2016‌లో, ఛత్తీస్‌గఢ్‌, ‌నవ రాయ్‌పూర్‌లో శ్రీ సత్యసాయి సంజీవని సూపర్‌-‌స్పెషాలిటీ హాస్పిటల్‌ ‌ఫర్‌ ‌చైల్డ్ ‌హార్ట్ ‌కేర్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రసం గిస్తూ ‘‘భగవాన్‌ శ్రీ ‌సత్యసాయి బాబా చూపిన మహిమాన్వితులుగా ప్రపంచానికి సుపరిచితులు. ఆయన చేసిన చాలా మహిమలు నాకు తెలుసు. కానీ ఆయన చూపించిన గొప్ప మహత్మ్యం ఏదైనా ఉందంటే అది శాశ్వతమైన నిస్వార్థ ప్రేమ, సేవ. ఆ మహత్మ్యం విద్య, ఆరోగ్య సంరక్షణ, తాగునీటి సరఫరా, గ్రామీణ అభ్యున్నతి రంగాలలో బృహత్‌ ‌సేవా ప్రాజెక్టులుగా వ్యక్తమైంది. ఆచారాలు, మతపరమైన ఆచారాల నుండి ఆధ్యాత్మికతను విముక్తి చేసి, దానికి సామాజిక సంక్షేమం కోణాన్ని ఇచ్చిన ఘనత భగవాన్‌ ‌బాబాకు చెందుతుంది. ఆయన చేతుల్లో ఆధ్యాత్మికత సామాజిక సేవ మానవ సంక్షేమానికి ఒక సాధనంగా మారింది’’ అన్నారు.

బాబా జీవితానికి అనంతమైన ప్రేమ ద్వారా మానవాళిని మార్చడమనే ఏకైక లక్ష్యం ఉంది. ఆయన అసమానమైన సేవా కార్యక్రమాల ద్వారా తన లక్ష్యాన్ని ముందుకు నడిపించారు. విశేషమేమిటంటే, ఆయన స్వయంగా మే 25, 1947న తన అన్నయ్యకు రాసిన లేఖలో ఈ లక్ష్యాన్ని ప్రకటించారు. ఆ లేఖలో

‘‘అఖిల మానవులకు ఆనందమును అందించుటే దీక్ష నాకు / ధర్మమార్గము వీడి చరియించువారల చేపట్టి కాపాడుటే వ్రతము నాకు బీదసాదలకు పెనుబాధ తొలగించి లేమిని బాపుటే ప్రేమ నాకు’’ అని పేర్కొన్నారు.

బాబా ఒక సందర్భంలో దేవుడికి నిర్వచనం సంపూర్ణమై నిస్వార్థ ప్రేమ అని ప్రకటించారు. మానవులకు బాధలు ఆధ్యాత్మిక అజ్ఞానం, భౌతిక లేమి అనే రెండు కారణాల నుండి పుడతాయి. బాబా లేఖలోని మొదటి రెండు పంక్తులు ఆధ్యాత్మిక సాధనను సూచిస్తాయి. మూడవది భౌతిక సాధనను సూచి స్తుంది. తద్వారా ఆయన తన జీవితాన్ని మానవాళి సమగ్ర ఉద్ధరణకు అంకితం చేశారు.

ఆయన విద్య, ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, తాగునీటి సరఫరా, గ్రామీణాభివృద్ధిలో స్థాపించిన అద్భుతమైన సేవా ప్రాజెక్టులు ఆయన కరుణకు నిదర్శనాలు. ఖలీల్‌ ‌జిబ్రాన్‌ ‌పేర్కొన్నట్టుగా ‘‘ప్రతి ప్రవక్తకు రెండు హృదయాలు ఉంటాయి. వాటిలో ఒకటి మన కష్టాలను తీర్చడానికి రక్తాన్ని చిందిస్తుంది. మరొకటి మన అజ్ఞానాన్ని భరిస్తుంది’’. బాబా మానవాళి కష్టాలను తనవిగా భావించి వాటిని తీర్చారు.

2011లో బాబా తన భౌతికమైన శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు, ఆయన విస్తారమైన లక్ష్యం ఏమవు తుందని చాలామంది ఆశ్చర్యపోయారు. ఆయన లేని లోటుతో అది అంతర్దానమైపోతుందా? అని ఆందోళన చెందారు. అయినప్పటికీ, ఆయన గురించి బాగా తెలిసినవారు ఆయన లక్ష్యం ఎప్పుడూ ఆయన భౌతిక రూపానికి కట్టుబడి ఉండదని అర్థం చేసుకున్నారు.

ఆయన శతజయంతి ఉత్సవాలను జరుపు కుంటున్న ఈ తరుణంలో, ఈ సత్యం మరింతగా ప్రకాశిస్తుంది. సామ్రాజ్యాలు పుడుతుంటాయి, పడిపో తుంటాయి. సాంకేతికత మానవ జీవితం రూపురేఖ లను మార్చివేస్తుంటుంది. భావజాలాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఇంత జరుగుతున్నా కానీ లక్షలాది మంది హృదయాలలో చెక్కుచెదరకుండా ఉన్నది బాబా అనంతమైన ప్రేమ. వర్తమానంలో, మధుసూదన్‌ ‌సాయి జీవితంలో, పనిలో ఇదే విధమైన ప్రేమ వ్యక్తమవుతుండటాన్ని నేను చూశాను.

బాబా విద్యా సంస్థలలో విద్యార్థిగా ఎదిగిన మధుసూదన్‌ ‌సాయి బాబా తన లక్ష్యాన్ని కొనసాగించ డానికి ఎంచుకున్న ఒక సాధనంగా నిలిచారు. ఆయన బాబా వారసత్వాన్ని అచంచలమైన భక్తితో ముందుకు తీసుకొని వెళుతున్నారు. బాబా విద్య, ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం ఆధ్యాత్మిక అభ్యున్నతిలో స్థాపించిన సంస్థలు కేవలం సంస్థలు మాత్రమే కాదు, అవి బాబా ఇచ్చిన మాటకు, సంకల్పానికి సజీవ సాక్ష్యాలు.

బాబా లక్ష్యం మధుసూదన్‌ ‌సాయి ద్వారా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. నాకు అత్యంత స్ఫూర్తినిచ్చేది గొప్పదైన ఆయన పని తీరు మాత్రమే కాదు, నిష్కలష్మమైన దాని ప్రేరణ కూడా. ఏమీ ఆశించని ప్రేమ, షరతులు లేని సేవ ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ స్ఫూర్తి బాబా ఇచ్చిన మాట ఎప్పటికీ విఫలం కాదని నిర్థారిస్తోంది.

మధుసూదన్‌ ‌సాయి ఒక దశాబ్దంలోనే భారత దేశంలో, శ్రీలంక, ఫిజి, నైజీరియాలలో పన్నెండు ప్రపంచ స్థాయి ఉచిత ఆసుపత్రులను నెలకొల్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత పీడియాట్రిక్‌ ‌కార్డియాక్‌ ఆసుపత్రుల గొలుసును ఏర్పాటు చేశారు. విద్యారంగానికి సంబంధించి, ప్రాథమిక పాఠశాల నుండి విశ్వవిద్యాలయం వరకు హాస్టల్‌, ‌వ్యక్తిగత ఖర్చులు సహా అన్ని రుసుములను తొలగించారు. ఒక విశ్వవిద్యాలయం, ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తిగా ఉచిత ప్రైవేట్‌ ‌గ్రామీణ వైద్య కళాశాల సహా ముప్పైకి పైగా విద్యాసంస్థలను స్థాపించారు. ప్రతిరోజూ ఉదయాన్నే కోటి మంది పిల్లలకు పోషకాహారం అందించేలా ఆయన చేపట్టిన కార్యక్రమం భారతదేశంలోనే అతిపెద్దదిగా మారింది. ఆయన బాబా సందేశాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు విదేశాలలో పదకొండు ఆధ్యాత్మిక, సేవా కేంద్రాలను కూడా స్థాపించారు. బాబా తాను ఎంచుకున్న శిష్యుడి ద్వారా తన ప్రేమను అందరికీ పంచుతున్నారు. ఆయన బోధనలు కాలాతీతమైనవి.

నేను బాబా ద్వారా పవిత్రమైన ఈ కార్యాచరణ ఆవిర్భావాన్ని, మధుసూదన్‌ ‌సాయి ద్వారా దాని అద్భుతమైన విస్తరణను ప్రత్యక్షంగా చూశాను. అందువల్ల ఇది కేవలం కొన్ని దశాబ్దాల కథనం కాదని ధ్రువీకరించగలను. ఇది శాశ్వతంగా కొనసాగే ప్రేమపూర్వకమైన ఒక సేవా ప్రస్థానం. బాబా మానవాళికి మార్గనిర్దేశం చేస్తూ, మానవాళిని ప్రేమిస్తూ, ఉద్ధరిస్తూ నిత్యం మనతోనే ఉంటారు.

బి.ఎన్‌. ‌నరసింహమూర్తి

ఛైర్మన్‌, ‌ప్రశాంతి బాలమందిర్‌ ‌ట్రస్ట్.

‌చీఫ్‌ ‌మెంటార్‌, శ్రీ ‌సత్యసాయి లోక సేవ గోకులం గ్రూప్‌ ఆఫ్‌ ఇనిస్టిట్యూషన్స్.

‌తొలి ఛాన్సెలర్‌, శ్రీ ‌సత్యసాయి యూనివర్శిటీ ఫర్‌ ‌హ్యూమన్‌ ఎక్సెలెన్స్.

About Author

By editor

Twitter
YOUTUBE