భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ట బహుమతి పొందిన రచన
– విహారి
రాత్రి మూడవజాము జరుగు తోంది.
పన్హాలా దుర్గం. ముఖద్వారం దగ్గరి కావలి తావులో రెండు గంటలు మోగాయి.
ఉలిక్కిపడి లేచాడు శంభాజీ.
ఏదో పీడకల. కొంత స్పష్టంగానే ఉంది. కళ్లు నులుముకున్నాడు. మందిరం మధ్యగా కాచదీపం వెలుగుతోంది. ఓ పక్కన పల్చటి చీకటి.
అలతిదూరంలో భార్య యశూబాయి. పక్కన పాప భవాని. ఇద్దరూ పక్కమీద మసలుతున్నారు.
లేచి, మందిరం బయటకు వచ్చాడు. బయట వాతావరణం ప్రసన్నంగానే ఉన్నది. సహ్యాద్రి పర్వత పంక్తుల నుండి దూరప్రయాణం చేస్తూ వస్తున్నా, గాలి చల్లగానే దేహాన్ని స్పర్శిస్తున్నది. వివరంలేని సవ్వడుల్ని వినిపిస్తున్నది ప్రకృతి. తన మనస్సులోనే అలజడి.
స్పష్ట స్మృతిలోని పీడకల దృశ్యం కలత పెడుతోంది. తండ్రి ఛత్రపతి శివాజీ మహరాజ్ ఆకారం-ఆకురాల్చిన చెట్టులా దీనంగా కనిపించింది! అసలు రాయగడలో ఏం జరుగుతోంది? ఏడాదిపైనే అయింది. తండ్రి ప్రత్యేకంగా తనను చూడాలని వచ్చారు. ఆంతరంగిక సమావేశం. మనసులు విప్పి మాట్లాడుకున్నారు.
‘‘మూడేళ్లయింది నిన్ను చూసి శంభూ!’’ అన్నారు, ప్రభువు – కళ్లల్లోనే ఉద్వేగాన్ని వ్యక్తం చేస్తూ. తాను పాదాభివందనం చేస్తే, లేపి అక్కున చేర్చుకున్నారు. ఆ తర్వాతి సంభాషణలో తాను నిష్ఠుర వాస్తవాల్నే ప్రస్తావించాడు. ‘మంత్రుల దుష్ప్రవర్తనని ఉపేక్షిస్తూ, వారు నా మీద మోపుతున్న దురభియోగాల్ని నమ్ము తున్నారు మీరు’అని నిష్కర్షగానే చెప్పాడు. ప్రభువుగా, కన్నతండ్రిగా తన బాధ్యతల్ని ఎన్నడూ విస్మరించనని స్పష్టం చేశారు మహారాజు. తన వైపు వాత్సల్యంగా చూస్తూ, ‘‘భావి హిందూరాజ్య పరిరక్ష ణకు నీవే చాలినవాడివి శంభూ! కవిగా, పండితునిగా, పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని సాధించుకున్నావు. నీ ధైర్య సాహసాలు గడ్డకెక్కాయి. మన లక్ష్యసాధనకు నీకంటే తగిన వారెవరున్నారు చెప్పు’’ అని ‘‘నీ మీద నాకే దురభిప్రాయమూ లేదు. గతం గతః’’ అంటూ కరచాలనంతో చల్లనిమాట చెప్పారు. ఆ తర్వాత రాజనీతి గురించీ, రాజధర్మాల్ని గురించీ కూడా ప్రబోధించారు. తనకు గుండెలోని ఆవేదన బరువుతీరింది.
అయితే, ఇప్పుడీ పీడకల– కలేనా?
– ఆలోచనల్లో మునకలు వేస్తున్న శంభాజీ భుజం మీద మెత్తని కరస్పర్శ! భార్య యశూబాయి!
‘‘నిద్రాభంగమైందా మా వలన?’’ అంటూ చేయిపట్టుకుని పక్కనున్న పీఠిక మీద కూర్చోబెట్టింది. తానూ కూర్చుంది.
‘‘అదేం కాదు’’ ముక్తసరిగా సమాధానం చెప్పాడు.
‘‘మనసులో కలతని ముఖం దాచలేదు ప్రభూ’’ అని ‘‘నాకు తెలుసు. తమ్ముడు రాజారాము వడుగుకి మీ సవతితల్లి, అతని తల్లి – సోయరాబాయి – మిమ్మల్ని ఆహ్వానించలేదని మీ మనసు వ్యథపడుతున్నది’’
‘‘ ఆ సంగతిని పక్కన పెట్టాను’’ అని,
‘‘అసలు ప్రధానమంత్రి, ఆమె విధేయుడు- అణ్ణాజీదత్తుకు నా మీద కోపం ఎందుకూ?’’
శంభు తన మాటలు పూర్తి చేయకముందే ఠక్కున అందుకుంది యశూ. ‘‘ఎందుకంటే – పన్నుల వసూళ్లలో ఆయన చేతివాటాన్ని మీరు గమనించారనీ, అమాయకుల్నీ, ఆ పన్నుల్నీ అవినీతితో పీడిస్తుంటే హెచ్చరించారనీ…’’ అని ‘‘సోయరాబాయి అత్త స్వభావం తెలియనిదేం ఉంది. ఆమెవి కైక లక్షణాలు. తన కొడుకు ఛత్రపతి కావాలి! శివాజీ ప్రభువుకేమో – ఆమె పట్ల దశరథ మహారాజుకి కైక పట్ల కంటే ఎక్కువ ప్రేమానురాగాలు! అయినా, మీకు చెప్పగలిగిన దాన్నా నేను? కాచిన చెట్టుకే కదా రాళ్లదెబ్బలు’’ అన్నది. నిర్లిప్తంగా ఆమె వైపు చూశాడు.
పాప ఏడుపు వినిపించింది. లేచి చకచకా లోపలికి అడుగులు వేసింది యశూ. వెళ్లి భవానీని సముదాయిస్తూ పడుకున్నది. కానీ, ఆమె ఆలోచనలు మాత్రం శంభు చుట్టూ తిరుగుతున్నై. ధైర్య సాహసాల్లో వరపుత్రుడు. ‘మల్లఖంబ్’ పోటీలో శారీరక దారుఢ్యాన్ని ప్రదర్శించి ప్రజల్ని అబ్బుర పరచిన ఘనుడు. బహుభాషా కోవిదుడు. కవి. వ్రజభాషలో తాను రాసిన ‘నఖశిఖ’ గ్రంథంలో రాధాకృష్ణుల ప్రణయ తత్త్వాన్ని రసవత్తరంగా చెప్పి పెద్దల ప్రశంసల్ని పొందిన వాడు. అందునా ఆ గ్రంథంలో రాధ కేశవర్ణన అపూర్వమని ఎందరో పొగడుతుంటే విన్నది తాను. అలాంటి ప్రతిభామూర్తి ఇటీవల బాగానే జంకాడు. తండ్రికి తనమీద అనుమానమనే భావన కూడా మనసును కలత పెడుతోంది.
శంభు లోపలికి వచ్చి తన పక్కమీద నడుం వాల్చేడు. గమనించింది. పిల్ల నిద్రపోయింది.
యశూ వచ్చి భర్త పక్కన కూచుంది. జరిగి చోటిచ్చాడు. ‘‘రాజారామ్ వడుగు సంగతి వదిలేశారు. బాగుంది. ప్రభువులు మీ పట్ల అభిమానంతోనే ఉన్నారు. లేకుంటే -మీకు పన్హాలా, దభోల్, ప్రభావళి ప్రాంతాల పాలన బాధ్యతల్ని ఇచ్చేవారా – ఆలోచిం చండి. అసలు తల్లి లేని పిల్లవాడిని తన తల్లి జిజియాకి ఒప్పజెప్పేననీ, ఆ తర్వాత, పుత్తలీబాయి సంరక్షణకు వదిలేశాననీ – మహా రాజుకు అపరాధభావం ఉన్నదని నాకు నమ్మకం. ఇటు చూస్తే మల్హోజీ గోర్పడే -పన్హలా సైన్యాధిపతి, విఠల్ మహద్కర్ కోటకు అధిపతి; అటు జనార్దన మహంతి కొల్హాపురిలో అశ్వదళాధిపతి, హీరోజీ కోశరక్షకుడు – వీరంతా మీరంటే ప్రాణం పెడతారు కదా. కారణం మహారాజు కాదూ?’’
భార్య మాటలకు శంభు మనసు ఉద్విగ్నమైంది. ఆమె నడుంపై చెయివేసి ముందుకు కదల్చేడు. ఆమె మొహంలోకి చూశాడు. పరమ ప్రసన్నంగా వుంది. ‘ముగ్ధమోహన సౌందర్యం ఈమెది’ అనుకుని మురిశాడు. ‘‘నీకూ రాచకార్యాలపై పట్టూ, మనుసుల ఆంతర్యాలూ బాగా తెలుస్తున్నాయి’’ అని చుబుకం మీద వేలుని తాటించాడు.
యశూ సన్నగా నవ్వింది.
బయట మూడవ గంట మోగింది. ‘‘కొద్దిసేపన్నా కునుకు పట్టించుకోండి’’ అంటూ లేచి తన శయనం వైపు నడిచింది. తనలో తను నవ్వుకున్నాడు శంభు.
* * *
‘తలచిన డెందము కందును…’ అన్నట్టు బయట ఎండకాస్తోంది. లోపల గాలి స్తంభించిన వాతావరణం. శంభు, ఆంతరంగిక మిత్రుడు కవికలశుడు, ఆ పక్కగా యశూబాయి. ముగ్గురూ మౌన మూర్తులుగా కూర్చుని వున్నారు.
శంభు చేతిలో పుతలీబాయి పంపిన కమ్మ. మనసు తెర పైన జరిగిన ఘటనల దృశ్యాలు….
* * *
జల్నా ప్రాంతంలో మొగలుల విజృంభణ ఎదుర్కోవటానికి సమాయత్తమై ససైన్యంగా వెళ్లాడు ఛత్రపతి శివాజీ. అక్కడ ధనాన్ని కొల్లగొట్టి రాయగడ తిరిగి వస్తున్నాడు. పక్కన తానాజీ వంటి సిద్దోజీ నింబోల్కర్. వీరందరినీ అపరిమిత సైన్యంతో ప్రతిఘటించారు మొగలు వీరులు. పోరు భీకరమైంది. ఛత్రపతి సైన్యంలో రెండువేల మంది వరకూ సైనికులు నిహతులైనారు. సిద్దోజీని వధించారు శత్రువులు. శివాజీ పరిస్థితిని గమనించి, ఐదువందల మంది సైనికవీరుల రక్షణతో తప్పించుకొని రాయగడ చేరేడు. కానీ, అటు సిద్దోజీ మరణఖేదం, ఇటు తన ఆరోగ్యం క్షీణించటం వలన శివాజీ జ్వరంతో, రక్త గ్రహణితో మంచం పాలైనాడు. వారం చివరలోనే స్పృహ కోల్పోయాడు. మరోవారంలో దుర్దినాన కాలధర్మం చెందాడు.
సోయరాబాయీ, ప్రధానమంత్రి అణ్ణాజీ – తండ్రి మరణవార్తను శంభుకు తెలియనీయకూడదని కుట్ర చేశారు. ఆమె తన సోదరుడు, సైన్యాధిపతి హంబీరరావు మోహితేని పిలిపించి, రాజారామ్‌కు ఛత్రపతి పట్టం కట్టాలనే కోరికను ఆజ్ఞగానే తెలిపింది. హంబీరరావు ఆశ్చర్యపోయాడు. ఆమె కోరికను అంగీకరించలేదు. హైందవరాజ్య క్షేమం దృష్ట్యా ప్రమాదకరమైనదని మందలించాడు. ఈ విషయం తెలిస్తే ఔరంగజేబు రేపే అపార సేనావాహినితో దండయాత్ర చేసి మరాటా రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేస్తాడని హెచ్చరించాడు.
ఈ ఘర్షణ మధ్యలోనే ఆమె శివాజీ అంత్య క్రియల్ని – రాజారామ్ కర్తగా ‘సబజీభోన్‌స్లే’ అనే వంశీకుడి చేత జరిపించేసింది.
ఈ పరిణామాలకు గుండెలు మండించుకుని పుతలీబాయి తన ఆంతరంగికుడైన గూఢచారి ద్వారా ‘కమ్మ’ను శంభుకు పంపించింది. తక్షణం రాయగడ వచ్చి రాజ్యరక్షణ భారం వహించమని సూచించింది.
ళి ళి ళి
ఉత్తరాన్ని మరోసారి చదువుకుని గద్గదికంగా అన్నాడు శంభు, ‘‘ఈ దుర్ఘటనలకు మాతాశ్రీ ఎంతగా తల్లడిల్లిపోయిందో’’ కళ్లనీళ్లు తిరిగినై శంభుకు.
భర్త పక్కకు చేరి ఊరడిస్తూ అన్నది యశూ, ‘‘తండ్రి చనిపోతే కుమారునికి తెలియజేయకుండా, అంతటి వీరశివాజీ ప్రభువుకు చివరకు-అనాథ కులము వాడు చేసే ‘బాటాగ్ని’ చితిని కల్పించటం ఎంత దారుణం’’
‘‘దారుణం కాదు ఘోరం. స్వార్థం, దుర్మార్గం. ఆమె స్వార్థానికీ, అహంకారానికీ రుజువు’’ అన్నాడు కవికలశుడు.
ఇద్దరినీ చూస్తూ ‘‘ఇంతటి దుఃఖాన్నీ సహించి నేనొక మౌనిలా తలవంచుక్కూచోవాలా?’’ అన్నాడు శంభాజీ. పిడికిలి బిగిసింది. పెదవులు వణికినై.
‘‘కాదు. ఆ మహారాణి, మహాతల్లి పుతలీబాయి సూచనని కర్తవ్యంగా భావించి కదలటమే’’ అన్నాడు కవికలశుడు.
చాలా సమయం గడిచింది.
నిర్ణయం దిగ్దర్శనం చేసింది. లేచారు.
* * *
హంబీరరావుకు వార్త వెళ్లింది.అటు శంబాజీ మామగారు పిలాజిషిర్కె ఐదువేల సైన్యంతో రాయగడకు బయల్దేరాడు. ఐదువేల సైన్యాన్ని సిద్ధపరచాడు హంబీరరావు. సోయరాబాయి అనుచరులైన మంత్రుల్ని చెరసాలలో బంధించాడు.
రెండువేల సైనికులతో శంభు కదిలాడు. దారి పొడువునా శంభాజీకి ప్రజలు, హాలికులు, సైనికులు, శ్రామికులు, స్త్రీ బాలవృద్ధులు విజయధ్వానాలతో హారతులు పట్టారు. రాయగడలో ఛత్రపతిగా పట్టాభిషిక్తుడైనాడు శంభాజీ! ‘హైందవీ రాజ్యవర్ధన’ ‘ధర్మవీర’ ‘విద్వత్కవి’ ‘మహావీర’ అంటూ కొలువులో జయధ్వానాలు మిన్నంటాయి.
* * *
ఛత్రపతి శంభాజీ గద్దెనెక్కిన తర్వాత తొలిసారి కొలువు దీరే రోజు – రేపే!
ఆ రోజే – మంత్రులతో సహా అపరాధులందరి విచారణ.
రాత్రి గడుస్తున్నది. శంభూకి నిద్రలేదు. మనసంతా ఆందోళనతో నిండి వుంది.
నేరాలు రుజువయ్యే ఉన్నాయన్నాడు మోహితే. అయితే, ఏ శిక్షలు విధించాలి? ఇదీ శంభుని వేధిస్తున్న ప్రశ్న!
అష్టప్రధానుల్లో ప్రతిఒక్కరూ మొన్నమొన్నటి వరకూ శివాజీ ప్రభువును వినయంతో సేవించినవారే. రాజ్యక్షేమానికి తొలి నుంచీ పాటుబడినవారే. కానీ, బలహీన మనస్కులై సోయరాబాయి ప్రలోభాలకు లొంగిపోయారు. క్షేత్రస్థాయిలో అవినీతికి పాల్పడి ప్రజల్ని – ప్రత్యేకించి హాలికుల్నీ, వృత్తిపరుల్నీ రాపాడి ఇక్కట్ల పాలు జేశారు. ఆ నేరస్థుల్ని పూర్వ ప్రవర్తన రీత్యా మందలించి క్షమించి వదిలేయటమా? లేక కఠినంగా శిక్షించటమా? ఏది సమంజసం? ఏది రాజ్యశ్రేయస్సుకి దోహదం చేస్తుంది? పాలకునిగా ఏది తన కర్తవ్యం?
మనస్సులో సంకుల సమరమే చేస్తున్నాడు శంభాజీ మహరాజ్!
– తెలతెలవారబోతున్నది!
* * *
ఛత్రపతి శంభాజీ కొలువు. మాన్యులతో, సామాన్యులతో సభ కిటకిటలాడుతోంది. మంత్రుల్ని సభలో ప్రవేశపెట్టారు.
ముందుగా మోరోపంతుని పిలిచారు. ‘‘వయసులో పెద్దలు మీరు. ప్రధానుల్లో ప్రధానిగా శివాజీ ప్రభువుని కొలిచిన వారు. ఎందుకిలా నేరస్థులైనారు?’’ అని బాధతోనే ప్రశ్నించాడు శంభు. ‘‘మోమోటముతో ఈ లంపటంలో దిగబడినాను. క్షమించండి’’ అన్నాడు పంతు చేతులు కట్టుకుని, తలవంచుకుని.
క్షణం ఆలోచించాడు శంభాజీ. ‘‘మిమ్మల్ని క్షమిస్తున్నాము. వెళ్లండి•. మీ కుమారుడు నీలకంఠోజీ నియమశీలి. అతను మాకు పీష్వాగా ఉంటాడు’’ అని ప్రకటించాడు. సభ హర్షధ్వానాన్ని వినిపించింది.
విత్తమంత్రిగా కోశాగారాన్ని సగం సొంతానికి మరలించిన అణ్ణాజి, ఆ తర్వాత ఇతరమంత్రులు అందరికీ క్షమాభిక్షనే పెట్టాడు శంభాజీ మహరాజ్. నేరస్థులందరికీ స్వేచ్ఛ లభించింది.
శంభాజీ తీర్పును మెచ్చిన వారు మెచ్చారు. నచ్చని వారు బాధపడుతూ మౌనం వహించారు.
యశూబాయి మాత్రం ‘పాముకు పాలు పోసి వదిలేశా’రని తన నిరసనని తెలిపింది.
‘‘శంభూ- నీ మంచితనం నిన్ను కాటేయకుండా సదా అప్రమత్తుడవై ఉండాలి. జాగ్రత్త’’ అని మిత్రవాక్యాన్ని పలికాడు కవికలశుడు.
‘‘మొగలాయీల నిత్యకృత్యాల్లో ప్రధాన వ్యూహం శత్రువర్గంలోని బలహీన మనస్కుల్ని డబ్బు ఎరవేసి బయటకు లాగటమే. కానీయండి. ధర్మపాలనకు అంకితమైన మీకు అంతా శుభమే జరగాలి’’ అని ఆశాభావాన్నీ, శుభాకాంక్షనీ పలికాడు హంబీరరావు.
* * *
తొమ్మిదేళ్ల శంభాజీ పాలనలో తాను సుఖపడిన రోజులు వేళ్లమీద లెక్కించటానికే తక్కువవుతాయి. ‘ఉపకారికి అపకారం’ నిజమైంది. ‘క్షమ’ తిరగబడింది.
కడకు కాలప్రభావం, దుర్విధిలీల – రెండూ అనుల్లంఘనీయమని చరిత్ర రుజువు చేస్తూనే వున్నది.
హైందవధర్మపాలనకూ, పరిరక్షణకూ, లక్ష్యశుద్ధికి శంభాజీ చెల్లించిన మూల్యం – ఔరంగజేబు క్రూర, కర్కశ చిత్రహింస, నలభై రోజుల మరణయాతన!
వీరశంభాజీ సాహసౌదార్యాలకు దక్కింది ఆచంద్రార్కమైన కీర్తి, ప్రజలకు మిగిలింది ఛత్రపతి శంభాజీ దేశభక్తి స్ఫూర్తి!!