సంపాదకీయం

శాలివాహన 1947 శ్రీ విశ్వావసు మార్గశిర బహుళ ఏకాదశి, 15 నవంబర్‌ 2025, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


దాదాపు ఎనిమిది శతాబ్దాల తరువాత ఆత్మ విస్మృతి నుంచి విముక్తమవ్వాలని ప్రగాఢంగా వాంఛించిన జాతి ఎత్తిన గళంలో నినాదమై ప్రతిధ్వనించినదే- ‘వందే మాతరం’. ఆ గీతం అక్షరబద్ధమై ఈ సంవత్సరానికి 150 ఏళ్లు. ఇంతకు మించిన గొప్ప సందర్భం భారతీయులకు ఏం ఉంటుంది? అందుకే ఈ మహోన్నత సందర్భాన్ని పురస్కరించుకుని పార్లమెంట్‌ ‌ప్రత్యేక చర్చను చేపట్టింది. ఆ గీతం నూరేళ్ల సందర్భం (1975) అత్యవసర పరిస్థితి వంటి చీకటి యుగంలో కొట్టుకు పోయింది. రాజ్యాంగ పరిషత్‌ ‌నిరాకరించిన పదాలను రాజ్యాంగంలో జొప్పించ డంలో నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం చూపిన శ్రద్ధ ‘వందేమాతర•’ గీతం వందేళ్ల సందర్భాన్ని నిర్వహించుకోవడం, స్మరించుకోవడం మీద చూపలేక పోయింది. ఆ పని ఈ డిసెంబర్‌ 8‌న ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలో జరిగింది. దేశమంతా ఉత్సవాలు జరపడంతో పాటు, పార్లమెంట్‌లో ప్రత్యేక చర్చకు కూడా నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆ మహోన్నత గీతం స్వాతంత్య్ర సమరానికి ఇచ్చిన ప్రేరణతో పాటు, మరుగున పడిన చాలా చారిత్రక అంశాలను మరొకసారి జాతి గుర్తు చేసుకునే అవకాశం ఆ పది గంటల చర్చా సమయం ఇచ్చింది. ఈ కోణంలో ప్రధాని మోదీ ఉద్విగ్న భరిత ప్రసంగం తన వంతు పాత్రను నిర్వహించింది.

ఆ గీతం జన్మించింది బెంగాల్‌లో. భారత జాతీయ కాంగ్రెస్‌ ‌తొలిసారిగా ఆలపించినది కలకత్తా (నేటి కోల్‌కతా)లోనే. అది కూడా విశ్వకవి రవీంద్రుడి గళం ద్వారా తొలిసారి 1896లో భారతావనికి వినిపించింది. ఆరు చరణాలలో రెండింటిని కోల్పోయినది కూడా 1937,అక్టోబర్‌లో కలకత్తాలోనే జరిగిన కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ సమావేశంలోనే. ఆ సమావేశాలకు అధ్యక్షుడు జవాహర్‌లాల్‌ ‌నెహ్రూ. 1906లో బెంగాల్‌ ‌ప్రాంతంలోని బారిసాల్‌లో వందేమాతరం బ్యాడ్జీలు పెట్టుకున్న కాంగ్రెస్‌ ‌నాయకులను పోలీసులు చావగొట్టారు. పోలీసుల లాఠీచార్జిలో దెబ్బలు తింటున్నవారు ‘వందేమాతరం’ అనే నినదించారు. కానీ జాతి మొత్తాన్ని అంత బలంగా ప్రభావితం చేసిన ఆ గేయంలో అంతిమంగా రెండు చరణాల తొలగింపు ముస్లింలీగ్‌, ‌దాని నాయకుడు మహమ్మద్‌ అలీ జిన్నా ఒత్తిడి, వేర్పాటువాద రాజకీయాలతోనే జరిగిందని, వాటికి నెహ్రూ తలొగ్గారని మోదీ ఆరోపించడం చరిత్రకు దర్పణం పట్టేదే.

వాస్తవాలను చూసీచూడనట్టు వదిలివేయడం, వాటిలోని ప్రమాద సంకేతాలను ఏవో ప్రయోజనాలను ఆశించి నిరాకరించడం (నెగేషనిజం) భారత జాతీయ కాంగ్రెస్‌లో ఆది నుంచి ఉంది. దేశాన్ని రెండు ముక్కలు చేసినది కూడా ఆ నెగేషనిజమే. స్వరాజ్య సమరంలో ముస్లింలను భాగం చేయాలన్న పేరుతో వారి ప్రతి చర్యను నాడు కాంగ్రెస్‌ ‌సమర్ధించింది. అందులో వందేమాతర గీతం పట్ల క్రమంగా వారు పెంచుకున్న ద్వేషభావం ఒకటి. భారత ప్రజానీకం 150 ఏళ్ల నుంచి వందేమాతరాన్ని ఆదరిస్తున్నారు. వేర్పాటువాద ముస్లిం శక్తులు 120 ఏళ్ల నుంచి వ్యతిరేకిస్తున్నాయి. 1905 నాటి బెంగాల్‌ ‌విభజన వ్యతిరేకోద్యమం నడిచినదే వందేమాతరం నినాదంతో. స్వదేశీ ఉద్యమానికి ఊపిరి కూడా ఆ గేయమే. 1875లో వేరే సందర్భంలో రాసుకున్న ఆ గేయాన్ని బంకించంద్ర చటర్జీ తన నవల ఆనందమఠ్‌లో చేర్చారు. ఒక వెన్నెల రాత్రి గుర్రాల మీద వెళుతూ ఉద్యమకారులు ఈ పాట పాడుకుంటారు. రవీంద్రుని తరువాత తరువాత ఎందరో ఈ గీతం పాడారు.

ముస్లింలంతా మూకుమ్మడిగా వందేమాతరాన్ని నిరాకరించలేదు. స్వాతంత్య్రోద్యమం అన్ని దశలలోను ఆ వ్యతిరేకత లేదు. ఉదాహరణకు జిన్నా. ఆయన 1904లో గోపాలకృష్ణ గోఖలే ప్రోద్బలంతో జాతీయ కాంగ్రెస్‌లోనే పనిచేశారు. జిన్నా ముస్లింలీగ్‌లో చేరడం కూడా గోఖలే సూచనతోనే. ఆఖరికి 1921 నుంచి కాంగ్రెస్‌కు జిన్నా దూరమయ్యే క్రమం ప్రారంభమయింది. మరి ఇంతకాలం ఆయన వందేమాతర గీతాన్ని ఆమోదించకుండానే, చెవులలో పడకుండానే కాంగ్రెస్‌లో కొనసాగారా? చరిత్ర తవ్వేకొద్దీ కొత్త విషయాలు బయటపడతాయి. జాతీయ కాంగ్రెస్‌ ‌సమావేశాలు వేదమంత్రోచ్ఛాటనతో, వందేమాతరంతోనే మొదలయ్యేవి. జనవరి 24,1920లో మీరట్‌లో జరిగిన ఖిలాఫత్‌ ‌సభలో నలుగురు బెంగాలీలు వందేమాతరం గీతం పాడారు. ఇది సీఐడీ నివేదికలోనే ఉంది. 1937 నాటికి అసలు వందేమాతరమే వద్దన్న స్ధితికి జిన్నా వచ్చారు. 1936 నాటి ఎన్నికలలో కాంగ్రెస్‌ ‌వైఖరి అందుకు దోహదం చేసింది.

భారతదేశాన్ని చూసుకుని గర్వించేవారూ, భారత స్వాతంత్య్ర పోరాటాన్ని గౌరవించేవారూ, కులమతాలతో పనిలేకుండా తాము భారతీయులమని నమ్మేవారూ వందేమాతరం నినాదాన్ని నిరాకరించలేరు. కాబట్టే ఆ అద్భుత గీతం 150 ఏళ్లుగా మనకు ప్రేరణ ఇస్తూనే ఉంది.

ఇంత జరిగిన తరువాత ఒక ప్రశ్న వేసుకోక తప్పదు. వందేమాతర గేయం దేశాన్ని దేవతగా చిత్రిస్తుంది కాబట్టి, విగ్రహారాధనకు ఇస్లాం అనుమతించదు కాబట్టి ముస్లింలక• విరుద్ధమని ఆ వర్గం గడచిన వందేళ్లుగా చెబుతున్నది. వారికి అభ్యంతరకరంగా ఉన్నాయని మొదటి నుంచి వాదిస్తున్న ఆ రెండు చరణాలను భారత జాతీయ కాంగ్రెస్‌ ఏనాడో తొలగించింది. అయినా ఆ గేయం పాడడానికి ఇంత రాద్ధాంతం ఎందుకు? మిగిలిన చరణాలతో వచ్చిన అభ్యంతరం ఏమీ లేదని కొందరు ముస్లింలు కూడా 1930 దశకంలోనే స్పష్టం చేశారని పరిశోధనలు చెబుతున్నాయి. అయినా ఇప్పుడు ఎందుకీ మొండిపట్టు. మెజారిటీ ప్రజల విశ్వాసం పట్ల ఇంత చులకన భావమెందుకు? మధ్య యుగాల నాటి ముస్లింల మనస్తత్త్వాన్ని ప్రదర్శించడం ఎందుకు? స్వాతంత్య్రోద్యమానికి దివిటీలా పనిచేసిన ఆ గీతం పాడబోమని అరచి చెప్పడం ఏమిటి? రాజ్యాంగ పరిషత్‌ ఆమోదించిన జాతీయగీతాన్ని నిరాకరిస్తున్నామని చెప్పడం ఎలాంటి రాజ్య విధేయత?

About Author

By editor

Twitter
YOUTUBE