‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన

సోమలదేవికి, చిల్లాదేవికి మధ్య వ్రాసుకున్న ఉత్తరాలు అంతఃపురంలో దొరికితే వాటిని చదువుతున్నాడు.
‘ఆ చనిపోయిన పెద్ద కవ్వల కోసం బాలకవ్వల వీళ్లతో కలిసి ఆ దేవతను కొలుస్తున్నట్లుంది. అయితే ఈ బాలకవ్వల ప్రస్తుత స్థితిగతులు.. ఆమె ఎక్కడ.. ఎలా.. జీవిస్తుందో చిల్లాదేవికి, సోమలకు తెలుసన్న మాట!?’
ఈ ముగ్గురూ కలసి కవ్వల ఆత్మశాంతి కోసం ఎవరో దేవతను పూజించడం..’
గణపతికి అంతగా హర్షణీయంగా లేదు. ఇందులో ఏదో తిరకాసు ఉన్నట్లు ఆయన మనసు చెబుతోంది.
నిజమేనా.. కేవలం సందేహమేనా??
* * *
నాలుగవ మెట్టు: కన్నడరాజ్య హద్దులలో
‘‘కాకతీయ రాజ్యానికి తూర్పుదిక్కున రాజ్యం పొడవునా పూర్తిగా సముద్రతీరం ఉంది. పటమట దిక్కున ఖచ్చితంగా అంత పొడవునా కన్నడ భాషా రాజ్యాలున్నాయి. హద్డు వెంట ఉన్న గ్రామాలలో కన్నడ తెలుగు భాషా గ్రామాలున్నాయి. వాయవ్య మూలగా దేవగిరి రాజ్యముంది. భాషాపరంగా చూస్తే అక్కడ మూడు భాషలు.. తెలుగు, మరాఠి, కన్నడభాషల ప్రజలున్నారు. తెలుగు గ్రామాలు తక్కువ కాని అది పూర్తిగా కన్నడభాషా రాజ్యమో..మరాఠ భాషా రాజ్యమో తేల్చుకునే ప్రయత్నంగా నిర్విరామంగా దిగువ కన్నడ రాజ్యాలతో యుద్ధాలు చేస్తోంది దేవగిరి రాజ్యం. అలాగే నైరుతి మూలగా దిగువన అనేక త్రిభాషా (కన్నడ తమిళ తెలుగు) గ్రామాలున్నాయి. వాటిలోని మన తెలుగు గ్రామాలను.. తెలుగు భాషారాజ్యంలో కలుపుకోవాలి. అందుకు గణపతిదేవుని మహా చాణక్యం, యుద్ద తంత్రజ్ఞత అవసరం.’’
తిమ్మప, కన్నడ తెలుగురాజ్య సంబంధాల నిపుణుడు, చింతనా శిబిరంలో..
* * *
కురుమద్దహళ్లి గ్రామం, బెలగావి, దేవగిరి రాజ్యం.
గ్రామమంతా హడావిడిగా ఉంది. ఇది కదంబుల రాజధాని బెలగావి నుండి తూర్పువైపు తెలుగు రాజ్యాల హద్దులవద్ద ఉన్న గ్రామం. కదంబ రాజ్యాన్ని దేవగిరి మహారాజు సింఘణదేవుడు ఓడించి కదంబ వంశాన్ని నామమాత్రం చేసి తన దేవగిరి రాజ్యంలో కలిపేసుకున్న రోజులు.
పాలకుడు ఎవడైనా ప్రజలకొచ్చిన నష్టం ఏమీ లేదు. రాజ్యపాలకులు మారినప్పుడు తాత్కాలికంగా వచ్చే కొన్ని ఇబ్బందులు మాత్రమే ఉంటాయి. కాని ఈసారి సమస్య భాషా సమస్య. ఈ రాజ్యంలో అత్యధిక ప్రజలు మాట్లాడే భాష కన్నడ. తూర్పువైపు తెలుగు రాజ్యాలున్నాయి. అంచులలో ఉన్న గ్రామాలలో తెలుగన్నడ (తెలుగు కన్నడ మిశ్రమ భాష) మాట్లాడతారు. ఇప్పుడు అందరూ మరాఠి మాట్లాడాలన్నది కొత్త పాలకుల ఆజ్ఞ. అందుకు రాజ్యమంతా ఒకలా స్పందిస్తే తెలుగన్నడ మాట్లాడే గ్రామాలు ఒకలా స్పందించాయి. కారణం ఇప్పుడు తెలుగన్నడ అనే మిశ్రమభాష మాయమై తెలుగు, కన్నడ స్పష్టమైనాయి. పూర్తిగా తెలుగు మాట్లాడేవారు మేము తెలుగు రాజ్యంలో కలుస్తామని అంటుంటే.. పూరిగా కన్నడ మాట్లాడేవారు తాము కన్నడ రాజ్యంలో కలుస్తామంటున్నారు. వీరిద్దరి గొడవ ఇలా ఉంటే.. ఇప్పుడు ఇది మరాఠి పాలకుల రాజ్యం కాబట్టి మీరంతా మరాఠి మాట్లాడాలని కొత్త పాలకుల దాష్టీకం పెరిగింది.
కురుమద్దహళ్లి గ్రామ సమయసెట్టి కన్నడవాడు. ఆ ప్రాంతంలోని ప్రముఖ వణిజశెట్టి మరాఠివాడు. సమయ శెట్టి కూడా వణిజశెట్టి మాట జవదాటలేడు. వర్తమానంలో వణిజ శెట్టి మాట సమాజంలో బాగా చెల్లుబాటు అవుతోంది. కురుమద్దహళ్లి గ్రామంలో కన్నడ, మరాఠి భాషల ప్రజలు ఏమి మాట్లాడాలో తేల్చుకోలేకపోతున్న సమయంలో తెలుగుభాషా కుటుంబాలు మెల్లగా మూటాముల్లె సర్దుకుని తూర్పుదిక్కుగా హద్దులు దాటి తెలుగు రాజ్యం అద్దంకి వెళ్లి పోవాలని చూస్తున్నాయి.
కురుమద్దహళ్లి సమయశెట్టి చాటింపు వేయించాడు.
‘‘మన గ్రామం ఇప్పుడు మరాఠి మహారాజ్యం దేవగిరి రాజ్యంలో భాగం అయ్యిందని మీకు అందరికి తెలుసు. రాజ్యమంతా ఇకపై మరాఠిలో మాట్లాడాలని మహారాజులవారి ఆజ్ఞ అని తెలియవచ్చింది. కాబట్టి అంతా ఆ భాష గురించి యోచించవలసినదిగా కోరుతున్నాను. వచ్చే ఆదివారం జరగబోయే సంతలో మరాఠి మాట్లాడేవారికి మాత్రమే సరకు అమ్ముతామని వణిజశెట్టి తెలియజేశాడు. సంత నిర్వాహకులు, సుంకాధికారులు కూడా మరాఠి వాళ్లే ఉంటారని గుర్తుపెట్టుకోండి.’’
ఈ చాటింపు వేయించిన సమయశెట్టి సమయానుకూలంగా ఉంటాడని గ్రామస్తులందరికి తెలుసు. కన్నడం వాళ్లు విచికిత్సలో పడిపోగా తెలుగువాళ్లు మెల్లగా హద్దు దాటడానికి బయటకు తెలియకుండా సిద్ధమౌతున్నారు. ఆ సమయంలో దేవగిరి రాజ్య వాణిజ్య సంధివిగ్రహిట. ఓ మరాఠి మహాతల్లి రాజ్యంలోని వణిజశెట్టిల అతిథిగా ఉంటూ.. ఆయా గ్రామాలను దర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తోందని కురుమద్దహళ్లి గ్రామస్తులకు తెలియవచ్చింది.
తెలుగుభాషా కుటుంబాలవాళ్లు తాత్కాలికంగా వల్లప్పనాయడు అనే వ్యక్తిని సమయశెట్టిగా ఎన్నుకున్నారు.
వల్లప్ప గ్రామ సమయశెట్టి ముద్దగండయను కలిసి ‘‘మా తెలుగువాళ్లు అవతల అద్దంకి రాజ్యంలోకి వెళ్లిపోదామని అనుకుంటున్నారు శెట్టి. మీ సహకారం కావాలి’’ అని కోరాడు.
‘‘నాదేముంది వల్లప్పా. మన గ్రామస్తులందరం ఇంతకాలం ఒక్కటిగా ఉన్నాం. మన కష్టాలు సమస్యలు ఐక్యంగా పరిష్కరించుకున్నాం. అప్పుట్లో మాట్లాడేది మన భాషా.. పరాయి భాషా అనే తేడా రాలేదు. ఇప్పుడు వచ్చింది. సరే సరే. ఇది కాలధర్మం. కాబట్టి భాషాపరంగా మనం వేరువేరు అనుకున్నప్పుడు మీరంతా గ్రామం విడిచిపోతామంటే నేను చేసేది ఏముంది? అయితే ఎవరో మరాఠి మహిళ.. దేవగిరిరాజ్య వాణిజ్య సంధివిగ్రహి.. పేరు బాల కవ్వలాబాయి గారట. కొత్త రాజ్యం తరఫున అన్ని గ్రామాలు తిరుగుతూ అందరిని బెదిరిస్తోందని విన్నాను. రేపోమాపో మన గ్రామం కూడా రావచ్చు. ఆమెను కలిసి చెప్పుకో.’’ అన్నాడు ముద్ద గండయ.
ఆయన చెప్పినట్లుగా ఆ మరాఠా వాణిజ్య సంధివిగ్రహి బాలకవ్వలాబాయి ఓ రోజు కురుమద్ద హళ్లి గ్రామానికి విచ్చేసింది. వెంట పెద్ద రక్షణ వలయం. పూర్తి మరాఠీ కట్టుబొట్టు.. దూరానికి కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న ముక్కుకున్న నత్తు, చెవులకు వ్రేలాడుతున్న జుమకి, కాన్ వెలి.. చేతులకు కాకన్, థోడా, పాటిల్య.. చేతులకు బాజూబంద్, వేళ్లకు వింతవింత అంగుటిలు.. ఇక మెడనిండా మిలమిల మెరిసిపోతున్న తుషిమాల, తన్మణి, బోర్ మాల, సూర్య, చంద్ర లక్ష్మీ హారాలు, జబ్బలకు వాక్య.. ఇక ఉన్నదో లేదో తెలియని సింహమధ్య లాంటి నడుముకు కమర్ పట్టా.. ఓహ్.. అచ్చమైన మరాఠి పరిపూర్ణ మహిళ..
పల్లకి నుంచి కిందికి దిగిన ఆమె.. కేవలం రాజవంశ అంతఃపురకాంతలా లేదు. రాజసంతో కూడిన కుందనపు బొమ్మలా, సన్నగా ఏపుగా చివారుకొమ్మలా ఎదిగి.. ఎదుటివారిని ఉక్కిరి బిక్కిరి చేయగల అందచందాలతో పాటు యుద్ధ్ద విద్యలు సైతం నేర్చిన యోధురాలిగా తెలుస్తోంది. చూపుల్లో, కదలికల్లో రాచరిక దర్పం ఎక్కువగా ప్రదర్శిస్తోంది. ఆమెను చూస్తుంటే వంగి దండాలు పెడితే గాని ఆమె కరుణించదు అనిపించింది వల్లప్పకు.
దండాలు పెడుతున్న ఆ గ్రామీణులను క్రీగంట చూస్తూ సమయ భవనపు చావడిలోకి వెళ్లిపోయింది. వల్లప్పకు చిరాకు కలిగింది. స్వతహాగా ఆయన పెద్ద భూస్వామి. ఎవరివద్దకో వెళ్లి తలవాల్చి దండాలు పెట్టడం అతడెప్పుడూ చేసినవాడు కాదు. ఆమె దర్పం చూసి చిరాకు పుట్టి ఆమె వద్దకు వెళ్లకుండా వెనుదిరిగాడు. ఎలాగూ ఈ ఊరు విడిచి పోతున్నాం కదా.. ఇక కలిసి ఆమెను వంగివంగి దండాలు పెట్టడం ఎందుకు? అనుకున్నా డు వెళుతూ…
అయితే ఆ రాత్రి జరిగింది చూసి ఆమె శక్తియుక్తులేమిటో అర్థమై పిచ్చికేకలు వేశాడు భయంతో.
* * *
దేవగిరి పాలకుడు సింఘణదేవుడు దక్షిణాది వైపుగా దండెత్తి రావడం సరిహద్దు గ్రామాల ప్రజలకు భాషాపరంగా కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. కన్నడ, తెలుగు భాష కుటుంబాలు మౌనంగా ఎవరి భాషా రాజ్యాలకు వాళ్లు వెళ్లిపోతున్నారు. గొడవలు లేవు. అంతా సామరస్య పూర్వక సర్దుబాటు. కాని మరాఠి భాషీయులైన దేవగిరి యాదవ పాలకులు గెలవడంతో ఈ సరిహద్దు గ్రామవాసులకు కొత్త భాష సమస్య వచ్చింది.
సింఘణదేవుడు దేవగిరి మహారాజుగా దినదినప్రవర్థమానంగా ఎదిగి పోతున్నాడు. సింఘణ మీద ఓ కన్నువేసి ఉంచాడు గణపతిదేవుడు. కారణం కవ్వలను అతడే చంపించి ఉంటాడు అనే వదలని సందేహం. దానిని అలా పక్కన ఉంచి చూస్తే దేవగిరి మహారాజుగా ఆతని పాలన దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఉత్తరం వైపు సౌరాష్ట్ర రాజ్యాలు, దక్షిణంగా కన్నడభాషా రాజ్యాలు జయించుకుంటూ అడ్డొచ్చిన వారిని తొక్కుకుంటూ విజయ దండ యాత్రలు చేసుకుంటూ తాత, తండ్రిని మించిన పరాక్రమశాలిగా గుర్తింపు పొందుతున్నాడు. అయితే ఊహాతీతంగా అతడు గణపతిదేవుని పట్ల పూర్తి అభిమానంతో ప్రవర్తిస్తున్నాడు. అందువల్ల తనకూ కొన్ని ప్రయోజనాలున్నాయి కాబట్టి గణపతిదేవుడు కూడా అంతే అభిమానం ప్రదర్శిస్తున్నాడు.
కాకతీయులకు అత్యంత ప్రీతిపాత్రుడు ద్వారసముద్రం పాలకుడు బల్లాల దేవుడు. ఇప్పుడు బల్లాల దేవునికి, సింఘణకు పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. నిజానికి జైత్రపాలుని కాలం నుండి ఈ రెండు రాజ్యాల మధ్య వైరం ఉంది. ఇప్పుడు బల్లాలదేవుడు వార్ధక్యం వల్ల.. యువకుడైన సింఘణ దేవునిదే పైచేయిగా ఉంది. బల్లాలను సైతం విజయ వంతంగా ఓడించి మరింత క్రిందికి దూసుకు పోతున్నాడు దేవగిరి సింఘణదేవుడు.
దక్షిణాపథం అంటే దక్షిణానికి రహదారి. దక్షణాది అంటే వింధ్య పర్వతాల క్రిందనున్న రాజ్యాలు అనేది ప్రాచీనం నుండి ఉన్న భావన. దక్షిణావర్తానికి రావడానికి ప్రధానమైన దక్షిణాపథాలు రెండు. మధ్యగా వింధ్య పర్వతాలు ఉంటే దానికి పడమరగా ఉన్నది ఒక రహదారి అయితే.. తూర్పున ఓడ్ర రాజ్యాలు, కళింగం మీదుగా ఉన్నది మరో రహదారి. సాధారణంగా దక్షిణాపథం అంటే.. పడమటి రహదారిని చెబుతారు. ఉత్తరావర్తం నుండి దక్షిణావర్తానికి వచ్చే వాళ్లంతా ఈ దక్షిణాపథాన్నే ఎంచుకుంటారు. పాటలీపుత్ర మహారాజైన అశోకుడు లాంటి ఈశాన్య రాజ్యాల పాలకులు కళింగం మీదుగా దక్షిణావర్తానికి వస్తుంటారు.
దక్షిణాపథంలో ఉన్న రాజ్యాలు దేవగిరి రాజ్యం, కాకతీయ రాజ్యం మాత్రమే.
దేవగిరి రాజ్య చరిత్ర చిన్నది కాదు. శత్రుదుర్భే ద్యంగా రూపొందించారు జైత్రపాలుడు, ఆయన తండ్రి భిల్లమదేవుడు. తురుష్కులు దక్షిణాదికి విస్తరించలేదు కాని ఉత్తరాదిలో వాళ్లు సృష్టిస్తున్న వైపరీత్యాలను దక్షిణావర్తపు రాజులంతా విభ్రమంగా పరికిస్తున్నారు. రేపు వాళ్లు మనపైకి వస్తే అనే ఆలోచనలతో జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే సహ్యాద్రి పర్వతశ్రేణుల పాదాల వద్ద ఉన్న రాజధాని దేవగిరి చుట్టూ బలిష్టమైన కోటను నిర్మించారు యాదవ రాజులు.
ఇప్పుడు భాష ప్రధానమయ్యే నాటికి దేవగిరి రాజ్యంలో మూడు భాషలు మాట్లాడే ప్రజలున్నారు. అన్ని రాజ్యాలలో సమస్య ఇదే అయినా ఆయా రాజ్యాలలో అధిక శాతం ప్రజలు మాట్లాడేది ప్రధాన భాష అనుకుంటే రెండు మూడు భాషలు మాట్లాడే హద్దుల గ్రామాల వద్దే అసలు గొడవంతా వస్తోంది.
ఇప్పుడు కురుమద్దహళ్లి గ్రామ పరిస్థితే హద్దు పొడవునా ఉన్న ద్విభాషీయ గ్రామాలన్నిటా కనిపిస్తోంది. మరారి •వాడైన సింఘణ కన్నడరాజ్యాల్లో దక్షిణంగా చొచ్చుకుపోతున్నకొద్దీ.. ప్రజలు ఏది మాట్లాడాలో మరాఠా అధికారులు ఆజ్ఞాపిస్తుండ టంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
నిజానికి హద్దు గ్రామాలలోని తెలుగువారు హద్దు దాటి తెలుగు రాజ్యాలలోకి వెళ్లిపోవడానికి ఏ అడ్డూ రాదనీ భావించారు. అదే ఆలోచనలో కురుమద్దహళ్లి గ్రామ తెలుగువారు కూడా నిశ్శబ్దంగా మూటాముల్లె సర్దుకుంటున్నారు. ఈ గ్రామంలో మొత్తంగా తెలుగు వారివి ఓ నలభై కుటుంబాలు ఉన్నాయి. ఏ రాత్రి వేళలో రాజ్యహద్దులు దాటిపోవచ్చు అనుకుని సిద్ధంగా ఉన్నారు. కాని ఆ రాత్రి జరగరానిది జరిగిపోయింది.
ఎవరో తెలుగువారి నివాసాలను తగలబెట్టారు.
ఇది కార్చిచ్చులా హద్దు గ్రామాలకంతా పాకిపోయింది. దాదాపు అన్ని గ్రామాలలోనూ హద్దు దాటిపోదామన్న తెలుగువారిని అడ్డుకుంటున్నారు మరాఠి పాలకులో.. వారి అనుయయులో..
అమాయక ప్రజల మధ్య ఇంతవరకు లేని కొత్త చిచ్చు పెట్టారు. ఇక ఆ మూడు భాషల గ్రామాలలో కొత్త సమస్యలు ఆరంభం అయ్యాయి.
ఈ చిచ్చు పెట్టింది ఓ మహిళ ఎందుకు కాకూడదు అనే సందేహం అప్పటికి ఎవ్వరికీ రాలేదు.
* * *
కాకతీయరాజ్యపు నిండు సభామందిరం, అనుమకొండ రాజప్రాసాదం..
మొదటి కొలువు అప్పుడే ప్రారంభం అయ్యింది.
కాకతీయ మహామండలేశ్వరుడు గణపతిదేవుని పాలనా విధానం అంతా పాతతరం పాలన నుండి పూర్తిగా మారిపోయింది.
మహావీరులకు, అనేక యుద్ధాలలో పోరాడి అలసిన సర్వసైన్యాధ్యక్షులకు, వృద్ధ్దులైన యుద్ధ మంత్రజ్ఞులకు కూడా వేరువేరు మండలాలను కేటాయించి ప్రశాంతంగా ప్రజలకు సహాయ సహకారాలు అందించవలసినదిగా ఆదేశిం చాడు. యుద్ధాలు, యుద్ధ మంత్రాంగాలను పక్కన పెట్టేసి మండలేశ్వరులుగా ప్రజలకు సమస్త సౌకర్యాల కల్పనతో కూడిన ప్రజాహితం, ప్రశాంత సమాజం దిశగా ఆలోచించమన్నాడు.
ఇప్పుడు ఆయన ఎప్పుడు చూసినా సైనిక వీరులతో కాక ప్రజాపాలనలో నిపుణులైన ప్రతిభామూర్తులతోనే పరివేష్టించి కనిపిస్తున్నాడు. నిర్ణయించిన సమావేశాలు, కలవవలసిన విదేశీ, స్వదేశీ వణిజులు, వివిధ అంశాల నిపుణులతో చర్చలకు సంబంధించిన చిట్టా ముందే రోజే సిద్ధ్దమైపోతుంది. ఎంతో అత్యవసరం అయితే తప్ప ఈ నిర్ణీత అంశాల నుంచి మరో అంశాన్ని చూడడు మహారాజు గణపతిదేవుడు.
హఠాత్తుగా రాజధానికి వచ్చి మహారాజును కలవాలని ఎవరైనా ప్రత్యేకంగా అభ్యర్ధిస్తే మహా మండలేశ్వరుల ఆంతరంగిక కార్యదర్శి మయభట్టు.. ఆయనకు దగ్గరగా నిలబడి ఆయన కన్నెత్తి చూసినప్పుడు మాత్రమే ధైర్యం చేసి వచ్చిన ప్రముఖుల సంగతి చెవిన వేస్తాడు.
ఈ రోజు కూడా అదే జరిగింది.
తీవ్రమైన ఆర్థిక అంశంపై సంబంధిత నిపుణు లతో మహారాజు పూర్తి ఏకాగ్రతతో చర్చిస్తున్నాడు. అప్పటికి గంట నుండి ఆయన దగ్గరగా చేతులు పిసుక్కుంటూ కదలాడుతున్నాడు మయభట్టు. ఓ లిప్తకాలంలో ఆయన గుర్తించాడు.
‘‘ఏమి భట్టూ.. ఏమైనా చెప్పెడిది ఉందా ఏమి?’’
‘‘అవును ప్రభూ.. దేవగిరి.. నుంచి?!’’
ఆయన చివ్వున చూశాడు, ‘‘ఆ.. దేవగిరి నుంచి??’’
‘‘దేవగిరి రాజ్యం నుండి తమరికి ఏకాంతంగా కలవాలని ఓ బృందం??’’ …
సభామందిరానికి పక్కగా ఆంతరంగిక మందిరం ఉంటుంది. అక్కడ అతిథులను, ప్రత్యేక వ్యక్తులను పక్కన సహాయకులు లేకుండా కలుస్తాడు మహా మండలేశ్వరుడు.
‘‘అంతరంగిక మందిరంలో కూర్చుండబెట్టు..’’
దేవగిరి రాజ్యం నుంచి ఎవరో రావడం కలిగిం చిన ఆలోచనలతో మరో అంశంపై దృష్టి పెట్టలేక వడివడిగా ఉత్సుకతతో ఆ మందిరలోకి ప్రవేశిం చాడు గణపతిదేవుడు. అక్కడి బృందమంతా.. దాదాపు పాతికమంది చివ్వున లేచి నమస్కరించారు.
వాళ్లు మరాఠీయులని లిప్తకాలంలోనే గుర్తుపట్టిన గణపతిదేవుడు ముందున్నవ్యక్తిని చూసి చివ్వున అడుగు వెనక్కు వేశాడు. నిలువెల్లా కదిలి పోయాడు.
అతడు కేయూర.. కేయూరదేవుడు!!
ఎవరికోసమైతే ఈ పదేళ్లుగా ప్రతినిత్యమూ ఆయన శరీరంలోని ప్రతి అణువణువూ స్మరిస్తుందో.. కంటిపై రెప్ప వెయ్యకుండా ఎవరికోసం ఆయన ఎదురు చూస్తున్నాడో ఆ వ్యక్తి ఊహాతీతంగా కళ్లముందు నిలబడటం.. పిచ్చెక్కినట్లయింది గణపతిదేవునికి. చేతులు కట్టుకుని కొంచెం వంగి తలెత్తి చిన్నగా కంపిస్తున్న శరీరంతో తన వైపు చూస్తోన్న కేయూరను రెప్పవేయకుండా చూస్తున్నాడు.
పదేళ్లనాడు తానొక యుద్ధ్దఖైదీ అయితే అతనొక విస్మృత రాజకులీనుడు. ఆగామి రోజులలో తాను తప్పక కాకతీయ సింహాసనం అధిష్టిస్తానని ప్రగాఢంగా నమ్ముతూ.. అప్పుడు తనకు తప్పక సహాయం చేయాలని ఆనాడే అర్థించిన వాడు. చివరిరోజు ఆ వివాహమందిరంలో కనిపించాడు. అంతే. ఆరోజు నుంచి మరెక్కడా.. తనవివాహ సమయంలో కూడా కనిపించలేదు. ఇప్పుడు హఠాత్తుగా ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. నోట మాట రావడం లేదు గణపతి దేవునికి.
‘‘మహారాజా.. కాకతీయ మహామండలేశ్వరా.. శతకోట వందనాలు ప్రభూ.’’
కాళ్లపై పడబోయాడు కేయూర. చటుక్కున ఆపి హత్తుకున్నాడు.
ఎంతగా హత్తుకున్నాడంటే వెంటవచ్చినవాళ్లు వీరి అన్యోన్యతను.. ఎన్నోఏళ్ల తరవాత కలసిన ఉద్వేగాన్ని.. కళ్లప్పగించి చేష్టలుడిగి దిమ్మెరబోయి చూస్తూ ఉండిపోయారు.
‘‘కేయూరా..! ఏమై పోయావూ. నన్ను.. నన్నెంత అన్యాయం చేశావూ..! నేను నీకు చేసిన ద్రోహం ఏవిటి??’’
ఒక మహామండలేశ్వరుడు అలా ఓ సాధారణ వ్యక్తిలా ఉబికివస్తున్న కన్నీటిని ఆపుకుంటూ కేయూర లాంటి సాధారణ రాజకుటుంబికుడిని గాఢంగా హత్తుకుని మాట్లాడటం చూసి కేయూరతో వచ్చిన వారందరికీ మతిపోయింది. వారందరూ గణపతిదేవుడు అద్భుత కరుణామూర్తి అని విన్నారు కాని ప్రత్యక్షంగా చూసేసరికి వారికి నోట మాట లేదు. మిడిగుడ్లతో చూడసాగారు.
మహారాజ వైభవంతో వెలిగిపోతున్న గణపతిని అబ్బురంగా ఆత్మీయంగా పైనుండి కింది వరకు తడిసిన కన్నులతో చూడసాగాడు కేయూర. కంటి చూపుతో అందరిని బయటకు వెళ్లవలసినదిగా సౌంజ్ఞ చేశాడు. అందరూ వెళ్లాక కేయూరను ఓ ఆసనంలో కూర్చుండబెట్టి మళ్లీ అడిగాడు గణపతిదేవుడు.
‘‘మిత్రమా.. నీ అదృశ్యం.. ఇంతకాలం దూరంగా ఉండటం.. అన్నీ నన్ను ఆశ్చర్యపరుస్తు న్నాయి. ఏమి జరిగింది చెప్పు. నేనిప్పుడు పూర్తిస్థాయి మహామండ లేశ్వరుడను. దేవగిరివారికి అల్లుడను. ప్రస్తుత మహారాజు సింఘణదేవుడు నాతో పూరి స్థాయి గౌరవాభిమానాలతో ప్రవర్తిస్తున్నాడు. నీకొచ్చిన ఆపదలు ఇకపై ఉండవు. నాది హామీ. సరేనా.?? చెప్పు చెప్పు.. మీ తల్లిగారు ఎలా ఉన్నారు?’’
ఇవన్నీ కేయూర ఎదురైతే అడగాలనుకున్న మాటలు.. ఆయన నాలుక చివరనే ఉన్నాయి.. పదేళ్లుగా.
‘‘నా తల్లి కాలం చేసింది ప్రభూ… అప్పటినుండే నాకు మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయి.’’
ఆగి, అటూఇటూ చూసి, ‘‘కవ్వల..’’ చెప్పబోయి ఆగాడు కేయూర.
ఆ ఒక్క మాట.. గణపతిదేవుని పూర్తిగా వణికిం చింది. ఏమి చెప్పబోతున్నాడు కేయూర??
గబుక్కున తన స్థాయిని మరచి అతని ముందు మోకాళ్లపై కూర్చుండి పోయాడు గణపతి.
‘‘కవ్వల??.. చెప్పు కేయూరా.. కవ్వల.. ఆమెను నాకు దగ్గర చేసిన వాడివి నువ్వే. నేనే ఆమెను దూరం చేసుకున్నాను. ఆ రాత్రి నేను ఆ పెళ్లికి వెళ్లకుండా ఉంటే ఎంతో బావుండేది. ఆ రాత్రే మావాళ్లు నా కోసం మెరుపుదాడి చేశారు. నన్ను తప్పక విడిపించి అనుమకొండ తీసుకుపోయేవారు. నేను మహారాజుగా పట్టాభిషక్తుడనై తిరిగి దేవగిరి వచ్చి ఆమెను.నా కవ్వలను వివాహం చేసుకునే వాడిని. ఇప్పుడు నా పట్టమహిషిగా.. ఈ రోజు కవ్వల నిన్ను ఆప్యా యంగా అంతఃపురంలోకి ఆహ్వానించి.. నీకు పంచ భక్ష..’’
‘‘నాకా అదృష్టం లేదు మహారాజా.. లేదు గాక లేదు.’’ భోరుమని ఏడుస్తూ నెత్తి బాదుకున్నాడు కేయూర.
గణపతిదేవుడు తానొక మహారాజు అనే స్పృహ వదిలేశాడు. కేయూరకు పరిచయమైన చెరసాలవాసిగా ఆ రోజులలో మిగిలి ఉన్న సందేహాలను కేయూరను అడిగి నివృత్తి చేసుకోవాలని ఆరాటపడుతున్నాడు.
‘‘ఏమైంది చెప్పు కేయూరా. బాధపడకు. నా వద్దకు వచ్చావ్..ఇక నీ సమస్యలన్నీ తొలగిపోయాయి. చెప్పు. కవ్వల అంటూ ఏదో చెప్పబోయావ్. చెప్పు.. ఆమెను ఎవరు చంపారు? ఆ రాత్రి కాకతీయ సైనికులు, ఇటు దేవగిరి సైనికులు చాలా ఉద్రేకంగా యుద్ధోన్మాదంతో ఉన్నారు. అప్పుడొక అమ్మాయి వారికి తారసపడితే ఆమెను మానభంగం చేసినా ఆశ్చర్యం లేదు. అతి దారుణంగా ముక్కలు ముక్కలుగా ఆ లేత శరీరాన్ని నరికి నరికి చంపేశారు.. అది దుర్మార్గులైన సైనికుల పనే కావచ్చు.. అవునా??’’
కాస్త తేరుకున్నాడు కేయూర.
‘‘ఆమె మరణం దారుణం. కాని కానీ ఆమెను.. ఎవరు అలా.. అంత దారుణానికి ఒడికట్టారో.. ప్చ్. నాకు తెలియదు ప్రభూ…! కాని ఆమెను సింఘణ పెళ్లి చేసుకుంటానని ఆ సంఘటనకు కొన్ని రోజుల ముందు మహారాజు, రాణిగార్ల వద్ద ప్రస్తావించిన మాట నిజం. అదే నేను ఆ వివాహ మండపంలో మీతో చెప్పాను. ఆ రాత్రి అక్కడ కొందరు వేగుల వాళ్లున్నారు. నేను వాళ్లను చూశాకే భయంతో దూరంగా పరుగుపెట్టాను. కారణం సింఘణ దేవుడు ఎంత దుర్మార్గుడో నాకు తెలుసు. ఆ వేగులు మిమ్మల్ని గుర్తించారు కూడా. మీరిద్దరూ కలిసి మాట్లాడు కోవడం.. బయటకు వెళ్లడం కూడా వాళ్లు గుర్తిం చారు. ఈ సంగతులు వాళ్లు తప్పక సింఘణ చెవిన వేసే ఉంటారు.’’
ఆపాడు కేయూర. ఆలోచనలో పడిపోయాడు గణపతిదేవుడు. చాలాసేపు అలా ఉండిపోయాడు. కేయూర చెబుతున్న వివరాలలో ఆయనకు కావాల్సిన ప్రధాన అంశం.. కవ్వల మరణ రహస్యం.. ఏ మాత్రం తెలియక పోవడం ఆయనను నిరుత్సాహ పరచింది.
కాస్త తెప్పరిల్లాడు. లేచి నిలబడ్డాడు.
‘‘సరే.. ఇన్నేళ్లూ ఈ పదేళ్లు ఎక్కడున్నావ్.. ఈ రోజు ఇలా ఇక్కడికి రావడానికి కారణం ఏవిటి’’
కేయూర లేవబోయాడు. భుజాలు పట్టి కూర్చోబెట్టాడు గణపతి. పదేళ్లలో కేయూరలో వచ్చిన మార్పులు తొలిచూపుతోనే గుర్తించాడు. అప్పుడు బట్టల చిరుగులను కప్పిపెట్టుకోవడానికి యత్నించే వాడు. ఇప్పుడు మంచి రాచరిక దుస్తులలో ఉన్నాడు. నడుముకు విలువైన కత్తి కలిగిన వొర వేలాడుతోంది. తలకు ఖరీదైన ఉష్నీషం ధరించాడు. పాదరక్షలు కూడా మహారాజులు ధరించేవే.
స్థాయి పెరిగినట్లు కనపడుతున్నా ముఖంలో దర్పం లేదు అప్పటిలాగే దైన్యం గానే ఉన్నాడు.
‘‘స్వామీ మీకొక సంగతి చెప్పాలి. నన్నొక ‘విషయ’కు పాలకుడిగా నియమించారు మా మహారాజు సింఘణ దేవులవారు.’’
కనుబొమలు ఎగరేసి ఆశ్చర్యంతో కూడిన అభినందనగా భుజం తట్టాడు గణపతిదేవుడు.
‘‘ఓహో.. సంతోషం. తమరు ఇప్పుడొక విషయాధి పతి అన్నమాట.’’
‘‘అవును ప్రభూ. దేవగిరి ఉత్తర హద్దు. సౌరాష్ట్ర రాజ్యాల వద్ద. కల్వకోల రాజ్యం..’’
ఒక్కొక్క అంశమే కేయూర మెల్లగా ఆపి ఆపి చెబుతున్నట్లు భావించాడు. పదేళ్ల తర్వాత కనిపించి మెరుగైన తన జీవితాన్ని చెబుతున్నప్పుడు సహజంగా ఉండే ఆత్మవిశ్వాసపు గర్వం, దర్పం.. ఏమీ లేవు. గణపతిదేవుని ముఖంలోకి చూస్తూ ఒక్కొక్క సంగతే చెబుతున్నాడు.
‘‘వివాహం కూడా సింఘణదేవులవారే జరిపించారు.’’