2024‌లో జరిగిన విధ్వంసానికి జెన్‌జీ ఉద్యమమని పేరు పెట్టారు. ఇప్పుడు ఏ పేరు లేకుండా కేవలం విధ్వంసంతో ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్నది ఆ దేశం. ఇదంతా భారతదేశం మీద పగతో బాంగ్లాదేశ్‌ అనే ఆ చిన్న దేశం తనను తాను దహనం చేసుకుంటున్నది. డిసెంబర్‌ 19 ‌రాత్రి మొదలైన హింసాకాండ ఇందుకు తార్కాణంగా నిలుస్తుంది. జెన్‌జీ పేరుతో షేక్‌ ‌హసీనాకు వ్యతిరేకంగా నిరుడు తలెత్తిన తిరుగుబాటు, హింసాకాండ, విధ్వంసకాండలకు వెనుక ఉన్న షరీఫ్‌ ఉస్మాన్‌ ‌హాది అనే విద్యార్థి, యువ రాజకీయ నాయకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపడంతో తాజా అల్లర్లు మొదలయినాయి. ఈ అల్లర్లకు ఉద్యమమనీ, అది జెన్‌జీ తరానిదనీ ఎవరూ వీరావేశంతో వ్యాఖ్యానించకపోవడమే గమనించదగిన అంశం. ఇది ముస్లిం మతోన్మాద వర్గాల నాయకత్వంలో నడుస్తున్నదని ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అసలు వాస్తవం.

బాంగ్లాదేశ్‌లో ఇప్పుడు ఏ అల్లరి జరిగినా దాని వెనుక అసలు ఉద్దేశం హిందువుల మీద దాడి కోసమేనన్నది సుస్పష్టం. చట్టోగ్రామ్‌ అనే చోట ఉన్న భారత మిషన్‌ ‌కార్యాలయం మీద రాళ్లు రువ్వారు. తరువాత భారత్‌ అక్కడి వీసా కేంద్రాన్ని మూసి వేసింది. విధ్వంసకారులు ‘ప్రోథమ్‌ ఆలో’, ‘డెయిలీ స్టార్‌’ అనే రెండు పత్రికలకు నిప్పు పెట్టి ప్రచురణను నిలిపివేశారు.  హాది రక్తం వృథా కాదంటూ  ఆ పచ్చి భారత వ్యతిరేకి మీద బాంగ్లా పాలకులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. దేశం మంటల్లో ఉన్న సంగతి కంటే అతడికి నివాళి ఘటించడానికే ఎక్కువ శ్రద్ధ చూపారు. బాంగ్లా తాజా అల్లర్లు కూడా మైనారిటీ హిందువులను,  క్రైస్తవులను, బౌద్ధులను లక్ష్యంగా చేసుకున్నాయి. వారిని, ముఖ్యంగా హిందువులను ఊచకోత కోస్తున్నారు. శాంతిభద్రతలు అన్నమాటే ఆ దేశంలో ఆశించలేనిదిగా ఉంది. హసీనాను దేశం నుంచి పంపించిన తరువాత శాంతిని స్థాపించడంలో తాత్కాలిక ప్రభుత్వ నేత యూనస్‌ ‌దారుణంగా విఫలమయ్యారు. ఫలితం- మైనారిటీల ఊచకోత, బాంగ్లా మీద మతోన్మాదుల పిడికిలి మరింత బిగియడమే.

 ఢాకాలోనే, ఒక మసీదు నుంచి బయటకు వస్తుండగా ముసుగులు ధరించిన వ్యక్తులు డిసెంబర్‌ 12‌న హాది మీద కాల్పులు జరిపారు. మొదట ఢాకాలోను తరువాత సింగపూర్‌లో వైద్యం అంది స్తుండగా 18వ తేదీ రాత్రి హాది చనిపోయాడు. ఆ సాయంత్రమే అతడి మృతదేహం బాంగ్లాకు చేరింది. మరునాడే బాంగ్లాదేశ్‌ ‌దగ్ధకాండ మొదలయింది. ఉద్రిక్తతల మధ్య పార్లమెంట్‌ ‌భవన ప్రాంగణంలోని సౌత్‌ ‌ప్లాజాలో డిసెంబర్‌ 20‌న అంత్యక్రియలు జరిపారు. అంత్యక్రియల తరువాత కూడా హాది అభిమానులు పార్లమెంట్‌ ‌భవనంలోకి చొరబడడానికి ప్రయత్నించారు. కానీ పోలీసులు నిలువరించారు. ఇదంతా ఏమిటి? షేక్‌ ‌హసీనాకు ఆశ్రయం కల్పించిన భారత్‌ ‌మీద పగ మాత్రమే కాదు, బాంగ్లాదేశ్‌ను మతరాజ్యంగా తక్షణం మార్చడం కూడా.

 ఈ అల్లర్లను అడ్డం పెట్టుకుని పాత పగలతో దీపూచంద్ర దాస్‌ అనే దుస్తుల తయారీ కర్మాగారం కార్మికుడిని సాటి కార్మికులు దైవ దూషణ చేశాడంటూ అతి కిరాతంగా చంపారు. బాంగ్లాదేశ్‌ ‌హిందు, బౌద్ధ, క్రైస్తవ ఐక్య సమితి ఈ హత్యను తీవ్రంగా గర్హించింది. నిజానికి దీపూ హత్య తాజా హింసలో తొలి ఘట్టం అనుకోవచ్చు. డిసెంబర్‌ 19‌న మిగిలిన చోట్ల విధ్వంసం విస్తరించింది. 18వ తేదీ రాత్రే దీపూను సాటి కార్మికులు హత్య చేశారు. బాంగ్లాదేశ్‌ ‌నేషనలిస్ట్ ‌పార్టీ నాయకుడొకరి ఇంటికి తాళం పెట్టి తగులబెట్టడంతో ఏడేళ్ల బాలిక చనిపోయింది. దీపూ హత్యకు సంబంధించి మొత్తం పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. బాంగ్లాలో ఉద్యమాల పేరుతో మతోన్మాదం ఎంత చెలరేగి పోతున్నదో డిసెంబర్‌ 19‌వ తేదీన గోవిందదాస్‌ అనే రిక్షా కార్మికుని మీద జరిగిన దాడి కూడా తెలియచేస్తున్నది. అతడు ‘రిసెర్చ్ అం‌డ్‌ అనాలిసిస్‌ (‌రా)’ ప్రతినిధి అంటూ ఒక మూక వచ్చి దాడి చేసింది. నిజానికి అతడి చేతికి హిందువులు సాధారణంగా ధరించే ఎర్రదారం కనపడడమే దాడికి అసలు కారణమని చెబుతున్నారు. ఝనైదా పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో ఈ సంఘటన జరిగింది. ఈ నిరసనలలోనే బాంగ్లాదేశ్‌ ‌నేషనలిస్ట్ ‌పార్టీ నాయకుడు ఒకరి ఇంటిని ఆందోళనకారులు తగులబెట్టారు. ఇంటికి బయట తాళం వేయడంతో లోపల ఏడేళ్ల బాలిక సజీవ దహనమైంది. మరొక ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.లక్ష్మీపూర్‌ ‌సదర్‌ ‌దగ్గర డిసెంబర్‌ 20 అర్ధరాత్రి ఈ దుర్ఘటన జరిగింది.

విద్యార్థుల మద్దతుతో షేక్‌ ‌హసీనాను పదవీ చ్యుతురాలిని చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఇంక్విలాబ్‌ ‌మంచ్‌ ‌నాయకుడు హాది. 32 ఏళ్ల హాది కరుడగట్టిన భారత వ్యతిరేకి. 2024 ఆగస్ట్‌లో షేక్‌ ‌హసీనా దేశం నుంచి పారిపోయి భారత్‌లో తలదాచుకున్న సంగతి ఇతడిని నిలవనీయడం చేసింది. కొద్దిసేపు గడిస్తే అప్పుడే ఆమెను చంపే వారని కూడా అప్పుడు వార్తలు వచ్చాయి.అప్పటి నుంచి ఇతడు పూర్తి భారత వ్యతిరేకిగా మారాడు. టీవీలలో, బయట జరిగే ఇతడి కార్యక్రమాలను చూసి దేశమంతటా అభిమానులు ఏర్పడ్డారు. అదే సమయంలో వ్యతిరేకులు కూడా పెరిగారు. జెన్‌జీ పేరుతో నిరుడు జరిగిన హింసాకాండలో 1400 చనిపోవడానికి హసీనా కారణమని చెబుతూ ఆమెకు నవంబర్‌లోనే ఆ దేశ న్యాయస్థానం మరణదండన విధించింది.

 దేశంలోని అన్ని రాజకీయ పక్షాలు హాది మరణం పట్ల సంతాపం ప్రకటించాయి. కుట్ర దారులను వెంటనే పట్టుకోవాలని ఆ పార్టీలు తాత్కా లిక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. హాది మరణం దేశానికి తీరని లోటు అని తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ ‌యూనుస్‌ ‌వ్యాఖ్యానించారు. డిసెంబర్‌ 20‌న హాది మృతికి సంతాపసూచకంగా దేశంలో సెలవు ప్రకటించారు. ఫిబ్రవరిలో తలపెట్టిన ఎన్నికల పక్రియకు భంగం కలిగించడానికే కుట్రదారులు ఈ హత్యకు పాల్పడ్డారని యూనుస్‌ ఆరోపించారు. హాది ఆ ఎన్నికలలో (వచ్చే ఏడాది ఫిబ్రవరి 12) ఢాకా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని అనుకున్నారు. ఆ ప్రచారంలో ఉండగానే డిసెంబర్‌ 12‌న కాల్పులు జరిగాయి. వారం రోజులు మృత్యువుతో పొరాడిన హాది డిసెంబర్‌ 18‌న చనిపోయారు. ఈ హత్యకు ఆవామీలీగ్‌, ‌భారత్‌ ‌కారణమని అక్కడ గగ్గోలు పెడుతున్నారు. ఆవామీ లీగ్‌ ‌కార్యకర్తలుగా పేరున్న ఫైయాసల్‌ ‌కరీం మసూద్‌, ఆలంగీర్‌ ‌షేక్‌ ఈ ‌హత్య చేసి భారత్‌కు పారిపోయా రని కూడా బాంగ్లాలో వదంతులు వ్యాపించాయి. మా దేశంలో కల్లోలం సృష్టించిన వారికి మీరు ఆశ్రయం ఇస్తే, ఈశాన్య రాష్ట్రాలలోని తిరుగుబాటు దారులకు తాము కూడా ఆశ్రయం ఇవ్వవలసి వస్తుందని నేషనల్‌ ‌సిటిజన్‌ ‌పార్టీ నాయకుడు హస్నత్‌ అబ్దుల్లా ఇప్పటికే ఒక ప్రకటన జారీ చేశారు.

డిసెంబర్‌ 18‌న చనిపోయిన షరీఫ్‌ ఉస్మాన్‌ ‌హాదిని షహీద్‌ అం‌టూ బాంగ్లాదేశ్‌ ‌గౌరవించు కుంటున్నది. పనిలో పనిగా ఢాకా విశ్వవిద్యాల యంలో ఒక మందిరానికి ఉన్న వంగబంధు షేక్‌ ‌ముజిబూర్‌ ‌రెహమాన్‌ ‌పేరు తొలగించి దానిని షహీద్‌ ‌షరీఫ్‌ ఉస్మాన్‌ ‌హాదీ హాల్‌ అని మార్చారు. ఇంక్విలాబ్‌ ‌మంచ్‌ ‌నాయకుడు హాది మృతికి సంబంధించిన కొత్త సమాచారం 24 గంటలలో సిద్ధం చేయాలని ఆ దేశ హోంశాఖకు ఉద్యమకారులు గడువు నిర్ణయించారు.

హాది అంత్యక్రియలు ఢాకాలోని విశ్వవిద్యాలయం మసీదు దగ్గరి శ్మశానవాటికలో నిర్వహించారు. దీనికి దేశ తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్‌ ‌యూనుస్‌ ఇతర ప్రముఖులు హాజరయ్యారు. హాది మృతదేహాన్ని బాంగ్లాదేశ్‌ ‌జాతీయ కవి ఖాజీ నజ్రుల్‌ ఇస్లాం సమాధి పక్కనే ఖననం చేశారు. అంటే నజ్రుల్‌ ఇస్లాంతో సమంగా గౌరవించినట్టే. అయితే సెక్యులరి జానికి అంకితమైన నజ్రుల్‌ ‌సమాధి పక్కన హాది అంత్యక్రియులు నిర్వహించడంపైన కొందరు నిరసన వ్యక్తం చేశారు. నజ్రుల్‌కు తిరుగుబాటు కవి అన్న పేరు ఉంది.

అంతర్జాతీయ సమాజం కూడా దౌత్య మర్యాద లను మరచి వ్యవహరిస్తున్నది. హాది హత్యను కొన్ని పాశ్చాత్య దేశాలు బరువైన పదాలతో ఖండించాయి. కానీ దీపూ, గొవిందదాస్‌, ‌బీఎన్‌పీ నేత ఏడేళ్ల కుమార్తె దారుణ మరణం గురించి కనీసం ప్రస్తావిం చడం లేదు. యూఎస్‌ ‌దౌత్యకార్యాలయం, యూరోపి యన్‌ ‌యూనియన్‌, ‌జర్మనీ, ఫ్రాన్స్ ‌హాది హత్య పట్ల బాహాటంగా సానుభూతి ఒలకబోయడంలోని విజ్ఞతను భారత విదేశ వ్యవహారాల మాజీ కార్యదర్శి కన్వల్‌ ‌సిబల్‌ ‌ప్రశ్నించారు. ఆసియాలో మానవ హక్కులు, సెక్యులరిజం అమలు, ప్రజాస్వామ్య పరిరక్షణ విషయంలో ఆ దేశాలు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నాయని  విమర్శించారు. హాదికి ముస్లిం మతోన్మాద వర్గాలతో సంబంధాలు ఉన్నాయని, అతడు ఇంక్విలాబ్‌ ‌మంచ్‌ ‌నాయకుడని, ఈ మంచ్‌ ఉద్దేశం దేశంలో ఇస్లామిక్‌ ‌పాలన తేవడమేనని సిబల్‌ ‌గుర్తు చేశారు. భారత్‌ అధీనంలోని ఈశాన్య భారత రాష్ట్రాలపై హాది తరుచు హక్కును ప్రకటిస్తూ ఉంటాడని, హాది భారత వ్యతిరేకత అందరికీ తెలిసినదేనని సిబల్‌ ఎక్స్ ‌వేదికగా ఇచ్చిన ప్రకటనలో వ్యాఖ్యానించారు. ఇంక్విలాబ్‌ ‌మంచ్‌ ‌లక్ష్యం ప్రజాస్వామ్య, సెక్యులర్‌ ‌బాంగ్లాను ఇస్లామిక్‌ ‌దేశంగా మార్చడమేనని తెలుసుకోవాలని ఆయన పేర్కొన్నారు.  షేక్‌ ‌ముజిబుర్‌ ‌రెహమాన్‌ (‌బాంగ్లా జాతిపిత) భవంతిని హాది అనుచరులు తగులబెట్టారని, దీనిని పాశ్చాత్య దేశాలు సమర్ధిస్తాయా అని కూడా సిబల్‌ ‌ప్రశ్నించారు. నిజానికి హాది అంత్యక్రియల తరువాత కూడా పార్లమెంట్‌ ‌భవనం మీద దాడికి హాది అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ పాశ్చాత్య దేశాలు ఇచ్చిన ప్రకటనలు అంతర్జాతీయ ప్రాముఖ్యం ఉన్న వ్యక్తుల విషయంలోనే సబబుగ ఉంటాయని సిబల్‌ ‌స్పష్టం చేశారు.

ఈ విధ్వంసమంతా ప్రస్తుతం బాంగ్లా మీద ఆధిపత్యం సంపాదించిన  ముస్లిం మతోన్మాద సంస్థలే చేయిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. షేక్‌ ‌హసీనా నాయకత్వంలోని ఆవామీ లీగ్‌ ‌ప్రభుత్వం పతనమైన తరువాత ఈ విధ్వంసక శక్తులే బాంగ్లాను తమ చేతులలోకి తీసుకున్నాయి. కాబట్టి జెన్‌జీ పేరుతో జరిగిన విద్యార్థుల అల్లర్లు, దీనికి వత్తాసు పలికిన సైన్యం, రాజకీయ పార్టీలు అన్నీ ఆ ముస్లిం మతోన్మాద శక్తులు ఆడించినట్టే ఆడాయని అర్థం చేసుకోవాలి. దేశంలోనే పెద్ద రాజకీయ పక్షం బాంగ్లాదేశ్‌ ‌జమాత్‌ ఇ ఇస్లామి (బీజేఐ), ఇతర ఇస్లామిస్ట్ ‌ముఠాలు హసీనా నిష్క్రమణ తరువాత బాంగ్లా మీద పట్టు సాధించాయి. ఇస్లామీ ఆందోళన్‌ ‌బాంగ్లాదేశ్‌, ఇస్లామి ఒయిక్యా జోతే, హెఫాజత్‌ ఇ ఇస్లాం వంటి తీవ్రవాద సంస్థలే ఇప్పుడు బాంగ్లాను శాసిస్తున్నాయి. వీటన్నిటికీ జమాతుల్‌ ‌ముజాహుదీన్‌ ‌బాంగ్లాదేశ్‌, ‌హర్కత్‌ ఉల్‌ ‌జిహాద్‌ అల్‌ ఇస్లామీ బాంగ్లాదేశ్‌, అన్సారుల్లా బాంగ్లా టీమ్‌ ‌వంటి ఉగ్రవాద సంస్థల మద్దతు ఉంది. ఇంకొన్ని తీవ్రవాద ముఠాలకు, హరున్‌ ఇజహర్‌, ఆసిఫ్‌ అద్నాన్‌, ‌జిమ్‌ ‌తన్వీర్‌ ‌వంటి నాయకులు యువతను  ప్రభావితం చేయగలుగుతున్నారు. పైకి వీటి ఆశయాలు, ఆచరణ వేర్వేరుగానే కనిపిస్తాయి. కానీ వాటన్నిటి ఉద్దేశం ఒక్కటే- బాంగ్లాదేశ్‌ను ముస్లిం మత రాజ్యంగా మలచడమే. ఆ ముస్లిం మత రాజ్యం అఫ్ఘాన్‌ ‌వలె లేదా ఇరాన్‌ ‌వలె ఉండాలని వారు కోరుతున్నారు.పైగా ఈ తీవ్రవాద ముఠాలన్నిటినీ పాకిస్తాన్‌ ‌గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ ‌కూడా ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఈ ముఠాలు, ఈ వ్యక్తులు అంతా బాంగ్లాకు చెందినవారేనన్నది వాస్తవం. కానీ హాది హత్యను తీవ్రవాద ముఠాల చర్యగా తాత్కాలిక పాలకుడు యూనుస్‌ ‌పేర్కొనడమే వింత. ఎవరా తీవ్రవాదులు? ఏవీ ఆ తీవ్రవాద ముఠాలు?

దీపూదాస్‌ ‌హత్యాకాండ బాంగ్లాలోని హిందువు లనే కాదు, భారతదేశంలోని హిందువులను కూడా కదిలించింది. కానీ ఆ విషయంలో సజావుగా, మర్యాదగా స్పందించే ఉద్దేశం కూడా బాంగ్లాకు లేదనిపిస్తుంది. డిసెంబర్‌ 21‌న ఈ అంశం మీద భారత్‌-‌బాంగ్లాల మధ్య జరిగిన మాటల యుద్ధం దీనినే నిరూపిస్తున్నది. దీపూ హత్యకు నిరసనగా పాతిక మంది హిందూ యువకులు ఢిల్లీలోని బాంగ్లా మిషన్‌ ‌కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహిం చారు. దీనినే బాంగ్లా మీడియా భద్రతా సమస్యను సృష్టించే ప్రయత్నం జరుగుతున్నదని వ్యాఖ్యానించడం విశేషం. నిరసన తెలిపిన వారిపై హిందూ తీవ్రవాదులుగా ముద్ర వేయడం తెంపరితనం తప్ప మరొకటి కాదు. ఇతర మతాలవారిని చంపడం తమ విశ్వాసంలో భాగమన్న మధ్యయుగాల మనస్తత్త్వాన్ని ప్రదర్శించడమే.

నిజానికి ఈ దుష్టశక్తులను పెంచి పెద్ద చేయడంలో షేక్‌ ‌హసీనా కూడా తనవంతు పాత్ర నిర్వహించారని, తన రాజకీయ మనుగడ కోసం చేరదీశారని కూడా విశ్లేషకులు చెబుతారు. 20 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికి ఉగ్రవాద మూకల ప్రభావం నుంచి ఆమె దేశాన్ని కాపాడలేకపోయారు. 2021లో దసరా సమయంలో 21 హిందువుల ఇళ్లకు మతోన్మాద శక్తులు నిప్పు పెట్టిన ఘటన ఆమె కాలంలోనే జరిగింది. కౌంటర్‌ ‌టెర్రరిజం అండ్‌ ‌ట్రాన్స్‌నేషనల్‌ ‌క్రైమ్‌ ‌యూనిట్‌ ఆఫ్‌ ‌ఢాకా, యాంటీ టెర్రరిజం యూనిట్‌ ‌వంటి ఉగ్రవాద నిరోధక వ్యవస్థలకు ఆ ఉగ్రమూకలు సవాళ్లు విసిరే స్థాయికి చేరుకున్నాయి. అయితే ఆ సంస్థలు ఉగ్రవాద నిరోధం కంటే, చిన్న చిన్న నేరాల దర్యా ప్తునకు పరిమితం కావలసి వస్తున్నదంటేనే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.

బాంగ్లా ఆవిర్భావం సందర్భంగా 1972లో రాసుకున్న రాజ్యాంగంలో సెక్యులరిజం అన్న పదం కనిపిస్తుంది. ముందుమాటలోని ఈ పదంతో పాటు, ఆర్టికల్‌ 8‌లో ప్రాథమిక హక్కులను కూడా చేర్చారు. కానీ ఐదేళ్లకే, అంటే 1977లోనే జనరల్‌ ‌జియా ఉర్‌ ‌రహమాన్‌ ‌రాజ్యాంగ స్వరూపం మార్చారు. ఐదో రాజ్యాంగ సవరణ ద్వారా సెక్యులరిజం అన్న పదం తొలగించారు. దాని స్థానంలో సర్వోన్నత అల్లాకు విధేయమైన రాజ్యంగా ప్రకటించారు. దీనితో 1988 నాటికి బాంగ్లా పూర్తి మత రాజ్యంగా ఆవిర్భవించింది. అయితే 2011లో మళ్లీ సెక్యులరిజం అన్న పదం రాజ్యాంగంలో చేరినా అంత ప్రాధాన్యం సంతరించుకోలేదు. ఇప్పటి అల్లర్ల వెనుక ఉన్నవారు బాంగ్లాను వడివడిగా మత రాజ్యం దిశగా అడుగులు వేయిస్తున్నారు.

ఇవన్నీ ఎలా ఉన్నా 2026 ఫిబ్రవరిలో జరగవలసిన బాంగ్లా ఎన్నికల మాటేమిటి? ఇప్పుడు అంతా వేసుకుంటున్న ప్రశ్న ఇదే. ఈ ఎన్నికల పక్రియను భగ్నం చేసి, ప్రజాస్వామికంగా బాంగ్లా సుస్థిరం కావడం ఇష్టం లేని వారే హాదిని హత్య చేశారని యూనుస్‌ ‌వ్యాఖ్యానించారు. కాగా మాజీ ప్రధాని ఖాలీదా జియా కొడుకు తారిక్‌ ‌రహమాన్‌ (60) ‌రంగంలోకి దిగవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాంగ్లాదేశ్‌ ‌నేషనలిస్ట్ ‌పార్టీకి ఇతడే తాత్కాలిక నేత. కానీ ఈ పార్టీని యూనుస్‌ ‌ప్రభుత్వం నిషేధించింది. ఒకవేళ బాంగ్లాదేశ్‌ ‌నేషనలిస్ట్ ‌పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చినా జమాత్‌ ‌పార్టీతో ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షుడు యూనుస్‌కూ, సైనిక దళాల ప్రధానాధికారి వాకరజ్‌ ‌జమాన్‌కు నడుమ విభేదాలు ఎలాంటి ఫలితాలకు దారి తీస్తాయో ఊహించడం కష్టం.

2024లో బాంగ్లాలో వచ్చిన సామాజిక సంక్షోభానికి ఉదారవాదులు జెన్‌జెడ్‌ ‌పేరు పెట్టి ఆకాశానికి ఎత్తారు. ఆ తరహా సంక్షోభాన్ని ప్రపంచం చూడడం అదే మొదటిసారి. ఇదే వ్యాధి తరువాత ఆసియా దేశాలు నేపాల్‌, ఇం‌డోనేషియా, ఫిలిప్పైన్స్, ‌తైమోర్‌లెస్టె, మాల్దీవులకు పాకింది. అది ఎక్కడ ఎలాంటి ఫలితాలను ఇచ్చిందో కూడా ప్రపంచం చూసింది.  ఏమైనా బాంగ్లా తనకు తాను తెచ్చుకున్న సంక్షోభానికి ఇప్పట్లో ముగింపు పలకలేదు. అప్పటి దాకా భారత్‌ అ‌ప్రమత్తంగా ఉండక తప్పదు. ఐదు రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న బాంగ్లాదేశ్‌తో కఠినంగా వ్యవహరించక తప్పదు. కాబట్టి ఇప్పటికైనా పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా వంటి నేతలు కళ్లు తెరుచుకోవడం అవసరం.


హిందువులపై రాక్షస మూకల దాడులు

‘వారి కుటుంబానికి దీపూచంద్ర దాస్‌ ఒక్కడే ఆధారం. దివ్యాంగుడైన అతడి తండ్రి, తల్లి, భార్య, వారి బిడ్డ అతడి జీతం మీదే ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు వారి పరిస్థితి ఏమిటి? జిహాదీల నుంచి తమను తాము రక్షించుకోవడానికి భారత్‌కు రావడానికి కూడా వాళ్ల దగ్గర డబ్బు లేదు. అక్కడ వాళ్లు దయనీయంగా ఉన్న మైనారిటీలు కాబట్టి వారిని ఆదుకునేవారే లేరు. వాళ్లకి దేశం లేద. వాళ్ల సొంత దేశం అనుకున్న చోటే వారి దేశం కాదు. వాళ్లకంటూ ఒక మతం ఉన్నది. కానీ వాళ్లకి మతం లేదు’ ఇవీ బాంగ్లాదేశ్‌ ‌మతోన్మాదుల చేతులో హింసకు గురై చనిపోయిన హిందూ నిరుపేద కార్మికుడు దీపూచంద్ర దాస్‌ ‌గురించి రచయిత్రి తస్లీమా నస్రీన్‌ అన్నమాటలు.

బాంగ్లాదేశ్‌లో చెలరేగిన తాజా హింసాకాండకు దీపూచంద్రదాస్‌ అనే ఈ కార్మికుడు బలైపోయాడు. ఇతడిని అత్యంత దారుణంగా హింసించారు. తరువాత చెట్టుకు వేలాడదీసి నిప్పు పెట్టారు. అతడి మీద ఆ రక్తపిపాసులు మోపిన నేరం ఒక్కటే- అతడు దైవదూషణకు దిగాడు. దాస్‌ను మైమెన్‌సింగ్‌ ‌జిల్లా భాలుకా అనే చోట డిసెంబర్‌ 19 ‌రాత్రి ఈ ఘాతుకం చోటు చేసుకుంది. ఒక దుస్తుల తయారీ సంస్థలో పనిచేసే దాస్‌, ‌సమీపంలోనే ఒక అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఇతడు దైవదూషణకు పాల్పడ్డాడని చెబుతున్నప్పటికి అందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవు. ఎలాంటి దర్యాప్తు జరగలేదు. ఉన్మాదం నెత్తికెక్కిన ఒక మూక అతడిని కర్రలతో చుట్టుముట్టి చనిపోయే వరకు కొట్టింది. తరువాత అతడి మృతదేహాన్ని ఒక చెట్టుకు వేలాడదీసి నిప్పంటించింది. చనిపోయిన వ్యక్తి దీపూచంద్ర అని భాలుకా పోలీస్‌ ‌స్టేషన్‌లో విధి నిర్వహణలో ఉన్న రిపోన్‌ ‌మియా బీబీసీ విలేకరి వద్ద ధ్రువీకరించాడు. ఈ హత్యకు దీపూదాస్‌ ‌దైవదూషణ చేసినట్టు చెబుతున్నప్పటికీ నిజానికి హాదీ మరణం తరువాత చెలరేగిన అల్లర్లలో భాగంగా, హిందువులపై జరుగుతున్న హత్యాకాండలో ఇదీ భాగమేనని చెబుతున్నారు.

దీనిని పశ్చిమ బెంగాల్‌ ‌బీజేపీ తీవ్రంగా ఖండించింది. వక్ఫ్ ‌సవరణ చట్టం సవరణ సమయంలో, అంటే ఏప్రిల్‌ 2025‌లో జరిగిన అల్లర్లలో ముర్షిదాబాద్‌కు చెందిన హరిగోవింద దాస్‌ (72), ‌చందన్‌దాస్‌ (40) ఇదే విధంగా చంపారని బీజేపీ నాయకులు ఆరోపించారు.

దీపూ హత్య గురించే తస్లీమా కూడా తన ఎక్స్ ‌ఖాతాలో వెల్లడించారు. అక్కడ జరిగినదేమిటో వివరించారు. భాలూకాలో దీపూ పనిచేస్తున్న దుస్తుల కర్మాగారం మేనేజర్‌ ‌బలవంతంగా ఉద్యోగానికి రాజీనామా చేయించాడు. అతడే ఆ ముఠాకు అప్పగించాడు. అతడు ప్రవక్త మహమ్మద్‌ను అవమానిస్తూ దూషణలకు దిగాడని, అందుకే సాటి కార్మికులు అతడిని కొట్టి చంపారని చెబుతున్నారు. ఇదంతా ఆ దుస్తుల తయారీ కర్మాగారం ఎదుటే జరిగింది. దీపూచంద్రకు పోలీస్‌ ‌భద్రత ఉన్నది. అయినా ఇంత ఘోరంగా అతడిని చంపారని తస్లీమా ఆరోపించారు. పాత పగలను దృష్టిలో ఉంచుకుని అదే కర్మాగారంలో పనిచేసే ముస్లింలు దీపూను చంపారని కూడా ఆమె చెప్పారు. అదెలాగంటే, ఇతడిని హైనాలలా మీదపడి సాటి కార్మికులు చీరుతుంటే పోలీసులు వచ్చి తన అదుపులోనికి తీసుకున్నారు. ఆ తరువాతనే అతడి ప్రాణాలు పోయాయి. ఎందుకంటే దీపూను తీసుకుపోతున్న కార్మికులను వెంబడించే ప్రయత్నమేదీ పోలీసులు చేయలేదు.జిహాద్‌ అం‌టే పోలీసులకు కూడా ఇష్టమే కాబట్టి దీపూ హత్యను ఆపే ప్రయత్నమేదీ చేయలేదని ఆమె తన ఎక్స్ ‌ఖాతాలో వెల్లడించారు.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE