శ్రీకరపాత్రీస్వామి మార్కస్ కంటే ముందున్న పాశ్చాత్యులు చెప్పిన భౌతికవాదాన్ని, గతివాదాన్ని, వారి తర్క పద్ధతులలోని లోటుపాట్లను మన భారతీయ వేదాంతశాస్త్రం ఆధారంగా నిరూపించారు. అటు తర్వాత మార్కస్ గురువైన హెగెల్ సిద్ధాంతాన్ని విడమరిచారు. హెగెల్‌కు మార్కస్‌కు మధ్యనున్న ఫాయర్ వాఖ్ తత్త్వవిచారాన్ని గురించి ఇలా చెప్పారు.
దార్శనిక విచారములో హెగెల్‌కి శిష్యుడైనప్పటికీ మార్కస్ ఏమంటాడంటే, ‘హెగెల్ మేధస్సు అంతా ఆయన శిరస్సులో దాగిఉంది. నేను నా తెలివితేటలను నా కాళ్లయందు భావించి, స్వయంగా లేచి నిలబడ్డాను’ అని. హెగెల్‌కి మార్కస్ కి మధ్య ఫాయర్ వాఖ్ తత్త్వశాస్త్రం పుట్టింది. వాటినుంచి చాలా అంశాలను మార్కస్ గ్రహించాడు. చాలావాటిని ఖండించాడు.
‘ఈశ్వరుడు నా మొదటి చింతన. జ్ఞానం రెండోది. మూడోది, అంతిమమైనది మానవుడే’ అని వీటే పేర్కొన్నాడు. దీనిపై ఫాయర్ వాఖ్, ‘ఆదర్శవాదం, భౌతికవాదాల నడుమ పరస్పర యుద్ధం జరగడానికి తగిన స్థలం మానవుని మస్తిష్కం. మస్తిష్కం ఏవిధమైన వస్తువులతో రూపొందిందో తెలుసుకోగలిగితే… అన్యవస్తువులతో దానికి గల సంబంధాల విషయంలో చింతన స్పష్టరూపాన్ని దాల్చుతుంది’ అని చెప్పాడు. అతడే ఇంకా, ‘అస్తిత్వమే కర్త. తత్త్వచింతన క్రియ. చింతన అస్తిత్వం తాలూకు క్రియయే కానీ, కారణం కాదు. అస్తిత్వమే స్వయంగా సృష్టికి మూలం’ అని కూడా చెప్పాడు. అతడే మరికొంచెం వివరంగా, ‘ఆదర్శవాదుల దర్శనానికి ఆరంభమే పెద్ద తప్పు. స్వచ్ఛమైన దర్శనం ఎన్నడూ, ‘నేను’ నుంచి ప్రారంభం కాదు. ‘నేను – నువ్వు’ నుంచి ప్రారంభం అవుతుంది. అలా ప్రారంభమైన తత్త్వవిచారము లేదా పదార్థము కర్త – కర్మలకు గల సంబంధాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది. ‘నేను’ అనే భావం స్వయంగా తనకోసమే ‘నేను’ అవుతుంది. కానీ ఇతరుల విషయంలో ‘నీవు’ అనాల్సి వస్తుంది.
‘ఇదెలాగంటే ‘నేను’ అనేది ఒకేసారి కర్త, కర్మ కూడా కాగలదు. కానీ ‘నేను’ అనేది అమూర్తసత్త కాజాలదు. ‘నా’ వాస్తవిక అస్తిత్వం నా శరీరమే. ‘నా’ సమగ్ర స్వరూపంలో ‘నా’ వాస్తవిక సత్త ఇమిడి ఉంది. ఎక్కడ తత్త్వవిచారం జరుగుతుందో… అక్కడ అది అమూర్తం కాదు. భౌతిక అస్తిత్వమే కర్త అవుతుంది. తత్త్వవిచారమే దానికి క్రియ. తత్త్వవిచారము, దానితో పొసగని విరోధానికి గల అస్తిత్వమే ఈ రెండే సమస్యలను రేకెత్తించేవి. ప్రకృతి లేదా పంచభూతాలను నియంత్రించి ఉంచడం ద్వారా లేదా వాటిని మిధ్యగా తలపోయడం ద్వారా సమస్యలు మొలకెత్తకుండా పోతాయి’ అని చెప్పాడు.
ఫాయర్ వాఖ్ చెప్పేది ఏమిటంటే, ‘స్పినోజ్ సిద్ధాంతం చేత ధర్మవిద్యలోని గజిబిజితనాన్ని తీసివేయగలిగితే మూలమునందు అంతా సరిగ్గా ఉంటుంది’ అని. ఆదర్శవాదులతో సంబంధాన్ని తెగదెంపులు చేసుకున్న తరువాత మార్కస్ – ఏంగెల్స్ మునుముందుగా ఈ తత్త్వచింతననే తమ సొంతం చేసుకున్నారు అని చెబుతుంటారు. ఫాయర్ వాఖ్ ఇలా చెబుతాడు… ‘బయటి వస్తువుల క్రియను విషయమాత్రంగా భావించిన మానవుడు ఆయా వస్తువులను గుర్తించగలుగుతాడు.’ కానీ మార్కస్ అభిప్రాయంలో, ‘వస్తువుపై మనదైన ప్రతిక్రియను ఆచరించడం ద్వారా ఆయా వస్తువులను గుర్తించగలుగుతాం.’
పైన పేర్కొన్న పండితుల తత్త్వచింతన అంతా భారతీయ దర్శనాల దృష్టిలో చాలా స్థూలమైనది. విషయేంద్రియ సంయోగజన్యమైన సుఖమే వాస్తవిక సుఖం కాజాలదు. అనశ్వర సుఖం ఆత్మస్వరూపమే అయి ఉన్నది. వాళ్లు చెప్పిందే నిజమైతే ఒక వృద్ధుడు గోక్కోవడం ద్వారా దురద తీర్చుకోవడం కూడా సుఖమే అని చెప్పాలి. బుద్ధిమంతుడు అయిన వాడు ఎవడైనా దానిని సుఖంగా చెప్పగలడా? ఈ విధంగా సూక్ష్మవివేచన కొరవడితే అస్తిత్వయుక్త పదార్థాన్నే అస్తిత్వంగా భావించి దానిని కర్తగానూ, విచారాన్ని కర్మగానూ సంభావిస్తుంటారు.
అస్తిత్వం అనేది సూక్ష్మవస్తువు. తత్త్వవిచారంలో కూడా అనుస్యూతంగా వస్తూనే ఉంటుంది. ఇట్టి అస్తిత్వం లేనికారణంగా దేహము – దేహానికి అంతర్గతమైన దాని సమగ్రతకు పూరకంగా నిలిచేది కూడా అసత్తుగానే మిగిలిపోతుంది. సర్వ విశేషణా రహితమైన అస్తిత్వమే సర్వత్ర సమానరూపంలో అనుస్యూతంగా వస్తున్న కారణంగా దానిని సర్వబీజంగా పేర్కొనాలి. దానికి పక్కనే తత్త్వవిచారంలోని సూక్ష్మత దాగి ఉంటుంది. దానియందే ‘నేను – నీవు’ అనే భావాలన్నీ అంతర్భావాలుగా కలగలిసిపోతాయి. బహిర్ముఖాలైన ప్రాణులకు ‘నేను’పై ఆధారపడియే ‘నీవు’ అనేది ఆవశ్యకమని అధిక స్పష్టంగా కనిపిస్తుంది.
ఫాయర్ వాఖ్ దర్శనానికి టిప్పణి రాస్తూ మార్కస్ ఇలా అన్నాడు. భౌతిక సిద్ధాంతంలో దేని అనుసారంగా అయితే మానవులు పరిస్థితులు, విద్య ద్వారా రూపుదిద్దుకుంటారని చెప్పడానికి వీలవుతోందో… అట్టి దానిని పూర్తిగా మరిచిపోయారు.
మానవుడు పరిస్థితులకు అనుగుణంగా పరివర్తన చెందుతాడు. అందుకు శిక్షకుడు స్వయంగా సుశిక్షితుడు కావాల్సిన అవసరం ఉంది. అదే ఈ సమస్యకు సమాధానం అవుతుంది. ఇతిహాసాలను భౌతిక ధారణ చేయగలిగితే రహస్యాల ద్వారా తెరుచుకుంటాయి.’ ఫాయర్ వాఖ్ తత్త్వవిచార ప్రణాళికల వికాసాన్ని, మానవసత్త వికాసంగా కూడా చెప్పాడు. పంచభూతాలు మానసమందు (జ్ఞానమందు) పుట్టినవి కావు. మానసమనేది భూతసృష్టి కంటే సర్వోత్కృష్టమైనది అన్నాడు. హెగెల్ చెప్పిన ద్వంద్వవాదాన్ని వాఖ్ ఖండించాడు. మార్కస్ దానినే గ్రహించి, తనదైన ద్వంద్వాత్మక భౌతిక వాదాన్ని రూపొందించాడు.
(వచ్చేవారం…తెలుసుకోవాల్సిన సత్యాలు)
హిందీమూలం : కరపాత్రీ స్వామి
అనువక్త : నేతి సూర్యనారాయణశర్మ