సంపాదకీయం
అసతో మా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
శాలివాహన 1947 శ్రీ విశ్వావసు పుష్య బహుళ విదియ, 5 జనవరి 2026, సోమవారం
ప్రతి పౌరుడి హృదయాన్ని సాటి పౌరుల హృదయాలతో తాదాత్మ్యం చెందేటట్టు చేసేదే జాతీయగీతం. అందులో ఉండేవి కొన్ని అక్షరాల కూడికతో వచ్చిన పదబంధాలో, ఆ పదాల అల్లికతో వచ్చిన పంక్తులో అనుకోలేం. అవన్నీ ముక్తకంఠంతో జాతీయ ఆత్మను వినిపిస్తాయి. మట్టి వాసనతో గుబాళిస్తాయి. కేరళలోని అళప్పుజకు చెందిన థెరిసా, ఆగ్నెస్ అనే అక్కాచెల్లెళ్లు సెప్టెంబర్ 21, 2021న ఐక్యరాజ్య సమితి నిర్వహించిన జాతీయగీతాల ఆలాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘జాతికి వందనం’ పేరుతో జరిపిన ఆ కార్యక్రమానికి 193 దేశాల నుంచి గాయనీ గాయకులు ఎంపికయ్యారు. అప్పటికి మెల్‌బోర్న్‌లో ఉంటున్న ఆ ఇద్దరు అమ్మాయిలు మన జాతీయగీతం ఆలపించేందుకు ఎంపికయ్యారు (మాతృభూమి.కామ్.). ఆ సందర్భంగా వారి చెవిన పడిన ఉత్తేజకరమైన మాట గురించి చెప్పారు, తరువాత. అల్జీరియా జాతీయగీతంలో కదిలించే పాదాలు కొన్ని ఉన్నాయి. వాటిని కవి మౌఫ్ది జకారియా వేలు ఖండించి ఆ రక్తంతో రాయవలసి వచ్చిందట. జాతీయగీతాన్ని అంతర్జాతీయ వేదిక మీద వినిపించిన బాలికలు పుట్టిన కేరళలోనే జాతీయగీతంతో ముడిపడి ఉన్న మరొక ఉదంతం జరిగింది.
కేంద్ర ఎన్నికల సంఘంలో నమోదైన మేరకు ఆ పార్టీ పేరు భారత జాతీయ కాంగ్రెస్. డిసెంబర్ 28, 2025న 140వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంది. కేరళలోనూ ఘనంగా జరిపారు. ఖద్దరుధారులైన ఆ పార్టీ నాయకులు జనగణమన అధినాయక జయహే అంటూ జాతీయగీతం పాడేశామని అనుకున్నారు. అయితే ‘జనగణ మంగళదాయక జయహే’ అంటూ పాడి, జాతీయగీతానికి తీరని అపచారం చేశారు. ఒంటి మీదకు కాస్త స్పృహ వచ్చిన తరువాత గాని నేతలు తమ నిర్వాకం గమనించలేకపోయారు. కానీ సామాజిక మాధ్యమాలు సదా చురుకుగానే ఉంటాయి. జాతీయగీతాలాపనలో స్వతంత్రం తెచ్చిన పార్టీ నేతల ప్రతిభను జాతిజనులు చూసి తరించడానికి ఏదీ దాచుకోకుండా వైరల్ చేశాయి.ఇది సాక్షాత్తు ఆ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో జరిగింది. కేంద్ర మాజీమంత్రి ఏకే ఆంటోనీ, వీఎం సుధీరన్, పీసీ విష్ణునాథ్ వంటి ఉద్దండుల సమక్షంలోనే జాతీయగీతం ఇలా ఖూనీ అయింది. అది తప్పని వాళ్లకి తెలియలేదో, లేదంటే ఆ తప్పుడు పాదమే ఒప్పు అని గట్టిగా నమ్మారో ఏమో, అక్కడ నిలబడిన వారు ఎవరూ మాట్లాడలేదు. అది తప్పని చెప్పడమూ కాంగ్రెస్ తరహా క్రమశిక్షణకు వ్యతిరేకమని భావించారేమో కూడా. నిజానికి 2025 కాంగ్రెస్‌కు బాగా గుర్తుండి పోవాలి మరి! సరిగ్గా సంవత్సరం ఆరంభంలో ఒక సందర్భంలో కేరళ కాంగ్రెస్ నేతలంతా ఇలాగే జాతీయగీతాన్ని ఖూనీ చేసిన సంఘటన జరిగింది. మళ్లీ సంవత్సరాంతంలో అదే జరిగింది.
జాతీయగీతాన్ని కూడా మరచిపోయిన కాంగ్రెస్‌కు వ్యవస్థాపక దినోత్సవం జరుపుకునే నైతిక హక్కు ఉందా? అది వారి విజ్ఞతకే వదిలేయాల్సిన ప్రశ్న. నిజానికి కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం పేరుతో సమీక్షించుకోవలసినదే విరివిగా కనిపిస్తుంది. గర్వించదగినదాని కంటే, నాలుక్కరుచుకోవసినవీ, లెంపలు వేసుకోవలసిన పనులే ఎక్కువ ఉంటాయి. ఆ పార్టీ హయాంలో ఆవిష్కరించుకున్న రాజ్యాంగంలోని చాలా అంశాలు నాయకులకు గుర్తు లేనేలేవు. ఇవాళ ఆ పార్టీని ఉద్ధరిస్తున్న కుటుంబం సహా, చాలా మంది నేతలకు సొంత పార్టీ చరిత్ర గుర్తు లేదు. కానీ బీజేపీకి, ఆర్‌ఎస్‌ఎస్‌కు స్వాతంత్య్రోద్యమంతో సంబంధమే లేదంటూ మడతపేచీకి దిగడం రివాజుగా మారింది. డిసెంబర్ 28,1885న భారత జాతీయ కాంగ్రెస్ అలెన్ ఆక్టేవియన్ హ్యూమ్ ప్రారంభించాడు. అతడు ఐర్లెండ్‌కు చెందినవాడు. అదేమిటో, సంపూర్ణ జాతీయవాదులు ఎవరూ అందులో ఇమడలేకపోయారు. అదే ఆ జాతీయత ప్రత్యేకత.
బాలగంగాధర తిలక్‌నూ, లాలా లాజ్‌పతిరాయ్‌నూ, పురుషోత్తమదాస్ టండన్‌నూ, అస్సాం నేత బార్డొలొయ్‌నూ, టంగుటూరినీ, కడు పేదరికంతో కన్నుమూసిన మువ్వన్నెల జెండా సృష్టికర్త పింగళి వెంకయ్యనీ ఏనాడో మరచిపోయింది సంస్థ. నేతాజీ బోస్ వంటి వారిని తప్పక స్మరిస్తున్నది. బ్రిటిష్ జాతి విభజన కుట్ర నుంచి ఈ దేశాన్ని ఐక్యంగా నిలబెట్టడంలో అహరహం శ్రమించిన సర్దార్ పటేల్‌నూ విస్మరించింది. ఇక భగత్‌సింగ్, ఆజాద్, అల్లూరి, బీర్సాముండా వంటి వారు కాంగ్రెస్‌కు అసలే గుర్తుకు రాని జాబితాలోని వారే.
గత చరిత్రనే కాదు, సమీప గతాన్ని కూడా సౌకర్యంగా మరచిపోయే విశేషమైన విద్యను కూడా కాంగ్రెస్ శ్రద్ధతో అభ్యసించింది. కాలం గడుస్తున్న కొద్దీ అందులో చాలా మెలకువలు కూడా ఆకళింపు చేసుకుంటున్నది. ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. ప్రధాని మోదీ ఏలుబడి అత్యవసర పరిస్థితి కాలాన్ని గుర్తుకు తెస్తున్నదని దబాయిస్తూ, తమ పార్టీ హయాంలోనే, ఇందిరా గాంధీ స్వతంత్ర భారతంలో తొలిసారి అత్యవసర పరిస్థితిని విధించిన సంగతిని విస్మరిస్తున్నది. రాజ్యాంగంలోని 370 అధికరణం గురించి ఆ పార్టీ విస్మృతి చరిత్రాత్మకమైనదంటే నమ్మాలి. దీనిని ఏనాటికైనా తొలగించాలని, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇవ్వడం సమాఖ్య స్ఫూర్తికి భంగమని సాక్షాత్తు రాజ్యాంగకర్తలు పేర్కొన్న సంగతినే కాంగ్రెస్ మరచిపోయింది. అందుకే బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన ఆ అధికరణను మళ్లీ ఆవాహన చేస్తామని చెబుతోంది. కాంగ్రెస్ మరపు జాడ్యానికి రుజువుగా తాజాగా మన కళ్ల ముందు కనిపిస్తున్నది ఓటర్ల జాబితాల సవరణపై రగడ. 2002లో కూడా జరిగిన ఓటర్ల జాబితా సవరణ రాజ్యాంగ విరుద్ధమంటూ 140 ఏళ్ల పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్లిందంటే దాని మతిమరుపు ఏ స్థాయిలో ఉన్నదో తెలియడం లేదా? జరిగిన ఘోర తప్పిదానికి ఏ లోకాన ఉన్నా గాని విశ్వకవి రవీంద్రుడు క్షమిస్తారని ఆశిద్దాం.