డిసెంబర్‌ 16‌న ధనుర్మాసం ఆరంభం‌

సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించిన నాటి నుంచి నెలరోజుల కాలం ధనుర్మాసం అన్నారు గీతాచార్యుడు. మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః’.  ‘మార్గం’ అంటే ఉపాయం/దారి .‘శీర్షం’ అంటే శిరస్సు. మానవ శరీరానికి తల దిశానిర్దేశం చేసినట్లే మార్గశీర్ష మాసం ఆధ్యాత్మికత వైపు దారి చూపుతుందని చెబుతారు. మార్గశీర్షం అంటే భగవత్‌ ‌ప్రాప్తిని కలిగించే శ్రేష్ఠమైన మార్గమని పూర్వాచార్యులు నిర్వచించారు. ‘ధనువు’ అంటే యోగశాస్త్ర పరిభాషలో ‘వెన్నెముక’అని అర్థం. అంటే ఇది ఒక యోగ సాధన. ధ్యానమే ధనుర్మాస వ్రతం.

స్వకల్యాణాభిలాషతో పాటు లోక శ్రేయస్సును కాక్షించిన గోదాదేవి తమ ఆరాధ్య దైవం శ్రీకృష్ణుడిని ప్రసన్నం చేసుకునేందుకు ధనుర్మాసం వ్రతం చేపట్టి రోజుకొకటి కీర్తన చొప్పున (తమిళంలో పాశురం) మాసం పాటు ముప్పయ్‌ ‌కీర్తనలు ఆలపించడం ప్రత్యేకత. ఈ పాశురాలు ‘తిరుప్పావై’గా ప్రసిద్ధి. ‘తిరు’ అంటే శ్రీ, శ్రీప్రదం, లక్ష్మి, సంపద, శ్రేష్ఠం, ఐశ్వర్యం, మోక్షం అనే అర్థాలు ఉన్నాయి. ‘పావై’ అంటే పాట(లు)లేక వ్రతమని అర్థం. ‘తిరుప్పావై’ దివ్యప్రబంధంగా శిఖరాయమానంగా వెలుగొందు తోంది. గోదాదేవి నోట సర్వ సులభరీతిలో వెలువడిన తిరుప్పావై ఉపనిషత్తుల సారమని పూర్వాచార్యులు అభివర్ణించారు. ద్వాపరంలో శ్రీకృష్ణుడిని పతిగా పొందాలన్న అభిలాషతో గోపికలు మార్గశిర మాసంలో కాత్యాయనీ వ్రతం ఆచరించినట్లే, గోదాదేవి తనను తాను గోపికగా భావించుకొని ధనుర్మాసంలో మార్గళి వ్రతాన్ని అచరించారు.

 దీనినే శ్రీ వ్రతం, ధనుర్మాస వ్రతం అనీ అంటారు. ఈ తిరుప్పావు వ్రతమే తెలుగు ప్రాంతాలలో ‘గొబ్బిళ్లు’గా రూపాంతరం చెంది, కన్యలు వేకువ జామునే వాటిని పెట్టి వ్రతమాచరి స్తారని విఖ్యాత సాహితీవేత్త వేటూరి ప్రభాకర శాస్త్రి పేర్కొన్నారు. ఈ వ్రతాన్ని ‘మేలినోము’, ‘సిరినోము’, ‘సువ్రతం’ అనీ తెనిగించారు.

తమిళదేశంలోని శ్రీవిల్లిపుత్తూరులో తులసివనంలో ఉద్భవించి, పెరియాళ్లార్‌ అనే విష్ణు చిత్తుని పాలనలో పెరిగిన గోదాదేవిని మధురభక్తికి ప్రతీకగా చెబుతారు. లోకంలో స్త్రీ పురుషుల మధ్య ప్రేమ లౌకికం కాగా, భగవంతుడికి భక్తుడికి మధ్య గల ప్రేమ అలౌకికం. అదే మధురభక్తి. ఆ మార్గంలో భగవంతుడిని సేవించి తరించిన వనితగా ఆమె మన్ననలు అందుకుంటున్నారు.

 శ్రీరంగనాథుడి సేవ కోసం పెరియాళ్వార్‌ అల్లిన పూమాలలను గోదాదేవి రహస్యంగా ధరించి బావిలోని నీటిలో ప్రతిబింబాన్ని చూసి మురిసి పోయేదట. స్వామి వారి కైంకర్యానికి ఉద్దేశించిన పూమాలలను తొలుత తాను ధరించి, వాటిని స్వామి వారికి పంపడం వల్ల ఆమెకు ‘శూడికొడుత్త నాచ్చియార్‌, ఆముక్తమాల్యద’ అనే పేర్లు వచ్చాయి. ఆమె వైఖరి తెలియని పెరియాళ్వార్‌ ఆమె ‘ధరించి విడిచిన మాలలనే స్వామికి సమర్పించేవారు. ఒకనాడు పూమాలలో శిరోజాన్ని తన కూతురిదిగా గ్రహించి, స్వామి పట్ల అపచారానికి కలత చెందారు. ఆ రోజుకు ఆయానికి మాలలు పంపకపోవడంతో, ఆ రాత్రి స్వప్న సాక్షాత్కారం చేసిన రంగనాథుడు ‘గోదా ధరించిన మాలలే నాకు ఇష్టం. ఆమెను పరిణయమాడతాను’ అని సూచించాడని పురాణ కథనం. పాండ్యరాజుకు కలలో కనిపి•ంచి, ‘గోదాదేవి ఆయానికి చేరేలా పల్లకి పంపవలసిందిగా ఆదేశించాడు. ఆలయం చేరుకున్న ఆమె పరిణయం తరువాత స్వామిలో ఐక్యమైంది. ‘రంగనాయకి’గా ఆరాధనీయ అయ్యింది.

గోదాదేవి సాక్షాత్తు లక్ష్మీదేవియని, ఆమె గానం చేసిన ‘తిరుప్పావై’ సర్వవేద సారమని, మానవులంతా తమను తాము గోపీకలుగా భావించి, శ్రీ కృష్ణుడిని అర్చిస్తే సర్వశుభాలు కలుగుతాయని విశిష్టాద్వైత ప్రవర్థకులు రామానుజాచార్యులు పేర్కొన్నారు. దానిని విశిష్టతను లోకానికి వెల్లడించినందుకే ఆయనకు ‘తిరుప్పావై జీయర్‌’ అనే ఖ్యాతి కలిగింది.

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ ధనుర్మాసంలో సుప్రభాతానికి బదులు తిరుప్పావైని గానం చేస్తారు. ఈ మాసంలో తిరుమలేశుని శ్రీకృష్ణుడిగా, ఆయన వక్షస్థలంలోని అమ్మవారిని గోదాదేవిగా భావించి రోజుకొక్క పాశురం వినిపిస్తారు. శ్రీనివాసుడు తమ బ్రహ్మోత్సవాలలో శ్రీవిల్లిపుత్తూరు నుంచి ప్రత్యేకంగా వచ్చే పూలమాలలు ధరిస్తాడు. ఈ మాసంలో వేంకటేశ్వరుడిని తులసీ దళాలకు బదులుగా బిల్వపత్రాలతో అర్చిస్తారు. రామానుజాచార్యులు ఈ కట్టడి చేశారని వేంకటాచల మహాత్మ్యం స్థలపురాణం పేర్కొంటోంది.

ఆధ్యాత్మిక భావనను పెంపొందించుకుంటూ స్వకార్యంతో పాటు లోకహితాన్నీ కాంక్షించడం గోదాదేవి రచనల్లోనూ, ఆమె జీవన శైలిలోనూ వెల్లడవుతుంది. వివిధ జాతుల పూలతో అందమైన మాలలు అల్లినట్లే, వివిధ వర్గాలకు చెందిన భిన్న ప్రవృత్తులు గల యువతులను సమీకరించి శ్రీవ్రతానికి శ్రీకారం చుట్టింది. ఈ తిరుప్పావై పాశురాలు కేవలం ఆధ్యాత్మికపరమైనవే కాదు. సామాజిక అంశాలూ ఇమిడి ఉన్నాయి. భగవదారాధనతో పాటు మంచి అలవాట్లతో మనుగడ సాగించాలని, తోటివారికి సాయపడాలని ఈ పాశురాలు ప్రబోధిస్తాయి. వీటిలో పరమాత్ముని వైభవం, ఆయనను చేరేందుకు అనుసరించవలసిన మార్గాలు, ప్రకృతి వర్ణనలు ఉంటాయి. ‘ఏడాదికి మూడు పంటలు పండాలి. చాలినంత వర్షం కురవాలి. గోవులు సమృద్ధిగా పాలు ఇవ్వాలి. ఏ సందర్భంలోనూ ‘లేదు’ అనే మాట విని పించకూడదు’ అని ఒక పాశురంలో ఆకాంక్షించడం గోదామాత లోక క•ల్యాణాభిలాషకు ఉదాహరణ.

డా।। ఆరవల్లి జగన్నాథస్వామి

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE