1966, ‌జూన్‌. శ్రీ ‌సత్యసాయిబాబా అనంతపురంలోని ఒక బాలికల పాఠశాలకు వచ్చారు. విద్యార్థినులతో వాళ్ల లక్ష్యాలు ఏమిటో తెలుసుకుంటున్నపుడు చాలామంది ‘‘మేము పదవతరగతితో చదువులు ఆపేయాలని అనుకోవడం లేదు. పై చదువులు చదివి, మా కుటుంబాలను ఆదుకోవాలి, దేశానికి సేవ చేయాలి అనుకుంటున్నాం, కానీ మా పట్టణంలో కళాశాల లేదు. బయటి నగరాలకు మమ్మల్ని పంపించి చదివించే ఆర్థిక స్తోమత మా తల్లిదండ్రులకు లేదు’’ అని చెప్పారు. భగవాన్‌ ‌మౌనంగా విన్నారు. కానీ, వారి మనసులో పుట్టిన ఆలోచన ఏమిటో అక్కడున్న వారెవ్వరికీ తెలియదు. తరువాత ప్రసంగించిన బాబా, ‘‘త్వరలో ఇక్కడ ఒక మహిళా కళాశాల నిర్మాణమవుతుంది’’ అని ప్రకటించారు. ఆ మహనీయుడి నోటి వెంట మాట రావడం, అది జరగకపోవడమా?

కేవలం రెండేళ్లలోనే అనంతపురం పట్టణంలో 115-23 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో Sree SatyaSai Institute of Higher learningను నిర్మించారు.. ఏ ఉద్దేశ్యాలతో కళాశాల ప్రారంభ మయిందో, 57 ఏళ్ల తరువాత ఈ రోజు కూడా అవే విలువలు, అదే నాణ్యత. కళాశాల ప్రాంగణం లోకి అడుగుపెడితే ప్రాచీన భారతదేశం నాటి గురుకులంలోకి వచ్చామా అనే భావన కలుగుతుంది.

సత్యసాయి విద్యాసంస్థల్లో చదివి, పెద్దవారై ఏ ఇతర సంస్థలలో చదువు తున్నా, ఉద్యోగాలు చేస్తున్నా, వారి ప్రవర్తన, వారి వేషం, మాట తీరు చూసి మనం ‘‘వీళ్లు బాబాగారు నెలకొల్పిన విద్యాసంస్థల్లో చదువుకున్న విద్యార్థులై ఉంటారు’’ అని గుర్తుపట్టవచ్చు. గుణంలేని విద్య దేవుడులేని ఆలయం వంటిది. (The end of education is character is like a temple without God) అని స్వయానా బాబాగారే తరచు అనేవారు.

సాయిబాబాగారు తన 37వ ఏట అంటే 1963వ సంవత్సరంలో కొంతమంది భక్తులతో తాను భూమి మీద ఏ కార్యం చేయడానికి వచ్చానో తన జీవితం ఏ దిశగా ముందుకుసాగబోతుందో సూచన ప్రాయంగా తెలియజేశారు. ‘‘ఏ ధర్మం అయితే అడవు లకు వెళ్లిపోయిందో, ఆ ధర్మాన్ని తిరిగి పల్లెలు, పట్టణాలు, నగరాలకు రప్పించాలి. ఏ అధర్మమయితే పల్లెలు, పట్టణాలను ఆక్రమించిందో ఆ అధర్మం తిరిగి అడవులకు వెళ్లిపోవాలి. మనం చేసే ప్రతి పని కూడా ధర్మం ఆధారంగానే జరగాలి, ధర్మానికి మేలు చేసేదిగానే ఉండాలి.’’ అన్నారు.

బాబా మాటలను తరచి చూస్తే: ప్రతి మనిషి లోనూ దివ్యత్వం ఉంటుంది. కానీ ప్రతి మనిషికీ అది తెలియదు. దాన్ని అతనికీ, ఆమెకూ తెలియచేస్తే ఆ దివ్యత్వం మేల్కొంటుంది. అపుడు ఆ మనుషుల ద్వారా జరిగే ప్రతి పనీ లోకానికి మేలే చేస్తుంది. స్వామి వివేకానందుడు, గౌతమ బుద్ధుడు, జిడ్డు కృష్ణమూర్తి లాంటి మహాత్ములందరూ ఇదే విషయాన్నే చెప్పారు. లోక కల్యాణానికి మనిషిని తయారుచేసేది ఏది? విద్య.

దురదృష్టవశాత్తూ ఈనాడు విద్య అంటే ఉద్యోగం, విద్య అంటే ఉపాధి అని మాత్రమే అనుకొంటున్నాం. ఉద్యోగం, ఉపాధి, ఆర్థిక స్వావలంబన, ఆర్థిక స్వాతంత్య్రం అవసరమే కానీ అవి విద్య ‘‘అంతిమ లక్ష్యం’’ కావు. అందుకే శ్రీ సాయి తరచు ఇలా అనేవారు : ‘‘పుస్తక సంబంధమైన విజ్ఞానం మాత్రమే చాలదు. అదొక్కటే మన జీవన గమ్యం కారాదు. బ్రతకడానికి ఒక ఆసరాను విద్య ఇవ్వవచ్చు. కానీ విద్య అక్కడితో ఆగరాదు. దానిని దాటి చాలా ముందుకు పోవాలి. జీవితంలో మనిషి ఎదుర్కొనే నైతిక, సామాజిక, ఆధ్యాత్మిక ప్రశ్నలు, సవాళ్లకు విద్య పరిష్కారం చూపేదిగా ఉండాలి. నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు పెంపొందించకపోతే విద్య ఒక విధంగా ప్రమాదానికే దారి తీయవచ్చు. ఈ రోజు విద్యావంతుల్లో ‘నైతికత’ లేకుండా పోయినందువల్లే వాళ్ల వ్యక్తిగత జీవితాల్లో భయం, ఆందోళన, ఒత్తిడి కనిపిస్తున్నాయి.’’

లౌకికవిద్య, ఆధ్యాత్మిక విద్య రెండూ వేరు వేరు కావని, కాకూడదని సాయి అనేవారు. ఈ రెండింటి సంగమమే నిజమైన విద్య. అంటే మనిషి తాను బ్రతకడానికి ఇతరులమీద ఆధారపడకూడదు, అలాగే ఇతరులను బ్రతికించడానికి తన శక్తియుక్తుల్ని వినియో గించకుండా ఉండకూడదు. ఈ విషయంగా శ్రీ సత్య సాయి చమత్కారంగా ఒక ఉదాహరణ చెప్పేవారు : ‘‘మనిషి, భూమిని చూసి నేర్చుకోవాలి. భూమి తన చుట్టూ తిరుగుతూ, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంటుంది కదా, అలాగే మనిషి కూడా తన కుటుంబం పట్ల తనకున్న బాధ్యతను నెరవేరుస్తూనే సమాజంపట్ల తనకున్న బాధ్యతను కూడా తప్పకుండా నెరవేర్చాలి’’.

ఇటువంటి విద్యావిధానాన్నే శ్రీ సత్యసాయి ఎడ్యుకేర్‌ (Educare) అని అన్నారు. మనిషిలో దాగి ఉన్న సత్యం, సత్ప్రవర్తన, శాంతి, ప్రేమ, అహింస, సేవాభావం అనే ఉదాత్తమైన విలువలను వెలికితీసి, మనిషి మాటలకు, చేతలకు, హృదయానికి అనుసంధనాన్ని ఏర్పరిచేదే నిజమైన విద్య. ఇటువంటి విద్యను మనిషికి బాల్యదశ నుండే నేర్పడం ప్రారం భించాలి అని భావించి 1968లో శ్రీ సత్యసాయి బాబాగారు ‘‘బాలవిహార్‌’’ అని బాలబాలికలకు కథలు, పాటలు, నాటకాలు, సంగీతం ద్వారా మన సనాతన ధర్మం విలువలను, ఆవశ్యకతను బోధించే విధానాన్ని ప్రారంభించారు. ఈ బాలవిహార్ల నిర్వహణను మహిళా విభాగానికి అప్పగించారు. 1971లో ‘బాలవిహార్‌’ ‌విధానాన్ని ‘బాలవికాస్‌’‌గా మార్చారు శ్రీ సాయి. ఈ ‘బాలవికాస్‌ను మూడు వర్గాలుగా విభజించి నడుపుతున్నారు.

6-9 సంవత్సరాల వయసు గల బాలబాలికలు మొదటి వర్గం

9-12 సంవత్సరాల వయసు గల బాలబాలికలు రెండవ వర్గం

12-15 సంవత్సరాల వయసు గల బాలబాలికలు మూడవ వర్గం

ఈ బాలవికాస్‌ ‌కేంద్రాల్లో మన సనాతన ధర్మంలో భాగమైన పురాణాలు, రామాయణ, భారత, భాగవతాల్లోని శ్లోకాలు, వివిధ దేవతా స్తోత్రాలు, నైతిక విలువలు నేర్పించే కథలు, భజనలు, భక్తి గీతాలు, మహాపురుషుల జీవిత చరిత్ర బోధిస్తారు.

2010లో ఒక మారు, 2011లో రెండవ మారు, పుట్టపర్తిని సందర్శించిన ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సరసంఘచాలక్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ ‌డిసెంబర్‌ 27,2019 ‌న మరోసారి పుట్టపర్తికి వచ్చినపుడు ప్రశాంతి నిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో ప్రసంగిస్తూ, బాలవికాస్‌ ‌కార్యక్రమాన్ని చాలా ప్రశంసించారు. ఆంధప్రదేశ్‌లో నడుస్తున్న 2000 బాలవికాస్‌ ‌కేంద్రాల నుండి వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్న ఆ కార్యక్రమంలో మోహన్‌భాగవత్‌ ‘‘ ‌బాలుడిగా ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు ఎలా తల్లిదండ్రుల ఒడిలో కూర్చుని చక్కటి కథలు, పాటలు నేర్చుకున్నాడో, అలాగే ఈ బాలవికాస్‌లోని పిల్లలు కూడా మన ధర్మాన్ని, సంస్కృతిని పాటలు, శ్లోకాలు, కథల ద్వారా నేర్చుకుంటున్నారని ఈ పిల్లలకు కృష్ణుడి, అలాగే సాయి దీవెనలు ఉన్నాయి కాబట్టి వీళ్లందరూ ‘‘సాయికృష్ణ’’ అని సంబోధించారు.

ఈనాడు బాలవికాస్‌ ‌భారతదేశంలో 28 రాష్ట్రాలకు విస్తరించి 1500 కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో 18000 మంది ఉపాధ్యాయులు పిల్లలకు నైతిక విద్యను అందిస్తున్నారు.

ఈ కేంద్రాల్లో 3,50,000 మంది బాలబాలికలు మన సనాతన ధర్మ సంస్కృతులను తెలుసుకుంటూ, ఆదర్శపౌరులుగా ఎదుగుతున్నారు.

బాలవికాస్‌ ‌కేంద్రాలే కాక శ్రీ సత్యసాయి ప్రారంభించిన లేదా వారి ఈశ్వరైక్యం తరువాత ప్రారంభమైన అనేక విద్యాసంస్థలు దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచంలో అనేక దేశాలకూ విస్తరించాయి. అందులో కొన్ని ఇలా ఉన్నాయి,..

  • Satya Sai Schools (SSS) 26 దేశాల్లో విద్యను బోధిస్తున్నాయి.

Institutes of Satya Sai Education (ISSES) 30 దేశాల్లోనూ,.

  • Satyasai Education in Human Values (SSEHV) 30 దేశాల్లోనూ,.
  • Sai Spiritual Education (SSE) 100 దేశాల్లోనూ నైతిక, ధార్మిక విద్యను అందిస్తున్నాయి.

భారతదేశంలో కూడా 4 సత్యసాయి అంతర్జా తీయ విద్యాలయాలున్నాయి. 1. Sai international School, 2. Sai Angan, 3. Sai International Residential School, 4. SAI international college of commerce (భువనేశ్వర్‌, ఒడిషా) ఆంధప్రదేశ్‌లో విశాఖపట్టణం, గుంటూరు, కడప, నందిగామ, మదనపల్లె, పలాస పట్టణాల్లో 8 సత్యసాయి పాఠశాలలు పనిచేస్తున్నాయి.

ఇంత పెద్ద ఎత్తున భారతీయ విద్యా విలువలను దేశంలోనే కాక అనేక ప్రపంచ దేశాల్లో విస్తరింపజేసి, బాబా మన భారతీయ సనాతన ధర్మం, ప్రపంచ శాంతికి, మానవ కల్యాణానికి ఎంతగా తోడ్పడు తుందో రుజువు చేయడం మాత్రమే కాదు, లక్షల కోట్లమంది మానవులకు జీవితం లక్ష్యమేమిటి? జీవితంలో మనుషులు ప్రేమ, శాంతి, ఆధ్యాత్మికతను అలవాటు చేసుకుంటే, వాళ్ల జీవితాలు ఎంత ఆనందంగా మారతాయో కూడా నిరూపించారు.

Not gold but only man can make
A people great and strong;
Men who for Truth and Honour’s sake
Stand fast and suffer long

‘ఒక జాతిని నిర్మించేది బంగారు కాదు, / మనుషులే ఒక జాతిని ఘనంగా, దృఢంగా నిర్మిస్తారు. / ఏ మనుషులైతే సత్యంకోసం, గౌరవం కోసం గట్టిగా నిలబడి, / బాధల్ని కూడా భరిస్తారో వాళ్లే జాతిని నిర్మిస్తారు’ అనే ఈ కవితను 1847లో ఆర్‌.‌డబ్ల్యు ఎమర్సన్‌ ‌వ్రాశారు.

సరిగ్గా ఇలాంటి మనుషులనే మన దేశానికి, మన ప్రపంచానికి అందించాలని శ్రీ సత్యసాయిబాబా భావించారు. అందులో వారు విజయం కూడా సాధించారు. వారు భౌతికంగా మన మధ్య లేకున్నా, వారి దివ్య సందేశం, ప్రేరణ మనల్ని నడిపిస్తూ ఉంటాయి.

– డాక్టర్‌ ‌పి.సతీష్‌

About Author

By editor

Twitter
YOUTUBE