‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన


“అరె.. నిజమా.. అయితే నిజంగానే నీ జీవితం అద్భుతం కేయూరా!” మధురం ఆయన కంఠంలో చిప్పిల్లుతోంది.

కాని కేయూరుని ముఖంలో ఆనందం లేదు. పైగా ఏదో చెప్పడానికి సంశయిస్తున్నట్లుంది.

“చెప్పు.. చెప్పు. ఏవిటి ఆగావ్??”

“నా భార్య పేరు కవ్వల.. బాలకవ్వల నా భార్య మహారాజా..”

చటుక్కున చెప్పి గణపతిదేవుని కాళ్లపై పడిపోయాడు కేయూర..

అగ్నిపర్వతం పేలినట్లు.. పగిలిన శకలాలు, ఎగసిన లావా తనపైనే పడినట్లు..

“ఇది నా ప్రమేయం లేకుండానే అన్ని.. అన్ని సింఘణ మహారాజులవారే నిర్ణయించి నిర్వహించారు ప్రభూ!”

కేయూరను సున్నితంగా వదలి కదిలి పక్కనున్న కుడ్యాన్ని ఆసరాగా చేసుకుని నిలుచున్నాడు.

కేయూర బాలకవ్వలను వివాహం చేసుకున్నాడా? చేశారా..? సింఘణే పూనుకుని చేసినట్లు చెబుతు న్నాడు.. అంటే.. ఈ పెళ్లి ద్వారా సింఘణ ఎవరిని అవమానించినట్లు?ఎవరిని గౌరవించినట్లు? ఏమి జరిగి ఉంటుంది? ఎప్పుడూ ఈసడించి అవమాన పరచే కేయూరకు కవ్వలను ఇచ్చి చేయడం అంటే తనకు పెద్ద కవ్వల దక్కలేదని.. బాలకవ్వలను కేయూర లాంటి నీచ రాజకుటుంబికుడికి కట్టబెట్టి ఆమెను సింఘణ అవమానించాడు.. ఇది నిజం!!

తలవాల్చి రోదనగా తన కాళ్ల వద్ద కూలబడ్డ కేయూరను కాసేపు అలా చూస్తూ ఉండిపోయాడు గణపతిదేవుడు. తర్వాత తెప్పరిల్లి…

“జరిగిపోయింది కదా కేయూరా! తెలియజెప్పావు చాలు. ఆమెనిచ్చి వివాహం చేసి నీకు ఓ గౌరవనీయ జీవితం, పదవి కూడా ఏర్పరచాడన్నమాట. ఇకనేం.. సంతోషమే కదా. మరి నన్ను వెదుక్కుంటూ ఓ బృందంతో వచ్చావ్. ఏమిటి? ఎందుకు?”

“మహారాజు సింఘణ దేవుడు.. నన్ను నాబోటి మరికొందరిని కక్షకట్టి చిత్ర హింసలు పెడుతున్నాడు. అందుకనే మేమంతా కాకతీయ రాజ్యంలో బతుకు తెరువు చూసుకుందామని.. మిమ్మల్ని కలసి మాకింత చోటు చూపమని అడుగదామని వచ్చాము మహాప్రభూ..”

“సరే. సరే.. తప్పక.. ఇకపై మీరంతా ఇక్కడే నా రాజ్యంలోనే ఉంటారు.. సరేనా?!!”

కేయూర మరేదో చెప్పబోతుండగా గణపతిదేవుడే మళ్లీ అడిగాడు.

“ఇప్పుడు నీ భార్య.. ఎలా ఉంది?.. ఆమెకు నేను గుర్తున్నానా??”

“ఏమో.. ఆమె ఎక్కడుందో.. ఎలా ఉందో నాకు తెలియదు మహారాజా..”

చివ్వున చూశాడు గణతపతి దేవుడు. “అదేవిటి?”

“అక్క.. పెద్ద కవ్వల మరణంతో బాల కవ్వల జబ్బుపడింది. మాటా, చూపు కోల్పోయి కేవలం ఊపిరి పీలుస్తూ ప్రాణాలతో మంచం పట్టి ఉంది. ఆమెకు పెళ్లి చేస్తే తిరిగి లేస్తుందని ఎవరో వైద్యులు, మంత్రవేత్తలు చెప్పడంతో నన్ను పిలిచి పెళ్లి చేసుకోమని ఆజ్ఞాపించి మరీ పెళ్లి చేశాడు సింఘణ మహారాజు. ఆశ్చర్యంగా ఆమె కోలుకుంది.. తిరిగి మామూలు మనిషయ్యింది. ఆమె కోసం ఆమె భర్తగా నాకొక స్థాయి, హోదా కల్పించడానికి ఓ చిన్న విషయకు పాలకుడిని చేశాడు.. అంతే. కాని ఆమె నాతో ఎప్పుడూ కాపురం చేసింది లేదు. ఈ మధ్య ఏమి జరిగిందో ఏమో..! సింఘణ, బాల కవ్వల ఓ సయోధ్యకొచ్చారు. అంటే ఆయన రాజ్యవ్యవహారాలలో ఆమెను ఉపయోగించుకోవడం ప్రారంభించాడు. ఇప్పుడు ఆయన రాచకార్యాలకు ఆమె ఓ ఎర. ఆమె కోసం ఓ ప్రత్యేక పదవి సృష్టించాడు. ఆమె ఇప్పుడు దేవగిరిరాజ్య వాణిజ్య సంధివిగ్రహి. అంటే కన్నడ రాజ్యం పొడవునా ఉన్న వాణిజ్యశెట్టిలతో కలసి వారి భవంతులలో అతిథిగా ఉంటూ వారు నిర్వహిస్తున్న వాణిజ్య కార్యకలాపాలను పర్యవేక్షిస్తుందట. అంటే ఏమీ లేదు. కన్నడ, తెలుగు మాట్లాడే గ్రామాలలోని ప్రజలను వణిజుల ద్వారా నిత్యావసరాలు అందకుండా నియంత్రిస్తూ.. బెదిరిస్తూ కన్నడ రాజ్యా లన్నిటా నిర్బంధంగా మరాఠీ భాష మాట్లాడించడం ఆమె ప్రధాన కార్యక్రమం..”

ఆశ్చర్యంతో మ్రాన్పడిపోయాడు గణపతిదేవుడు.

కేయూరదేవునితో మాట్లాడిన అనంతరం గణపతిదేవుడు ఆంతరంగిక మందిరం నుండి బయటకు వెళుతూ, “సరే సరే. మీ అందరికి మా కాకతీయ రాజ్యంలోనే తగినస్థాయి కల్పిస్తాను. వెళ్లి మహాప్రధానులకు కలువు. మా మాటగా చెప్పు కేయూరా” అన్నాడు.

“మహాభాగ్యం ప్రభూ..”

“ఆ.. మరో మాట. నేను కారాగారవాసంలో ఉన్నప్పుడు నాగతిస్య అనే దీప రక్షకుడు.. గుర్తున్నాడా..?”

కేయూర అయోమయంగా చూశాడు. అతిసాధారణ ఉద్యోగులైన దీప రక్షకులను ఈయన గుర్తుపెట్టుకోవడం.. ఇన్నేళ్ల తర్వాత అడగడంతో అతని ముఖంలో అయోమయం కదలాడింది.

కేయూర స్పందన ఊహించాడు గణపతిదేవుడు.

“అతడు నూనెపోసే ఉద్యోగి నిజమే కాని అతడు నాకోసం నియుక్తుడైన కాకతీయ గూఢచారి అన్నది అసలు నిజం..” అన్నాడు.

నివ్వెరపోయి చూశాడు కేయూర.

“ఆ రోజు నూనె పోసే వాడివేషంలో నన్ను పెళ్లి మండపానికి పంపింది అతడే.” అన్నాడు. అతని గొంతులో కృతజ్ఞత..

చప్పున అన్నాడు కేయూర.. గుర్తొచ్చినట్లు, “ఆ.. అయితే వాడే. అతన్ని కూడా మీతోపాటు ఆ రోజు దేవగిరి సైన్యం పట్టుకున్నారు. అతన్ని ఉరి తీశారో లేదా కారాగారంలోనే మగ్గుతున్నాడో.. తెలియదు ప్రభు..!”

విషాదంగా ఇద్దరూ చాలాసేపు అలా ఉండి పోయారు.

అంతే జరిగి ఉండవచ్చు అన్నట్లు నిట్టూర్చి భారంగా కదిలాడు.

ఆయనతో మరో మాట.. అత్యంత ముఖ్యమైన మాట చెప్పాలని.. చెప్పలేక.. చెప్పే అవకాశం జారిపోయినందుకు చింతపడుతూ ఉండిపోయాడు కేయూరుడు.

 * * *

దేవగిరి కోట..

చీకటి బాగా ముసురుకుంటున్నవేళ.

ఎలాంటి హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది కోట ప్రాంగణం. విశాలమై, బలిష్టమైన కోటలో ఎన్నో భవనాలు.. కోట ప్రధాన ప్రహరి పైభాగం నలుగురు కాపలా దారులు నడవగలిగినంత విశాలంగా ఉంటుంది. ఇద్దరిద్దరు చొప్పున నలుగురు ఎదురెదురుగా కాగడాలు పట్టుకుని పైభాగాన ఇరవై నాలుగు గంటలు కాపలా కాస్తుంటారు.

కోట వెలుపల ప్రహరీ దగ్గరగా మానవమాత్రులు తిరగడానికి లేదు. కోట సింహద్వారానికి చాలా దూరంగా ఆవలగా అక్కడక్కడా గుబురుగా.. చిన్న చిన్న అడవుల్లా ఉన్న చెట్ల నీడన సహజంగా బిచ్చగాళ్లు నివాసముంటారు.

ఆ నిశిరాత్రి వేళ ఓ గుబురుచెట్ల నీడకు ఒక్కరొక్కరుగా బిచ్చగాళ్లు వచ్చి చేరుతూ యోగక్షేమాలు అడుగుతున్నారు. “ఒరే.. కుంటోడా.. తిన్నావా..” అన్నారెవరో.. అప్పుడే కుంటుకుంటూ వచ్చిన ఓ వ్యక్తితో.

సదరు కుంటివాడు ఉస్సూరుమంటూ కూలబడి, “తిన్నా తిన్నా..” అన్నాడు పీలగొంతుకతో.

అక్కడ చేరిన ముష్టివాళ్లు రోజంతా దేవగిరి నగరంలో తిరుగుతూ విన్నవి, చూసినవి చెప్పు కుంటారు. సదరు కుంటోడు మాట్లాడకుండా అవన్నీ వింటూ అక్కడే కాసేపు ఉన్నాడు. తర్వాత కుంటు కుంటూ కాస్త దూరంగా మరో చెట్టు కిందికి పోయి ఆ చెట్టు కొమ్మలపై మడిచి పెట్టిన చింకి చాప, రెండు చిరుగుల దుప్పట్లు తీసి చెట్టు మొదట్లో పరుచుకుని నిద్రకు ఉపక్రమించాడు.

ఒకప్పుడు బలిష్టమైన శరీరం కావచ్చు కానీ ఇప్పుడు శిథిóలమైన ఆ శరీరం గుండ్రంగా ఒక చిన్న శిథిóలకొండలా మిగిలింది. పైగా కాళ్లు వంకర పోయినట్లు కుంటుతూ నడుస్తాడు. భుజాన జోలె.. చేతిలో బొచ్చె కనిపిస్తాడు. ఓ కన్ను కూడా లొట్టపోయినట్లు మూసుకుపోయి ఉంది. రెండవ కన్ను కూడా రెప్పలు వాలి మూసుకుపోయి ఉంటాయి. పగలంతా ఒక్కడే అడుక్కుంటాడు. రాత్రివేళ అక్కడికి చేరతాడు కాబట్టి వాళ్లతో ఉంటాడు కానీ దూరంగా మరోచెట్టు కింద పడుకుంటాడు. అతని పేరు ఎవరికీ తెలియదు. అందరూ ‘కుంటోడా’ అని పిలుస్తారు.

ముచ్చట్లు అయ్యాక కాసేపటికి అందరూ ముసుకుదన్ని పడుకున్నారు. పగలంతా అలసి సొలసిన వాళ్లంతా లిప్తల కాలంలోనే నిద్రలోకి జారుకున్నారు.

ఎప్పటిలాగే ఎందరో రక్షకభటులు కోట చుట్టూ.. కోట పైభాగానా.. నిర్దేశించిన ప్రదేశాలలో తమతమ విధులు నిర్వహిస్తున్నారు.అలా రాత్రి అయ్యే కొలది నిశ్శబ్దం సహజంగా ముసురు కుంటోంది. అక్కడక్కడ నీరసంగా వెలుగుతున్న కాగడాలు.. మిణుగురుల మెరుపులు.. తప్ప కోట పరిసరాలన్నిటా.. అంతటా చీకటి.

రాత్రి మూడవజాములోకి ప్రవేశిస్తోంది. కీచురాళ్ల ధ్వని తీవ్రంగా ఉంది. దోమల అల్లరి కూడా గట్టిగానే ఉంది.

కోట పైభాగాన కాగడాల వెలుగు దూరానికి కూడా కనిపిస్తోంది. ఆ వెలుగుతో పాటు కాపలా దారుల నవ్వులు, ముచ్చట్లు ఉండి ఉండి వినవస్తున్నాయి.

కుంటోడు కప్పుకున్న దుప్పటి తొలగించాడు. లేచి కూర్చున్నాడు.

అప్పటివరకు మొద్దుగా నిర్లిప్తంగా పరాకుగా ఉన్న కుంటోడు ఇప్పుడు చురుగ్గా ఉన్నాడు. కళ్లు పూర్తిగా తెరచి చీకటిలో కూడా అటూ ఇటూ చిరుతలా చూస్తూ మౌనంగా అడుగులో అడుగు వేసుకుంటూ కదిలాడు. బాట బాగా తెలిసినట్లు నిబద్దతతో వెళ్లి వెళ్లి కోట ప్రహరీకి ఓ మూలగా కళ్లు పొడుచుకున్నా ఏమీ కనబడని చోట కూలబడ్డాడు. పైన కాపలా భటుల దివిటీ వెలుగు దాటిపోయేవరకు అలాగే ఉన్నాడు. తర్వాత చీకట్లోనే చేతులతో తడిమి ఓ చోట గోడరాతిని పుష్టిగా తోశాడు. ఆ రాయి కదిలింది. మరి కొన్ని రాళ్లు కూడా తొలగించాడు. వాటిని లోపలికి తోశాడు. తర్వాత మెల్లగా లోపలికి పాకాడు. ఆ రాళ్లను యథా స్థానంలో ఉంచాడు.

కుంటోడు ఇప్పుడు దేవగిరి కోటలో ఉన్నాడు. లేచి మెల్లగా వంగోని పాకుతూ, కుంటుతూ ఆ ప్రాంతమంతా తెలిసినట్లు ముందుకు వెళ్లాడు.

 దగ్గరగా ఉన్న ఓ శిథిల భవంతి ముందు ఆగి లేచి నిలబడ్డాడు. కాసేపు తదేకంగా ఆ భవంతిని చూశాడు.

ఏవేవో గత స్మృతులు మనసును తొలుస్తుండగా.. ఏవేవో సన్నివేశాలు కళ్ల ముందు కదలాడుతుండగా ఉద్వేగంతో కళ్లు నీళ్ల కుండలుగా మారగా.. చేతులతో తుడుచుకుని మౌనంగా భవంతి లోపలికి వెళ్లాడు.

మరి కాసేపటికి బయటకు వచ్చాడు.

అటూఇటూ కాసేపు తచ్చాడాడు. తిరిగి మౌనంగా కుంటుకుంటూ వెళ్లి కోట గోడ రాళ్లను తొలగించి బయటకు పోయి రాళ్లను యథాస్థానంలో ఉంచి తిరిగి వెళ్లి తన స్థానంలో ఆ చెట్టు క్రింద పడు కున్నాడు.

అలా అతడు ప్రతి రాత్రి కోటలోకి ప్రవేశించి ఆ భవంతిలోకి వెళ్లి తిరిగి వస్తుంటాడు.

ఇప్పటికి ఇరవై ఏళ్లుగా అలా చేస్తూనే ఉన్నాడు. మరో కంటికి ఈ సంగతి తెలియదు. తెలియకుండా ప్రవర్తించడంలో అతనికి అపూర్వమైన అనుభవం ఉది.

దేవగిరికోటలోని ఆ భవంతి పాత కోష్టాగారం. ఇరవైఏళ్ల నాడు కోటలో యుద్దఖైదీగా ఉన్న కాకతీయ గణపతిదేవుని ప్రేమించి.. ఆ రోజు అవతలగా జరుగుతున్న పెళ్లిమండపం నుంచి అతనితో ఇక్కడికి వచ్చిన దేవగిరి రాజకుమార్తె కవ్వల.. ఆ రాత్రే ఆమె దారుణంగా ఇక్కడే హతమైంది.

రోజూ అక్కడికి వచ్చి ఆ దారుణస్మృతులను గుర్తుచేసుకుని తిరిగి వెళ్లే కుంటోడు తన అసలు పేరును మర్చిపోయాడు కాని ఆ దారుణాలకు తనే కారణమన్న భావనను మర్చిపోలేదు.

అతడి అసలు పేరు నాగతిస్య. ఒకప్పటి కాకతీయ గూఢచారి.

పడుకున్నాడు కాని నిద్ర పట్టలేదు నాగతిస్యకు. రోజూ ఇదే పరిస్థితి. మనస్సంతా ఇదే సంఘర్షణ..

లోపల.. కళ్ల ముందు ఆనాడు.. దానికి ముందు, ఆ తర్వాత జరిగిన సన్నివేశాలు కదలాడుతున్నాయి.

 * * *

దేవగిరి కోటలో అప్పటికి రెండేళ్లుగా కాకతీయ గూఢచారిగా ఉన్నాడు నాగతిస్య.

దీప రక్షకుడుగా దీపాలకు నూనె పోసే దినచర్యలో ఉన్నాడు. పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు గణపతిదేవుని బంధించిన కారాగారం వద్దకు తన దినచర్యను మార్పించుకున్నాడు. ఊహాతీతంగా గణపతిదేవునితో అనుబంధం కుదిరింది. ఆయనను రక్షించి తీసుకుపోవడానికి కాకతీయ సైన్యం మెరుపు దాడికి సిద్ధ్దం అవుతోందని వార్త అందింది కాని అది ఏ రోజో అప్పటికి తెలియరాలేదు. ఖర్మకొద్దీ ఆ రోజే కోటలో జరుగుతున్న వివాహానికి వెళ్లాలని గణపతిదేవుడు మంకుపట్టు పడితే నిర్ద్వందంగా తిరస్కరించాల్సింది పోయి అంగీకరించి పంపాడు.

ఆ తప్పుకు తన జీవితాన్ని బలి పెట్టుకున్నాడు నాగతిస్య.

ఆరోజే మందడి కాటయ నాయకత్వంలో మెరుపుదాడి జరిగింది. కాటయ నాగతిస్య ముందుకు వచ్చి “యువరాజు ఏడి?” అని అడిగే సమయానికి గణపతి పెళ్లి మండపంలో ఉన్నాడు.

అప్పుడు కాటయ కొట్టిన దెబ్బకు గింగరాలు తిరిగి పోయి దూరంగా పడి స్పృహ కోల్పోయాడు. అప్పుడే పెళ్లి మండపంలో మంటలు రేగడం, మరోపక్క కాకతీయ మెరుపుదాడిని గుర్తించి యాదవ సైన్యం కూడా ఎదురుదాడి చేయడంతో కాకతీయ సైన్యం నాగతిస్యను పట్టించుకోలేదు.

తెల్లవారేసరికి బయట గడ్డిలో స్పృహ లేకుండా పడి ఉన్న నాగతిస్యను పట్టి బంధించింది దేవగిరి సైన్యం.

ఆ రాత్రి గణపతిదేవుడు, కవ్వల పెళ్లి మండపం మంటల నుంచి బయటపడి దూరంగా ఓ మూలగా ఉన్న కోష్టాగారంలో ఉన్నారట. “అక్కడే కవ్వలను ఖండ ఖండాలుగా కాకతీయ సైనికులు నరికి చంపేశారట..”అని తనను బంధించిన సైనికులు చెప్పుకోవడం విన్నాడు నాగతిస్య.

“సంకెళ్లు వేసి తీసుకెళ్లి కోష్టాగారం వద్ద ఖండఖండాలుగా ఉన్న కవ్వల శరీర భాగాలు చూపారు. కాకతీయ సైనికులు ఆమెను ఎందుకు చంపారు? గణపతిదేవుడే చంపించాడా??” అని అడిగారు.

వాళ్ల ప్రశ్నలు అలా ఉంచి ఆ సుకుమారురాలు కవ్వల శరీర భాగాలు..కాళ్లు వేరుగా,చేతులు వేరుగా.. తల వేరుగా.. మొండం మూడు ముక్కలుగా.. చూడగానే నాగతిస్యకు ఆకాశం ఊడి దబ్బున మీద పడినట్లు కళ్లు తిరిగిపోయాయి. బడబా     లనం మీదకు ఉరికినట్లయ్యింది. ముఖ్యంగా ఆమె నిర్జీవ నేత్రాలు అతనినే చూస్తున్నట్లు.. ‘నా బ్రతుకు నాశనం కావడానికి నువ్వే కారణం’ అంటున్నట్లు..

చటుక్కున స్పృహ తప్పాడు.

ఆమె ఎంతో అపురూపంగా సన్నగా పొడవుగా కోమలంగా జాజిమల్లె తీవేలా ఉండేది. ముఖ్యంగా ఆమె కళ్లు కోటి నక్షత్రాల వెలుగులను తమలో దాచుకున్నట్లు మిలమిల మెరుస్తూ కదలాడేవి. గణపతిదేవునితో ఆమె ముచ్చట్లు, మురిపాల నవ్వులు ఎన్నోసార్లు విని ఉన్నాడు. ఇలాంటి బిడ్డ నా కుమార్తె అయితే అను

కునేవాడు. అలాంటి ఆమె శిరస్సు గడ్డిలోపడి ఉండటం.. ఆ కళ్లు రెప్ప వెయ్యకుండా తననే చూడటం..

ఆమె చూపులు నాగతిస్యను అప్పటి నుంచి అలా వెంటాడుతూనే ఉన్నాయి. ఆమె జీవితం అలా ముగిసిపోవడానికి తనే కారణమని అతడి మనస్సులో ఓ భావన.. బలంగా ముద్ర పడిపోయింది.

అంతే.. అతడు మళ్లీ మామూలు మనిషి కాలేకపోయాడు.

కారాగారంలో వేసి దినమూ కొరడా దెబ్బలు.. కొట్టి కొట్టి దెబ్బలపై కారం పూసి హింసిస్తూనే ఉన్నారు.

ఓ గూఢచారిగా దెబ్బలకు, కారాగారవాసానికి సిద్ధమై ఉన్నాడు కాని కవ్వల మరణం.. ఆమె చూపు.. నాగతిస్య మనోనిబ్బరాన్ని చంపేసింది. కూర్చున్నా నిలుచున్నా పడుకున్నా తింటున్నా.. నడుస్తున్నా ఆ చూపు ఆమె చూపు.. అతనిని అతలాకుతలం చేసేసేది.

శారీరక దెబ్బలకన్నా మానసిక ఒత్తిడితో కుమిలిపోయాడు నాగతిస్య. నిజానికి ఆ కోష్టాగారం దగ్గరగానే కారాగారాలు ఉన్నాయి. లోపల బందీగా ఉన్నా ఆ కోష్టాగార భవనం తనకు దగ్గరగా ఉండటంతో అక్కడే ఆమెను కిరాతకంగా చంపారని గుర్తొచ్చినప్పుడల్లా బాధతో తల్లడిల్లిపోయేవాడు. గవాక్షాల నుంచి బయటకు చూడటానికి యత్నించే వాడు. కనిపించకపోయినా ఆ గాలి సోకినప్పుడు ఆమెను చూసినట్లే భావించేవాడు. బాధ మరింత పెరిగేది. తెలియకుండానే కన్నీరు వచ్చేది. కుమిలి పోయేవాడు.

దాదాపు ఐదేళ్ల కాలం అక్కడే గడచిపోయింది.

ఒకానొకరోజు ఓ దిగ్భ్రమ కలిగించే సంఘటన జరిగింది.

ఆ రోజు కారాగారం అంతా శుభ్రపరచారు. నాగతిస్యకు కూడా దుస్తులు మార్చారు. ఎందుకో తెలియదు. ఆరోజు సంధ్యవేళకు సైనికులు వచ్చారు. అంతా పరిశీలించారు.

మరి కాసేపటికి మహారాజు సింఘణదేవుడు, అతని తల్లి చిల్లాదేవి వచ్చారు. కేవలం నాగతిస్య కోసమే రావడంతో కారాగార ఉద్యోగులు సంకెళ్లతో బయటకు తీసుకువచ్చారు.

బయటకు వచ్చినప్పుడు ఆ ప్రదేశంలోనే కవ్వల మరణించినందుకు.. ఆమె తనను చూస్తున్నట్లు భావించినందుకు.. మళ్లా అక్కడికే తనను బయటకు తెచ్చినందుకు.. ఓ చెప్పరాని విచిత్రానుభూతి..

కానీ సింఘణదేవుడు, చిల్లాదేవిల కరకుచూపులు ఊహ నుంచి బయటకు తెచ్చాయి.

సంకెళ్లతోనే మోకాళ్లపై పడి వందనం చేశాడు.

ఇద్దరూ అసహ్యంగా తీక్షణంగా చూస్తున్నారు.

“నువ్వన్నమాట.. ఈ దుర్మార్గాలకు మూల పాత్రధారివి..” అన్నాడు సింఘణదేవుడు. ఒకప్పుడు గణపతిదేవుడు చెప్పినవి నోరు తెరచి ఆలకించే యువరాజు ఇప్పుడు మహారాజు.

శిరస్సు నేలకు ఆన్చి మౌనంగా ఉండిపోయాడు.

చిల్లాదేవి అన్నది కరుగ్గా, “కవ్వలను చంపాల్సిన అవసరం ఎందుకొచ్చింది మీ కాకతీయ కుక్కలకు?”

చివ్వున తలెత్తబోయి అంతే వేగంగా తలవాల్చి అన్నాడు. “లేదు మహారాణి.. లేదమ్మా.. ఆమెను చంపడం ఎవ్వరికి అవసరం లేదు. ఆ రాత్రి కాకతీయ సైన్యం మెరుపుదాడి చేసింది కేవలం గణపతిదేవుల వారిని తీసుకు పోవడానికే గాని ఎవ్వరిని చంపడానికి కాదు. ఆ దుర్మార్గం ఎవరు ఎందుకు చేశారో నాకేమీ తెలియదు. నేను కేవలం గణపతిదేవులవారి బాగోగుల కోసం నియమితుడైనవాడిని. మెరుపుదాడి దాని సంగతులు నాకు తెలిసే అవకాశం లేదు మహారాణీ!”

“అది…గణపతిదేవులవారితో చెట్టపట్టాల్ వేసుకుని తిరగడానికి నువ్వే కారణం కదా?!”

“అయ్యయ్యో.. పెద్ద అభాండం. యువరాజుల వారి సంగతులు నాకెలా తెలుస్తా యమ్మా!? ఇది పూర్తిగా అభాండం మహారాణి. అదే నిజమనుకుంటే ఇప్పుడే నన్ను ఉరి తీయండి.”

“మరైతే ఆయన్ను ఆ రోజు పెళ్లికి పంపింది నువ్వే కాదా? ఇది కూడా కాదంటావా??” అరచినట్లు అన్నాడు సింఘణ.

కాసేపు మౌనంగా ఉండి తల నేలకు రాస్తూ అన్నాడు, “అవును మహారాజా. అది నేను చేసిన తప్పు. అంగీకరిస్తున్నాను. ఆయన బలవంతం మీదనే చేశాను. మారువేషంలో ఆయన వెళ్లడానికి సహాయ పడ్డానంతే. వారు ఎంత వొత్తిడి చేశారో అర్థం చేసుకోవచ్చు మహారాజా..”

ఆ పెళ్లికి గణపతిదేవుడు వెళ్లడం వల్లనే మెరుపు దాడి విఫలమై, గణపతిదేవుడు తిరిగి దేవగిరి సైన్యానికి దొరికాడు. అది గుర్తొచ్చి కాబోలు ఇద్దరూ మరి రెట్టించి ప్రశ్నించకుండా వెనుదిరిగి వెళ్లి పోయారు.

కారాగార భటులు తిరిగి లోపలికి తీసుకు పోయేవరకూ ఆ కోష్టాగారాన్ని చూస్తూ ఉండి పోయాడు నాగతిస్య.

అప్పుడొచ్చింది నాగతిస్యకు అసలు ప్రశ్న.. మొదటిసారి.

“ఎవరు ఆమెను చంపారు? ఎందుకు చంపారు?”

ఒళ్లు జలదరించింది నాగతిస్యకు. ఆమె శరీర ఖండాలను చూసి చలించాడు కానీ అసలు మౌలిక ప్రశ్న వేసుకోలేదు. ఇప్పుడు ఆ ప్రశ్న ఉదయించాక గూఢచారి తత్వం మనసులో అనేకానేక ఆలోచనలను కలిగించింది.

ఎవరు ఆమెను చంపి ఉంటారు? కాకతీయ సైనికులా..! వాళ్లకు అవసరం ఏముంది? అసలు దేవగిరి సైనికులే ఎందుకు కాకూడదు..! యుద్ధ సమయంలో దొరికిన ఆడపిల్లలను చెరచి చంపి వేయడం సైనికులకు పెద్ద వినోదం. ఆ పని దేవగిరి సైనికులు కూడా చేయవచ్చు కదా? గణపతిదేవుని వదిలేసి ఆమెను మాత్రమే చంపారంటే ఇదేదో ఆలోచించదగ్గ విషయమే!

ఈ భావన అతనిలో పుట్టి మహావృక్షమై ఎదిగింది. రాత్రి పగలు అదే ఆలోచన.. పరిపరి విధాల పరిశీలన.

నాగతిస్యకు గణపతిదేవుడంటే మహా ఇష్టం. కారణం కాబోయే తన మహారాజు. తనతో అత్యంత స్నేహంగా ఉండటం. అతని వీరత్వం, పరిజ్ఞానం, శత్రు కారాగారంలో ఉన్నా ఏమాత్రం పిరికితనం లేకపోవడం, సహజమైన హాస్యధోరణి, తన పరభేదాలు లేకపోవడం.. దేవగిరి యువరాజ బృందమంతా అతనికి దాసోహం అనడం.. అలాంటి మహానేత తనతో ఆప్యాయంగా ప్రేమగా ముచ్చట్లు చెప్పడం.. పెళ్లికి పంపాలంటూ మారాం చేయడం. తను కరిగిపోయి తన వేషంలో పంపడం.. అన్ని అతన్ని కాసేపు మధురోహలలో తెలియాడేలా చేశాయి.

గణపతిదేవుడు కవ్వలను ఎంతలా ప్రేమించాడో అతడు చూశాడు. ఆమె కోసం ఎంతలా పరితపిం చాడో.. ఆమె కోసం ఎంతలా ఎదురు చూసేవాడో.. అతనికి స్పష్టంగా గుర్తు. ఈ ఆడపిచ్చి మగవాడిని.. వాడు రాజయినా.. మంత్రి అయినా.. ఎంతలా కదిపి కుదిపివేస్తుందో గణపతిదేవుని చూసి అవాక్కయ్యేవాడు.

అంత అద్భుతమైన ప్రేమికుడు ఆమె మరణాన్ని చూసి ఎంతగా తల్లడిల్లాడో..

కవ్వల తల్లిదండ్రుల సంగతులు.. వారితో సింఘణదేవునికి, చిల్లాదేవికి ఉన్న గొడవలు తెలియవు. తల్లి, కొడుకు తనను అడిగిన ప్రశ్నలను మరోసారి మననం చేసుకున్నాడు. అంటే వాళ్లకు ఆమె గణపతి దేవునితో అన్యోన్యంగా ఉంటోందని తెలిసింది. కాబట్టి ఆమె పరాయివాడితో ప్రేమలో ఉన్నదన్న అక్కసుతో సింఘణే ఆమెను చంపించడానికి ఎక్కువ ఆస్కారం ఉంది కదా..

నాగతిస్య గజగజ వణికిపోయాడు. నొప్పులతో మూలుగుతూ పడుకున్నవాడల్లా లేచి కూర్చున్నాడు.

మ్రాన్పడిపోయి క్రింద చతికిలపడ్డాడు.

 * * *

శత్రు రాజ్యాలు లేవు.. అన్ని సామంతరాజ్యాలే.. అందరూ అనుకుంటున్నట్లు కాకతీయ మహామండలేశ్వరుడు స్వతంత్ర చిన్న చిన్నరాజ్యాలపై యుద్ధం ప్రకటించడంలేదు. తమ రాజ్యానికి సామంతరాజ్యంగా ఉండాలంటూ చిన్నరాజ్యాల రాజులకు ఆహ్వానాలు పంపుతున్నాడు. మరోవైపు తెలుగువారు తమ భాషలో మాట్లాడటం, ఒకరిపై ఒకరికి పెనవేసుకుంటున్న అనుబంధాన్ని అందరూ గుర్తించి మరింత చేరువౌతున్నారు. రాజ్యాలు వేరువేరు పేర్లతో ఉన్నప్పటికి.. రాజ్యాల మధ్య సరిహద్దులు ఉన్నప్పటికి.. భాష వల్ల ఏర్పడుతున్న అనుబంధం.. పెరుగుతున్న సంబంధ బాంధవ్యాలు.. ఉధృత మౌతున్న కంచం పొత్తులు, మంచం పొత్తులు.. అన్ని మిళితమై తెలుగు ఆట, తెలుగు పాట, తెలుగు చిందు.. అన్ని సంగమించి ‘తెలుగు సంస్కృతి’ అనే గొప్ప అంశం ఆకాశమే హద్దుగా ఎదిగిపోతోంది.

– మత్తి భానుమూర్తి

About Author

By editor

Twitter
YOUTUBE