భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

– బి.కళాగోపాల్‌

జూన్‌ ‌నెల ఎండలు మిటమిట మంటూ పేట్రేగిపోసాగాయి. పెద్దసారు బడిబాటలో భాగంగా ఉదయమే మన హాబిటేషన్‌లో కాన్వాసింగ్‌ ‌చేద్దామని చెప్పిండు. నేను, బయోసైన్సు సారు, పెద్దసారు ఆరోజు ముగ్గురం మా ఉన్నత పాఠశాలకు దగ్గర్లోని సందుగొందుల్లో, ఇరుకుగల్లీలలో తిరగసాగాం. అక్కడక్కడ మా స్కూల్‌ ‌పిల్లలు కన్పిస్తుంటే ఆరవ తరగతి అడ్మిషన్లకొరకై కొత్త పిల్లల ఇండ్ల జాడ చెప్పమంటూ ఆ ఊరి పిల్లల సహాయం తీసుకుంటూ ముందుకెళ్లసాగాం.
బయోసైన్సు సారు యస్‌సిఇఆర్‌టిలో గత ఇరవై ఐదేండ్లుగా రిసోర్స్ ‌పర్సన్‌. ‌నెలలో దాదాపు పదిహేను రోజులు హైదరాబాదులోనే ఆన్‌ ‌డ్యూటీ ఉంటుంది అతనికి. అభ్యాస దీపికలు,పాఠ్యపుస్తకాల రచయితగా బిజీ అతను. దానికి తోడు మా పెద్ద సారుది కూడా బయోసైన్స్ ‌సబ్జెక్టే గనుక ఆయన తనకూ పన్నెండు పీరియడ్స్ ‌టైంటేబుల్లో కేటాయించు కొని పాఠాలు చెప్పవట్టి గనుక బతికిపోయాం లేకుంటే మాకు నో లీజర్‌.
‌బడికి వచ్చినపుడు మాత్రం ఆయన క్లాసులకు తప్పకుండా వెళ్తాడు. బోధనకు దూరం కాని అతడి ప్రవర్తన మాకెంతో నచ్చుతుంది.‘‘ఇదేమిటి సార్‌? ఇం‌త ఘోరమైన పరిస్థితి దాపురించింది ప్రభుత్వ బడులకి..ఇల్లిల్లూ తిరుగుతూ మీ పిల్లల్ని మాబడిలో చేర్పించండి అని బిచ్చమెత్తుకున్నట్టు ఉంది.ఎనభైలలో ప్రభుత్వ బడులు నిండా విద్యార్థులతో ఎంత కళకళలాడుతూ ఉండేవని..! ఇప్పుడిలా లీస్ట్ ‌స్ట్రెంత్‌తో కొనఊపిరి రోగిలా కొట్టుమిట్టాడవట్టే..’’ అన్నాడు దిగులుగా.
హైదరాబాద్‌ ‌రిసోర్స్ ‌పర్సన్‌గా బడి సాధక బాధకాలు ఎరిగిన వ్యక్తిగా అతని సీనియారిటీ సిన్సియర్‌గా గొంతులో ప్రతిధ్వనించింది. ‘‘తప్పదు కదా! మన డీఈవో గారి ఆదేశాల మేరకు ప్రతిఏటా బడి పునఃప్రారంబ•• సన్నాహాలలో భాగంగా ఈ వారం రోజులు అడ్మిషన్ల కొరకు వచ్చే కొత్త పిల్లల్ని కనిపెట్టాలి. అటుపిమ్మట మండల కేంద్రంలో టెక్సట్ ‌బుక్స్ ‌తీసుకోవాలి. యూనిఫాంలు, రైసుబ్యాగుల నిల్వలు సరి పోల్చుకోవాలి. ఎంత హెచ్‌ఎం ఐనా మాకూ తప్పని తిప్పలే.. !పిల్లల సంఖ్యతో బడి నిండాలి.
విద్యార్థుల సంఖ్య పెరిగితేనే. రేపు మన ఉద్యోగాలకు కొంత భద్రత. లేకుంటే ఉన్న పోస్టులు పోయే ప్రమాదం. రాబోయే జెనరేషన్లకు ఉపాధ్యాయ ఉద్యోగాలు దొరకవు..!’’ అన్నాడు విజ్ఞతగా.
మెచ్చుకోలుగా చూశాను ఆయన వంక. వచ్చే ఎండాకాలం ఆయన ఉద్యోగ విరమణ. ఆదర్శ మార్గదర్శకుడిగా..కొన్ని బరువులు, బాధ్యతలు హెచ్‌ ఎం‌లకు తప్పవు కదా. ఓ ఇంటి మందు ఉన్న ఇద్దరు తల్లులు ఆ పక్కనే ఆడుకుంటున్న పది పన్నెండేళ్ల పిల్లలను పిల్చి.. ‘‘మన ఊరిలోని మన ప్రభుత్వ బడిలో చేరాలి. గవర్నమెంట్‌ ‌స్కూలల్ల మంచిగ సదువు చెప్పే టీచర్లు ఉంటరు. మేమంతా మంచిగ చదివిపిస్తం. మీరంతా మా బడిల్నే అడ్మిషన్‌ ‌తీసుకోవాలి..!’’ అంటూ ఆయన ముందే తయారు చేసి ప్రింటు తీయించిన పాంప్లెటును అక్కడున్న ఓ తల్లి చేతిలో పెట్టాడు.
అంతే ఆవిడ గయ్యిమంటూ లేచింది ‘‘ ఓ మస్తు జెప్తున్నరు.. ఏందీ మీ సర్కారు బడిల మా పిల్లల్ని ఎయ్యాల్నా?అక్కడ సదువు మంచిగ అస్తలేదనే మొన్ననే నా బిడ్డను ప్రైవేట్‌ ‌బడిల ఏశిన. మీ బడి పిల్ల గాండ్లయి నోటుబుక్కులు చినిగిపోయి ఉంటాయి. సమయానికి పుస్తకాలు ఇయ్యరు. మీరు మా దగ్గర అన్ని ఉన్నాయి అని చెప్తరు. కంప్యూటర్లు ఉన్నాయి, యూనిఫామ్‌ ‌లిస్తం, ఆటలాడిస్తాం, వారానికి మూడు కోడిగుడ్లతో భోజనం పెడ్తం, రాగుల జావ రోజూ ఇస్తాం.. అని అంటారు.. కాని వంట ఏజెన్సీలోళక్ల దగ్గర సాలినన్ని పైసల్లేక గివన్నీ పెట్టనే పెట్టరు. నేను సుత సర్కారు బడిల్నే గప్పట్ల వంట జేసిన. పిల్లలు తక్కువనీ బర్కత్‌ ‌వడతలేదని నేనే బంజేషిన మీరు రాక ముందులెండ్రి.పైసలు సరిపోక నాసిరకం పప్పులు, నూనెలు వాడతరు. కూరగాయలు సరిపోయినంత వేయక.. పోరగాండ్లకు పల్సటి పిండి పప్పుచారుతో అన్నం బెడ్తరు. వాంతులైతయి. విరోచనాలైతయి. పిల్లలకు సరిగ్గా మూత్రశాలలు లేవు. కాంపౌండ్‌ ‌గోడ కూలిపోయి ఉంది, పైకప్పులు గట్టివాన పడకముందే ఊరుస్తయి. గదులల్ల బండలు ఊడిపోయి ఉంటాయి. మీ దగ్గర అటెండర్‌ ‌లేడు మాకు తెల్సు. మాది గిదే ఊరు. నేను కూడా సూసిన అమ్మో! మా పొల్లగాండ్లు మీరు రాక ముందు ఊడ్సుడు, కంకర రాళ్లు ఏరుడు. ఎన్నిసార్ల పేపరోల్లు అచ్చి ఫోటోలు కొట్టుకొని పోలే. గీ నడుమ జెర నయమైంది. ఒక ఆడా మెను పెట్టినట్టుండ్రు. మా సుట్టాలామెనే ఆమె. ఇగ మీరిచ్చేగా యూనిఫాంలు ఐతే నాలుగు ఉతుకులకే రంగు ఎల్సిపోయి పల్సవడి షినిగి పోవట్టినయి. గా బట్టలు ఎన్ని రోజులు ఆగవు. చినిగితే కుట్లు ఏపిచ్చుడు, కాంటలు వెడితే పొక్కలు వడి బట్టలు ఖరాబు.గిన్ని పరేషాన్లు ఎందుకని.. అబ్బో! నా బిడ్డను దగ్గర్లోని ప్రైవేటు బడికే పంపి సదివించుకున్నది పోపు (మంచిది)..’’ అంటూ ఏకబిగిన మమ్మల్ని ఏకిపారేసింది.
ఎంతైనా సర్కారు బడి అంటే అందరికీ అలుసే! ఇక అంతే! మా బడి గురించీ మాకున్న ప్రతిభా ప్రావీణ్యాల గురించి, మా బోధనలోని నాణ్యత గురించి చెప్పుకునే అవకాశం ఇవ్వలేదా మహాఇల్లాలు, మా ముగ్గురి ముఖాలు మ్రాన్పడి పోయాయి.ఆవిడ తిట్ల దండకానికి తోడు సూర్యుడి ఎండతీవ్రతా హెచ్చసాగింది. ఎండ మొహం నుండి నడినెత్తి దాకా పాకసాగింది.
ఓ ఇంటి అరుగు మీద కాసింత చెట్టు నీడ కనిపిస్తుంటే కుర్చొన్నాం.
పాపం ..పెద్ద సారు ముఖంలో కత్తి వేటుకు నెత్తురు చుక్కలేదు. నాకూ బాధగా అన్పించింది. మా వివరణ వినకుండానే ఆమె అలా నలుగురి ముందు మమ్మల్ని అన్నేసి మాటలు అన్నందుకు ఇంకా చెప్పాలంటే ఆమె చెప్పిన సత్యవాక్కుల ముందు మేం మా బడిలో ఇవన్నీ ఉన్నాయి అని గట్టిగా వత్తాసు పల్కలేని మా నిస్సహాయతకు లోలోన మేమెంతో సిగ్గు పడిపోతున్నాం.
తెచ్చుకున్న నీళ్ల బాటిల్‌తో జెరంత గొంతు తడుపుకొని పరేషాన్‌ అవుతూ కర్చీఫ్‌తో ముఖం తుడ్సుకుంటున్న మా పెద్దసార్‌ ‌తోటి’’సార్‌ ‌గిదేంది?గా తల్లి గింత గానం తిట్ల పురాణం ఇన్పిస్తుంటే అట్లాగాదమ్మ అని సర్ది చెప్పుకోకపోతమి? మరి, నేను, మీరూ, మన బళ్ల అందరం గీ సర్కార్‌ ‌బడిల్నే గదా .. ఇగో గిదే తెలుగు మీడియం సదువుకొని, ట్రైనింగ్‌ ‌లు, యం.ఏలు చేసి అచ్చినం. మన బడిల ముందే పిల్లలు తక్కువ. పైగా సక్సెస్‌ ‌స్కూల్‌ ‌కాదు. కొన ఊపిరి మీన ఉన్న తెలుగు మీడియం ఉన్నత పాఠశాల. ఏది ఏమైనా మనల్ని మనం సమర్థించుకో లేమా సార్‌? ‌పక్కపొంటే ఉన్న ప్రైమరీ స్కూల్‌ ‌పిల్లలు కూడా మనకెందుకు అస్తలేరు?’’ ఆవేశం, ఆక్రోశం కలగలిసిన గొంతుతో ప్రశ్నించాను.
‘‘అవును మేడం, మీరన్నది నిజమే. అందరం ప్రభుత్వ బడి, వీధిబడిలో చదువుకొని వచ్చినవారమే. కాని నేటి సమాజానికి సర్కారు బడి అంటేనే ఒక రకమైన పలచనైన భావన ఏర్పడిపోయింది. అందుకు ఎన్నో కారణాలున్నాయనుకోండి. అవన్నీ మనకు తెలిసినవే. ఆమె ప్రశ్నల్లో సత్యం ఉంది.మనమంతా బడి మొదలైనా కొత్త పాఠ్యపుస్తకాలు రాక పాత పుస్తకాలతో నెట్టుకొస్తున్నవారమే. వివిధ యాప్‌లలో రోజూ సమాచారాన్ని నింపుతున్నాం. ఇక మాకైతే చెప్పతరం గాని మీటింగులు, నోడల్‌ ‌పర్యవేక్షణలు, బిల్లుల కొరకై డిటిఓల చుట్టూ ప్రదక్షిణ, వివిధ జబ్బులతో బాధపడుతున్న ఉపాధ్యాయులు, మెటర్నిటీ లీవ్లో ఉన్న ఉపాధ్యాయినిల స్థానంలో అడిగినా డిప్యుటేషన్‌ ఇవ్వని అధికారులు, మధ్యాహ్న భోజన రికార్డుల నిర్వహణ, పాఠశాల పనివేళల్లో వచ్చి పడుతున్న జూమ్‌ ‌మీటింగులు, కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్సులు.. గిన్ని పరేషాన్లతో సతమతమవుతుంటే ఇక సబ్జెక్టులల్లకు క్లాసులెలా జరిగేవి? బడిలో అకడమిక్‌ ‌విషయాలపై పురోగతి ఎపుడని ముందుకు వెళ్లేది? ‘‘అన్నాడు నా ప్రశ్నకు తన ప్రశ్నలను అదనంగా జోడించి.
మా బయోసారు మరో బాంబు లాంటి ప్రశ్నను పేల్చాడు. ‘‘మేడం! ఈ తల్లులు ఇంకా ముందుకెళ్లి మీ పిల్లల్ని మీరు ఎక్కడ చదివించిండ్రు. మీ పిల్లలేమో డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు కావాలాయే, మరి మా పిల్లలో అడ్డా మీద కూలి బతుకు, మెకానిక్కుల పని చేసుకోవాల్నా, అంటే అవేం తక్కువ పనులని గాకున్నా.. మీ పిల్లల్ని ప్రైవేట్‌ ఇం‌గ్లీష్‌ ‌మీడియం బడిలకెందుకని పంపుతుండ్రు? వాళ్లనూ గదే గవర్న మెంటు బడిలల్ల,కాలేజీలల్ల సదివిపియ్యెచ్చుగదా?
మీకేమో పైసలున్నయన్న షోకులు, మేం గూడా మాపిల్లగాండ్లను గట్లనే అద్దాల బస్సులల్ల, సూటు బూటు యూనిఫాంలల్ల పంపిస్తం.. అని బాణాలు సంధిస్తే ఏమని సమర్థించుకుందాం? వ్యవస్థను ఎలా చక్కదిద్దుతాం? చెప్పండి’’ అన్నాడు సూటిగా నన్నే చూస్తూ.
ఆయన ప్రశ్నలు నాకు మింగుడుపడటం లేడు. తీవ్రమైన ఉక్కపోతతో నిలువెల్లా చెమటలు పట్ట సాగాయి. అవమానంగా ఫీలయ్యానో ఏమోగానీ మొహమంతా ఎర్రగా జేవురించింది. మా పరిస్థితి గమనించిన పెద్దసారు ‘‘సరే ఈరోజుకు కాన్వాసింగ్‌ ‌చాలిద్దాం. రేపు మనం ముగ్గురం మనకు దగ్గర్లోని ప్రభుత్వ అప్పర్‌ ‌ప్రైమరీ స్కూల్లకు వెళ్లి, ఆ అడ్మిషన్ల వివరాలను సేకరిద్దాం. ఎండకాక ముందే వెళ్తాం. పొద్దున ఆయా గ్రామాల్లో తల్లితండ్రులు ఉంటారు. వివరాలు రాసుకోవచ్చు’’ అంటూ లేచాడు. రేపు మళ్లీ ఎన్ని మొట్టికాయలో దేవుడా! అనుకొని నిట్టూర్చాను.. ‘‘సార్‌ ఈ ‌రోజటి వివరాలు గూగుల్‌ ‌ఫాంలలో నింపి, కాన్వాసింగ్‌ ‌ఫోటోలు అప్లోడ్‌ ‌చేయాలి’’ అంటూ బయోసారు మిగిలిపోయిన పనిని మా పెద్ద సారు చెవిన వేశాడు. తెలుసన్నట్టుగా తలాడించాడు పెద్దసారు.
ళి ళి ళి
ఉదయం బంగారు భానుడి లేత కిరణాలు గోరువెచ్చగా స్పృశిస్తుంటే బస్సు దిగి మాకు పొరుగునే ఉన్న యూపిఎస్‌ ‌పాఠశాల గల పల్లెలో అడుగు పెట్టాం. ఇక్కడెన్ని యమగండాలో అని బిక్కు బిక్కుమనుకుంటూ ఆ మాధ్యమిక పాఠశాల ఆవరణను సమీపించాం. అశోక్‌ ‌సారు సాదరంగా ఆహ్వానించాడు..’’ సార్‌ ‌మా బడిలో ఏడవ తరగతిలో కేవలం పదిమందే ఉన్నారు. అందులో ఆడపిల్లల్ని కెజీ బీవీల్లో వేస్తామంటున్నారు. మరి కొందరు గిరిజన హాస్టల్స్, ‌గురుకులాలకు పంపుతా మని అంటున్నారు. ఈసారి మీ బడికి వచ్చే పిల్లల సంఖ్య తగ్గితుందేమోనండి’’ అంటూ ఒక ధర్మ సందేహాన్ని వెలిబుచ్చాడు.
‘‘వాళ్ల ఫోన్‌ ‌నెంబర్లు, డీటైల్స్ ఇవ్వండి. ఓసారి మాట్లాడతాం. ఇప్పుడే వెళ్లి కలుస్తాం’’ అన్నాడు పెద్ద సారు. ఆ వివరాలన్ని రాసుకున్నాడు బయోసారు. మా వెంబడి ఆ బడి మరో విద్యార్థిని వెంటబెట్టుకొని దగ్గర్లోని పొలాల్లో పని చేసుకుంటున్న ఓ తండ్రి దగ్గరకు వెళ్లి ఆయన బిడ్డల వివరాలను అడగసాగాడు పెద్దసారు.ఆ పెద్దాయన నవ్వి ‘‘గిదేంది సార్లు గిట్ల తోట లెంబడి, పొలాలెంబడి వడి బళ్లకు పిల్లలు కావాలని తిరుగుతున్నారా? మా పిల్లాడిని ఈ యేడు హాస్టల్లో వేస్తాను. పొలం పనుల్లో పడి సాయంత్రాలు ఆలీశమయితే మా పిల్లలను ఎవలు చూడాలి? ఇంటిపక్క బడి ఐతే జెల్ది అస్తున్నరు. రాంగనే ఆటలు, సదువుకోరా నాయనా! రాసుకోరా కొడుకా! అంటే ఇంటున్నరా ఈళ్లు? పొద్దుగుత్తా ఫోన్లు బట్టుకొని షోకులు, ఫోటోలు దిగుడు. సారూ! మీరు ఏమంటే గా కరోనా కాలంల ఫోన్లల్ల పాఠాలు చెప్పుడు షురు చేసిండ్రో ఇగ మా పోరగాండ్లు పదివేలకు తక్కువగాని ఫోన్లను కొనియ్యమని పానం తింటుండ్రు. అడిగిన ఫోన్లను కొనిస్తలేమని అలిగి ఉరివెట్టక సచ్చి పోతమని బెదిరిస్తుండ్రు. అప్పులు తెచ్చి ఫోన్లు కొనిస్తే, సదువుడు తక్కువ గేములాడుడు ఎక్కువయింది. ఇప్పటి కాలం మంచిగలేదు. గీ ఫోన్‌ ‌ఖరాబైంది ఇంకో ఫోన్‌ ‌కొనమని అన్నా అంటరు. లవు జిద్దు పోరగాండ్లు జమైండ్రు.ఈళ్ల ఫోన్ల బాధకు ఉన్న గోంతంత ఎవుసాన్ని పశువులను అమ్ముకోవద్దనుకుంటే నా కొడుకు, బిడ్డను పక్క మండలంలోని సంక్షేమ హాస్టలల్ల ఏసుడే మరి’’ అంటూ కుటుంబ భారాన్ని ఏకరువు పెట్టిండా బడుగురైతు.
ఆ మాటలు విన్న మా బయోసారుకు ఇగ ఊకో బుద్ధి కాలేదేమో ‘‘అయ్యా! మేం మీ పిల్లల్ని కొట్టొద్దాయే.. తిట్టద్దాయే.. ఆళ్లకు ఇగ భయం ఎట్లా జెప్పాలే. మావోడ్ని కొట్టిండ్రట బడికివోను అంటుండని మాకో కాంప్లేట్‌. ‌మీడియా కంట్ల వడితే డీఈవోల నుంచి షోకాజ్‌ ‌నోటీసులాయే.అందరి మనోభావాల్ని గౌరవిస్తూ గౌరవిస్తూ చివరికి మా బతుకులే అందరికీ భయపడుతూ అయ్యా!అమ్మా!అని బతిమిలాడుకుంట బడికి రమ్మని పిల్లల్ని మంచిగ జూసుకుంటమని ప్రాధేయ పడాల్సిన కడు దయనీయ మైన పరిస్థితులు ఇగో గిట్ల మీరు జేయవట్టి మాకు ఎదురుగావట్టే, మీకేమో సార్లు గిట్ల రావట్టేనని నవ్వులాటగావట్టే..!’’ అన్నాడు ఉక్రోషంగా. అయ్యో! హతవిధి ఏమి కాలం దాపురించింది.. మన వేలు బెట్టి మన కన్నే పొడుచుకున్న పరిస్థితి ఎదురైంది మాకు. ఇగ మా పెద్దసారు ‘‘ఊకోండి సార్‌!‌వాళ్ల మీద కోపానికస్తే జరిగేది ఏం లేదు?కాలమేఇట్ల జమైంది. బడికి రాని పిల్లల ఇండ్లకు వోకుంట ఆళ్లను మెల్లగ బుదరకించుకుంట పరీక్షలు రాయించు కోవాలి. ఫోన్లు జేసుకుంట బడికి రమ్మని పిలవాలి. నిన్న మొన్న ఏం జెప్పకుంట ఎందుకు బడికి రాలేదో అడగాలి. పొద్దుగాల్నే వచ్చిన పిల్లలకు ఫేషియల్‌ అటెండెన్స్ ‌వేయాలి. గిన్ని పనుల నడుమ బి.పీలు, షుగర్లూ కంట్రోల్ల వెట్టుకుంట నయనా భయానా బుజ్జగించుకుంట గీ మొండి పోరగాండ్లకు సదువు చెప్పుకోవాల్సిందే తప్పదు. మొన్ననే ఓ పెద్దసారుకు బియ్యంల పురుగు వచ్చిందని సస్పెండ్‌ ఆర్డర్‌ ‌వచ్చిందనగానే బి.పీ ఎక్కువై ఆడ్నే పడిపోయిన ఫోట్వ పనివడ అన్ని పేపర్లల్ల స్కూల్‌ ‌వాట్సాపులల్ల చక్కర్లు గొట్టింది. ఇంకో సంవత్సరం వరకు నా డ్యూటీ ఎలాంటి వివాదాలకు గురి కాకుండా ముగించు కోవాలని చిరు ఆశ నాది..! మంచి స్టాఫ్‌ ఉం‌ది మనబడిలో. కానీ వీళ్లకు ఎంత చెప్పినా అర్థం అవదులెండి.మనమే సంయమనం వహించాలి’’ అన్నాడు సముదాయింపుగా.
అందరం విధిలేక వెనుదిరిగాం. ఇంతలో పెద్దసారు ఫోను మోగింది. ఎవరితోనో సంభాషించి, ఫోను పెట్టేశాడు. ‘‘మేడం మీరు అర్జంటుగా బడికి చేరుకోండి. మన పక్కనే ఉన్న ప్రైమరీ స్కూల్‌ ఎల్‌ ఎఫ్‌ఎల్‌ ‌హెచ్‌ఎం ‌బడికి వస్తున్నారంట, మీకు తనదగ్గరున్న కొద్దిమంది ఐదవ తరగతి విద్యార్థుల వివరాలు, రికార్డ్ ‌షీట్స్ ఇస్తానంటున్నాడు. మీరెళ్లి ఆ పని చూడండి’’ అంటూ నన్ను బయల్దేరదీసాడు.
ఆ పల్లెబాట వెంబడి రెండు కిలోమీటర్ల దూరం నడిచి, మెయిన్‌ ‌రోడ్‌పై రిక్వెస్ట్ ‌బస్టాపులో బస్సు పట్టుకొని మా స్కూల్‌కు వచ్చి పడేసరికి గంట గడిచింది. నేను వచ్చేసరికే గోవర్ధన్‌ ‌సారు చెట్టుకింద బండి ఆపుకొని రికార్డు షీట్లు పట్టుకొని ఎదురుచూస్తూ కన్పించాడు. ‘‘మేడం ఇవన్నీ మా బడి నుండి మీకు వచ్చే అడ్మిషన్స్’’ అం‌టూ కొన్ని బోనఫైడ్‌ ‌లు, రికార్డు షీట్లను నాకందించాడు. ఎంతో అపురూపంగా అందు కున్నాను. అవన్నీ ఆఫీసుగదిలోని కొత్త ఫైళ్లలో సర్దు కుంటుంటే గోవర్ధన్‌ ‌సారు ఒకింత బాధగా ‘‘మేడం! ఇపుడు మీకిచ్చిన న్యూఅడ్మిషన్లలో ఇద్దరు పిల్లలు స్లోలెర్నర్స్ ‌మానసిక వైకల్యంగల పిల్లలు. రుచితకేమో స్పీచ్‌ ‌డిజార్డర్‌, అక్షితకేమో మెదడు ఎదుగుదల లోపం. తమ పేర్లు కూడా పలకలేరు వీళ్లు. తరగతి గదిలో నిశ్శబ్దంగా కూర్చుంటారు’’ అన్నాడు.
‘‘మన ఊరికి కేవలం ఒక్కటంటే ఒకే కిలో మీటరు దూరంలో భవిత స్కూల్‌ ఉం‌దని, వాళ్ల తల్లితండ్రులకు తెలియదా? మండల కేంద్రంలోని భవితకు పంపొచ్చుగా ?’’అన్నాన్నేను సందేహంగా..’’ అయ్యో!మేడం మన బడులల్ల పిల్లలు జేరకుండ గదే పెద్ద దెబ్బగొట్టే కదా! అట్లా దగ్గర ఉన్న మండల కేంద్రమనే గదా మేడం! నేడు మీ పాఠశాల మా ప్రాథమిక పాఠశాలల పిల్లలు ఇక్కడికి రాకుండా అక్కడున్న బళ్ళకే పోవట్టిరి. ఐనా మనం చెప్తనే ఉన్నం.ఈ ఊరి పిల్లలు ఇదే ఊర్ల సదవాలి గాని మీరెట్ల షరీఖు జేసుకుంటరని ఆ స్కూలోల్లనూ అడగనే వడ్తిమి?!కూతవేటు దూరంలో బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలు, మోడల్‌ ‌స్కూల్‌, అటు ఉర్దూ మీడియం హైస్కూల్‌, ‌పైపెచ్చు, మూడు దీటైన ప్రైవేట్‌ ‌హైస్కూల్స్ ఉన్నాక ఇక మన దగ్గర పిల్లల సంఖ్య ఎలా పెరుగుతుంది చెప్పండి? ఇదిగో ఇలాంటి పిల్లల్ని మన బళ్లలో చేర్చించి ఇక మీరే దిక్కయ్యా అని కూడా అంటారు. మనం కూడా సహితవిద్యను రెగ్యులర్‌ ‌పాఠశాలల్లో అందించాల్సిందే కదా మేడం. అందరికీ విద్య అందాలిగా! ఆ తల్లి తండ్రులకు బోలెడు పనులు. ఈ పిల్లలకు ప్రభుత్వం రవాణా డబ్బులు ఇస్తున్నా, అవి సరిగా రాక రోజువారీ వ్యవసాయ పనులను వదిలి వీళ్లు ఆ భవితకు వెళ్లరు. పైగా మరీ ఆటిజం, డిజార్డర్స్ ఎక్కువ ఉన్న పిల్లలుంటారని భయం కూడా కావచ్చు ఏం చేస్తాం మేడం? మన రెగ్యులర్‌ ‌పాఠశాలలో చేర్పించుకోక తప్పదు. ఆ పిల్లలు వచ్చినపుడు హాజరు వేయడం, లేనపుడు లేదు. పరీక్షల్లో కొంత సడలింపు మెర్సి మార్కులతో పాసు చేయించటం ఏ ప్రభుత్వ బడిలోనైనా అమలు చేసే పనులేగా’’ అంటూ నాకు తెల్సినవే ఐనా కొత్త సత్యాలు ఇవిగోనంటూ ముందుంచాడు.
మరో వారం రోజుల తర్వాత బడిబాట ముగిసిన పిమ్మట పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ప్రార్థన లైనులో రుచిత, అక్షితలను తొందరగానే పోల్చుకున్నాను.
న్యూ అడ్మిషన్‌ ‌నంబర్లతో వారు ఆయా తరగతి రిజిష్టర్లలో ఎన్‌ ‌రోల్‌ అయ్యారు. ఇలాంటివారిని మెయిన్‌ ‌స్ట్రీం పాఠశాలలో చేర్చుకుంటే బోధన ఎలా? అన్నది ఓ సందేహం. మా తెలుగు టీచర్‌ ‌హరిప్రియ నైతే ‘‘అసలు ఇలాంటి పిల్లల్ని చేర్పించుకోవటం ద్వారా వాళ్లకు ఎలా పరీక్షలు పెడతాం? ఫార్మాటీవ్‌ ‌మార్కులు ఎలా వేయాలి? ప్రాజెక్టు పని ఎలా పూర్తి చేయిస్తాం? ఈ పిల్లలతో ఎవరూ కలవరు, పైపెచ్చు మనం తరగతి గదిలో లేకుంటే వీళ్లను టీజ్‌ ‌చేస్తారు. వీళ్లు బడికి సరిగ్గా రారు. ఎప్పుడు వస్తే అప్పుడు అటెండెన్స్ ‌వేయడం. మెర్సీ మార్కులతో పాస్‌ ‌చేయించటం. ఎంతైనా సర్కారు బళ్లంటే అందరికీ అలుసే..!’’ అని పొద్దుటి ఇంటర్వెల్‌ ‌లో ధ్వజమెత్తింది.
‘‘అవునుకదా పెద్ద సారు బడిలో తక్కువమంది పిల్లలున్నారు. ఎన్‌ ‌రోల్మెంట్‌ ‌డ్రైవ్‌ అం‌టూ వారం రోజుల పాటు మనల్ని కాచ్‌ ‌మెంట్‌ ఏరియాలోనూ, ఫీడింగ్‌ ‌యూపియస్‌ ‌పాఠశాలల్లోను తిప్పారు, ఏం సాధించాం!ఎవర్ని ఉద్ధరించాం? పిల్లలేరి? ఎక్కడి కెళ్లినా మా పిల్లల్ని గురుకుల హాస్టల్లో వేస్తున్నాం అనో ప్రైవేట్‌ ‌బడికి పంపుకుంటాం అనో పైపెచ్చు మనల్ని చులకన చేస్తూ మాట్లాడటం. వస్తే గిస్తే ఇదిగో ఇప్పుడు ఇలాంటి పిల్లల్ని కూడా అడ్మిట్‌ ‌చేసుకోవాల్సిన దుస్థితి దాపురించింది మన బడికి.జెర్ర పైసలు కట్టే తల్లితండ్రులుంటే సాలు కొద్దిగ హుషారున్న పిల్లలంతా ప్రైవేట్‌ ‌బడులల్లకు పోతుంటే ఇగో మన స్కూలుకు ఇసొంటి పిల్లలు రావట్టే.బేసిక్స్ ‌లేని పిల్లలకు చదువెలా చెప్పేది?ఎక్కడుందీ లోపం?’’ అంది సోషల్‌ ‌టీచర్‌ ‌సుమతి కాస్త ఆవేశంగా.
నాకెంతో బాధ అన్పించింది. ‘‘దుస్థితి అని ఎందుకు అనుకోవాలి మేడం? మనమూ వారిపట్ల కాస్త ఓర్పుతోనూ, సానుభూతితోనూ, ప్రేమగా వ్యవహరించ వచ్చు కదా !పై పెచ్చు మనకు తరగతి గదికి సింగిల్‌ ‌డిజిట్‌ ‌స్ట్రైంత్‌ ‌మాత్రమే ఉంది .బడి అందరిది. చదువుకుంటాను అని వచ్చిన విద్యార్థు లందరికీ సమాన విద్య అందించాల్సిందే కదా..!’’ అన్నాన్నేను ఆమె మాటల్ని ఖండిస్తూ. ఇంతలో మూడవ పీరియడ్‌ ‌బెల్‌ ‌మోగింది. ‘‘ఓ! చెప్పొచ్చా వులే!’’ అన్నట్టు అందరూ నన్నే చూస్తూ ఎవరి తరగతి గదుల్లోకి వాళ్లు విసురుగా వెళ్లి పోయారు.
ళి ళి ళి
ఇంటికెళ్లాక ఫోను తీసి చూసుకుందును కదా, కరుణ మిస్డ్ ‌కాల్స్. ‌కరుణ వాళ్ల అమ్మాయి డెఫ్‌ అం‌డ్‌ ‌డంబ్‌. ఎం‌దుకై ఉంటుదబ్బా?? అనుకొని కాల్‌ ‌కలిపాను. అవతలి నుండి కరుణ కంఠం గొంతులో కాస్త ఆహ్లాదం, ఉత్తేజం రంగరించగా’’ దేవీ! మా అమ్మాయి కీర్తికి అడ్మిషన్‌ ‌జిల్లా కేంద్రం లోనిగర్లస్ ‌హైస్కూల్లో దొరికింది. అక్కడే మీ కజిన్‌ ‌కూడా కల్సింది. ఈ పదిహేను రోజుల్లో అమ్మాయిలో చాలా బిహేవియరల్‌ ‌మార్పులు సంభవించాయి.
చిన్నగా మాట్లాడటం వచ్చింది. మొన్న బయో మేడం పార్ట్ ఆఫ్‌ ‌ప్లాంట్‌ అడిగితే చెప్పింది. బొమ్మలు వేస్తుంది. రంగుల్ని గుర్తించి చెప్పగలుగుతుంది. టీచర్ల పేర్లను, పలుకుతుంది. రోజు బడికెళ్లడం మూలంగా మంచి మార్పు వచ్చింది. అదీ గాక ఆ తరగతి టీచర్లు కూడా వారి పీరియడ్‌ ‌టైంలో ఓ ఐదు, పది నిమిషాలు మా అమ్మాయి ఫీడ్‌ ‌బ్యాక్‌ ‌కొరకు ఇవ్వడం గొప్ప సానుకూల చర్య. నేనడిగితే చెప్పదుగానీ, టీచర్ల ప్రశ్నకైతే నా బిడ్డ సమాధానమిస్తుందని తెల్సి చాలా సంతోషించాను. టీచర్ల దృకృథం ఇలాంటి పిల్లల పట్ల మరింత ప్రేమపూర్వకంగా, సానుకూలంగా ఉంది ఇదో గొప్ప విజయం. జిల్లా కేంద్రంలోని ఉన్నత పాఠశాల పైపెచ్చు తరగతికి యాభైకి తక్కువ గాని స్ట్రైంత్‌ ఉన్నప్పటికిని ఇలా మా అమ్మాయికి ఎట్‌ ‌లీస్ట్ ఐదు నిమిషాలు కేటాయించి చదువుపట్ల శ్రద్ధ చూపడం నిజంగా గ్రేట్‌..!’’అం‌ది.
‘‘నిజమే కరుణా! టీచర్లు తల్చుకుంటే ఏదైనా సాధిస్తారు. అబ్దుల్‌ ‌కలాం గారు కూడా తన టీచర్‌ను ఎంతగా గుర్తు చేసుకుంటారు, టీచర్ల ప్రోత్సాహం ఉంటే పిల్లాడి సామర్థ్యాలు ఎంతగానో వెలుగు చూస్తాయి.అవునూ! ఈ మధ్య స్పీచ్‌ ‌థెరపీకి, హియరింగ్‌ ఎయిడ్‌కి ఢిల్లీ వెళ్లానన్నావు ఏమైంది?’’ అని అడిగాను. ‘‘లక్షల ఖరీదు పోసి హియరింగ్‌ ఎయిడ్‌ ‌కొన్నాము. స్పీచ్‌ ‌థెరపీలో భాగంగా ఇంటి వద్ద ఒక ట్యూటర్ని ఏర్పాటుచేశా. లిప్‌ ‌మూవ్‌ ‌మెంట్‌తోబాటు పదాల ఉచ్ఛారణ, పలకడం స్పష్టంగా పదేపదే చెప్పించడం వంటివి చేయిస్తుంది ట్యూటర్‌. ఎం‌తైనా భగవంతుడు ఇలాంటి బిడ్డల్ని మాకివ్వడం, వాళ్ల పెంపకం మాకో సవాల్‌, ఎం‌తో ఓపికగా, సహనంగా ఉండాలి. డబ్బు ఖర్చు ఉండనే ఉంటుంది. అయ్యో! ఇలాంటి స్పెషల్‌ ‌నీడ్‌ ‌పిల్లలు న్నారే..! అని మమ్మల్ని మేం డౌన్‌ ‌చేసుకోము కూడా, ఏం చేస్తాం, కాల గమనంతో మనమూ ముందుకు సాగాల్సిందే, ఉంటాను’’ అంటూ పెట్టేసింది.
నిజం చెప్పొద్దూ నాకు హృదయమంతా బరువెక్కింది. అప్పుడెపుడో కొఠారి కమీషన్‌ ‌చెప్పినట్లు ఎలాంటి పిల్లలకైనా బడిలో అడ్మిషన్‌ ఇవ్వాల్సిందే నంటూ ఒక ఆవాస ప్రాంతంలోని విద్యార్థులందరూ ఒకే పాఠశాలలో చదువుకోవాల్సిన అవసరాన్ని గమనించి చేసిన కామన్‌ ‌స్కూల్‌ ‌సిఫారసు గనుక అమలు అవుతే సర్కారు బడులు ఎంత బాగుపడతా యని అన్పించింది.ఆ సిఫారసులు ఇలా స్ట్రెంత్‌ ‌తక్కువ ఉన్న మా బోటి పాఠశాలలకు వరదాయినిలాంటివి.
తెల్లారి నేను బడికి వెళ్లేసరికి పేరెంట్స్‌తో బాటు ఇద్దరు మగపిల్లలు కొత్త అడ్మిషన్‌ ‌కొరకై వేచి చూస్తు న్నారు. లీజర్‌ ‌పీరియడ్లో వారి డీటెయిల్స్ ‌రాసుకో సాగాను. హరినాథ్‌ ‌పదహారేళ్ల పిల్లాడు. విజువల్లీ ఛాలెంజ్డ్. ‌కంటిచూపు సరిగా లేదు. నాలుగో తరగతి జిల్లా కేంద్రంలో చదివి మూడేండ్లు ఇంటి వద్దనే ఉండిపోయాడు. అతడి ట్రీట్మెంట్‌ ‌కొరకై ఆ తండ్రి లక్షలు ఖర్చు చేశాడు. ఆ మందుల ప్రభావంతో పిల్లాడిలో నిస్త్రాణ, మెదడులో చురుకుదనం లోపించింది. ఒక కన్ను మాత్రమే పాక్షికంగా కనిపిస్తుంది. మరో పిల్లాడు ఉదయ్‌ ‌వారి బిడ్డడే. ఇటీవలే హెర్నియా ఆపరేషన్‌ ఐం‌ది.
‘‘నేను అందరి లెక్క బడికి పోయి చదువు కుంటానని మారాం చేస్తాడు. బడికి పోతానని ఏడుస్తడు అమ్మ’’ అంది హరినాథ్‌ ‌తల్లి నీళ్లు నిండిన కళ్ళతో.
‘‘మా పిల్లాడిని ఏజ్‌ ‌ప్రకారం ఎనిమిదవ తరగతిలో అడ్మిషన్‌ ఇప్పించలేరా మేడం, అన్నదమ్ము లిద్దరు ఒకటే క్లాసైతే నామోషీగ ఫీలయితడు’’ అన్నాడు తండ్రి నసుగుతూ.. ‘‘అలా ఇప్పటికైతే వీలుపడదు, ప్రభుత్వం క్లాస్‌ ‌ఛేంజ్‌కు సెప్టెంబర్‌ ‌లో అవకాశం ఇస్తుంది. అప్పుడు పై తరగతికి ప్రమోట్‌ ‌చేద్దాం’’అని సముదాయించి అడ్మిషన్‌ ‌ఫాంలో తండ్రి సంతకం తీసుకున్నాను, అతడు ఓ షాపింగ్‌ ‌మాల్‌లో చిరుద్యోగి, తనతో బాటే తన కొడుకులిద్దర్ని జిల్లా కేంద్రానికి తీసికెళ్లి తీసుకొచ్చేవాడు, ఖర్చులు తట్టుకోలేక ఉన్న ఊర్లోని ప్రభుత్వ బడే బెటర్‌ అనుకొని అక్కడి నుండి రికార్డు షీటు పట్టుకొని వచ్చేశాడు.
మొదట్లో హరినాథ్‌ను తరగతి గదిలో అందరూ వింతగా చూసేవారు. కొన్ని రోజులు పోయాక బడి వాతావరణం వారికీ అలవాటైంది. క్లాస్‌ ‌పిల్లలంతా అతడితో ఎంతో స్నేహంగా ఎంతో సాధారణంగా వ్యవహరించేవారు. హరినాథ్‌ ఎన్నో కబుర్లు చెప్తాడు. అతడి దస్తూరీ కూడా ఎంతో అందంగా బాగుం టుంది. నేను అన్నట్లే క్లాసు ప్రమోషన్‌కు అవకాశం వచ్చింది. ఇటీవలే హరినాథ్‌కు డబుల్‌ ‌ప్రమోషన్‌ ఇప్పించి ఎనిమిదవ తరగతిలోకి ప్రమోట్‌ ‌చేశాం.
వారం రోజుల క్రితమే మండల కేంద్రంలోని భవిత కోఆర్డినేటర్‌ అమ్మాయి వచ్చి మా పాఠశాల లోని స్లోలెర్నర్స్ ‌స్పెషల్‌ ‌నీడ్‌ ‌విద్యార్థుల లిస్టు తీసికెళ్లింది.
త్వరలోనే మళ్లీ రెగ్యులర్‌ ‌పాఠశాలల ఉపాధ్యా యులకు మరో శిక్షణ ఉంటుందని చెప్పీచెప్పని దేవరహస్యాన్ని మరీ చెప్పి వెళ్లింది.మరో రెండు రోజుల్లో రానున్న వసంత పంచమి సందర్భంగా మాబడిలో సరస్వతీ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన మాజీ వార్డ్ ‌మెంబర్‌ ‌పులిసాయిలు ఆ విగ్రహానికి రంగులు వేయిస్తానంటూ రంగు డబ్బాలతో బాటు తన వెంబడే ఒక పెయింటర్‌ని తీస్కోని వచ్చాడు.
ఆయనొచ్చారని మర్యాదగా విష్‌ ‌చేయడానికని మా అందర్నీ పిలిపించారు మా పెద్ద సారు. ఆయన్ని మర్యాదలవీ చేసి కూర్చోబెట్టి ‘‘మన ఊర్లోని మనబడిలో పిల్లల సంఖ్య పెరగాలి. ముందు ఆ ప్రైవేట్‌ ‌స్కూల్స్ ‌బస్సుల్ని రానీయకండి. మేమెంత కాళ్లావేళ్లా పడి ప్రాధేయపడినా ఎవ్వరూ మాబడికి తమ పిల్లల్ని పంపటం లేదు. వృత్తి పట్ల అంకితభావం, విద్యా ప్రమాణాలు పెంచాలన్న తపన ఉంది గానీ, ఇదిగో ఇలా స్పెషల్‌ ‌నీడ్‌ ‌పిల్లలతో అటు మన బడి తెలుగు మీడియం అవటంతోటి పిల్లల సంఖ్య పెరగట్లేదండి, సర్పంచ్‌ ‌గారితోనూ మాట్లాడాను. ఆయన ఎన్నికల హడావిడిలో ఉన్నారు.
పేరెంట్స్ ‌సంతకాలతో, మనబడిని సక్సెస్‌ ‌స్కూల్‌గా మార్చాలని ప్రపోజల్స్ ఐతే పోయిన ఏడే పంపాము. ఈ విద్యాసంవత్సరమైనా అప్రూవ్‌ ‌కావాలి. ఈ బడిని మీ ఊరివాళ్లే మెల్లమెల్లిగా అప్‌ ‌గ్రేడ్‌ ‌చేస్తూ చేస్తూ హైస్కూల్‌ ‌దాకా లాక్కొచ్చారు. ఇకముందు ఎన్నెన్ని పరీక్షలకు తలఒగ్గాల్సివస్తుందో ఈ బడి అసలు ఉంటుందో? లేక దగ్గర్లోని మండల కేంద్రంలో విలీనం అవుతుందో తెలీదు ‘‘అంటూ బడి భారాన్ని ఆయన ముందుంచారు.
నల్లని నుదుటిపై దిద్దుకున్న ఎర్రటి తిలకం, చేతికి వెండి కడియం, ఖద్దరు చొక్కాలో హుందాగా వెలిగి పోతున్న పులిసాయిలు తాను తెచ్చిన పూజా సామానును పక్కన బెట్టి కండువా సవరించుకున్నాడు.
‘‘అవును సార్‌, ‌మీరు పాఠాలు బాగానే చెప్తారు.అందరూ గవర్నమెంటు టీచర్లే. నేను సుత గిదే బడిల పదోది పాసైన. ఇప్పుడు నా బిడ్డా ఈడ్నే సదువుతుంది కదా. గప్పట్ల మా బడి తడికెల గదులలెక్క ఉండేది. వానవడ్డా ఎండగొట్టినా ఓర్సుకొని సదువుకున్నం. అప్పట్ల ఇప్పుడున్నట్లు గింత మంచి అద్దాల బీరువాలల్ల సదుకోనికి మస్తు పుస్తకాలు లేకుండే.ఐనా మాకు చదువు అబ్బింది.మా ఊరోల్లం పట్టువట్టి ఒక్కోయేడూ ఒక్కో తరగతి పెంచుకుంటూ పెంచుకుంటూ దాదాపు పదిహేనేళ్లకు పైగానే ఐంది పదో తరగతి వచ్చి. సార్‌ ‌గప్పట్ల మా ఊరి ఆడపిల్లలకు కిలోమీటర్‌ ‌దూరం బోయి సదువుడు కష్టమైతదనే మా బడిని పెద్దబడి జేసుకున్నం.మస్తు మంది పిల్లలతో బడంతా కళకళలాడేది.గీ మోడల్‌ ‌స్కూల్లూ గురుకులాలూ సంక్షేమ హాస్టల్లూ కెజీబివీలు ఏం లేకుండే.ఇంకో ముఖ్యమైన సంగతేందంటే మా మండల కేంద్రంలో ప్రైవేట్‌ ‌స్కూల్‌ ఏదీ లేకుండే. సుట్టుముట్టు గివన్నీ ఉన్నాక ఈడ పిల్లలేకుండా గావట్టే.
అందరికీ సమానంగా అందాల్సిన విద్య బడిపొల్లగాండ్ల నడుమ విభజనరేఖను సృష్టించింది. అద్దాలబస్సులల్ల రంగ్‌ ‌బి రంగ్‌ ‌యూనిఫాంలల్ల సదువుకొనవోయే పొల్లగాడు ఒకడైతే..అవ్వ వెట్టిన సద్దన్నం బుక్క తిని నున్నటి తలతో లగాయించి ఉర్కచ్చే మన తెలుగు మీడియం పొల్లగాడు ఇంకోలు. మీకు బడి పిల్లల సంఖ్య పెంచాలనే గట్టి సంకల్పం ఉంది కాబట్టే గింతగానం తండ్లాట వడుతున్నరు.ఎవరు ఎంత చులకన చేసి మాట్లాడుతున్నా ఓపికతోటి ముందుకేవోతున్నరు.
టీచరంటేనే పాఠశాలకు తల్లివేరు అసంటోడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా చైతన్యవంతుడైన టీచర్‌ ‌తన స్నేహంతో పిల్లలను ప్రభావితం చేయగలుగు తాడు. ఆ పసిహృదయాలపై ఎప్పుడు విజేత కాగలడో వాళ్ల సహాయంOKతో తాను పనిచేస్తున్న ఊరి ప్రజల జీవితాలతో మమేకం కాగలుతాడు. తన జీతం, జీవితం పేద ప్రజల చెమటచుక్కలతో తడిసినవని అతనికి ఎర్కైతది. ఇగో ఇప్పుడిట్లా ఉపాధ్యాయవృత్తి పవిత్రతను ప్రశ్నించే విధంగా ప్రజల నుండి వస్తున్న నిందలను పరిశీలించి సరిదిద్దుకోక తప్పదు సారూ!
నాక్కూడా తెల్సు పైసల్లేక తిప్పలు వడుతున్నరని. విరాళాలతోటి, మీరంతా తలోచేయి వేసి సేకరించిన ఫండ్‌తో సక్కదిద్దిన పనులెన్నో. అసలు కాంపౌండ్‌ ‌వాల్‌ ‌లేక మస్తు అవస్థలు పడుతున్నమని మొన్ననే ఎమ్మెల్యే ఫండ్‌ ‌తోటి కాంపౌండ్‌ ‌వాల్‌ ‌నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టినం. మెల్లమెల్లగా పనులు చేపించు కుందాం. ముందు ప్రభుత్వ బడిల పిల్లల సంఖ్య ఎట్లైతే పెరుగుతదో ఆలోచించాలే..దాదాపు బయట సమాజానికి ప్రభుత్వ ఉద్యోగం అంటే మోజే. ప్రభుత్వ ఉద్యోగులనూ గౌరవిస్తారు.
అబ్బో! వాడికేం గవర్నమెంట్‌ ‌జాబ్‌ ‌కదరా! అంటూ ఆకాశానికి ఎత్తేస్తారు. కానీ వాళ్లకు ప్రభుత్వబడి వద్దు. ప్రభుత్వ కాలేజీ వద్దు. తన బిడ్డ ఐఐటి,ఐఐయం, నీట్‌, ‌జెఇఇ పరీక్షల్లో ర్యాంకులు కొట్టాలి అని ఆశపడతారు. లక్షలు పోసి సీట్లను కొనుక్కుంటారు.వాళ్లు తమ బిడ్డలకు మూడవ తరగతి నుండే ఐఐటి ఫౌండేషన్‌ ‌కోర్సుల్ని అందిస్తుంటే ఇక ప్రభుత్వ బడి, కాలేజీల్లో చదివిన బడుగు విద్యార్థి వాళ్ళతో ఎలా పోటి పడగలుగుతాడు?
అందుకే ప్రభుత్వ బడిలోను, కాలేజీల్లోను చదివే విద్యార్థులకు డెబ్భై శాతం వివిధ ఎంట్రన్స్‌లలో వెయిటేజి ఇవ్వాలి. అలా ఇస్తే డాక్టర్ల పిల్లలూ,అటు పేదోడి కూలీ పిల్లలు కల్సి సదువుకోగల్గుతారు. మనకుంటున్న సమానత్వం సాధ్యమవుతుంది.
కూలీ తల్లి తండ్రులు ప్రభుత్వ బడిలోని సౌకర్యాల తీరు గురించి ప్రశ్నించి ప్రశ్నించి వారి అసహనాన్ని దిగమింగుకున్నా.. ఉన్నతవర్గాల పిల్లలు వాటిని కలెక్టర్ల దాక తీసుకెళ్తారు, బడి బాగుపడు తుంది. అందరికీ సమాన విద్యా అవకాశాలు రావా లంటే, సంపన్న పిల్లలు, సగటు నిరుపేద పిల్లలు సమానంగా కల్సి కూచుని చదువుకొనే అవకాశం రావాలి. ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్‌ ఎన్నికలలో పోటీ చేస్తున్న నా ఎజెండా ఇదే.
మన ఊర్లొని మన బడిని నిలుపుకోవాలే. వంకరలేళ్ల లెక్క పెరిగిపోతున్న ప్రైవేటు స్కూల్లను నిలువరీయాలి. కడుపు కట్టుకొనియాజమాన్యం అడిగిన ఫీజులను వాయిదాలలో చెల్లించే తల్లి తండ్రులు తమ బిడ్డలను సక్కగ సదువులు నేర్పే మన బడిలనే వేయాలి. గిట్లాంటి వెయిటేజీ ఉంటే..ఈ వెయిటేజీ కారణంగా వివిధ హోదాల్లో ఉన్న అధికారుల పిల్లలు మధ్యాహ్న భోజనం బాగా లేకున్నా, నాణ్యత లేకున్నా గొంతెత్తుతారు.
పర్యవేక్షణకోసం పై అధికారుల్ని సంప్రదిస్తారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న పిల్లలకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాల్లో, ప్రభుత్వ ఉన్నత విద్యలో అవకాశాలను వెయిటేజీలను కల్పించగలిగిన పుడే కదా దేశంలో విద్యారంగం బాగుపడేది. దేశభక్తుల ఆత్మలు ఆనందపడేది. మళ్లీ బడులు గప్పట్ల మీరు సూసే వందలాది విద్యార్థులతో కళకళలాడేది. చదువులతల్లి సరస్వతమ్మ జ్ఞానయోధు లైన తన బిడ్డలను జూసి మురిసేది’’ అని చెబుతూ అమ్మవైపుగా తిరిగి చేతులెత్తి మొక్కాడు. ఆ సమయంలో నిజంగా మాకు పులిసాయిలులో భవిష్యత్‌ ‌ఫూలే అగుపించారు..!! రంగు వెలసిన సరస్వతికి తన నవీన భావాలతో రంగులద్దుతున్న అతని విజనరీని మనస్ఫూర్తిగా అభినందించాం మేమంతా.

About Author

By editor

Twitter
YOUTUBE