సంపాదకీయం
శాలివాహన 1947 శ్రీ విశ్వావసు పుష్య శుద్ధ విదియ – 22 డిసెంబర్ 2025, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
తమిళనాట ద్రవిడవాద రాజకీయాలు, ముఖ్యంగా డీఎంకే పోకడలలో హిందూ వ్యతిరేకత ఒక పార్శ్వం. జాతీయస్ఫూర్తి పట్టని ధోరణి సుస్పష్టం. తిరుప్పరంకుండ్రం దగ్గర పురాతన సంప్రదాయాన్ని ఆచరించే హక్కు హిందువులకు ఉన్నదని న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు కొందరికి కంటగింపు కావడమే ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అక్కడి సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం వద్ద కార్తికదీపం వెలిగించడానికి మద్రాస్ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం అనుమతించింది. కోర్టు అనుమతి అమలు కాకుండా గూండాగిరికి తీసిపోని విధంగా డీఎంకే ప్రభుత్వం అడ్డగించడం చర్చకు దారి తీయకపోతేనే ఆశ్చర్యం. ఎనిమిది దశాబ్దాల క్రితమే ఆగిపోయినా, తిరుప్పరం కుండ్రంలో దీపం వెలిగించేందుకు హిందువులకున్న ఆ హక్కు సమర్ధనీయమని చెప్పిన న్యాయమూర్తిని అభిశంసించాలని కుప్పిగంతులు వేస్తోంది డీఎంకే ప్రభుత్వం. ఈ వికృత చేష్ట స్వతంత్ర భారతచరిత్రలోనే మొదటిది. డీఎంకేకి ప్రతిపక్షాలు వంతపాడడం హేయమైన అడుగు.
తిరుప్పరంకుండ్రం ఏకశి కొండ. 17వ శతాబ్దంలో ఈ కొండ మీదే సికందర్ బాద్షా దర్గా వచ్చింది. హిందువులకు పరమ పవిత్రమైన క్షేత్రంలో ఇలాంటి ఒక దుండగీడు చిహ్నం మామూలే. ఈ ప్రాంతం మీద హక్కు గురించి 150 ఏళ్ల క్రితమే వివాదం రేగింది. మదురై సబార్డినేట్ న్యాయమూర్తి 1923లో కొండ అంతా, దర్గా ఉన్న ఆ కాస్త స్థలం తప్ప, ఆలయానిదేనని తీర్పు ఇచ్చారు. మెజారిటీ హిందువుల విశ్వాసాలను మన్నించనవసరం లేదన్నదే ఈ దేశంలో బీజేపీయేతర పక్షాల నమ్మకం. కోర్టు తీర్పులయినా అంతే. ఈ హక్కు వివాదాన్ని ఫిబ్రవరి 2025లో కొందరు ముస్లింలు మళ్లీ రేపారు. తిరుప్పరంకుండ్రం పేరునే సికందర్ కొండగా మార్చాలంటూ మళ్లీ తెంపరితనం ప్రదర్శించారు. అందుకే బీజేపీ ‘దక్షిణాది అయోధ్య’ నినాదం అందుకుంది. రామనాథపురం ఎంపీ నవాజ్ కనీ దర్గా దగ్గర మేకను చంపడంతో వివాదం ముదిరింది. గతం నుంచి ఇక్కడ హిందూ ముస్లిం సామరస్యం పొంగిపొర్లుతున్నదంటూ ఇవాళ కూడా పత్రికలు రాస్తున్న దిక్కుమాలిన రాతలలోని అసలు వాస్తవాలు ఇవే.
ఈ నేపథ్యంలోనే కొండమీద ఉన్న దీపస్తంభం మీద ఈ ఏడాది డిసెంబర్ 3న కార్తికదీపం వెలిగించుకోవచ్చునని జస్టిస్ జీఆర్ స్వామినాథన్ ఏకసభ్య ధర్మాసనం డిసెంబర్ 1న తీర్పు చెప్పింది. రవికుమార్ అనే హిందూ హక్కుల కార్యకర్త వేసిన పిటిషన్ మేరకు కోర్టు ఈ తీర్పు వెలువరించింది. అదేమీ దర్గా గౌరవానికీ, ముస్లింల విశ్వాసాలకూ భంగం కాబోదని స్పష్టం చేసింది. సంగం యుగం, అంటే క్రీస్తుపూరం 200 లేదా 300 సంవత్సరం నుంచి వస్తున్న ఆచారమిది. 80 ఏళ్ల క్రితమే దీపథూన్ మీద దీపం వెలిగించే ఆచారం నిలిచిపోతే, మళ్లీ ఇప్పుడు మొదలుపెట్టడం కుదరదంటూ డీఎంకే ప్రభుత్వం 144 సెక్షన్ విధించి, కోర్టు తీర్పును పోలీసు బలగం ప్రయోగించి ఆపేసింది. సీఐఎస్‌ఎఫ్‌ను రంగంలోకి దించాలన్న కోర్టు ఆదేశం కూడా నివ్వెరబోయింది. ఈ తీర్పు ఇచ్చిన ఆ న్యాయమూర్తినే అభిశంసించాలని డీఎంకే ఉవ్విళ్లూరడం వీటికి పరాకాష్ఠ. డిసెంబర్ 9న దాదాపు 100 మంది విపక్ష ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అభిశంసన నోటీసు అందించారు.
జస్టిస్ స్వామినాథన్‌పై అభిశంసన తీర్మానానికి నోటీసుకు ఎలాంటి ఆధారాలు లేవని, ఇది ప్రజాస్వామ్యంలో మూల స్తంభాలైన చట్టవ్యవస్థకు, న్యాయవ్యవస్థకు మధ్య లక్ష్మణ రేఖను దాటడమేనని మద్రాస్ హైకోర్టు సీనియర్ న్యాయవాదులు వాదిస్తున్నారు. అభిశంసనకు నోటీసు ఇవ్వడం అంటే భారత న్యాయవ్యవస్థను అస్తవ్యస్థం చేయడానికి నేరుగా జరుగుతున్న ప్రయత్నమేనని డిసెంబర్ 13న లోక్‌సభ స్పీకర్‌కు సమర్పించిన వినతిపత్రంలో వారు కూడా ఆరోపించారు. జూన్ 2017 నుంచి ఈ నవంబర్ వరకు జస్టిస్ స్వామినాథన్ పరిష్కరించిన 1,26,426 కేసులలో ఆయన నిష్పాక్షిక వైఖరి వెల్లడవుతుందని గుర్తు చేశారు. నోటీసు ఇచ్చిన ఎంపీలకు ప్రజాస్వామ్యంలోని అత్యున్నత విలువల పట్ల గౌరవం లేదని, రాజ్యాంగానికి ఉన్న పవిత్రత మీద విశ్వాసం లేదని వాస్తవమే చెప్పారు. ఆ నోటీసును ఆమోదించరాదని కోరారు. డీఎంకే, ఇతర ఎంపీల ఈ వికృత విన్యాసాన్ని దేశం నలుమూలలకు చెందిన 56 మంది మాజీ న్యాయమూర్తులు కూడా తప్పు పట్టారు. ఇది తమ రాజకీయ అభిప్రాయాలకు అనుగుణంగా లేని, తమ ప్రయోజనాలకు కలసిరాని ‘న్యాయమూర్తులను భయభ్రాంతులను’ చేసే ప్రయత్నమేనని విమర్శించారు. అభిశంసనను రాజకీయ ఆయుధంగా మలుచుకోవాలని చూడడం న్యాయవ్యవస్థ స్వాతంత్య్రాన్ని తక్కువ చేయడమేనని దుయ్యబట్టారు. ఆ తీర్పు విధి నిర్వహణలో భాగమేనని గుర్తు చేశారు.
భారతదేశంలో సెక్యులరిజం పేరుతో జరుగుతున్న దగా ఈ ఉదంతంతో మరొక ఎత్తుకు చేరింది. మైనారిటీల బుజ్జగింపు భరించరాని స్థాయికి వెళ్లింది. శతాబ్దాలనాటి ఆచారాన్ని పునరుద్ధరించుకునే అవకాశం హిందువులకు ఉందని న్యాయస్థానం చెబితే, సెక్యులరిస్టులు మోకాలడ్డుతున్నారు. తీర్పు ఇచ్చిన న్యాయమూర్తిని అభిశంసించాలట. ఇది న్యాయవ్యవస్థ చరిత్రలోనే దిగ్భ్రాంతి కలిగించే పరిణామం, కళంకం. రకరకాల పేర్లతో ఆర్‌ఎస్‌ఎస్‌ను, బీజేపీని అపఖ్యాతి పాల్జేయాలని చూసి, హిందువులలో వస్తున్న కొత్త చైతన్యాన్ని తక్కువ అంచనా వేసి బొక్క బోర్లాపడిన విధ్వంసక పార్టీలు ఇప్పుడు, న్యాయవ్యవస్థకీ, చట్ట నిర్మాణ వ్యవస్థకీ మధ్య అగాధం సృష్టించే పనిని మొదలుపెట్టాయని చెప్పాలి. ఈ దేశంలో హిందూ వ్యతిరేకులకు ఎలాంటి ఉచ్ఛనీచాలు లేవు. తమిళనాడు హిందువులు ఇంకాస్త ఐక్యతను ప్రదర్శించి ఈ బుజ్జగింపు తొత్తులను, జాతి వ్యతిరేకులను వచ్చే ఎన్నికలలో బంగాళాఖాతంలోనికి నెట్టే యత్నం చేయాలి.