పదే పదే అదే పనిగా ఎంతోమంది పలికే పదం ‘మానవత’. అది ఏమిటో, ఎక్కడుంటుందో కొంతమందికి మాత్రమే అనుభవపూర్వకంగా తెలుసు. ఆ అనుభవాన్ని ఆచరణకి తెచ్చేవారు వేళ్లమీద లెక్కపెట్టేంతగా ఉంటారు. నిజానికి మానవతా దినోత్సవమంటూ ఒకటుంది, దాని గురించి తెలిసినా, తెలియకున్నా, ప్రతీరోజూ ఎవరో ఒకరిని ఆదుకోనిదే నిద్రపట్టనివారు అతికొద్దిమంది!
అసలైన మానవత్వం అంటే
అభిమానమే అందరికీ!
అయితే ఆ ‘అసలు’లో దాగిన సిసలైన అర్థం
అర్థమయింది ఎందరికి?
(అంటూ కరుణభావంతో ఆక్రోశించింది ఏనాడో కవి హృదయం).
ఎన్ని వాదాలున్నా, మార్గాలు కనిపిస్తున్నా- సేవా మార్గమే మిన్న. ఆ మార్గాన వెళ్లడమే తప్ప, మరి ఇంకేదీ తెలియని, మరో లోకమంటూ ఉండని కొందరు వనితల గురించి ఇప్పుడు!
అదొక నగరం. రాత్రిళ్లు చలి చంపేస్తోంది. ఉన్నవారు, మధ్య తరగతివారు, కూడూ, గూడూ ఉన్నవారైతే సరే. మరి తిండికి లేని, ఒంటిమీద కప్పుకోవడానికి గుడ్డలేని, నిలవడానికి ఏ ఆధారమూ లేని నిరుపేదల స్థితి? వాళ్లు ఎవరికి కావాలి? వాళ్లమీద ఎవరికి జాలి?
ఇలా ఎప్పుడూ ఆలోచన చేసే ముగ్గురు అతివలు ఆ నగరం శ్రీకాకుళంలో ఉన్నారు. బ్యాంకులో పనిచేసే ఉద్యోగిని గౌతమి, ఆస్పత్రిలో నర్సుగా బాధ్యతలు నిర్వర్తించే కృష్ణవేణి, పాఠశాల ఉపాధ్యాయి నిగా ఉన్న సౌజన్య. జీవిత అనుభవాలు, మదిలోపలి ఆదర్శాలు వీరిలోని సేవాభావనను ఎప్పటికప్పుడు తట్టిలేపుతూనే ఉన్నాయి.
ఒకరోజు రాత్రి… సేవాసంస్థ రెడ్‌క్రాస్ కీలక ప్రతినిధి నుంచి వాట్సప్ సమాచారం వచ్చింది. అదీ స్టేటస్‌లో.
నగర ప్రాంతంలోని వంతెన దిగువన ఒక అవ్వ పడి ఉందనేది ఆ సందేశ సారాంశం. ‘రోజుల తరబడి ఆహారంలేదని ఆమెను చూడగానే అర్థమవుతోంది. అస్తిపంజరమా? అనిపిస్తోంది. కూడూ, గూడూ కరవై ‘ఇవాళో రేపో’ అన్నట్లుంది. గజగజ వణికించే చలితో నరకాన్నే చూస్తోందామె. ఇప్పుడే గమనించాను. స్త్రీలు ఎవరైనా తక్షణం స్పందిస్తే, ఆ వృద్ధురాలి ప్రాణం పోకుండా కాపాడినట్లవుతుంది. ఏ ఒక్కరైనా ముందుకొస్తే చాలు.’
ఇదీ ఆ మెసేజ్. నగరంలోని ఎంతమంది ఆ సమాచారం చూశారో, చదివినారో లేదో కూడా తెలియదు. కానీ – ఆ ముగ్గురు స్త్రీ మూర్తుల్లో ఒకరు వెంటనే చలించిపోయారు. దయాభావం ఉప్పొంగిన స్థితిలో ‘నేను ఉన్నా’ అని ఆ ప్రతినిధికి బదులిచ్చారు.
మరి కాసేపట్లోనే ‘నేను సైతం’ అంటూ మరొక అతివ నుంచి స్పందన. ఇంకొద్ది సేపటికి వేరొకరి నుంచి కూడా!
సేవాసంస్థ ప్రతినిధి మరింత చొరవగా, మరెంతో నిబద్ధతగా, ఇంకెంతో బాధ్యతాయుతంగా కదిలొచ్చారు. ఉమాశంకర్ అనే పేరున్న అతని వల్లనే ముగ్గురు మగువలూ ఆ వంతెన ప్రాంతానికి చేరుకున్నారు. అంతా కలసి వెళ్లి చూసేసరికి….
రోడ్డుమీద దీనాతిదీనంగా, హృదయవిదారక స్థితిలో కనిపించింది ఆ ముసలమ్మ. ఏ మాత్రమూ కదలిక లేదు. ఒంటిమీద చీర ఉండీ లేనట్లుంది. శరీరానికి పురుగులు పట్టిన పరమ దుర్భర దశ!
అంతలోనే రెడ్‌క్రాస్ ప్రతినిధి నుంచి అందిన సమాచార ఫలితంగా, మరికొందరు దయార్ద్ర హృదయులూ అక్కడికి చేరారు. ఆ నిర్భాగ్యురాలి దరికి చేరి, సపర్యలు సాగిస్తూనే, ఎంతో కొంత ఆహారమిచ్చారు. తినే స్థితిలోనూ లేదు ఆమె! నీళ్లు తాగేంత ఓపికా లేదు తనకి.
ఆ వృద్ధురాలిని అక్కడి నుంచి నెమ్మదిగా లేపి, కదలిక తెప్పించడం ఎలా? ఏం చేయాలి ఇప్పటికిప్పుడు?
ఈ ప్రశ్నకు సమాధానంగా ముగ్గురు అతివలూ (గౌతమి, కృష్ణవేణి, సౌజన్య) ముందడుగు వేశారు. ఆమె శరీరంమీద ఉన్న పురుగులను జాగ్రత్తగా తొలగించారు. వాహనంలో తెచ్చిన నీటితో శరీరాన్ని శుభ్రపరిచారు. దుస్తుల్ని మార్చి, ఎంతో కొంత ఉపశమనం కలిగించ గలిగారు.
ఇప్పుడు ఆ అభాగ్యురాలిని ఎక్కడికి తీసుకెళ్లాలి? ఆమె ప్రాణాల్ని ఏ విధంగా పరిరక్షించాలి? అసలిప్పుడు చేయాల్సిందేమిటి? అక్కడి స్త్రీ, పురుష సేవాపరాయణులు ఆలోచనలో పడ్డారు. నిమిషాల వ్యవధిలో ఒక నిర్ణయానికి వచ్చారు. వారి నుంచి సమీప పోలీసు ఠాణాకు వివరాలు చేరాయి. పోలీసుల అనుమతి వచ్చింది. ఆ వెంటనే ఆ అవ్వను వాహనంలో శ్రీకాకుళం నుంచి పలాసకు తరలించే ఏర్పాటు!
వారందరూ కలిసికట్టుగా ఆమెను ఆ వాహనం లోకి చేర్చి, పలాస సేవాసంస్థ (లలిత ట్రస్టు) ఆశ్రమానికి బయల్దేరారు. అంతమంది తన చుట్టూ చేరి, అండదండగా ఉండటంతో, వృద్ధురాలికి కాస్తంత దిటవు ఏర్పడింది. కొద్దికొద్దిగా మాట్లాడటం మొదలు పెట్టింది. ముగ్గురు అమ్మాయిలూ అడిగినవాటికి జవాబులివ్వడం ఆరంభించింది.
‘నాది ఫలానా ఊరు. పిల్లలున్నారు. పెంచి పెద్ద చేశాను, ఆడా, మగా వారందరి బాగోగులూ చూశాను, వయసు పెరిగి, శరీర అనారోగ్యం కలిగి, బాధపడుతున్న నన్ను ఏం చేయాలని చూశారో తెలుసా?
వదిలించుకోవాలని సిద్ధమయ్యారు కొడుకులూ కూతుళ్లూ!
ఒకరోజున నన్ను ఇక్కడికి (శ్రీకాకుళం) తెచ్చి, వంతెన దగ్గరికి చేర్చి, ‘ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాం’ అని చెప్పి వెళ్లిపోయారు. అప్పటి నుంచీ నేను….
చెప్పడం ఆపింది అవ్వ. ఆ అమ్మాయిల కళ్లు వర్షిస్తున్నాయి. కళ్లలో నీళ్లు ఇంకిన స్థితి ముసలావిడది!
పిల్లలు ఎవరి కంట్లో నలక పడినా, కాలికి ముల్లు గుచ్చుకున్నా ముందుగా తానే విల్లవిల్లాడుతుంది తల్లి. పసి బిడ్డల దశ నుంచి నోటికి అందించే ప్రతీ చేతి ముద్దలో తన ప్రాణముంటుంది. ఎన్ని కలరవాలు, ఇంకెన్ని కలవరాలు? ఎన్నెన్ని చుట్టుముట్టినా ఆవిడ కళ్లకి పిల్లలు ఎప్పుడూ పసివాళ్లే!
కానీ ఆ బిడ్డలు చేస్తోందేమిటి? గూడుపుఠాణీ చేసి, తీసుకొచ్చి, ఏ దూరప్రాంతంలోనో రోడ్డుమీద / రోడ్డు ప్రక్కన వదిలేసి వెళ్లిపోవడం. ‘ఇప్పుడే వస్తాం. ఇక్కడే ఉండు’ అనడమే తప్ప తిరిగొచ్చేదీ లేదు. తల్లి బతికి ఉందో లేదో చూసేదీ అసలే ఉండదు. వదిలేసి వెళ్లిపోవడం అంటే శాశ్వతంగా వదిలించు కోవడం.
అయినా తల్లి తెలుసుకోలేదు. గూఢార్థం గ్రహించలేదు. పిచ్చి నమ్మకంతో ఎదురుచూస్తూనే ఉంటుంది ఎప్పటికీ! ‘మా వాళ్లు వస్తారు’ అనుకుంటూ అంటూ రోజులు గడిపేస్తుంటుంది. అవన్నీ ఆమె పాలిటి చివరి రోజులే!
పలాస ఆశ్రమం అక్కున చేర్చుకుంది. అవ్వను సంరక్షించేందుకు నడుం కట్టింది. కొన్ని రోజులు గడిచాక ఈ లోకం నుంచి అన్న పానీయాలు లేక, ఎండా వానా చలిని తట్టుకోనూ లేక, దిక్కూ మొక్కూ లేక పైలోకం చేరుకుంది.
ముగిసిపోయింది జీవితం! సొంత బిడ్డలు ఈసడించి నడిరోడ్డు పాలు చేసినా, నోరు తెరిచి ఒక్క మాట అయినా అనని పిచ్చి తల్లి!
ఆమెకి అసలు పిల్లలెవరు? వాళ్లా, వీళ్లా?
బిడ్డల్లా ఉందీ, ఆదుకుందీ ఈ ముగ్గురే కదా!
అవ్వ కన్నుమూసిందని తెలియగానే, మరుక్షణమే తల్లడిల్లింది గౌతమి మది. కోలుకునేందుకు ఎన్నో రోజులు పట్టింది. అనుబంధం అనే పదానికి అర్థం గురించే ఆ పడతి ఆలోచనంతా!
‘ఏది పుణ్యమో తెలిసింది నాకు. అవ్వని కొన్నాళ్లయినా ప్రాణంతో ఉంచగలిగానన్న సంతృప్తే మిగిలింది నాకు. జీవితానికి ఇటువంటిది చాలు. దీనికి సేవ అనే పేరు పెట్టడం నాకైతే ఇష్టం ఉండదు. నేను అనుకున్నది చేయగలిగాను. దీని గురించిన ఎటువంటి ప్రచారాన్నీ కోరుకోను. అసలు మనం చేసిన ఏ మంచి పనైనా మనకి ఇచ్చే సంతృప్తి అనంతం. అంతే! అంటూనే తన సేవాభావ నేపథ్యాన్ని వివరించారిలా….
‘అనారోగ్య మహమ్మారి మా కుటుంబ పెద్దల్నీ పట్టి ఉక్కిరిబిక్కిరి చేసేసింది. అమ్మకు చూపులేదు. జీవితం గురించిన లోతైన చూపు మాత్రం ఎంతగానో ఉంది. ఆమె నన్ను చూడలేకపోయినా, నా జీవన ఉన్నతిని తొలి నుంచీ అంతర్ నేత్రంతో చూసింది. ఎన్నెన్నో జీవిత పాఠాలు నేర్పింది. నాన్న నన్ను రాకుమారిలా చూసుకున్నారు. అపురూపంగా పెంచి పెద్ద చేశారు. నా కుడి ఎడమ వైపుల్లో నిలిచింది అమ్మా నాన్నలే! వారి పెంపకం నన్ను అన్ని విధాలా తీర్చిదిద్దింది.
మావారు మరెంతో. అన్నీ మనం అనుకున్నట్లే జరిగితే, అది జీవితం ఎందుకవుతుంది చెప్పండీ? కారుణ్య నియామకం అనేలా ఆయన తాలూకు ఉద్యోగ పని నాకు లభించింది. నన్ను మా అమ్మా నాన్నా బాగా చూసుకున్నట్లే- నేనూ ఇప్పుడు నా సంతానాన్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నా. ఎవరైనా బాధలో ఉండటం చూస్తే తట్టుకోలేను. వారు ఎవరైనా, ఎక్కడ ఉన్నా నాకు తోచిన సాయం చేయకుండా ఉండలేను. నా చిన్నారి పిల్లలకీ ఇదే అలవాటు చేస్తూ వస్తున్నా.
నాది చిన్న ఉద్యోగమే. ఆర్థిక స్థితి పరిమితమే. అయినప్పటికీ, నాకు ఉన్నదాంట్లో ఎంతో కొంత మొత్తాన్ని దీనుల కోసమే ఉపయోగిస్తాను. అవసరం ఉన్న ఎవరికైనా సాయం చేయడంలో ముందు వరసన ఉంటా. ఇది నాకు బరువు కాదు. ఇష్టమైన బాధ్యత. ఎంతైనా చేస్తాను. కళ్లుతెరిచి చూడాలే కానీ- ఎన్నెన్ని విషాదాలు? అన్నం లేక, నీళ్లూ దొరక్క నకనకలాడే వాళ్లు ఎంతోమంది కనిపిస్తుంటారు. ఎండకి ఎండుతూ, వానకు తడుస్తూ చలికి వణుకుతూ, నానా విధాలా అలమటిస్తుంటారు. ఉన్నంతలో వాళ్లను ఆదుకోలేమా? అందరినీ కాకపోయినా, మన దృష్టికి వచ్చిన కొందరి పరిస్థితినైనా ఎంతో కొంత మెరుగుపరచలేమా? కావాల్సింది సాయపడే మనసు. అది మనం అనుకుంటే వస్తుంది’ అంటుంటే గౌతమి కళ్లు మెరిశాయి.
గౌతమి, కృష్ణవేణి, సౌజన్య. ఇలాంటి కరుణ హృదయులు ఇంకొందరు ఉన్నారు. నిరుపేదరాలైన, నిండు గర్భిణి అయిన ఒకరు ఇదే శ్రీకాకుళం నగరంలో-అన్నమూ, నీళ్లూ కరవై అల్లాడుతుండటాన్ని ఒక విద్యాలయ వ్యవస్థాపకులు ఉమాదేవి, పద్మజ గమనించి సకాలంలో సాయం అందించారు. గర్భిణీగా, అంత సంక్లిష్ట సమయంలో… విపరీత చలిలో కటిక నేలమీద నిద్రించడాన్ని చూసి చలించిపోయారు.
కొంత ఆహారం, కొన్ని దుస్తులు, అవసర సామగ్రిలో కొన్నింటిని అందించారు. దీన్ని మానవత్వం అంటారో, మరేమైనా పేరు పెడతారో మాకైతే తెలియదు. తెలుసుకోవాలనే మాకు అనిపించదు. సాటి మనిషిగా ఏం చేయాలో అదే చేశాం. ఈ సంతృప్తి సరిపోతుంది. ఈ జీవితానికి ఇదే చాలనీ అనిపిస్తుంది. మనిషికి మనిషి కాకుంటే మరెవరు సాయం చేస్తారు’ అంటారు వాళ్లిద్దరూ. మానవతకు ప్రతీకలు ఈ వనితలు!
జంధ్యాల శరత్‌బాబు
సీనియర్ జర్నలిస్ట్