సంపాదకీయం
శాలివాహన 1947 శ్రీ విశ్వావసు మార్గశిర బహుళ చవితి – 08 డిసెంబర్ 2025, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
హిందూ సమాజం మీద పూర్తి స్థాయి మత యుద్ధాన్ని పునఃప్రారంభించాలని కొందరు ముస్లిం మతోన్మాదులు వెంపర్లాడుతున్నారు. అందుకోసం ఘర్షణ రగిలించాలని తహతహలాడుతున్నారు. భారతదేశంలో మైనారిటీల హక్కులను ప్రభుత్వాలే కాదు, న్యాయవ్యవస్థలు కూడా నిరాకరిస్తున్నాయి, ఎక్కడ అణచివేత ఉంటుందో అక్కడ జిహాద్ ఉంటుందని జమాయిత్ ఉలేమా ఇ హింద్ అధ్యక్షుడు మహమూద్ మదానీ తాజాగా పేలడం ఆ తహతహలో భాగమే. ఈ డిసెంబర్ 6వ తేదీన పశ్చిమ బెంగాల్‌లో బాబ్రీ మసీదు పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుందని తృణమూల్ కాంగ్రెస్ శాసనసభ్యుడు హుమాయూన్ కబీర్ ప్రకటించడమూ అలాంటి ఉన్మాదమే. బుజ్జగింపు రాజకీయాలకు గండి పడడం, బుజ్జగింపుతోనే సొమ్ము చేసుకుంటున్న రాజకీయ దుకాణాలు వెలవెలబోవడం, హిందూ చైతన్యం అనే పరిణామాలను, ఆ క్రమాన్ని సక్రమంగా అర్థం చేసుకోలేక ఇలాంటి తల తిరుగుడు ప్రకటనలకు, చర్యలకు కొందరు తెగబడుతున్నారు.
జమాయిత్ ఉలేమా దేశంలో అత్యధిక ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్నది. అలాంటి సంస్థ అధ్యక్షుడు మదానీ ఇలా ప్రభుత్వం మీద, సుప్రీంకోర్టు మీద కూడా విజ్ఞత మరచి విషం చిమ్మారు. బాబ్రీ మసీదు, తలాక్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పులను విమర్శించారు. భారత రాజ్యాంగం మైనారిటీలకు ఇచ్చిన హక్కులను ఉల్లంఘించే విధంగా తీర్పులు ఉంటున్నాయని తేల్చేశారు. రాజ్యాంగాన్ని రక్షిస్తేనే సుప్రీంకోర్టును ‘సుప్రీం’ అనాలే తప్ప, ఆ అర్హత కోల్పోయినపుడు ఎందుకు అనాలని కుతర్కించారు. పెద్ద సర్వే చేసినట్టు ఆయన చాలా ధీమాగా కొన్ని గణాంకాలు పరిచారు. దేశంలో ముస్లింలకు మద్దతుగా నిలిచేవారు 10 శాతం ఉన్నారట. 30 శాతం వ్యతిరేకులట. కానీ 60 శాతం నిశ్శబ్దంగా ఉన్నారట. వీరితోనే ముస్లింలు తమ గోడు వెళ్లబోసుకోవచ్చునట. ఇక ఈ 60 శాతం కూడా ముస్లింల క్షోభను వినకుంటే దేశానికి పెనుముప్పు తప్పదని జోస్యం పేరుతో బెదిరింపునకు పాల్పడ్డారు. జిహాద్ నిజరూపం వెల్లడిస్తే ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. అసలు జిహాద్ అంటేనే పరమ పవిత్రమైనదని అర్థమనీ, కానీ మీడియా, ప్రభుత్వం దానికి విపరీతార్థాలు తీశాయనీ చెప్పి నిఖిల జగతినీ నిబిడాశ్చర్యంలో ముంచెత్తారు. మదానీ దృష్టిలో ఇదంతా అణచివేత. కాబట్టి ఎక్కడ అణచివేత ఉండునో అక్కడ జిహాద్ ఉండును అని సూత్రీకరించారు ఈ మతపెద్ద. మధ్యయుగాల వ్యూహాలతో, మతోన్మాదంతో మదానీ వంటి వారు హిందువుల మీద యుద్ధానికి ఉవ్విళ్లూరు తున్నారనీ, కాలు దువ్వుతున్నారనీ అనడానికి వందేమాతరం మీద, దానిని గౌరవించే సాటి ముస్లింల మీద మదానీ విసుర్లే నిదర్శనం. జాతీయ గీతాలాపనకు మృతప్రాయంగా మారిన ఒక సమూహం లొంగిపోయిందని ఆయన ఉవాచ. తాము, అంటే వందేమాతర గీతాన్ని వ్యతిరేకించే మూక, సజీవంగా ఉన్నారట. కాబట్టి ఏ పరిణామాలు ఎదురైనా ఎదుర్కొంటారట.
ఒకప్పుడు భారత్‌లో నిస్సహాయ హిందూ సమాజం మీద జిహాద్ జరిగింది. మరచిపోవద్దు, జిహాద్ భారతీయ ఆత్మను గాయపరిచిన ఆయుధం. బానిస వంశీయులు, మొగలులు చెలరేగిపోయిన కాలంలో వారి ‘ముస్లిం సేన’ సాగించింది అదే. కాబట్టి మీడియా, ప్రభుత్వం జిహాద్‌కు విపరీతార్థాలు కల్పించాయనడం, అణచివేతకు జిహాద్ ఓ జవాబు అని భాష్యం వినిపించడం ఓ దగా. బాధితులను ఇంకా వంచించాలన్న తెంపరితనం. మైనారిటీలనూ, మెజారిటీలనూ శాశ్వతంగా చేరువ కాకుండా ఉంచాలన్న దుర్బుద్ధి. బాబర్, ఔరంగజేబ్ స్పష్టమైన ఉద్దేశంతోనే జిహాద్ సాగించి, చరిత్రను రక్తపంకిలం చేశారు. ఆ నిర్వాకం ముస్లిం సేన ఘనతేనని బాబర్ నామా వంటి రచనలు ఎలుగెత్తిన సంగతి మదానీ స్థాయి మతపెద్దకి తెలియనిది కాదు. ముస్లింలంతా ఉగ్రవాదులు కాదు. కానీ ఎక్కడ ఉగ్రవాద ఘటన జరిగినా దాని వెనుక ముస్లింలు మాత్రమే ఉంటున్నారు. పాకిస్తాన్ పేరు ఉంటుంది. హైదరాబాద్ పాత నగరం జాడ ఉంటుంది. ముస్లిం మతోన్మాదం కొత్తగా సంతరించుకుంటున్న వెర్రితలలు గురించి చెప్పిన ఎర్రకోట పేలుడు ప్రపంచాన్ని నివ్వెరపరిచిన విషయం మదానీకి తెలియనిదా? ఒక వైద్య విశ్వవిద్యాలయాన్ని ఉగ్రవాదుల తయారీ కేంద్రంగా మార్చిన సంగతి ప్రపంచానికే వెల్లడైతే, మదానీ చెవిన పడదా? ఇక కశ్మీరీ ఉగ్రవాదులకు ప్రీతిపాత్రమైన నినాదమూ అదే, జిహాద్.
అసలే పశ్చిమ బెంగాల్, ఆపై తృణమూల్ ఎమ్మెల్యే. మతోన్మాదం సహజ లక్షణం కదా! డిసెంబర్ 6వ తేదీన ముర్షిదాబాద్ జిల్లా, బెల్డంగాలో బాబ్రీ మసీదు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నట్టు హుమాయూన్ కబీర్ అనే టీఎంసీ ఎమ్మెల్యే ప్రకటించారు. దీనికి దేశం నలుమూలలలోని ముస్లిం నేతలను పోగు చేసే పని పెట్టుకున్నారు కూడా. అయోధ్యలో కూలిన మసీదుకు అక్కడ పునర్జన్మనిస్తారట.
దీని వెనుక మమతా బెనర్జీ ఉన్నారన్న బీజేపీ విమర్శ అక్షరసత్యం. కానీ కాంగ్రెస్ నీళ్లు నమలకుండా ఖండిరచే ముచ్చటే రాదు, ఉండదు. మసీదు లేదా గుడి ఎవరైనా కట్టుకోవచ్చు. కానీ..కానీ ఎన్నికల ముందు ఇలా మసీదు కట్టడం కొద్దిగా బాగా లేదు అని సన్నాయి నొక్కులు నొక్కారు ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత అధీర్ రంజన్. నిజమేమిటి? వ్యక్తి పేరుతో మసీదు ఇస్లాంకు విరుద్ధం. ఆ పేరైనా ఎవరిది? మధ్య యుగాలనాటి విదేశీ దురాక్రమణ దారుడుది, రక్తపిపాసిది, మతోన్మాదిది. అతడి పేరిట 21వ శతాబ్దంలో ఈ నేల మీద మళ్లీ మసీదు నిర్మించడమంటే దేశాన్నీ, మెజారిటీ ప్రజలను ఘోరంగా అవమానించడం కాదా? అయోధ్యలో కొత్త మసీదు కోసం సుప్రీం తీర్పుతో కేటాయించిన స్థలం వదిలేసి బాంగ్లా సరిహద్దులలో ఈ మసీదు నిర్మాణమేమిటి? అయోధ్యలో బాబ్రీ కూలాక, మూడు దశాబ్దాల తరువాత, అసెంబ్లీ ఎన్నికల వేళ వేస్తున్న ఈ కుప్పిగంతులకు అర్థం ఏమిటి? మతోన్మాదులు కొత్తగా పాత యుద్ధం ఆరంభిస్తున్నారనే. కానీ పునరుజ్జీవనం పొందిన జాతి జిహాద్‌ను కొనసాగిస్తే సహించదని తెలుసుకోవాలి.