భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రేమ, దయ, సేవ, ధార్మికతలకు నిలువెత్తు రూపం. ఆధునిక కాలంలో ఆధ్యాత్మికతను సులభంగా ప్రజల హృదయాలకు చేరువ చేసి, ధర్మాన్ని జీవన విధానంగా స్థాపించిన మహా పూర్ణావతారం. పుట్టపర్తి అనే సాధారణ గ్రామంలో అవతరిం చిన ఈ దివ్య స్వరూపుడు, బాల్యదశ నుంచే ప్రేమ, కరుణ, అద్భుతాలతో ప్రపంచాన్ని ఆకర్షించారు.
బాబా బోధనలు చాలా సరళమైనవైనా, అర్థవంత మైన లోతు కలిగినవి. ఆయన మానవజాతికి అందించిన ఐదు జీవన సూత్రాలు ఇవే:
సత్యం -ధర్మం – శాంతి – ప్రేమ – అహింస
ఈ ఐదు విలువలు మానవ జీవితానికి మూల స్తంభాలు అని ఆయన నిత్యం బోధించేవారు. మతం, జాతి, ప్రాంతం అనే భేదాలు లేని ‘‘విశ్వ సోదర భావం’’ ఆయన సందేశం.
‘‘అన్ని ఆధ్యాత్మిక గ్రంథాల సారాంశం ఒక్కటే అదే మానవ ప్రేమ’’ అనే సత్యాన్ని ఆయన జీవితం అంతా నిరూపిం చేరు. మానవ సేవే మాధవ సేవ, సేవామూర్తి సత్య సాయి. బాబా మాటలు మాత్రమే కాదు, ఆయన జీవితమే సేవకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆరోగ్యం ప్రపంచ స్థాయి నాణ్యతతో, పూర్తిగా ఉచితంగా వైద్యసేవలను అందించే శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, బాబా దివ్య కరుణకు చిరస్మరణీయ చిహ్నాలు.
మానవీయ విలువలను విద్యతో రంగరించడం అనే గొప్ప సంకల్పంతో శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్స్ఆఫ్ హయ్యర్లెర్నింగ్ స్థాపించి ఉచిత విద్య ద్వారా, విలువల ఆధారిత విద్యను అందిస్తున్నారు. ఆంధప్రదేశ్, తమిళనాడులో వేలాది గ్రామాలకు శుద్ధ తాగునీటిని అందించిన భారీ నీటి ప్రాజెక్టులు (సాయి గంగ) బాబా మానవతా దృష్టిని స్పష్టంగా చిత్రిస్తాయి.
సార్వత్రిక సోదరభావానికి ప్రతీక పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం. హిందూ, ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ, సిక్కు మతాల ప్రార్థనలు ఒకే స్థలంలో ధ్వనించే, ప్రపంచమంతా ఐక్యంగా కలిసే ఆధ్యాత్మిక ధ్యాన క్షేత్రం. బాబా దర్శనం, అభయదానం, ఆయన చూపించిన అనేక లీలలు భక్తుల విశ్వాసాన్ని మరింత లోతుగా బలపరిచాయి.
ఆయన చెప్పిన సారాంశం ఒక్కటే:
‘‘అందరిని ప్రేమించు.. అందరిని సేవించు.. ఎవరిని బాధించకు.’’
ఏప్రిల్ 24, 2011న ఆయన దివ్యశరీరం వీడినప్పటికీ, ప్రేమ, సేవ, శాంతి అనే వారి సందేశం నేటికీ ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా ఉంది. ప్రపంచంలోని 150కిపైగా దేశాలలో సాయి సంస్థలు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. ఈ సంవత్సరం జరుగుతున్న శ్రీ సత్యసాయి శతాబ్ది మహోత్సవాల్లో, నవంబర్ 23న కోట్లాది భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఆయన పుట్టిన రోజును అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.
శ్రీ సత్యసాయి బాబా ప్రేమకు జీవ రూపం, సేవకు మూల ప్రతిరూపం, శాంతికి శాశ్వత మార్గదర్శి. ఆయన బోధనలు మానవుల హృదయా లలో దాగి ఉన్న దైవత్వాన్ని మేల్కొలిపే దివ్య చిహ్నాలు.
విస్సాప్రగడ సాయి
న్యాయవాది, పుట్టపర్తి