‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన

వెలనాడు యుద్ధంలో కాకతీయసైన్యం విజయం సాధించిన వార్తలు  వార్తాహరుల ద్వారా ఒకటొక టిగా తెలియ వస్తున్నాయి. వచ్చిన వార్తాహారుడి వద్దకు గణపతి వేగంగా దూకి భుజాలు పట్టుకుని కుదిపివేస్తూ “ఊ.. చెప్పు. ఏమిటి వార్త?” అని అడిగాడు.

“ద్వీపరాజ్య రాజధాని తలగడదీవి కోటలో అఖండమైన భాండాగారం ఉన్నదట ప్రభూ! లెక్కపెట్టలేనన్ని వజ్ర వైఢూర్యాలు, బంగారు వెండి నాణాలు, నగలు, బంగారు అచ్చులు.. అబ్బో! వాటిని అనుమకొండకు తరలించడానికి వంద మత్తగజాలు సరిపోవట ప్రభూ..” చెబుతూ లేఖను రెండు చేతులతో ఆయన వైపు చాపాడు.

చౌండసేనాని పంపిన లేఖ చదవకుండానే వార్తాహరుడే మొత్తం అంశం వివరించేశాడు.

మళ్లీ గణపతిదేవునిలో గంతులు మొదలు. ఆయన సంతోషాలు, ఉద్వేగాలు, ఉత్సాహాలు.. ఇంతింత అని చెప్పడానికి లేదు. సైన్యం మొత్తం తిరిగి అనుమకొండ చేరేవరకు చిన్నపిల్లాడిలా పరవశిస్తూనే ఉన్నాడు. విజయులై తిరిగి వచ్చిన సర్వ సైన్యాధ్యక్షుడు చౌండసేనాని, శూన్యపాలకుడు.. ఇతర సైనిక ప్రముఖులతో ఆట పాటలు మొదలు..

చౌండసేనానికి ‘ద్వీపలూటకార’ బిరుదు ప్రదానం చేసి మిగిలిన మహాయోధులను కూడా సముచితంగా సన్మానించి మండలాలు, మడిమాన్యాలు బహు మతులుగా అందించి గౌరవించి తనను తాను గౌరవించుకున్నాడు.

కాకతీయ మహాయోధులు రుద్రదేవుడు, మహాదేవుడు వెనువెంటనే మరణించడం, యువరాజు గణపతిదేవుడు బందీ కావడంతో కాకతీయ వంశ పాలనపై నీలినీడలు కమ్ముకున్నాయి. కానీ రుద్ర సేనాని, వెల్లంకి గంగాధరుడు లాంటి నమ్మినబంట్లు పట్టుసడలని పోరాటంతో కాకతీయ వంశాన్ని కాపాడి గణపతిదేవుని సింహాసనంపై నిలిపి తిరిగి కాకతీయ కేతనాన్ని రెపరెపలాడించారు.

కాకతీయవంశ పాలన తిరిగి నిలదొక్కుకున్నాక కాకతీయ గణపతిదేవుడు తొలి యత్నంలోనే వెలనాడును జయించడం తెలుగు రాజ్యాల చరిత్ర లోనే మహోన్నత ఘట్టం. అది కాకతీయులకు మరింత గొప్ప సంగతి. కారణం… వెలనాడును జయించాలని మూడు నాలుగు తరాలుగా కాకతీయులు చేయని ప్రయత్నం లేదు. గతంలో గణపతిదేవుని తాత రెండవ ప్రోలరాజు వెలనాడును జయించాలని వెళ్లి వెలనాడు సామంతుడు కోట చోడోదయ మహారాజు చేతిలో మరణించాడు. గణపతి పెదనాన్న రుద్రదేవుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. పల్నాడు యుద్ధంలో పాల్గొ న్నాడు కానీ వెలనాడులో తిష్ఠ వేయలేక పోయాడు.

ఇప్పుడు గణపతిదేవుడు వెలనాడును సాధించి తన రాజ్యంలో కలిపేసుకోవడం.. ఇది చిన్నగెలుపు.. సాధారణ విజయం కాదు. ఓ మహోద్భుతం.. ఓ సామ్రాజ్య స్థాపనకు పునాది.

అక్కడి నుండి గణపతిదేవుని జైత్రయాత్ర మొదలయ్యింది.

గణపతి వెలనాడు జయించినా పాలకుడు పృధ్వీశ్వరుడు తప్పించుకుని పారిపోయి శ్రీకూర్మం చేరాడు. అక్కడి నుండి వెలనాడును తిరిగి జయించ డానికి ఆతడు చేయని ప్రయత్నం లేదు. కొందరు సామంతులను కూడగట్టి తిరిగి గణపతిదేవునిపై యుద్ధం ప్రకటించాడు. గణపతి కూడా అనేక మంది చిన్నచిన్న రాజులను సామంతులుగా చేసుకుని బలిష్టుడయ్యాడు. తిరిగి ఆరేళ్లకు పిఠాపురం వద్ద జరిగిన యుద్ధంలో గణపతిదేవుడు స్వయంగా పాల్గొని పృధ్వీశ్వరుడిని చంపి అతని తలతో కందుక క్రీడ ఆడి తన కసి తీర్చుకున్నాడు.

ఈ గెలుపు గణపతిదేవునికి మరో వివాహానికి దారి తీసింది.

పధ్వీశ్వరుడు పారిపోగా కాకతీయ సైన్యం అతని బంధువు, సామంతుడు అయిన ద్వీపరాజ్య పాలకుడు పినచోడుని ఓడించి అతని వద్దనున్న వెలనాడు ధనాగారాన్ని స్వాధీనం చేసుకుని తిరిగి పినచోడునే వెలనాడు పాలకుడుగా కాకతీయ సామంతునిగా ప్రకటించారు. ఆ యుద్ధంలో సర్వ సైన్యాధ్యక్షునిగా ఉన్న మల్యాల చౌండసేనాని పినచోడుని ఇద్దరు కుమార్తెలను అనుమకొండ తరలించి రాజ ప్రాసాదంలో గౌరవ బందీలుగా ఉంచాడు. అప్పుడే వాళ్ల తమ్ముడు చిన్నారి జాయచోడుడు ఎవ్వరికి చెప్పకుండా అక్కల బండి వెంటపడి అనుమకొండ వచ్చేశాడు. అక్కడ నానా అగచాట్లుపడి బతుకుతూ.. పిఠాపురs యుద్ధ్దంలో పాల్గొని గణపతిదేవుడు, పృధ్వీశ్వరుడు ఎదురెదురయినప్పుడు గణపతికి ఖడ్గం అందించి శత్రువు తల తుంచడానికి సహాయపడ్డాడు.

యుద్ధానంతరం పినచోడుని కుటుంబానికి జరిగిన అన్యాయం గణపతి దేవునికి పూర్తిగా తెలిసింది. పినచోడుని కుమార్తెలు బందీలుగా ఉండటం, కొడుకు జాయపుడు అదే అనుమకొండలో ఆరేళ్లుగా అనాథŠగా బతకడం అతన్ని తీవ్రంగా కలసివేసింది. ప్రాయశ్చిత్తంగా గణపతిదేవుడు ఆ ఇద్దరు అమ్మాయిలను వివాహమాడాడు. అందుకు భార్య సోమలదేవి అనుమతి తీసుకోలేదు కాని తండ్రులస్థాయి గురువులయిన రుద్రసేనాని, వెల్లంకి గంగాధరుని ఆమోదం తీసుకున్నాడు.

అల్లునిగా ద్వీపరాజ్య రాజధాని తలగడదీవి కోటలో ఉండగా మరో యుద్ధానికి సిద్ధం కావాల్సివచ్చింది. విక్రమ సింహపురి రాజ్యాలపై చోళప్రభువు కులోత్తుంగ చోళుడు దాడి చేసి ఆక్రమించుకున్నాడు. మహారాజు మనుమసిద్దిని బందీని చేశాడు. ఇది మహామంత్రి తిక్కన నెల్లూరులో లేని సమయంలో జరిగింది.

తెలుగుప్రజల అన్ని సమస్యలూ తిక్కనా మాత్యునివే. మొదటగా చోళసామ్రాజ్యానికి కప్పాలు కట్టే చోడ రాజ్య పాలకులతో మంతనాలు జరిపి కప్పాలు, అంగీకరించిన పన్నులు వగైరా ఆపు చేశాడు. తర్వాతి దశలో చోడ అనే పేరుకు ముందు తెలుగు అనే పదం చేర్పించి పూర్తి తెలుగుజాతి రాజ్యాలుగా తెలుగు చోళ రాజ్యాలుగా వాటిని మార్చేశాడు. చోడ సామంతరాజ్యాలు అనే మచ్చను పూర్తిగా రూపు మాపాడు. మూడవ దశలో తెలుగు చోడ రాజ్యాలను ఏకీకృతం చేసి కాకతీయరాజ్యానికి సామంతులుగా మార్చడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాడు.

ఆయన కందవోలులో తెలుగురాజ్యపు ఆవశ్యకతపై ఆ రాజ్యపు సమయ సెట్టిలతో సమావేశమై ఉన్నాడు.

మనుమసిద్ది కుమారుడు అక్కడికి వచ్చి జరిగింది వివరించాడు. హతాశుడైన తిక్కన వెనువెంటనే తలగడదీవి కోటలో ఉన్న గణపతిదేవుని కలిసి తన మాటగా సహాయం అందించవలసినది అని ప్రార్ధించమన్నాడు.

వెంటనే తిక్కన కుమారుడు తలగడదీవి వెళ్లి జరిగిన సంగతి గణపతిదేవునికి విన్నవించి తిక్కనా మాత్యుని అభ్యర్థన కూడా తెలియజేశాడు.

వెనువెంటనే స్పందించి బావమరిది జాయచోడుని తోడు తీసుకుని దగ్గరలో ఉన్న సామంతుల సైన్యాన్ని సమాయత్తపరచి స్వయంగా సైన్యానికి నాయకత్వం వహించి కదిలాడు గణపతిదేవుడు.

అంత త్వరగా సైన్యంతో కదలి నెల్లూరు వచ్చి తన సహాయాన్ని ప్రకటించిన గణపతిదేవుని చూసి తిక్కనామాత్యుడు కతజ్ఞతతో పొంగిపోయాడు. సజల నయనాలతో ఆయనకు ఆతిథóŠ్యం ఇచ్చాడు. తిక్కన మంత్రి బృదంతో తీవ్రమైన మంత్రాంగం జరిగింది. భవిష్యత్ యుద్ధ తంత్రాన్ని రూపొందించారు.

*******

తంజావూరు రాజప్రాసాదం సభ నిర్వహిస్తోన్న చోళ చక్రవర్తి కులోత్తుంగ చోళుని ముందు వినయంగా వంగి నమస్కరించాడు నెల్లూరు రాజ్యపు సందివిగ్రహి ముప్పలప్రగ్గడ. తాను నెల్లూరు నుండి వచ్చానని విక్రమసింహపురి రాజ్యవారసులు మనుమసిద్ది మహారాజులకు సంఘీభావంగా కాకతీయ మహామండలేశ్వరులు శ్రీశ్రీశ్రీ గణపతిదేవమహా రాజులు ససైన్యంగా నెల్లూరు వచ్చి ఉన్నారని.. వారు పంపిన ఈ లేఖను అందుకుని సమాధానం ఇవ్వవలసిందిగా కోరాడు.

ఆయన సహాయకులు లేఖ అందుకుని ఆయనకు చదివి వినిపించాడు.

“చోళ మహారాజ్య పాలకులు శ్రీశ్రీశ్రీ కులోత్తుంగ చోళ చక్రవర్తులకు వినమ్ర నమస్సులు.

యుద్ధ ధర్మాలకు విఘాతం కలిగించి కొందరు తిక్కన వంశ ద్రోహులద్వారా మహారాజు మనుమసిద్ది రాజ్యాన్ని ఆక్రమించిన మిమ్మల్ని గొప్ప చరిత్ర కలిగిన చోళసమ్రాట్టుగా గౌరవించలేక పోతున్నాము. మనుమసిద్ది మహారాజులవారికి సర్వకాల సర్వా వస్థలలో ఈ కాకతీయ మహామండలేశ్వరుడు గణపతిదేవుడు ఉన్నాడని తమరికి తెలియజేస్తున్నాము. తక్షణం విక్రమసింహపురి రాజ్యాన్ని మనుమ సిద్ది మహారాజులవారికి స్వాధీనపరచవలసినదిగా హెచ్చరిస్తున్నాము. ప్రాచీన తొండమనాడు రాజ్య ప్రాంతంలో తెలుగు మాట్లాడే ప్రజలున్న రాజ్య మంతా మాకు స్వాధీనం చేయాల్సి ఉంది. అది మా హక్కు. లేనినాడు ఎలా స్వాధీనం చేసుకుంటామో తమరు ప్రత్యక్షంగా చూడగలరు. ఇది మా హెచ్చరిక!!”

లేఖ చదివి కోపంతో పళ్లు కొరికాడు కాని చివరి వాక్యాలతో ఆలోచనలో పడ్డాడు కులోత్తుంగుడు.

తెలుగు మాట్లాడే ప్రాంతమా??

సంధివిగ్రహి ద్వారా పంపిన లేఖలో గణపతి దేవుడు తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ మాకు కావాలి అని పేర్కొనడం చోళమహారాజు కులోత్తుంగుని ఆలోచనలో పడవేచింది.

అంతేకాదు. అదే అతని ఆలోచనలను తల కిందులు చేసింది. నిజానికి వెలనాడు వరకు చోళ సామ్రాజ్యంలో కలుపుకుని తమిళభాషా రాజ్యంగా చేయాలని అతని లోలోపలి ఆలోచన.

ఇది గణపతిదేవునికి తెలిసిందా?! తెలుగు భాషారాజ్యమనే పదాన్ని ఆయన ఎలా పేర్కొన్నాడు??

చోడరాజులు ఇటీవల తెలుగుచోడరాజులుగా ప్రకటించుకుంటున్నారని వేగుల సమాచారం. ఇప్పటికే వాళ్లు తమకు కప్పాలు కట్టడం తగ్గించారు కూడా.

తెలుగురాజ్యాలలోకి చొచ్చుకుపోవాలంటే ముందు నెల్లూరు స్వాధీనం కావాలి. మనుమసిద్ది దాయాదులైన నల్లసిద్ది, తమ్మసిద్ది తనకు సహాయ పడడానికి సిద్ధంగా ఉన్నారు. వారి సహాయంతో రాత్రికి రాత్రి మెరుపు దాడి చేయించాడు. విజయ వంతమయ్యాడు.

నెల్లూరుకు కాకతీయ మహారాజు గణపతిదేవుడు సహాయంగా నిలబడతాడని సమాచారం ఉన్నా కాని ఇంత తక్కువ సమయంలో ఇంత వేగంగా గణపతి దేవుడు ససైన్యంగా నెల్లూరు వస్తాడని ఊహించలేదు.

తన మందిరంలో అటూ ఇటూ తిరుగుతూ తీవ్రంగా ఘర్షణ పడుతున్నాడు కులోత్తుంగచోళుడు. మౌనంగా నిలబడి చూస్తున్నాడు నెల్లూరు నుండి వచ్చిన సంధి విగ్రహి ముప్పలప్రగ్గడ.

అప్పుడే వేగంగా లోపలికి వచ్చాడు చోళ సామ్రాజ్య గూఢచారి అభిరామయ.

“క్షమించండి మహాప్రభూ. నెల్లూరు రాజ్యానికి సహాయంగా వెళుతున్న మన సైన్యంపై కాకతీయ సైన్యం దాడి చేసింది. యుద్ధం తీవ్రంగా జరుగు తోందని తెలియవచ్చింది. మన పరిస్థితి.. ఏవిÖ బాగో..”

చేతిలోని గణపతిదేవుని లేఖను విసిరికొట్టి వికతంగా గావుకేకలు పెట్టాడు చోళుడు.

“ఎలా జరిగిందిది?? ఆ కాకతీయుడు నెల్లూరు లోనే ఉన్నాడని చెప్పావు కదా. ఎవరు మన సైన్యాన్ని ఎదుర్కొన్నది??”

“గొప్ప పన్నాగం ప్రభూ. సైన్యం రెండుగా చీలి ఒక పటాలం నెల్లూరులో ఉండగా మరో పటాలం గణపతిదేవుని బావమరిది.. జాయచోడుడట. అతని నేతత్వంలో కంచి పైకి వచ్చింది. ఆ విషయం మనకు తెలియకుండా ఈ సంధి విగ్రహితో రాయబారం పంపాడు గణపతిదేవ మహారాజు..”

చోళుడు మళ్లా పెడబొబ్బలు పెడుతుండగా ఆయనకు వినయంగా నమస్కరించి బయటకు కదిలాడు సంది విగ్రహి ముప్పలప్రగ్గడ.

అతడు నిష్కమిస్తూ చోళగూడచారిని అభినందనగా చూస్తూ వెళ్లడం ఆవేశంతో ఆవేదనతో రొప్పుతున్న కులోత్తుని కంటపడింది.

ముప్పలప్రగ్గడ వెళ్లగానే అరిచాడు చోళుడు, “నువ్వు.. నువ్వు.. తెలుగువాడివి కదూ??”

అతని జవాబు వినకుండానే.. జవాబు తెలిసినట్లు.. పూర్తిగా ఓటమిని గుర్తించినట్లు మళ్లీ హాహాకారాలు చేయసాగాడు కులోత్తుంగచోళుడు.. మూడవ కులోత్తుంగుడు.. చిట్టచివరి చోళచక్రవర్తి!!

*******

“ఇది చరిత్రలో తొలి భాషా యుద్ధం.. తెలుగు భాషా యుద్ధం..” ప్రకటించాడు గణపతిదేవుడు.

గణపతిదేవుని సమక్షంలో తిరిగి మనుమసిద్దిని విక్రమసింహపురి రాజ్యానికి మహారాజుగా పట్టాభిషేకం సశాస్తీయంగా నిర్వహించాడు తిక్కనామాత్యుడు.

అంతకు ముందు కాకతీయ వీరయోధులు నెల్లూరు కోటలో వారి యోధుల సహాయంతో చోళని సహాయంతో మహారాజులుగా, చోళసామంతులుగా కులుకుతున్న నల్లసిద్ది, తమ్మసిద్దిలను వెదికి వెదికి వేటాడి ముక్కలు ముక్కలుగా నరికిచంపి వారి శిరస్సులను నెల్లూరుకోటకు వేలాడదీశారు. సహాయంగా వస్తామన్న చోళ సైన్యం ఎందుకు రాలేదో..! ఎవరు రాకుండా అడ్డుకున్నారో! తెలిసేలోగా అత్యంత కిరాతకంగా నరికివేయబడ్డారు.

పట్టాభిషేకానంతరం తిక్కనతో పాటు గణపతి దేవునికి కూడా సాష్టాంగ ప్రణామాలు చేశాడు మనుమసిద్ది.

“అయ్యయ్యో.. తమరు నాకంటే వయస్సులో పెద్దవారు. ఇది తగదు..” అంటూ గణపతిదేవుడు వారించినా వినలేదు మనుమసిద్ది.

“విÖకు ఏమిచ్చి విÖ రుణం తీర్చుకోగలను.. సాష్టాంగ ప్రణామాలుతప్ప..”

అవకాశాన్ని వదులుకోలేదు గణపతిదేవుడు.

“స్థాపించబోయే తెలుగు సామ్రాజ్యానికి విÖరు తొలి తెలుగు సామంత మహారాజులు. ఇక్కడ విÖరు తెలుగు భాషవైపు కోటలా నిలబడితే తెలుగు సామ్రాజ్య స్థాపన ఎంతసేపూ..?!”

చాలా తేలిక అన్నట్లు చెబుతూ మనుమసిద్దిని మరింత కర్తవ్యముఖుడ్ని చేశాడు గణపతిదేవుడు.

“ఇక్కడ మా పక్కన తిక్కనమామ ఉండగా మాకేవిÖ భయం? విÖరు కోరినట్లు దక్షిణ భాగానికి మేము అండగా నిలబడతాం.” అన్నాడు మనుమసిద్ది.

“అటు తమిళం వైపు చివరి గ్రామం ఏవిటి.. ఇటు కన్నడం వైపు చివరి గ్రామ ఏవిటి.. అనే సరి హద్దులను మనం నిర్ణయించుకోవాలి. ఆ అంచుల లోని గ్రామాల వివరాలు సేకరించి విÖకు అంద జేస్తాను ప్రభూ..” అన్నాడు మనుమసిద్ది.

“రానురానూ కులోత్తుంగ చోళుడు బలహీన పడుతున్నాడు. అతనికి మరో చోళ వారసుడు.. మూడవ రాజరాజు చోళుని నుండి అంతర్గతంగా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయనకు మంత్రులు, సామంతులు, సైనిక వర్గాలు కూడా సహకరించడం లేదు. పాండ్యులు రాను రానూ బలపడుతున్నారు. పాండ్యరాజు జటావర్మన్ కులశేఖర గట్టివాడు. ఘటనాఘటన సమర్థుడు. విక్రమసింహపురిని సాధించాలని ఆయన కూడా పట్టుదలగానే ఉన్నాడు. అది తెలిసి చోళుడు ముందుగా దాడి చేసి పరాభవం పాలయ్యాడు. అది పాండ్యునికి సహజంగా ఆనందమే కదా! ఆయన మనుమసిద్ది మహారాజులకు అభినందనలు తెలియజేశాడు ప్రభూ..”

“మంచిది. మనకు ఎవ్వరూ మిత్రులూ కాదు.. శత్రువులు కాదు. మన తెలుగు భాష మాట్లాడే ఆఖరి గ్రామం వరకు మనం హద్దులు నిర్ణయించుకుని సాధించుకోవాలి..”

“శుభం. నా అభిప్రాయం కూడా అదే. ఆ ఆఖరి గ్రామం ఏదో నేను పరిశీలించి తెలుసుకుంటాను. విÖరు నిశ్చింతగా అనుమకొండ వెళ్లి సత్పరిపాలన అందించండి మహాప్రభూ.. శుభం భూయాత్..” అన్నాడు తిక్కనార్యుడు ఆశీర్వదిస్తూ.

గణపతిదేవుడు, బావమరిది జాయచోడునితో తిరిగి తలగడదీవి చేరారు.

తెలుగు భాషారాజ్యం కోసం దక్షిణాది వైపున్న పరిస్థితులను.. పాలకులైన చోళరాజుల శక్తియుక్తులను ఆకళింపు చేసుకున్నాక ఇతర దిక్కులవైపు దష్టి సారించాడు గణపతిదేవుడు. పడమర కన్నడ భాషా రాజ్యాలున్నాయి. అందులో బలిష్టుడు బల్లాలదేవుడు. ద్వారసముద్రం రాజధానిగా శత్రువు కన్నెత్తి చూడలేనట్లు శత్రుభీకరుడుగా పాలన సాగిస్తున్నాడు. కాని గణపతిదేవుడంటే అతనికి పుత్రవాత్సల్యం.

కారాగారంలో బంధించిన జైత్రపాలుని మెప్పించి కాకతీయ సింహాసనంపై గణపతిదేవుని తిరిగి ప్రతిష్టించినవాడాయన. గణపతిదేవుని విడిచి పుచ్చడమే కాదు పుత్రికనిచ్చి కాళ్లు కడిగి కన్యాదానం చేశాడంటే ఆ ప్రతిభ.

బల్లాలదేవునిదే. కాబట్టి పడమర నుండి తెలుగు గ్రామాలు, కన్నడ గ్రామాలు అనే విభజనకు ఎలాంటి అడ్డంకులు ఉండవు.

ఈశాన్యప్రాంతంలో కళింగులతోనూ వాయవ్యంలో యాదవులతోనూ పోరాటాలు తప్పక పోవచ్చు. మామగారి రాజ్యమే అయినా తరచి చూస్తే దేవగిరి శత్రురాజ్యమేనని గణపతిదేవుని ఊహ. ఇప్పటికిప్పుడు శత్రు భావనలు లేవు కానీ అతడెందుకో సింఘణదేవుని నమ్మలేకపోతున్నాడు. బావమరిదిగా కలసినప్పుడు ఆప్యాయంగా హత్తుకుని సకల గౌరవమర్యాదలు సమున్నతంగా జరిపిస్తాడు అయినా ఎక్కడో అపనమ్మకం. అందుకు కారణం కవ్వల కావచ్చు.

మిగిలింది ఈశాన్యంలోని కళింగరాజ్యం. ఎలాంటి మిత్రత్వం, బంధుత్వం లేదు. ఉన్నది కేవలనీ భాషా బంధుత్వం. లేదా భాషా శతత్వం మాత్రమే.

అద్భుత ప్రతిభ, యుద్ధ నైపుణ్యాలు కలిగిన బావమరిది జాయచోడుడు ఇప్పుడు గణపతిదేవునికి అత్యంత ఆత్మీయుడు. కాకతీయ కొలువులోని మహా మహావీరులు, మంత్రాంగవేత్తలు అందరూ గణపతి దేవుని కంటే చాలా పెద్దవారు. కాబట్టి వారితో ఆత్మీయత అనురాగం ఉండొచ్చు కాని స్నేహం తక్కువ. సమ వయస్కుల మధ్య ఉండే స్నేహాన్ని ఆయన జాయపుని వద్ద చూస్తున్నాడు. తనకంటే పదేళ్లు చిన్నవాడయిన జాయపుని నాట్య ప్రతిభ, యుద్ధ కౌశలం గణపతిని బాగా ఆకట్టుకున్నాయి.

జాయపునితో పాటు మరో ఇద్దరు యువవీరులను జత చేశాడు.

“యుద్ధమో, స్నేహమో చేస్తూ వారి శక్తియుక్తులు గమనించండి. వాళ్లంతా మనరాజ్యంలోని సామంత మండలేశ్వరులు కావాలి కాని శత్రువులు కారు. బహుశా మన శత్రువు కళింగ మహారాజు కావచ్చు. ఎందుకంటే మన తెలుగురాజ్యాలను తన రాజ్యానికి సామంతులుగా ఉంచుకున్నాడు కాబట్టి. మనం మన తెలుగుభాషా రాజ్యాన్ని స్థాపించాలంటే కాళింగుని జాగ్రత్తగా గమనించాలి. ఏయే రాజ్యాలను ఆయన తన చెప్పుచేతలలో ఉంచుకున్నాడో పరిశీలించండి.”

హితబోధ చేసి ఆ ముగ్గురిని ఈశాన్య రాజ్యాల పైకి పంపాడు. వాళ్లు తిరిగి వచ్చేవరకు తలగడదీవి లోనే అత్తవారింట ఉన్నాడు. మరో ఏడాదికి వాళ్లు ముగ్గురూ తిరిగి తలగడదీవి చేరారు. అప్పటికి గణపతిదేవునికి ఇద్దరు భార్యల ద్వారా ఇద్దరు మగపిల్లలు పుట్టారు. అయితే

ఒక భార్య పేరాంబ పురిటిలోనే మరణించింది. రెండవ భార్య నారాంబను, ఇద్దరు పిల్లలను, బావమరిది జాయచోడుని కలుపుకుని తిరిగి అనుమకొండ రాజప్రాసాదానికి చేరాడు గణపతిదేవుడు.

*******

రాజప్రాసాదం.. అనుమకొండ.

అంతఃపురంలో తన పడక గదిలోకి ప్రవేశించి తెల్లబోయాడు గణపతిదేవుడు.

అది పూర్తిగా పాడుబడి ఉంది. బూజుపట్టి.. గబ్బిలాలో మరేదో పురుగులు లాంటివి ఎగురు తున్నాయి.. పాకుతున్నాయి. కదలాడుతున్నాయి. ద్వారానివే వేలాడుతున్న చీనీపట్టు వృస్తాలు గబ్బు పట్టి ఉన్నాయి. దూరానికే ముతకవాసన వేస్తున్నాయి. కింద కశ్మీరు తివాసీలు తడిసి ఎండి బిర్రబిగదీసుకుని ఉన్నాయి.

వాటిపై ఎలుకలు పరుగులు పెడుతున్నాయి.

భరించలేనట్లు చివ్వున తిరిగి బయటకు వచ్చేశాడు.

సాధారణంగా గణపతిదేవుడు అంతఃపురంలోని తన ఏకాంత మందిరాలు.. అంటే పడకగదిలాంటి లోలోపలి గదుల్లోకి వెళ్లేముందు పరిచారికలను, అంగరక్షకులను, ప్రతీహారి లాంటి లోపలి రక్షణ వలయాన్ని కూడా తొలి అంచెలోనే దూరం పెట్టేస్తాడు. పూర్తి ఒంటరిగా లోపలికి వెళతాడు.

అలాంటిది చివ్వున బయటకు వచ్చి క్రోధంతో జేవురించిన ముఖంతో గట్టిగా అరిచాడు..

“ప్రతీహారీ.. ఎవరు.. పరిచారికలు ఏరి.. ఎక్కడ చచ్చారు..??”

ఆయన అరుపులు దూరంగా ఎక్కడో మొదటి ద్వారం వద్ద నిలబడిపోయిన ప్రతిహారికి, పరిచారిక లకు వినపడింది. అందరూ పరుగు పరుగున వచ్చారు. ఆయనను వాళ్లెవరూ ఎప్పుడూ అలా చూసినవారు కాదు.

చేతులు కట్టుకుని బిక్కచచ్చిన ముఖాలతో వణుకుతూ తలలు వాల్చి నిలుచున్నారు.

“ఏవిటిది.. శయన మందిరాన్ని అలా నరక ప్రాయంగా వదలివేసింది ఎవరు??” గర్జించాడు.

ఎవ్వరూ జవాబివ్వడానికి ముందుకు రాలేదు. మళ్లీ గర్జించాడు. “చెప్పండి. ఏమి జరిగింది??”

నపునీసకుడైన ప్రతీహారి కాస్త తలెత్తి జవాబి చ్చాడు. “క్షమించాలి ప్రభూ.. ఎవ్వరిని శయన మందిరంలోకి వెళ్లవద్దని మహారాణి అమ్మగారి ఆజ్ఞ. శుభ్రం చేయవద్దని.. కనీసం ఊడ్చవద్దని తీవ్రంగా హెచ్చరించారు..”

అర్థ్ధమైంది గణపతిదేవునికి. ఇది సోమలదేవి నిర్వాకం.

కోటలోకి ప్రవేశించగానే వాకబు చేశాడు. ఆమె అసలు కోటలోనే లేదు. దేవగిరి వెళ్లిందట. పిఠాపుర యుద్ధం నుండి వెలనాడు రాజధాని ధనదుపురం వెళ్లడం.. అక్కడే పినచోడుని కుమార్తెలను వివాహం చేసుకోవడం.. ఆనక కంచియుద్ధం.. తర్వాత నారానీ, పేరంబ గర్భవతులై ఇద్దరూ మగపిల్లలను కనడం, కాన్పులోనే పేరాంబ మరణించడం.. ఇవన్నీ ఎప్పటికప్పుడు అనుమకొండలోని మహాప్రధానికి.. అదే సమయంలో సోమలదేవికి కూడా వార్తాహరుల ద్వారా తెలియపరుస్తూనే ఉన్నాడు.

సోమల మనస్తత్వం తెలిసిన భర్తగా తాను తలగడదీవిలో ఉన్నప్పుడు ఆమె కదలికలపై నిఘా వద్దన్నాడు.

అయితే సోమల ఎప్పుడూ తల్లితో మాటామంతీ నిర్వహిస్తూనే ఉంటుంది. ఇటీవల గణపతిదేవుని తల్లులు ఇద్దరూ మరణించాక, రెండో సంతానంగా బాబు పుట్టాక ఆమె పుట్టింటివారితో రాసుకుపూసుకు తిరుగడం మరింత ఎక్కు వైంది. ఆమె తల్లి చిల్లాదేవి ఆరోగ్యం కూడా ఏవిÖ బావుండటం లేదని విన్నాడు.

స్త్రీగా సోమల సవతులను అంగీకరించలేని తత్వాన్ని గుర్తించినా ఆమె అతి ప్రవర్తన తెలిసిన గణపతిదేవుడు భయపడుతూనే వచ్చాడు. తమ శయన మందిరాన్ని వల్లకాడుగా భర్తకు చూపడమే ఆమె విజయం కావచ్చు. పెళ్లయిన నాటి నుండి ఆమె పొందే బీభత్స ఆనందాన్ని మౌనంగా భరించడం గణపతి వ్యక్తిగత జీవిత విజయం.

ఈసారి కూడా అలాగే ఆమె ఆనందాన్ని ఎందుకు కాదనాలి?! అనుకుని శయన మందిరాన్ని శుభ్రపరచమని పరిచారికలకు పురమాయించాడు.

తర్వాత సోమల దేవగిరినుండి వచ్చేలోగా అంతáఃపురాన్ని రెండు భాగాలు చేసి రెండు వేరు వేరు ద్వారాలు ఏర్పాటు చేయించాడు. అందులో మొదటి ప్రాధాన్యం సోమలకే ఇచ్చి పక్క అంతఃపురాన్ని నారానీకు కేటాయించాడు. తన అంతఃపురాన్ని చూసుకుని మురిసిపోయింది నారాంబ. కారణం ఆమె గౌరవబందీగా ఆరేళ్లున్న అదే కోటలో ఇప్పుడు ఆమె ఓ మహారాణి.

రెండు అంతఃపురాలను చూసుకుని హమ్మయ్య అనుకుంటూ బయటకు కదులుతున్న గణపతిదేవుని ఓ పరిచారిక ఆపింది. “ప్రభూ.. ఏవో లేఖలు. సోమలమ్మ వారి మందిరంలో శుభ్రపరుస్తున్నప్పుడు దొరికాయి.”

ఆశ్చర్యంగా అందుకుని ఆసక్తిగా చదివాడు. అవి తల్లి చిల్లాదేవికి కూతురు సోమలకు జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలు. కబుర్ల రూపంలో తల్లి కూతుళ్లు రాసుకున్న ఆ లేఖల్లో గణపతికి తెలియని ఎన్నో విశేషాలున్నాయి. ఓ లేఖలో గిరిరాజమ్మ అనే ఓ దేవత గురించి రాసి ఉంది. అందులో చివరలో కనబడిన ఓ పేరు చూసి కంగు తిన్నాడు. మళ్లీమళ్లీ కళ్లు చికిలించి చూశాడు.

అక్కడ దొర్లిన పేరు “కవ్వల.”

కవ్వల పేరు ఈ లేఖల్లో ఉన్నదేవిటి.. ఆ లేఖను మళ్లీమళ్లీ చదివాడు.

“కవ్వల కూడా ఈ మన కొత్తదేవత గిరిరాజమ్మ భక్తురాలు.”

మతిపోయింది గణపతిదేవునికి.. కళ్లు చికిలించి మళ్లీ అక్షరమక్షరం చదివాడు. అన్ని లేఖలు మళ్లీ మళ్లీ చదివాడు. ప్రతి అక్షరం పట్టి పట్టి చూశాడు. ఊహు.. కేవలం ఓ లేఖలో కవ్వల కూడా ఆ దేవత భక్తురాలు అని మాత్రమే ఉంది.

‘ఎవరైనా చంపిన మనిషిని ఆ దేవత తిరిగి బ్రతికిస్తుందట. అందుకే చచ్చిన తన సోదరిని ఆ అమ్మవారు తిరిగి బ్రతికిస్తుందని బాలకవ్వల ఆమెను భక్తితో కొలుస్తోశీదట. అంటే శత్రు పోరాటంలో చనిపోయిన అక్క కవ్వల ఆత్మశాంతి కోసం వీళ్లిద్దరూ పూజలు హోమాలు చేయిస్తున్నారన్నమాట.

(సశేషం)

మత్తి భానుమూర్తి

About Author

By editor

Twitter
YOUTUBE