భాగం-14

మార్కస్ ‌సిద్ధాంతాన్ని గతితార్కిక భౌతికవాదం అని పిలుస్తారు. శ్రీకరపాత్రీ స్వామి మార్కస్ ‌కంటే ముందున్న పాశ్చాత్యులు చెప్పిన భౌతికవాదాన్ని, గతివాదాన్ని, వారి తర్క పద్ధతులలోని లోటుపాట్లను మన భారతీయ వేదాంతశాస్త్రం ఆధారంగా నిరూపించారు. అటు తర్వాత మార్కస్ ‌గురువు హెగెల్‌ ‌సిద్ధాం తాన్ని గురించి ఇలా చెప్పారు…

హెగెల్‌ (1770-1831) ‌దృష్టిలో జగత్‌ ‌స్రష్ట (జగత్తును రూపొందించినవాడు) మనసే. కాంట్‌ ‌చెప్పిన ద్వైతభావనను అతడు ఖండిం చాడు. స్పినోజ్‌ ‌లాగే హెగెల్‌ ‌కూడా ఆత్మ అనేది మనసు- పంచ భూతాలతో అభిన్నమైనది అని అంగీకరించాడు. అంటే ఆత్మకంటే వేరుకానిది మనసు… మనసు కంటే వేరు కానివి పంచ భూతాలు. హెగెల్‌ అభిప్రాయంలో, ‘పూర్ణతత్త్వమే అంతటా నిండి ఉంది. దృశ్యమానమైన జగత్తు ఆ పరిపూర్ణతలో భాగమే.’ హెగెల్‌ ‌తాత్త్విక చింతన మన అద్వైతానికి దగ్గరగా ఉంటుంది. వేదాంతంలో బ్రహ్మము అఖండ బోధా స్వరూపంగా ఉంటుంది. ఈ విశ్వం కంటే ముందుగా మనస్సు రూపొందుతుంది.

స్వయం ప్రకాశశక్తి కలిగిన బ్రహ్మాత్మను గురించి మననం చేసి, ధారణ చేయగలిగితే మనస్సు బ్రహ్మముగా మారుతుంది. ఏ వస్తువు అయినా మనకు వ్యావృత్తి రూపంలో లభిస్తుంది అని వేదాంతం మనకు చెబుతోంది. తనకంటే భిన్నమైన సమస్త వస్తువులయందు నిరూపితమైన భేదమందు యుక్తులం కావడం ద్వారా వస్తుబోధ జరుగుతుంది. అల్పజ్ఞునికి సంపూర్ణ పదార్థాలను గురించిన బోధ కలిగే అవకాశం లేదు. పదార్థాన్ని నిరూపించే భేదాన్ని గురించిన జ్ఞానం కూడా లభించదు. ప్రకృతిలో సర్వవస్తువులనూ భిన్నరూపాలలో దర్శించినంత మాత్రాన పదార్థాన్ని తెలుసుకోవడం సాధ్యం కాదు.

హెగెల్‌ అం‌తర్విరోధం లేదా ద్వంద్వమానాన్ని గురించి చెప్పాడు. అందులో క్రమ వివర్తక స్వరూపమైన వివేచన కనిపిస్తుంది. దానిప్రకారం మూలవస్తువు, అఖండ బోధామయ ఆంతరిక వస్తువే. మనసు- తత్త్వవిచారము మొదలైనవి వాటియందే జరుగుతాయి. అందువల్ల వాటియందు ఉద్యమించడం ద్వారా విచారాంతరము, వస్త్వంతరము అనేవి ఉత్పన్నం అవుతాయి. తత్త్వవిచార సంఘర్షణతో విరోధించే విచారణల ద్వారా సర్వబాధ కలిగిన తరువాత బాధాధిష్ఠాన పరమార్థ వస్తువుల ఎరుక కలుగు తుంది. అప్పుడు చింతనతో విరోధించే అంశాలు, సంఘర్షణలు అంతమై పోతాయి. సుందోప సుంద న్యాయం చేత సత్యాత్మవాదులు – అసత్కార్య వాదులనే రెండు తరహాల వారి వాదనలు సాంఖ్యము – న్యాయదర్శనాల ఆధారంగా ఖండితమైపోయి నప్పుడు… ఒకానొక అనిర్వచ నీయత- వివర్తము సిద్ధమవుతూ ఉంటుంది. ఈ విధంగానే అంతర్వి రోధం ద్వారా అటువంటివన్నీ బీజదశలోనే విధ్వంస మవుతాయి. తిరిగి మొలకెత్తనేరవు.

అదేరకంగా ప్రతి ఒక్క కారణమందు అంతర్వి రోధం కలిగిన వెంటనే విధ్వంసము లేదా వికృతి ఏర్పడుతుంది. దాంతో కార్యాంతర మొకటి వికసిస్తుంది. అవ్యక్తమైన మహసు, ఆ మహసు నుంచి వచ్చిన అహం, అహము నుంచి ఆకాశం వస్తాయి. అట్టి ఆకాశం నుంచి వాయువు మొదలైన వాటి వివర్తము లేదా వికాసం పైక్రమంలోనే ఏర్పడుతుంది. సత్త్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాల వికారము-వైచిత్రి నుంచే సృష్టి ఏర్పడుతుంది. వికారం కూడా సంఘర్షణే. నిర్విరోధమైన శాంతము – శమము మొదలైన గుణాల వల్ల సృష్టి జరగనే జరగదు. వికారము – వైషమ్యముల నుంచే తత్త్వాంత రికమైన వికాసం కలుగుతుంది. అట్టి తత్త్వాంతర కారణం అనిర్వచనీయమని ఊహించ వచ్చు. ఈ అంశాలన్నింటినీ హెగెల్‌ ‌తనదైన భాషలో వాదము, ప్రతివాదము, సమన్వయము, ద్వంద్వ మానము లేదా అంతర్విరోధము అని పేర్కొన్నాడు.

అతని ప్రకారం అంతిమకార్యం అనంతరం కూడా అంతర్విరోధం చెలరేగుతుంది. సమన్వయా నికి ప్రయత్నం కొనసాగుతుంది. అయితే హెగెల్‌ ‌తన ద్వంద్వవాదాన్ని వాదంగా మార్చి… దాన్ని ఏకాత్మవాదంలో లయమైనట్లుగా కల్పన చేశాడు. అప్పుడు ద్వంద్వవాదాన్ని ఆధారంగా చేసుకుని… అధినాయకవాదం, సమష్టి వాదం, భూతవాదం, చేతనావాదం వంటి పరస్పర విరుద్ధ మతాలు సిద్ధం అవుతున్నాయి. వాటి బలంపై ఆధారపడి, ఏ సిద్ధాంతాన్ని అయినా ఇదమిత్థంగా తేల్చి చెప్పలేని స్థితి ఏర్పడుతుంది.

హెగెల్‌ అభిప్రాయంలో, ‘రాజ్యం మానవుల సామాజిక ప్రగతికి చరమస్థానం అయి ఉన్నది.’ దీని అర్థమేమిటంటే, ‘ఈ సంవాదానికి పైన మరో వాదం పుట్టనేరదు’ అని. అయితే మార్కస్ ‌దానిని కూడా ఒక వాదంగా మార్చాడు. కార్మిక నాయకత్వం లేదా సమష్టి వాదాన్ని చరమ సంవాదంగా మార్కస్ ‌చెప్పాడు. కానీ రామరాజ్య వాదులు జడ – చేతనాలు రెండింటినీ ఆధ్యాత్మిక సంబంధం చేత సమన్వయం చేస్తారు. దానివల్లనే రాజతంత్రం – ప్రజాతంత్రం, వ్యష్టి – సమష్టి, విత్తవిభాగం – శ్రమవిభాగాలను సమన్వయం చేస్తారు. ఈ విధంగా ఆధ్యాత్మవాదంలో శాసించ శక్యం కాని ధర్మం నియంత్రణలో ధర్మ సాపేక్షత, పక్షపాత విహీన పాలనా తంత్రం ఏర్పడు తుంది. అదే రాజ్యానికి అంతిమ లక్ష్యం అవుతుంది.

భారతీయ ఆధ్యాత్మ వాదంలో సమష్టి అంటే అనంతకోటి బ్రహ్మాండాత్మయే… కార్య-కారణాలకు అతీతమైన బ్రహ్మకు అదే స్థూల రూపం అయి ఉన్నది. దానిలోపల సమష్టి లింగాత్మ హిరణ్యగర్భునిగా సూక్ష్మరూపంతో ఉంటాడు. ఆయన యందు కూడా ఆంతర సమష్టి కారణాత్మ మహాకారణుడైన ఈశ్వరు నిగా ఉంటాడు. కాగా వీటన్నింటియందు ఉండే సూక్ష్మాత్మ కార్యకారణాలకు అతీతమైన శుద్ధబ్రహ్మ. మహావిరాట్‌ ‌రూపాన్ని గురించి శోధిస్తున్నప్పుడు… హెగెల్‌ ‌చెప్పిన విశ్వాత్మ భావన చాలా స్థూలమైనది. ఇంకా సంకీర్ణమైనది కూడా.

హిందీమూలం : కరపాత్రీ స్వామి

అనువక్త : నేతి సూర్యనారాయణశర్మ

About Author

By editor

Twitter
YOUTUBE