాయికి: ఉపముఖ్యమంత్రి
గ్రామం నుంచి గ్లోబల్ స్థాయి వరకూ… విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, యువత, మహిళా సాధికారత, సాంకేతికత… ఇలా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే 360 డిగ్రీల సమతుల్య గ్రోత్ మోడల్‌గా రాష్ట్ర బడ్జెట్ రూపుదిద్దు కుందని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర బడ్జెట్‌పై ‘ఎక్స’ వేదికగా ఆయన స్పందించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ.. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం, సంక్షేమంతో కూడిన అభివృద్ధి ఫలాలు అందిస్తున్నా మన్నారు. ‘చంద్రబాబు నేతృత్వంలో 360 డిగ్రీల్లో రాష్ట్ర సమగ్రాభి వృద్ధికి బలమైన పునాది వేసేలా.. రూ.3.22 లక్షల కోట్ల వ్యయంతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.22, 942 కోట్ల కేటాయింపుల ద్వారా రాష్ట్రాభివృద్ధిలో గ్రామాల పాత్ర కీలకమనే విషయాన్ని ఎన్డీఏ ప్రభుత్వం పునరుద్ఘాటించింది. పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలకు 714 కోట్లు కేటాయిం చింది’ అని చెప్పారు.
ఆర్థిక నిర్వహణలో పరిపక్వత: సత్యకుమార్
2024-25లో 5.11 శాతంగా ఉన్న ద్రవ్య లోటును 4.57 శాతానికి తగ్గించిన ప్రభుత్వం ఇప్పుడు దాన్ని మరింత తగ్గించి 3.84 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకోవడం ఆర్థిక నిర్వహ ణలో పరిపక్వతకు నిదర్శనం. రెవెన్యూ లోటును 2.33 శాతం నుండి 1.88 శాతానికి తగ్గించాలని నిర్దే శించుకోవడం రాష్ట్ర ఆర్థిక స్వావలంబనకు దోహద పడుతుంది. ఆరోగ్య రంగంలో మొత్తం బడ్జెట్లో 5.88 శాతం కేటాయించడం చారిత్రాత్మకం. బడ్జెట్ లో మూడవ అతిపెద్ద కేటాయింపు ఆరోగ్య శాఖకు కావడం ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. ఆరోగ్య రంగంలో మూల ధన వ్యయంగా రూ.3,066 కోట్లు కేటాయించాం. స్వర్ణాంధ్ర దిశగా రాష్ట్రం పయనిస్తున్న తరుణంలో ఆ లక్ష్యానికి ఊత మిస్తూ 2026-27 బడ్జెట్లో సాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై రాష్ట్రప్రభుత్వం దృష్టి సారించింది.
సంపద సృష్టికి దోహదం: మాధవ్
లోటును అదుపులో ఉంచుతూ సంపద సృష్టించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందనడానికి 2026-27 బడ్జెట్ నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. ‘ప్రాధాన్యత క్రమంలో అన్ని రంగాలకు పెద్దపీట వేశారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన 83 కేంద్ర ప్రాయోజిత పథకాలను పునరుద్ధరించి వాటికి దాదాపు రూ.24 వేల కోట్లు కేటాయించారు. అదే నిష్పత్తిలో కేంద్రం నుండి 60 శాతం నిధులు రాబట్టే అవకాశం ఉంది’అని పేర్కొన్నారు.
బిల్‌గేట్స్ రాష్ట్ర పర్యటన
గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఆంధ్ర ప్రదేశ్‌లో ఫిబ్రవరి 16న విస్తృతంగా పర్యటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో కలసి ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించి, పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించారు. చంద్రబాబును తన “గుడ్ ఓల్డ్ ఫ్రెండ”గా అభివర్ణించిన గేట్స్, ప్రపంచం లోని ఎంతోమంది నాయకుల కంటే చంద్రబాబు ఆలోచనలు చాలా ముందుంటాయని, సింగపూర్ ప్రధాని తరహా విజన్ ఆయన సొంతమని కొనియా డారు. ముఖ్యంగా కుప్పంలో అమలు చేస్తున్న ‘సంజీవని’ కార్యక్రమం, ఆరోగ్య, విద్యారంగాల్లో ఏఐ వినియోగంపై గేట్స్ ప్రశంసలు కురిపించారు. ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన గేట్స్, అక్కడ సాగులో డ్రోన్ల వినియోగం, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా మహిళా రైతులు స్వయంగా వండిన స్థానిక వంటకాలను రుచిచూసి వారితో ముచ్చటిం చారు. ఏపీ ప్రభుత్వం వ్యవసాయాన్ని సాంకేతికతను అనుసంధానిస్తున్న తీరు అద్భుతమని, ఇది రైతుల ఆదాయాన్ని పెంచడానికి దోహదపడుతుందని బిల్ గేట్స్ పేర్కొన్నారు. అంతకు ముందు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు మంత్రి లోకేశ్ ఘనస్వాగతం పలకగా, అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఎదురేగి స్వాగతం పలికారు.

తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్