‘‘భారతదేశంలో ఇతఃపూర్వం ప్రభవించిన అవతారములన్నిటికంటె ఒక విశిష్టమైన అవతారం భగవాన్‌ ‌సత్యసాయిబాబావారిది  పూర్వ అవతారాల ప్రశస్తి ఆనాటి భారతీయులకు మాత్రమే తెలుసు. కాని సత్యసాయిబాబావారి ప్రశస్తి ఈనాటి ప్రపంచానికంతటికి తెలిసిపోయింది. కనుక పూర్వయుగాల మానవులకంటే ఈనాటి కలియుగ మానవాళియే ధన్యతమైంది’’ అంటారు ఆచార్య బిరుదురాజు రామరాజు.

పశుపక్ష్యాది జంతువులు ఒక పరిధిలో జీవనం సాగిస్తున్నాయి. జంతు ప్రాణులలో అత్యుత్తమ ప్రాణి మానవుడు తన ధర్మాన్ని విస్మరించి వ్యవహరిస్తు న్నాడు. అసలు ధర్మం, శాస్త్రం, గురువు అనేవి కేవలం మానవుడికి సంబంధించినవి. వీటి ఆచరణ ద్వారా మానవుడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి, ఉన్నత స్థితి నుండి అత్యున్నత స్థితికి, అత్యున్నత స్థితి నుండి మహోన్నత స్థితి, మహోన్నత స్థితి నుండి దివ్యస్థితి, దివ్యస్థితి నుండి దివ్యోన్నత స్థితి, దివ్యోన్నత స్థితి నుండి దైవస్థాయి స్థితి, దైవ స్థాయి నుండి దైవస్థితి, దైవస్థితి నుండి పరిపూర్ణ ‘దైవం’గా మారే అవకాశం మానవుడికి ఒక్కడికే-భగవంతుడు అనుగ్రహించాడు. దేవతలకుగాని, తిర్యక్కులకుగాని కర్మాధికారం లేనందున వాటికి ఈ అవకాశం లేదు.

అందుచేతనే జంతూనాం నరజన్మదుర్లభం అన్నారు జగద్గురు శంకరాచార్యుల వారు. మానవుడు శాస్త్రం, ధర్మం, గురువును విస్మరించినా, ధిక్కరించినా పతనం ఖాయం.

ధర్మాచరణ ప్రధానమైన అంశంగా కల్గిన మానవుడు, ధర్మాన్ని అతిక్రమించి వ్యవహరించడం వలన – మానవాళిని సంస్కరించేందుకు, తనకు తన యదార్థ తత్త్వం తెలియచెప్పేందుకు, ధర్మాచరణ వైశిష్ట్యం వివరించేందుకు ఒకరు వచ్చి- ఆచరించి చూపవలసిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ ధ్యేయంతో వచ్చిన దానినే ‘అవతారం’ అంటారు.

సత్యధర్మ స్వరూపులు శ్రీ రామచంద్రమూర్తి కాగా, శాంతి, ప్రేమ స్వరూపులు శ్రీకృష్ణభగవానుడు. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసామూర్తి బాబా వారు. 23.11.1926న ఉదయించిన అవతారం శ్రీ సత్యసాయి ప్రేమావతారం. ప్రేమ సేవలతో తరించవచ్చని లోకానికి ఒక గొప్ప దివ్యమైన, నవ్యమైన సందేశం ఇచ్చారు.

అవతరించుట యనుటలో అర్థమేమి, జనులపై ప్రేమ వాత్సల్య పరత తోడు వారి స్థాయికి దైవంబు వచ్చు భువికి, జీవప్రజ్ఞతోపాటుగా దైవప్రజ్ఞ అంటారు భగవాన్‌ ‌బాబా.

భగవంతుని అవతరణానికి కారణం- పుణ్యాత్ముల, సాధు పురుషుల ప్రార్థన ఒక కారణమైతే, దుర్మార్గుల దురాగతాలు మరొక కారణం. అసలు కారణం జనులపై గల అపారమైన ప్రేమ, ప్రీతి, వాత్సల్యమే. సమాజంను సంస్కరించా లని, మంచి పరివర్తన తీసుకురావాలని, వారి వారి యధార్థ స్వరూపం (ఆత్మస్థితి) తెలుసుకొని, సర్వేశ్వర రూపం ధరించియున్న సమాజంలో సేవ చేయించి తరింపచేయాలని, శాస్త్రము, వేదము ఎడల సదావగా హన, ధర్మాచరణ ఎడల అనురక్తి, ధర్మాచరణీయ జీవన విధానంలో పయనింపచేసి, జీవనం పావనం చేసుకునేలా చేయాలన్న మహాదివ్య సంకల్పమే భగవంతుని అవతరణకు ప్రధాన కారణం.

సత్యసాయి చూపిన అపార ప్రేమ 180 దేశాలక• వ్యాపించింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాదిమంది ప్రేమ సేవకు పెద్దపీట వేశారు.

ఆదిశంకరులవారు ‘జంతూనాం నరజన్మ దుర్లభం’ అంటే, సాయివారు – ఓ మానవా! నీవు దివ్యాంశ సంభూతుడవు, నీలో అనేక దివ్యగుణాలు న్నాయి, నీవు సామాన్యుడవు కాదు, నీవు సైతం దేవుడివే’ అన్నారు. కొన్ని మాయ తెరలు దట్టంగా, గాఢంగా క్రమ్ముకొని ఉన్నమీదట మీరు దైవం అని తెలుసుకొనలేక పోతున్నారు, ఆ మాయను తొలగించండి సాధన ద్వారా, ప్రేమ ద్వారా, సేవ ద్వారా. మీ యధార్థ దివ్య స్వరూపం ఆవిష్కృత మౌతుంది అని లోకానికి చాటి చెప్పారు.

సేవ ప్రేమతో చేయండి. అందులో కరుణ, దయ, జాలి, వాత్సల్యాలను నింపండి. సేవా ఫలితం పొందుతున్నవారు-పరవసించిపోవాలి. ఆ పారవశ్యంతో పునీతులు కావాలి, పునీతుడైన తాను- లోకానికి చేతనైన సేవచేయడానికి సంసిద్ధుడు అవుతాడు అని స్వామి గొప్ప విశ్లేషణ చేసి చెప్పారు.

ఎంత ఖరీదైన, విలువైన సేవ చేశావన్నది కాదు – ముఖ్యంగా ఎంత ప్రేమతో చేశావన్నదే ప్రధానం అంటారు సత్యసాయి.

సేవా ఫలితం-సేవ పొందుతున్నవారికి వస్తున్నా, సేవా పుణ్యం నువ్వు పొందుతున్నావు. పుణ్య సముపార్జనకు నువ్వు చూపే ప్రేమ, సేవ ఎంతగానో దోహదపడతాయని స్వామి చాటి చెప్పారు. ప్రపంచం మొత్తం మీద-ప్రతిరోజు కొన్ని కోట్ల విలువైన విద్య, వైద్య, వస్త్ర, ఆహార నైపుణ్య, సామాజిక, సాంఘిక సేవలు సమాజానికి – స్వామి చూపిన శ్రీ సత్యసాయి సేవాసంస్థలు అందిస్తున్నవి.

కుగ్రామం మొదలు కుబేర దేశాలలో సైతం విస్తరించిన శ్రీ సత్యసాయి సేవాసంస్థలు భాష, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సేవలు కొన సాగిస్తున్నాయి. ఈ సేవలు మూగ జీవులకు సైతం అందుతున్నాయి. గర్భిణీలకు సీమంతం, వారికి పౌష్టిక ఆహారం, శిశువుకు ఆరోగ్య పరిరక్షణ, విద్య, వస్త్రం, కుటీర సదుపాయాలు, త్రాగునీరు, యువతకు నైపుణ్య శిక్షణ, ఉపనయనములు, వివాహాలు, ఉపాధి-చివరకు శ్మశానవాటిక నిర్వహణ. ఇలా అనేకానేక కోణాలలో గిరిజన, ఆటవిక ప్రాంతాలలో మంచి నీటివసతి, పాఠశాలలు, కమ్యూనిటీ హాలు, విశ్వవిద్యాలయంవరకు అనేకానేక సేవలు ఏవిధమైన ఫలాపేక్ష లేకుండా ప్రపంచమంతా అందుతున్నాయి. శ్రీమంతులలో, విద్యావేత్తలలో, వైద్యులలో, కళాకారు లలో, రాజకీయవేత్తలలో, ప్రముఖులలో, శాస్త్రవేత్త లలో, సాంకేతికాధిపతులలో, సామాన్యులలో సైతం గొప్ప పరివర్తన కల్గించారు- తమ దివ్య మహిమా న్విత శక్తులచే దర్శన, స్పర్శన, సంభాషణలచే.

మానవాళిలో దాగియున్న దివ్యత్వాన్ని మేలుకొలిపి మనిషిని మనీషిగా ఎందరెందరినో తీర్చిదిద్దారు. వారు సాయి దూతలుగా, సాయి సేవకులుగా తరిస్తున్నారు.

నీ వద్ద ఏ శక్తి-సామర్థ్యాలు, వనరులు లేకపోయినా నువ్వు సమాజ సేవలో పాల్గొనవచ్చు, అదెలా అంటే నీవద్ద ఉన్న మంచి, గొప్ప మనసుతో సమాజ హితాన్ని హృదయపూర్వకంగా కాంక్షిస్తూ, సమస్త లోకాలు సుఖసంతోషాలతో ఉండేలా అనుగ్రహించమని భగవంతుడిని ప్రార్థించండి. మీ పరమ పవిత్ర సంకల్పాన్ని భగవంతుడు తప్పక నెరవేరుస్తాడు. ఇది ఒక గొప్ప సమాజసేవ అని సాయి ఉదహరించారు.

శ్రీ సత్యసాయి మహాసంస్థానం- ఇది అపూర్వ గొప్ప ప్రేమ సామ్రాజ్యం. విచ్చేసిన వారి హృదయా లను వికసింపచేసే పరమ పవిత్ర ప్రశాంతి పరంధామము- శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం.

ప్రశాంతి నిలయంలో, మందిర ప్రాంగణంలో ప్రవేశించి ఆసీనులైనవారికి ఒక దివ్య అనుభూతితో పాటు, నేను సైతం సమాజసేవలో పాల్గొనే శక్తి, సామర్థ్యాలు, పవిత్రంగా జీవనం సాగేటట్టు అనుగ్రహించమని ప్రార్థించడం అతి సహజం. వారికి తెలియకుండానే, ముందుగా అలా ఆలోచన లేకుండానే అలా స్వామిని ప్రార్థించడం గొప్ప విశేషం. ఇదే స్వామి లీల. ఇలా లక్షల, కోట్ల హృదయాలను తనవైపు త్రిప్పుకొని, వారందరిని సమాజసేవలో, వారివారి ప్రాంతాలలో చేయ ప్రోత్సహించడం స్వామివారి అపార కరుణకు నిదర్శనం.

ఇలా స్వామివారు వ్యక్తిలో తీసుకొస్తున్న పరివర్తన, కుటుంబం, సమాజం, రాష్ట్రం, దేశంపై ఎంతగానో ప్రభావం ఉంటున్నది. ఇది సత్యం- సత్యం-సత్యం.

కొందరిని ఎంపిక చేసుకొని వారి వారి హృదయాలలో ప్రవేశించి, హృదయాలను కదిపి, కుదిపి – వాళ్ల జీవితాలను ప్రక్షాళన చేసి పవిత్ర సేవా హృదయాలుగా తీర్చిదిద్ది, ఉత్తమ మార్గంలో ప్రయాణింపచేస్తున్న దివ్య పరిపూర్ణ ప్రేమావతారం – సత్యసాయి మహాదేవుని అవతారం.

అరిషడ్వర్గాలను సాధకుడు దూరం పెట్టాలి. లేకుంటే మానవుడిని అధోగతి పాలుచేస్తాయని శాస్త్రాలు, మహర్షులు బోధిస్తే …

సాయి అంటారు-వాటితో మచ్చికగా యుండండి. వాటితో భేటీ పడవద్దు. వాటిని ఢీకొనవద్దు. వాటిపై ఆగ్రహావేశాలు ప్రదర్శించవద్దు. అలా చేస్తే అవి ఇంకా తీవ్రరూపం దాలుస్తాయి.

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను ప్రేమతో గౌరవంతో పూజించాలి అంటారు. వాటిని ప్రేమతో భగవంతుని వైపు మరల్చడమే, త్రిప్పడమే పూజించడం అంటే ఇలా సాధకుడు చేయాలి. వాటితో ఘర్షణ పడకూడదు. విజయదశమినాడు ఆయుధపూజ ఎలా చేస్తారో-అలా వీటిని భగవంతుని వైపు త్రిప్పేసరికి దుర్గుణాలు, సద్గుణాలుగా మారతాయి అంటారు బాబా.

‘కామం’ దీనిని భగవంతుడిని దర్శించాలని, భగవంతుడి గురించి తెలుసుకోవాలని తపింప చేయాలి. ఇలా దీనిని కాంక్షగా మార్చాలి.

‘క్రోధం’ పట్టుదలగా మారి భగవత్‌ ‌సాక్షాత్కారం పొందాలని, పొందలేకపోవడానికి కారణం ఏమిటని క్రోధంపై క్రోధంవచ్చి ఆత్మావలోకనం చేసుకోవాలి.

‘లోభం’ అంటే పిసినారితనం. దీనితో భగవంతుడు నాకే చెందాలి, ఏమి చేస్తే నాకు చెందుతాడు అని యోచింపచేయాలి.

‘మోహం’ ఇది మూఢభక్తిగా మారి భగవంతునికై పరితపించాలి. భగవంతుడు లేకపోతే నేను లేను అనే రీతిగా మారాలి.

‘మదం’ అంటే గర్వం. ఇది భగవంతునిపై అచంచల విశ్వాసంగా, నాకు భగవంతుడున్నాడు అనే గొప్ప భరోసాతో గర్వంగా ఉండాలి.

‘మాత్సరం’ అంటే అసూయ. భగవంతుడు నేను పిలిస్తేనే పలకాలి. వేరేవాళ్లు పిలిస్తే పలుకకూడదు. భగవంతుడు నాకే దక్కాలి అని గాఢంగా యోచించి, యోచించి అలా భగవంతుడిని ధ్యానిస్తూ, తపించి తపించి అలసిపోయి తరించాలి.

లోకంలో ఎన్నో రకాల క్రూర జంతువులు, బలవంతమైనవి కూడా సర్కస్‌లో వాళ్ల యజమానికి వశమై, చెప్పినట్టు చేస్తాయి. ఉదాహరణకు ఏనుగు, పులి, సింహం, ఎలుగుబంటు, పాము, కుక్క ఇలా ఎన్నో ఉన్నాయి. ఇలా యజమానికి వశమై – తన సహజ లక్షణాన్ని వదలి సాత్వికంగా వ్యవహరిస్తు న్నాయి కదా, మరి ఈ అరిషడ్వర్గాలను శ్రీహరివైపు త్రిప్పితే అవి ‘హరిషడ్వర్గాలు’గా మారతాయి. ఆయనకు వశమై ఆనంద ప్రాప్తికి దోహదమౌతాయి అని సత్యసాయి కలియుగంలో అరిషడ్వర్గాలపై గొప్ప భాష్యం చెప్పారు. వినూత్న విశ్లేషణ చేశారు.

సేవ ప్రేమతో చేయండి. అందులో కరుణ, దయ, జాలి, వాత్సల్యాలను నింపండి. సేవా ఫలితం పొందుతున్నవారు – పరవసించిపోవాలి. ఆ పారవశ్యంతో పునీతులు కావాలి, పునీతుడైన తాను- లోకానికి చేతనైన సేవచేయడానికి సంసిద్ధుడు అవుతాడు అని స్వామి గొప్ప విశ్లేషణ చేసి చెప్పారు.

జంధ్యాల నాగేశ్వరరావు

ప్రవచనకర్త

About Author

By editor

Twitter
YOUTUBE