తొలిగా నృత్యప్రదర్శన ఇచ్చినపుడు ఆమెకు 17 ఏళ్లు. మరో మూడేళ్లకే అంతర్జాతీయ స్థాయి గుర్తింపు. దేశీయ సంస్కృతి పరివ్యాప్తికి ‘నృత్య కౌస్తుభ’ను స్థాపించారు.
కాలక్రమంలో ‘విశ్వమోహిని’ అనిపించుకున్నారు. పద్మవిభూషణ అయ్యారు. స్వర్ణకమలం అందుకొన్నారు. తమిళ, కన్నడ, ఒడిస్స భాషాభిమానులకు అభిమాన పాత్రులయ్యారు. ఇది ఆమె 85వ జయంతి ఉత్సవ సందర్భం.
తన పేరు యామినీ కృష్ణమూర్తి. సొంత ఊరు చిత్తూరు ప్రాంత మదనపల్లి. మరింత విశేషం ఒక బెంగాలీ చిత్రంలో తన పాత్ర పోషణ తానే చేయడం! నర్తన కళనీ జీవిత భాగస్వామిగా భావించడం!!
యామిని పుట్టిన తేదీ డిసెంబర్ ఇరవై.
‘కృష్ణమూర్తి’ తండ్రిపేరు.
తండ్రి, తాత భాషావేత్తలు. ఒకరు సంస్కృతంలో. ఒకరు ఉర్దూలో.
ఇంట్లో ఎప్పుడూ సాహిత్య, సంగీత, నృత్య చర్చలే! అంతా సమలంకృతం.
కుటుంబ పరిస్థితులు ఆమె మకాం మారేలా చేశాయి. తెలుగు నాట నుంచి తమిళనాడుకు వెళ్లింది కుటుంబమంతా. అది చిదంబరం ప్రాంతం.
నటరాజ స్థలం. చిదంబరం అంటేనే పరమశివుడు నర్తించిన ప్రదేశమని భావం. ఆయనది ఆనంద తాండవం. (స్వామి నృత్యభంగిమ చిదంబర ప్రాంత ఆలయంలో ఇప్పటికీ కనువిందు చేస్తూనే ఉంది). వేదికమీద కొలువైన ఆ దేవదేవుడి సందర్శనం బాల యామిని మదిలో చెదరని ముద్ర వేసింది. నాట్యం నేర్చుకోవాలన్న అభిలాష విస్తరించిందీ అప్పుడే.
భరతనాట్యం, కూచిపూడి.
భరతముని రూపుదిద్దిన శాస్త్రీయ నృత్యరీతి ఒకటైతే, సిద్దేంద్రయోగి దిద్ది తీర్చిన విశిష్ట పక్రియ మరొకటి. ఈ రెండూ భారతీయ కళారంగ కీర్తి కిరీటాలు.
నర్తనకు ఆలంబన సంగీత సాధన. అందుకే ‘కర్ణాటక’ వైపు చూపు సారించారు యామిని. దక్షిణాదిన ప్రశస్తం, గాత్ర ప్రాధాన్యం కర్ణాట. స్వరరాగ తాళ సమన్వితం. ఇందులోని ‘శ్రుతి’ ధ్వని విశిష్టం. గీతశ్రుతుల పరంగా ప్రత్యేకించి ప్రభావతి, కాంత, ధీర రూపాలు ఆమెను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
పరిపూర్ణ కళాభిరుచితో ‘పూర్ణతిలకం’ అనిపించుకున్నారు. యామిని నాట్య కళను నేర్చుకుంది రుక్మిణీదేవి అరండేల్ కళాక్షేత్రంలో! చెన్నైలో ‘కళాక్షేత్ర’ నర్తన విద్యాలయ వ్యవస్థాపకురాలిగా రుక్మిణికి అనంత ఖ్యాతి.
గమనార్హ అంశం ఏమిటంటే గురు శిష్యులైన రుక్మిణీదేవి, యామిని జీవితకాలం దరిదాపు ఒకటే.
భరతనాట్యానికి సంబంధించి, శిక్షకుల్లో బాలసరస్వతి, మైలాపూర్ గౌరి అమ్మ ఉన్నారు. అభినయం చేస్తూనే, తన గీతాన్ని తానే పాడుకున్న ప్రజ్ఞానిధి గౌరి అమ్మ. ‘నృత్యకళానిధి’ బిరుదాంకిత.
ఇక కూచిపూడిని అభ్యసించింది వేదాంతం, పసుమర్తివంటి విఖ్యాతుల సన్నిధానంలో.
మరో నృత్య పక్రియలోనూ మేటితనం సంపాదించారు యామిని. ఒడిస్సీ నాట్యం. భారతీయ శాస్త్రీయ నృత్యరీతుల్లో ప్రఖ్యాతం (ఈ రీతి నర్తన శిల్పరూపాలు కోణార్క ఆలయంలో నేటికీ దర్శనమిస్తున్నాయి). మంగళాచరణంతో కూడిన సంప్రదాయ విధానమే ఒడిస్సీ. ఇందులో ఆమెకు గురువు కేలూచరణ్ మహాపాత్ర. మరొక శిక్షకులు పంకజచరణ్‌దాస్. ఒడిశా నుంచి పద్మవిభూషణులైన మొదటి కళావేత్త కేలూచరణ్. ఒడిస్సీ నృత్య పితామహ చరణ్‌దాస్.
వీణావాదనంలోనూ మేటి శిక్షణ అందుకున్నారు యామినీ కృష్ణమూర్తి. కల్పకం స్వామినాథన్ వద్ద శిష్యరికం చేశారు. ఆవిడ కర్ణాటక వీణా విద్వాంసురాలిగా కీర్తి గడించినవారు. భారత రాష్ట్రపతి చేతులమీదుగా అప్పట్లో సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని అందుకున్న నిపుణురాలు. అంతటి కల్పకం సమక్షాన వాద్య సంగీత అభ్యాసం చేసిన భాగ్యశీలి యామిని.
పలువురు గురుమూర్తులు. అనేక విధాల కళారీతులు. ఎందరి నుంచి ఎన్ని నేర్చినా, తనదైన ప్రత్యేకత కోసమే పరితపించారామె.
ఆ విభిన్నతను నిరూపించే నిదర్శనాలు ఎన్నో. ప్రధానంగా పరిగణించాల్సింది క్షీరసాగర మథనంలోని విశ్వమోహిని పాత్ర పోషణనే! ఆ నృత్యరూపక కర్త దేవులపల్లివారు. రచన చేసింది ఆనాడు ఆకాశవాణి కోసం. ఆధ్యాత్మికత, సామాజికత కలగలసిన రూపచిత్రణం అది. ఆ రూపకంలో ప్రముఖపాత్ర యామినిదే. శ్రీమహావిష్ణువు అవతార ఫలితం. సాగరమథనంతో వెలువడిన అమృతాన్ని దేవదానవులకు పంచిన విధం. వారిని రెండు పంక్తులుగా కూర్చోబెట్టి, కలశాన్ని చేతబట్టి, అందించిన తీరును వేదికమీద చూసి తరించాల్సిందే!
అప్పటినుంచీ యామిని విశ్వమోహిని అయ్యారు. అలనాడు రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ సమక్షంలో అదే నృత్య నాటికను ప్రదర్శించి, భామావేణి బిరుదాన్ని అందుకున్నారామె.
మరొక ఉదాహరణం భామాకలాపం. అందులో సత్యభామాదేవి. ఆ సుప్రసిద్ద కూచిపూడి రూపకంలో సత్యాకృష్ణుల సరసకలాపం ఆపాత మధురం. ఇక్కడ కలాపం అంటే ఆసక్తిదాయక సంభాషణం.
మాట మీరగడా, నే గీచిన గీటుదాటగలడా… అని సత్యాదేవి.
‘మీరజాలగలడా నా ఆనతి… సత్యావతి’ అనే దృఢ విశ్వాసం.
‘ఆ నటన సూత్రధారీ’ అంటూ భావనావిష్కరణం.
వీటన్నింటినీ ప్రదర్శించడంలో యామిని ప్రజ్ఞాపాటవాలు అనితర సాధ్యాలు. రసాభినయంలో ఆమె ఒడుపు అసంఖ్యాక కళాభిమానుల్ని ముగ్ధుల్ని చేసేది. కళ్లార్పకుండా చూసేలా ఉండది ఆ పటిమ.
‘కృష్ణశబ్దం’ రూపకంలో సైతం లలిత, గంభీర భావాలను అభినయించి ఎందరెందరినో ఆశ్చర్యచకితులను చేసిన ఘనత ఆమెది.
శాస్త్రీయతను జోడించి, సమరసతను మేళవించి, భిన్నవిభిన్న రీతుల్లో యామిని ఇచ్చిన నృత్యప్రదర్శనలు వేటికి అవే విలక్షణం.
దేశ విదేశాల్లో పర్యటించారు. చూడని ప్రాంతం లేదు. అందుకోని సత్కారం లేదు. అమెరికా, ఐరోపాలో ఖండాంతర పర్యటనలు అనేకం. ఎక్కడ ఏ దేశానికి వెళ్లినా, భారతీయ సంప్రదాయ నృత్యరీతులకే పెద్దపీట వేసిన నర్తకీమణి. ప్రతీ ప్రదర్శనలోనూ తనదైన ధోరణిని చాటిచెప్పిన విదుషీమణి యామిని.
భాష, భావం మధ్య సమతుల్యతకు మొదటి ప్రాధాన్యం ఇచ్చేవారు.
‘ఏ కళ అయినా ప్రజలకోసమే. కళాభిమానుల గురించే నా ఆలోచనలన్నీ. ఏ ఊళ్లో ఏ కార్యక్రమం చేపట్టినా, ముందుగా నృత్య అంశ కథాక్రమాన్ని వివరిస్తాను. పురాణ, చారిత్రక, సామాజిక, సాంస్కృతిక నేపథ్యాన్ని విపులీకరిస్తాను. అందువల్ల, నా ప్రదర్శన పూర్వాపరాల మీద వీక్షకులకు ముందుగానే ఒక అవగాహన కలుగుతుంది. ఆ క్రమంలో వారంతా ప్రదర్శన అంశంతో మమేకమవుతారు. వేదికమీది హావభావాలతో పరిపూర్తిగా అనుసంధానమవుతారు. ఏ కళాకారులైనా మొద• చేయాల్సింది అటువంటి సంసిద్ధతా ప్రయత్నమే’ అని ఒక ముఖాముఖిలో ప్రస్ఫుటం చేశారామె.
ఎటువంటి కళాపక్రియనైనా వర్తమాన స్థితిగతులకు అనువుగా మలుచుకోవాలన్నది ఆమె స్థిర అభిప్రాయం. రచనా సంవిధానానికి, నర్తన విధానానికి సమ ప్రాధాన్యం ఇవ్వాలన్నది తన కృత నిశ్చయం. ఇందుకు అనుగుణంగానే, ప్రదర్శనలను నిర్వహించేవారు.
కేంద్ర / రాష్ట్ర సంగీత నాటక అకాడమీలు ఏర్పాటుచేసే నాట్య ప్రదర్శనల గురించి అమూల్య భావాలెన్నింటినో ఆమె వ్యక్తీకరించారు. నర్తకులకు ఆహ్వానం మొదలు ప్రదర్శన ముగిసేవరకు ఉండాల్సిన నిబద్ధతను సోదాహరణంగా విశదీకరించేవారు. కళను గౌరవించడం, ప్రజల్లో విస్తరింపజేయడం అకాడమీల మొదటి బాధ్యత. అనుగుణంగా వ్యవహరించి కళాభ్యుదయాన్ని సాధించడం నాట్యకారుల విధి అని కర్తవ్యప్రబోధం చేశారు ఆమె. ప్రాంతం, భాషలకు అతీతంగా నృత్య కార్యక్రమాల రూపకల్పనను ఎంతో ప్రోత్సహించిన ఘనురాలు.
తిరుమల-తిరుపతి దేవస్థానం ఆస్థాన నర్తకిగా ఉన్నారు. ఆలయ కార్యక్రమాల్లో సంప్రదాయ నృత్యరీతుల సమధిక ప్రోత్సాహానికి అన్ని విధాలా దోహదమయ్యారు. నాట్య విశిష్టతలను తేటతెల్లంచేస్తూ, తన ప్రస్థాన రీతులను అవలోకిస్తూ, పుస్తకాన్ని రచించి కళాప్రియులకు అంకితం చేసిన సార్థక జీవని యామిని.
ప్రతీ పక్రియా కళాత్మకం, సృజన పూరితం. అందుకే ఔత్సాహిక యువతను మరెంతో ప్రోత్సహించాలని ప్రభుతకు ఆమె విజ్ఞాపనలు సమర్పించారు. నాట్యకళాభివృద్ధికి సూచనలెన్నింటినో ప్రతిపాదించారు.
‘సంగీత, నృత్యకళలకు ప్రస్తుత విద్యాబోధనలో ఉన్న ప్రాధాన్యం ఎంత? పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళలను చూడండి. అక్కడ కళలకు విద్యలో ఎంతో ప్రాముఖ్యమిస్తున్నారు. మరి తెలుగునాట వర్తమాన స్థితిని ఒక్కసారి గమనించండి. ఇక్కడ ఇతర ప్రాంతాలమాదిరి ఉత్సాహ ప్రోత్సాహాలున్నాయా?’ – ఇది దశాబ్దాల క్రితమే ఒక కార్యక్రమ వేదిక నుంచి యామిని వేసిన ప్రశ్న. జవాబు ఏమిటన్నది ప్రభుత్వాలకే తెలియాలి.
సృజనకు ప్రోత్సాహం తోడైతేనే కళకు రాణింపు. అందునా నృత్యరంగపరంగా యువకళాకారులను ఎంత ముందుకు తెస్తే, అంతటి సామాజిక వికాసం సాధ్యపడుతుంది. ఏ ఉద్యోగంచేసినా / వ్యాపారం చేపట్టినా / ఎవరు ఏ వృత్తిలో ఉంటున్నా ఆ అందరినీ ప్రభావితం చేసేది కళారంగమే! ఆ కారణంగానే ప్రభుత్వాలు / స్వచ్ఛంద కళాసేవ సంస్థలు విస్తృత కార్యాచరణకు సిద్ధం కావాలంటూ గతంలోనే ఆమె ‘నృత్యమూర్తి’ పేరిట ధారావాహికకు రూపకల్పన చేసి, దూరదర్శన్‌లో వరస ప్రసారాలు చేశారు కూడా. శాస్త్రీయ సృజన అంశాలన్నింటినీ సదవగాహన చేసుకునేలా యువతకు మార్గదర్శినిగా నిలిచారు. ఆమె వెళ్లిపోయి పలు నెలలు గడిచిపోయాయి. ఆ జ్ఞాపకాలన్నీ అందరి హృదయాల్లో పదిలంగానే ఉన్నాయి. బిరుదుకు తగినట్లు యామినీ కృష్ణమూర్తి – నాట్య విద్యాభారతి. భారతీయతను విశ్వవ్యాప్తం చేసిన ఆ నర్తకికి ఇదే అక్షర హారతి!
జంధ్యాల శరత్‌బాబు
సీనియర్ జర్నలిస్ట్