‘భరతదేశము వేదాల పట్టుగొమ్మ. యజ్ఞ యాగాది క్రతువుల కాటపట్టు. పెక్కు అవతారములు గన్న పెద్దతల్లి. నీతి నియమాల రూపు ఈ త్యాగ భూమి’ – బాబా.
మనదేశం ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి మానవుడు ఎదగడమే ఆధ్యాత్మికత. మానవుని ప్రవర్తన ఆదర్శంగా, ఇరుగు పొరుగు వారికి సహకరిస్తూ సేవాభావంతో సాగడమే ఆధ్యాత్మికత. ఇంకా మానవునిలో మాధవుని చూడటమే!
మాతృదేవోభవ. పితృదేవోభవ. ఆచార్యదేవోభవ. అతిథిదేవో భవ. సత్యం వద, ధర్మంచర వంటి అనే సూత్రాలున్నాయి. నేడు వీటిని హ్యాస్యాస్పదమైన మాటలుగా భావిస్తున్నారు. తల్లితండ్రులు ముసలి వారయ్యాక వృద్ధాశ్రమాల పాలవుతున్నారు. చదువులు సంస్కారాన్నివ్వడంలేదు. ధనవ్యామోహం అధికమై, స్వార్థం పెరిగి భారతీయ సంస్కృతి మరుగునపడే సమయంలో భగవాన్ శ్రీసత్యసాయి బాబా పుట్ట పర్తిలో అవతరించి భారతీయ సంస్కృతిని కాపాడేం దుకు పూనుకున్నారు.
అవతరించడం అంటే? వేదోధ్ధరణ, పండిత పోషణ, భక్తరక్షణ, సాధు సంరక్షణ. వీటన్నింటినీ సరిదిద్దాలని బాబా బాలవికాస్‌ను ప్రారంభించారు.
education is for life, and not for living (విద్య జీవిత పరమావధి కోసమే కానీ జీవించటానికి మాత్రమే కాదు). దీనిని బోధించేందుకే స్వామి బాలవికాస్ స్థాపించారు. మొదట్లో (1969)లో ‘బాలవిహార్’ అనే పేరు పెట్టారు బాబా. 1971లో బాలవికాస్‌గా మార్చారు. విద్యాసంస్థలలో మాత్రమే కాక బాలబాలికలంతా బాలవికాస్ బోధనాంశాలను నేర్చుకుని ఆచరించేలా సత్యసాయి సంస్థలలో ఒక విభాగంగా బాలవికాస్‌ను ఏర్పరచారు. మానవతా విలువలు పిల్లలకు ఇళ్లలో బోధించే తీరిక, ఓపికా లేని ఈ యుగంలో బాలవికాస్ ఎంతో ఉపయోగి స్తుంది. సత్యసాయి భగవానులు సత్య, ధర్మ, శాంతి ప్రేమ అహింసలనే ఐదు విలువలను మానవులకు తాను అనుసరిస్తూ, ఉపన్యాసాల ద్వారా బోధించ సాగారు. సేవకు ప్రత్యేక స్థానం ఇచ్చారు.
బాలవికాస్ ప్రధాన ఉద్దేశాలు -దేహ వికాసం, బుధ్ధి వికాసం, మానసిక వికాసం, హృదయ వికాసం, ఆత్మ ఆధ్యాత్మిక వికాసం కలిగించడం.
బ్లూజమింగ్ ఆఫ్ ఇండివిడ్యూవల్ పర్సనాలిటి
పిల్లలు మొగ్గలుగా ఉన్నపుడు మంచి శిక్షణ అందిస్తే ఉత్తమ పౌరులుగా తయారై అటు దేశానికీ, ఇటు సమాజానికీ, కుటుంబానికీ ఉపయోగపడతారు. ఆ ఉద్దేశంతోనే బాలవికాస్‌ను కులమతాలకు అతీ తంగా పిల్లలందరికీ అందించాలని సంకల్పించారు.
బుధ్ధి వికాసానికి తోడ్పడేవి మానవతా విలువలు. దేహ వికాసానికి తోడ్పడేవి క్రీడా పధ్ధతులు. ఆత్మ వికాసానికి తోడ్పడేవి భజనలు, స్తోత్రాలు, ప్రార్ధనలు, కధలు, అన్ని మతాలలోని మహనీయుల చరిత్రలు మొదలైనవి. బాలవికాస తరగతులను ప్రభుత్వ పాఠశాలలలోనూ, బస్తీలలోను, తమ గృహాలలోనూ బాలవికాస్ గురువులు ఏమీ ఆశించకుండా బోధి స్తారు. గురువులంతా ఈ పనిని స్వామి అప్పగించిన కర్తవ్యంగా భావిస్తారు. అందుకే బాలబాలికల్లో ఎంతో సానుకూల, పవిత్ర మార్పు వస్తున్నది.
బాలవికాస్ అంటే వ్యక్తిత్వ వికాసం. ప్రతీ వ్యక్తిలో అంతర్లీనంగా విశిష్ట వ్యక్తిత్వం ఉంటుంది. ప్రతీ విద్యార్థిలోని ఆ అంతర్లీన శక్తిని వెలికి తీసి దానిని అత్యున్నతమైన స్థాయికి తీసుకొనిపోయేందుకు పాటుపడేది బాలవికాస్. నేటి పిల్లలు రేపటి సమాజా నికి మార్గనిర్దేశకులుగా ఎదగటానికి, స్వీయ పరిశోధన – స్వీయ ఆవిష్కరణ మార్గంలో సాగేందుకు బాల వికాస్ తోడ్పడుతుంది. దీనిని బాలవికాస పూర్వ విద్యార్థులు యదార్ధమని రుజువుచేస్తున్నారు.
ఐశ్వర్యరాయ్ బచ్చన్, మిస్ వరల్డ్,నటి. ఆమె బాబా శతజయంతి సందర్భంగా పుట్టపర్తికి వచ్చి తాను బాలవికాస్ పూర్వ విద్యార్థిననీ, గురువులు నేర్పిన మానవతా విలువలు, నిస్వార్థ ప్రేమను, మానవసేవను ఆచరించడం వలన జీవితంలో ఎంతో లాభం పొందానని చెప్పారు.‘‘భగవాన్ బాబా ఆశీస్సులు, ప్రేమతో నాకు ఆశీర్వచనాలు అందాయి. నేను బాలవికాస్ విద్యార్థిని కావడం నా అదృష్టం. జీవితంలో చిన్న వయసునుండే బాలవికాస్ బోధనాం శాలను వినడం వలన వాటిని ఆచరించి ఎంతో లాభం పొందాను. నేను మంచి బాలవికాస్ పూర్వ విద్యార్థిగా ఉండాలని ఆశిస్తున్నాను. నా జీవితం ప్రారంభంలో బోధించిన విలువలను నా జీవితాంతం అమలుపరుస్తాను. పంచుకుంటాను.’’ అన్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా అదే వేదిక మీద తాను బాలవికాస్‌లో నేర్చిన అంశాల ద్వారా నా జీవితంలో విజయాలు సాధించి సుఖసంతోషాలతో ఉన్నానంటే అంతా స్వామి ఆశీర్వచనమే అన్నారు. మరొక క్రికెట్ క్రీడాప్రముఖుడు గవాస్కర్ బాబా భక్తుడు. యువ పారిశ్రామికవేత్త, బాలవికాస్ మరో పూర్వ విద్యార్థి డాక్టర్ సాజన్ శర్మ ఇలా చెప్పారు. ‘‘బాలవికాస్ పూర్వ విద్యార్థిని కావడం నా అదృష్టం. మానవతా విలువలను నేర్చుకుని, పాటించి, వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ఈ విలువలను అమలు చేయడం వల్ల నేను ఒక మంచి వ్యక్తిగా, సంస్థ వ్యవస్థా పకుడిగా జీవించేందుకు బాలవికాస్ సాయపడింది. బాలవికాస్ చెప్పే ఐదు మానవతా విలువలే నా ఆభరణాలు’’.
నేను ఒక బాలవికాస్ టీచర్‌ను. వృత్తిరీత్యా కూడా ప్రభుత్వ పాఠశాల టీచర్‌నే. బాలవికాస్ పూర్వ విద్యార్థుల సంస్కారం ఎలా ఉంటుందో నా జీవితం లోని ఒక స్వానుభవం మీ ముందుంచుతాను. ఒకసారి తిరుపతిలో బాలవికాస్ శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. పుట్టపర్తి నుంచి బయల్దేరి కదిరిలో తిరుపతి వెళ్లే రైలు ఎక్కడానికి వెళ్లాను. మొదటి ప్లాట్ ఫాంకు రైలు వస్తుందని మొదట ప్రకటించారు. చివరి నుంచి ఐదో లేదా ఆరోది మీ బోగీ కావచ్చు’ అని చెప్పారు. నేను నా రెండు లగేజీలతో వెళ్లి వారు చెప్పిన చోట ఉన్నాను. ఇంతలోనే తిరుపతి వెళ్లే రైలు రెండో నెంబరు ప్లాట్ ఫాంకు వస్తుందని ప్రకటన వచ్చింది. రెండు లగేజీలతో సుమారు కిలో మీటరు దూరంలోని బ్రిడ్జ్ ఎక్కి అటువైపుకు వెళ్లే సమయం లేదు. మరేం చేయలేక ‘జై సాయిరాం!’ అంటూ ఫ్లాట్ ఫాం దూకేసి, లగేజీలు పట్టుకుని 4 లైన్లు దాటి రెండో ప్లాట్‌ఫాం దగ్గర కెళ్లాను. అది చాల ఎత్తుగా ఉంది. అక్కడున్న వారిని సాయం చేయమని అడిగాను, వింతచూస్తున్నారు తప్ప సాయానికి రాలేదు. అప్పుడు నా వయస్సు 73 (ఇప్పుడు 78). ఐతే స్వామి దయవల్ల వేరే ఏ అనారోగ్యాలూ లేవు. కానీ జనం ఆత్రంగా చూస్తున్నారు. ఎందుకంటే, రెండు రైళ్లు ఒకేమారు వస్తున్నాయి. ఇంతలో సుమారుగా 20 ఏళ్ల వయస్సున్న ముగ్గురు అటూ వెళుతుండగా నేను ‘హెల్ప్ – హెల్ప్’ అని అడిగాను. వారు వెంటనే లగేజీలూ ఒకరు తీసుకోగా, మిగిలిన ఇద్దరూ నా రెండు చేతులూ దొరకపుచ్చుకుని ప్లాట్‌ఫాం పైకి లాగారు. రెండే నిముషాల సమయం. వెంటనే రెండు రైళ్లు వచ్చి ఆగాయి. ఆ ముగ్గురే నా బోగీ నెంబర్ అడిగి లగేజీలతో సహా ఎక్కించారు. ధన్యవాదాలు చెప్పి ‘మీరెవరు? ఎక్కడికి వెళ్తున్నారూ?’ అని అడిగాను. వారు ‘‘మేడం! మేము బాలవికాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులం. కదిరిలో ఒక స్కూల్లో బాలవికాస్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తుంటే సాయం కోసం వచ్చాం.’’ అని చెప్పారు. నేను చాలా ముచ్చట పడ్డాను. ఇదీ బాలవికాస్ ఇచ్చిన సంస్కారం.
నేను ప్రభుత్వ పాఠశాలల్లో 40 ఏళ్లు పనిచేశాను. నా విద్యార్ధులకి బాలవికాస్ చెప్పేదాన్ని. వాళ్లలో చాలామంది ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, పోలీస్‌శాఖ లోనూ, కొందరు ఉపాధ్యాయులుగా పనిచేస్తుండటం నాకు గర్వకారణం. బాలవికాస్‌లో నేర్చిన విలువలు పాటిస్తూ, ధర్మబధ్ధమైన జీవనం గడుపుతున్నారు. ఇటీవల నన్ను కలిసిన కొందరు ‘‘మీరు ఆనాడు నేర్పిన మానవతా విలువలు పాటించడం వలన హాయిగా జీవిస్తున్నాం, మా ఉద్యోగాల్లో గుర్తింపు, గౌరవం వచ్చాయి’’ అని చెప్పారు. సేవలన్నింటిలోకీ ఉత్తమసేవ బాలవికాస్ సేవ.
ఎందరెందరో బాల వికాస్ పూర్వ విద్యార్ధులు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ ధర్మంగా జీవిస్తున్నా, బాలవికాస్‌లో తాము నేర్చుకున్న విషయాలను, ఎలా ఆచరిస్తూ లాభం పొందుతున్నారో చెప్తూనే ఉన్నారు. వారి ప్రవర్తన సత్యసాయి సంస్థలకే కాక, భారత దేశానికే మంచి పేరు తెస్తున్నది. స్వామి వారి అవతారతత్వాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ వారంతా ఆదర్శంగా ఉన్నారు. బాలవికాస్ గురువులుగా పనిచేయడం, బాలవికాస్ విద్యార్థులు కావడం రెండూ దైవానుగ్రహానికి పాత్రులను చేస్తాయి.
మానవతా విలువల గురించీ బాబా-
సత్య ధర్మ మహింసయు శాంతిప్రేమ
మానవుని పంచప్రాణాలు మహినిచూడ
పంచప్రాణాలలో ప్రేమ ఎంత హెచ్చు
కాన హృదయాన ప్రేమను గట్టిపరచు.
స్వామి ఇలా ప్రేమ అనే ఆయుధంతో అందరినీ సరిచేసి మానవసేవ చేయించడానికి పూనుకున్నారు. స్వామి సేవకూ అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. వారు పసితనంలోనే సేవచేసి ఆదర్శాన్ని అందించి ప్రభోధిం చారు. సేవ అహంకారాన్ని నిర్మూలిస్తుంది. స్వామి వారి మాటలు పాటిస్తూ -సత్యసాయి సంస్థలు అనేకానేక విధాలుగా సమాజ సేవ చేస్తూ లోకాని కంతా ఆదర్శంగా ఉంటున్నాయి.
మానవుడు తనకూ, సమాజానికీ రెండింటికీ ఉపయోగించే విద్యను నేర్వాలి. తాను సుఖశాంతు లను పొందుతూ సమాజానికీ సుఖశాంతులను అందించాలి. మనం కూడా సమాజంలో వ్యక్తులమే అయినందున సమాజం సుఖశాంతులతో ఉంటే మనమూ సుఖశాంతులతో ఉంటాం. సమాజానికీ వ్యక్తికీ అవినాభావ సంబంధం. శరీరమనే సమా జంలో కాలో చెయ్యో లాంటి వాడు వ్యక్తి. కనుక సమాజ క్షేమాన్ని నిరంతరం ఆలోచించే లాగా వ్యక్తి జీవించాలని బాలవికాస్, సత్యసాయి సేవా సంస్థా నేర్పుతున్నది.. ఆధ్యాత్మికత ఒంటబడితే హృదయం పవిత్రంగా ఉంటుంది. పిచ్చి పిచ్చి భావములచే మనస్సు కల్మషం కాదు నిర్మలమైన హృదయంతో, నిస్వార్ధమైన కర్మలతో ఈ సమాజంలో పాల్గొని సమాజానికి తగిన సహాయం చేయ గలుగుతారు. సేవలో పాల్గొని దైవ దీవెనలు పొందగలుగుతారు. ఈ ఆధ్యాత్మిక విద్య వలన మానవత్వం మేల్కొం టుంది. ఆత్మశోధప మొదలవుతుంది.
విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి
సంకుచిత భావముల నెల్ల సమయ జేసి
ఐకమత్యము సహజీవనాదికములు
సమత నేర్పునది గాదె సత్యసాయి విద్య.
ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తే ‘ధర్మమూల మిదం జగత్’ అని అర్థమవుతుంది. ధర్మమార్గాన పయనించే చాకచక్యం వస్తుంది.
The proper study of mankind is man baba
చివరిగా-బాలవికాస్ గురించి నేను చెప్పినది చాలా స్వల్పం. ఈ విషయాల గురించి మరింత తెలుసుకోగోరేవారు ‘hymavathy Aduri’: ‘సత్యసాయి మహిమాఝరి’ యూట్యూబ్స్‌లో పూర్తిగా చూడవచ్చు. ప్రస్తుతం పుట్టపర్తిలోనే ఆశ్రమంలో స్వఛ్ఛంద సేవ చేస్తూ జీవిస్తున్నాను.
సర్వేజనాఃసుఖినోభవంతు. జైసాయిరాం.
సత్యసాయి పాదార్చిత
ఆదూరి హైమవతీ శ్రీనివాసరావు